Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sab andar,, amma bahar.. darvaja band

ఈ సంచికలో >> కథలు >> కమానువీధి కథలు

kamanuveedhikathalu
‘ఆరు నూరైనా...నూరు ఆరైనా మార్నింగ్‌ షో శ్రీవారి ముచ్చట్లకే ఎళ్లాలి. పొరపాటున కూడా ప్రేమాభిషేకం పోయేకి లేదు. ఇట్టా సేయకుంటే మనకే మర్యాద పోతాది. అవతలోళ్లు మనల్ని ఆడుకుంటారు...’చిన్న గుండ క్రాఫ్‌ సరిచేసుకుంటూ కాలు ఊపుతూ అంటుంటే..మాకు నిజమే కదా అనిపించిండాది.  కొత్తగా రిలీజైన ప్రేమాభిషేకం కాదని...యాభైయ్యో రోజుకు చేరుకున్న శ్రీవారి ముచ్చట్లు చూడాలంటే మనసు అదోలా అవుతుండాది. కానీ ఏం చేసేకి లేదు. దాంట్లోనూ...దీంట్లోనూ హీరో మన ఏయన్నారే! ఓ గంట మీటింగ్‌ పెట్టుకున్నాంక... మెహబూబియా టాకీసుకు పోయ్యేకి రెడీ అయ్యిండాం. అంతలోనే చిన్నగుండ  మొదట నిర్మల్‌ టాకీసుకెళ్లి ప్రేమాభిషేకం రష్‌ ఎట్లా ఉందో తెలుసుకోవాలి, ఆ తర్వాతే మెహబూబియాకి... అంటూ అందరికీ డైరక్షన్‌ ఇచ్చిండాడు. నిర్మల్‌ టాకీసు చేరుకునే సరికి ..చివర్లో ఏయన్నార్‌ చనిపోతాడంట...ఈ సినిమా ఎత్తిపోతుందో ఏందో అని మా ఫ్రెండొకడు సైకిల్‌పై కూర్చొనే అంటుంటే...మాకు నీరసమొచ్చేసిండాది.  ఏయన్నార్‌..స్టెప్పులేసి గోలచేయాల్సింది పోయి... మంచానికతుక్కుని సస్తానంటే ఎవడైనా ఎందుకొప్పుకుంటాడు. కానీ  తప్పదు కాబట్టి కాసేపుండి మెహబూబియాకు పోయిండాం.

