Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బదరీ వృక్షము.-రేగు చెట్టు. - హైమాశ్రీనివాస్.

badaree tree

వదినగారూ! ఈ సంక్రాంతికి మా బుజ్జిగాడికి ‘భోగి పండ్లు’ పోయాలనుకుంటున్నాను. ఈ ఊరు మాకు కొత్తకదా! రేగుపండ్లు ఎక్కడ దొరుకుతాయో కాస్త చెప్పరూ?"అంటూ వచ్చింది వాసంతి. " ఓస్ ! అంతేకదా! నీకు ఈ ఊర్లో రేగుపండ్లు దొరక్కపోతే మాతమ్ముడ్ని మీఅన్నగారిని 5కిలో మీటర్ల దూరంలో ఉన్న మా పొలా నికి మీ మోటార్ బైక్ మీద  తీసుకెళ్ళమను.ఈ ఏడాది మా రేగు సాగు బాగా వచ్చింది. కావల్సినన్ని తెచ్చుకోవచ్చు. ముందుగా ఎన్నికావాలో చెప్తే మా సేద్యం చేసే చెలమయ్య  కోసి ఉంచుతాడు."అంది అనంతమ్మ."ఎంత మంచి మాట చెప్పారు వదినగారూ! మీ భరోసాతో ‘భోగి పండ్లు ‘పోసేసినట్లే ఉంది మా బుజ్జిగాడికి. మీతో పరిచయం పది రోజులైనా ఎంతోకాలంగా తెల్సినట్లు ఉందండీ మనస్నేహంబంధం. మీలాంటి వారి పొరుగున దిగడం మా అదృష్టం." "దీన్నెనమ్మా! బాదరాయణ సంబంధం అంటారు."" అంటే అర్ధం చెప్తారా? నాకు సంస్కృతం అంతగారాదు."  

"ఇదేం పెద్ద సంస్కృతం మాటకాదమ్మా! .." అని అనంతమ్మ  చెప్తుండగా , ---- "ఆగాగు , నన్ను చెప్పనీ మా చెల్లెమ్మకు.అమ్మా!’ బాదరాయన సంబంధం ‘అంటే ,అసలు అర్ధం ‘దూరపు సంబంధము’.దానికో కధ చెప్పాలి, కూర్చోతల్లీ! పూర్వం ఒకానొక పట్టు చీరల వ్యాపారి పక్క ఊర్లలో చీరలు అమ్ముకోను వెళ్ళాడుట. మధ్యాహ్నం ఐంది. ఆకలేస్తున్నది తినేందుకేం లేవుట. ఆఊర్లో ఒక బుట్టలో రేగిపండ్లమ్ముతున్న అవ్వవద్ద ఒక రూపాయకు రేగుపండ్లు కొని తింటూ వెళుతున్నాట్ట. ఎక్కడైనా భోజన హోటల్ లాంటిది ఆఊర్లో ఉందేమోని.ఇంతలో ఒక ఇంటిముందు ఒకరేగు చెట్టుకనిపించిందిట. అక్కడ ఆగి ఆఇంట్లోకి వెళ్ళి " చెల్లెమ్మా! బావున్నావా? " అని ఆప్యాయంగా పలక రించాట్ట.ఆమె మావారి తరఫు బంధువై ఉంటా డనుకుని  'రండి అన్నయ్యగారూ! కాళ్ళు కడు క్కోండి.రండి మా ఆయన పక్క ఊరెళ్ళారు.మీరు రండి భోజనం చేద్దురు " అంటూ వడ్డించిందిట, ఆ అమాయక ఇల్లాలు. అతడు కడుపారా తిన్నాట్ట. " అన్నయ్యా గారూ! మావారికి ఎవరు వచ్చి వెళ్లారని చెప్పమం టారూ?" అని అడిగిందిట ఆమె."చెల్లెమ్మా! మనది బాదరాయణ సంబంధం. నాకు చక్కెర వ్యాధి.బీపీ వ్యాధీ ఉన్నాయి.సమయా నికి అన్నం తినకపోతే పడిపోతాను. నేను ఆకలికి రేగు పండ్లు తింటూ వస్తుండగా మీ ఇంటి ముందున్న రేగు చెట్టును చూశాను. ఇంకేముందీ వచ్చి పలకరించాను,

నీవు భోజనం పెట్టావు. తిన్నాను. నేను తింటున్న రేగుపండ్లు మీ ఇంటి ముందున్న రేగుచెట్టూ మన అన్నాచెల్లెళ్ళ బంధాన్ని కలిపాయి.అదే బాదరాయణ సంబంధం అనిచెప్పామ్మా! మా బావగారికి. ఇదిగోమ్మా ఈ అన్నకు అన్నంపెట్టి ప్రాణం కాపాడావు. ఈ పట్టుచీర కానుకగా ఉంచు."అంటూ బలవంతంగా కంచి పట్టుచీర ఆమె చేతిలో పెట్టి , "అస్మాకం బదరీవృక్షః -యుష్మాకం బదరీఫలమ్, -బాదరాయణ సంబంధాత్ - యూయం యూయం వయం వయమ్"- అనిచెప్పివెళ్లాడుట. అలాంటిదేనమ్మ మన అన్నచెల్లెళ్ళ సంబంధం.మీకు రేగు పండ్లు కావాలి,మా పొలంలో రేగుఛెట్లు పండ్లు కాస్తున్నాయి.సరేనమ్మా! మీకెన్నికావాలో చెప్తే మా రైతుకు ఫోన్ చేసి తయారుగా ఉంచమని చెప్తాను."అన్నాడు ఆనందయ్య.     రేగు చెట్టు లాటిన్ పేరు ‘జిజిఫస్’ ప్రజాతికి చెందినది. ఇది చిన్న పొదగానూ పెద్ద వృక్షం గానూకూడా ఉంటుంది. మెట్ట ప్రాంతం లో, బంజరు భూముల్లోనూ కూడాపెరుగుతుంది.ఇది నిత్య హరిత వృక్షం.దీని బెరడు బూడిద రంగులో పగుళ్ళతో బీటలు వారి మందం గా ఉంటుంది, కొమ్మలు అన్ని వైపులకూ విస్తరించి పెరుగుతాయి. ఆకు మొదట్లో ముళ్ళు ఉంటాయి, ఆకులు గుండ్రంగా క్రింద వైపు నూగు కలిగి ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. పదునైన కొడవళ్ళ వంటి ముళ్ళను తప్పించుకుని పండ్లు కోయడం ఓ సవాల్ .రేగు పూలు గుత్తులుగా ఆకుపచ్చ మరియూ పసుపు పచ్చ రంగులు గా చిన్న నక్షత్రాల వలె ఉంటాయి.పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులోఉండి పసుపు రంగులోకి మారి ,ఎర్రని పండ్లుగా మారతాయి.పండు తొక్క మందంగా ఉండి,లోపల మెత్తటిగుజ్జు ,మధ్యలో గట్టి గింజ ఉంటాయి.పండ్లు పుల్లగా ,తియ్యగా కూడా ఉంటాయి.దీని కలపను వంటచెరకు గా ఉపయోగి స్తారు.

పండ్లు తింటారు. వడియాలు, పచ్చళ్ళు పెట్టుకుంటారు. ముఖ్యంగా సంక్రాతికి చిన్నపిల్లలకు భోగిపండ్లు  పోస్తారు.  రేగు ఒక పండ్ల చెట్టు.ఇందులో40 జాతుల పొదలు ,చిన్న చెట్లు కూడా ఉంటాయి ఇవి ఉష్ణ మండలం అంతటాపెరుగుతాయి. రేగు పండ్లు వాటి సైజు, రంగు, రుచిని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒక రకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుండగా. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపుగా వుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడ ఎరుపుగనే వుంటుంది.కండ ఎక్కు వ గా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా బావుంటాయి. వీటినే ‘పెద్ద రేగు’ లేదా ‘గంగ రేగు’ అంటారు.రేగు పండ్లను భానుడికి అంటే సూర్యునికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగిరోజున పిల్లలు భోగ భా గ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లు న్నాయి. వీటిని ‘జిజిఫుస్ మారిటియానా, నార్కెలి కల్, బెర్, బోరీ, బోర్, బెరి అని అనేక ప్రాంతల్లో అనేక పేర్లతో పిలుస్తారు. ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి. మూడు సంవత్సరాల్లోనే పండ్లనిస్తాయి.నేడు ఈ రేగుసాగు కూడా వ్యాపారదృష్టితోనే చేస్తున్నారు.  కొందరు ఎండిన పండ్లను స్నాక్స్ లాగా,టీ తాగేప్పుడు తీసుకుంటారు.

రేగిపళ్ల ’గుజ్జుటీ ‘కొందరికి ప్రియం. జిహ్వకోరుచి ,పుర్రకో బు ధ్ధీ కదా!. రేగు పళ్లతో జ్యూస్, వెనిగార్లను కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో, బంగ్లాదేశ్లో నేకాక ఆంధ్రులూ పచ్చడి చేసుకు తింటారు. చైనీయులు వీటితో వైన్  కూడా తయారుచేస్తారుట.వారు తినని వేమున్నాయి గనుక! రేగు పళ్లను ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు,ఎర్రని పచ్చిమిరప కాయలు, ఉప్పు,బెల్లం వేసి దంచుతారు. దీన్ని భోజనంలో ఆధరువుగా తింటారు. వీటితో బియ్యపు,మినప్పప్పుతో చేసినట్లే వడియాలు కూడా చేస్తారు.రేగుపళ్లలో మంచి పోషకాలే కాక 'సి' విటమిన్ సమృద్ధిగాఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా సీ. విటమిన్ ఇందులోనే ఉంటుంది. మనదేశంలో వీటిని పండ్లుగానే తింటారు.రేగు తాండ్ర కూడా చేస్తారు.ఒంటెలు, మేకలు,ఇతర పశువులకు వీటిఆకులు మంచిపోషకాహారం.ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకునితింటారట.  భారతదేశంలో 90 రకాలకు పైగా రేగుపళ్లను సాగుచేస్తున్నారు. రేగు చెట్లు మొదటే ఎంచుకున్న స్థలంలో నాటాలి. ఒక చోట మొలి చిన రేగు చెట్టును ఇంకోచోట నాటితే అవి బతకవు. అందుకే ముందుగా ఎక్కడ వెయ్యదలచుకుంటే అక్కడ విత్తనాలను పెట్టాలి. మనదేశంలో ఈ పండ్లు అక్టోబర్ ప్రారంభంలో, ఇతర ప్రాంతాలలో ఫిబ్రవరి,మార్చి నెలల్లోవస్తాయి.మనదేశంలో సంవత్సరానికి ఒక్కో చెట్టు 5,000 నుండి10,000 పండ్లను కాస్తుంది. అంటు కట్టిన చెట్లైతే 30,000 వరకూ కాస్తాయి.ప్రత్యేకంగా సాగు చేసి నేడుఅధిక ఉత్పత్తిని సాధిస్తున్నారు.పాకిస్తాన్,బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు అధికంగా ఉంది.

వినాయక చవితిరోజు చేసుకునే వరసిద్ధివినాయక ‘ఏకవింశతి పత్రి ‘పూజా క్రమములో ఈ ఆకు ఐదవది. ‘బదరీపత్రం సమర్ప యామి’ అని చదివి ఆకు ను వినాయకుని పాదాలచెంత అర్పిస్తాం.రేగుపండులో ఔషధ గుణాలు చాలవున్నాయి. వీటిని తింటే కడుపులో మంటతగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పి ని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగుగింజ చాల గట్టిగా వుంటుం ది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు తగ్గు తాయి. ఒక గుప్పెడు రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి , నీరు సగం అయ్యే వరకు మరగ ని వ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి అరసాన్ని రోజూ నిద్రించేముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. 100 గ్రాముల తాజా రేగు పండ్లలో లభించేపోషకాలు --  కార్బో హైడ్రేట్లు -17 గ్రా,చక్కెర -5.4 నుండి 10.5 గ్రా,కొవ్వుపదార్థం-0.07గ్రా,పీచు పదార్థం- 0.60గ్రా, ప్రోటీన్లు-0.8 గ్రా,నీరు-81.6 -83. 0 గ్రా,బి1 విటమిన్-0.02నుండి 0.024 మిగ్రా(2శాతం), రైబోఫ్లేవిన్(బి2)- 0.02 నుండి 0.038 మి.గ్రా(3శాతం),నియాసిన్(బి3)-0.7 నుండి 0.873 మి.గ్రా(5 శాతం),కాల్షియం -25.6  మి.గ్రా(3 శాతం),ఇనుము- 0.76 నుండి 1.8 మిగ్రా,ఫాస్పరస్- 26.8 మిగ్రా ఉంటాయి .  రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. శూలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెర డును ఉపయోగిస్తారు.

బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది. రేగు ఆకులను నూరి ,కురుపుల వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి.రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్ మందుకూడా .రేగు పండ్లు బరువు పెంచి, కండరాలకు బలాన్నిచ్చి, శారీరకంగా శక్తిని పెంచడంలో బాగా ఉపయోగ పడతాయి. కాలేయం తనపనిని సక్రమంగా చేసుకోను సహకరిస్తాయి.దీనికోసం చైనా ప్రజలు రేగిపండ్లతో చేసినా ఒక టానిక్ వాడుతారు. రేగిపండు  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈవిషయం జపనీయుల పరిశోధనలో తేల్చారు. రేగుపండ్లు  బాధానివారిణిగా పనిచేస్తాయి. క్యాన్సర్ రాకుండా శారీరానికి తగిన శక్తినిస్తాయి. రక్తాన్ని శభ్రం చేసి, జీర్ణశక్తిని పెంచు తుందిరేగు పండు. ఆకలి పెంచి, రక్త హీనత తగ్గించి, నీరసాన్ని నివారించి, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపురానివ్వదు. రేగు విత్తనాలు కూడా చాలా ఔషధగుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు.

అజీర్తిని అరికట్టడం లో దాని వేర్లను ఉపయోగిస్తారు. వేర్లను పొడి చేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆకులు జ్వరసంహారిగా ఉపయోగపడతాయి. వెండ్రుకలు పెరగడానికి రేగుపండ్లు సహకరిస్తాయి. వేళ్లతో, బెరడుతో చేసిన రసం కీళ్లవాతానికి బాగా పనిచేస్తుంది. ఐతే ఏదీ అదేపనిగా వాడరాదని మనకుతెల్సుకదా!ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. రేగు పూలతో చేసిన కషాయం కంటికి లోషన్ గా  ఉపయోగపడుతుంది.చైనీయులు, కొరియన్సు వత్తిడి తగ్గించడానికి సాంప్రదాయక మందులలో వీటిని వాడతారు. ఆయుర్వేదం , సిధ్ధ వైద్యాల్లో విరివిగా రేగుచెట్టు భాగాలన్నింటినీ వాడుతారు.ఇంత గొప్ప వైద్య పోషక విలువలు ఉండటం వల్లే పూర్వం నుంచీ రేగు పండ్లను విరివిగా అవిభించేకాలంలో వాడటం జరుగుతున్నది. మనకూ గోతెలుక్కూ ఉన్న బాదరయన సంబంధం బహుబలమైన బంధంగా రూపొందాలని ఆశిద్దాం. 

మరిన్ని శీర్షికలు
kaju chiken