కమాను...చుట్టుపక్కల గేరి పిలగాళ్లకి సినిమా పిచ్చి మామూలుగా కాదు. భూకంపం వచ్చినా...వరసగా ప్రపంచయుద్ధాలు వచ్చేసినా...ఇంకో గంటలో అందరం మునిగిపోతాం అని మైకుపెట్టి అరచినా...రోజూ కనీసం ఓ అయిదారు గంటలైనా సినిమాలపై డిస్కసన్‌ చేస్కోకుండా ఉండలేం. రోజూ రాత్రి ఎనిమిది కాగానే తుంగాబసప్ప వాళ్ల ఇంటి ముందర గేటు మీటింగ్‌ సురు అయితీరాల. పెద్దగుండ.. చిన్నగుండ..బుస్సి...వేణు...రంగ...గంటలు గంటలు సినిమాలపైనే చర్చ...రచ్చ! ఎన్టీఆర్‌...ఏయాన్నార్‌ సినిమాలు ఎన్నెన్ని ఏయే టాకీసుల్లో వందరోజులాం డిండాయి... వాటిలోనూ డైరెక్టు ఎన్ని...షిఫ్టు ఎన్ని...ఎంతెంత కలెక్షన్లు అయిండాయి...ఈ వివరాలన్నీ చెప్పే పోటుగాళ్లు కొందరైతే.. ఏయన్నార్‌ ఏ పాటలో ఎన్ని ప్యాంట్లు,షర్టులు మార్చిండాడు..యాడాడ స్టెప్పులు ఎట్టా ఏసిండాడో విశ్లేషించే సాణేగాళ్లు మరి కొందరు. ఎన్టీఆర్‌ ఫైటులు..పాటలు చర్చించే గుంపు వేరే ఉండేది. ఇంక ఎన్టీఆర్‌...ఏయన్నార్‌ గురించి మాటా మాటా పెరిగి..యే పోలే మీవోడికి ఎంత డిమాండున్నాదో మాకేం తెలీదనుకునిండావా.. మా వాడు పులి...మా వాడు గడార్‌...ఈ మాటలయుద్ధాన్ని రోడ్డుపై పోయే కొందరు విచిత్రంగా వింతగా చూసేవాళ్లు. కొన్నిసార్లయితే ఇంకేం కొట్టుకుంటారేమో అనుకుని ఆగిపోయి చూస్తుండేవాళ్లు!  ఇది చాలదన్నట్టు పెదనాన్న ఇంట్లో  నగేషు...మురళీఅన్నలతోనూ చాలాసార్లు ఇదే చర్చ. వాళ్లు ఎన్టీఆర్‌ పార్టీ...ఎస్పీ అంటే అభిమానం. నాకేమో ఏయన్నార్‌...రామకృష్ణ అంటే ఇష్టం. వీరితో ఎన్నిసార్లు వాదులాడినా చివరికి నేనే ఓడిపోయేవాణ్ని.
 ఈ సినిమా పిచ్చి ఏదో వయసొచ్చినాంక వచ్చిపడలేదు. చిన్నప్పటి నుంచే సురు అయిండాది. మా రక్తంలోనే ఉండాది. కమాను ఆడోళ్లు తమ పిలగాళ్లకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా...సినిమా నాలెడ్జి మటుకు మస్తు ఇచ్చిండారు. పార్టీ అంటే కాంగ్రెస్‌...లీడరు అంటే రాజీవ్‌ గాంధీ...హీరో అంటే ఏయన్నార్‌ ఇదీ మా అమ్మ లెక్క!  మిగిలిన విషయాలెట్లా ఉన్నా విశాలాక్షమ్మక్క, పార్వతమ్మ వీళ్లందరు కూడా  ఏయన్నార్‌ పార్టీయే! అట్టాగని వేరే సినిమాలు చూసేదిలేదని కాదు. సినిమా ఏదైనా చూడాలి అది మొదటి రూలు. ఏయన్నార్‌దైతే చూసితీరాలి అది రెండో రూలు. పండుగలు...కబుర్లు తర్వాత కమాను ఆడోళ్ల ప్రాధాన్యం సినిమాయే! 

ఊర్కే టాకీసులో కూసొని చూస్తేనే సరిపోదు. మరుసటి రోజూ రాత్రి దాని గురించి మీటింగు పెట్టి సినిమా కత అట్టా ఉండాది ఇట్టా ఉండాదంటూ వాదించు కోవాల. .ఇవన్నీ మాలోనూ దిగిపోయిండాయి. చిన్నపిల్లగాళ్లని ఇంటికాడ వదిలితే ఏం చేసి చస్తారో అన్న అనుమానంతో ప్రతి సినిమాకు మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లేవారు. టికెట్టు చింపేకాడ రంప రామాయణమే!  హాఫ్‌ టికెట్‌ యాడ తీస్తాం. ఇంకా  చిన్నోళ్లు. ఇంటికాడ వదిలేకి లేక తీసుకొస్తుండామంతే అని అమ్మ...ఆ సానా చూసిండాము. అందంతా కుదిరేకి లేదమ్మా...హాపు తీయ్యాలంతే...అంటూ వాడు మొండికేసేవాడు. లోపల స్క్రీనుపైన నెంబర్లు సురువయిండాయంటే ఇంకా సూడాల అమ్మ టెన్షను. అప్పో...యాల ఊర్కే అరుస్తుండావు. పిల్లోడంటే ఇనుకోవాల అంతే. మొన్ననే నాల్గు నిండిండాయి...అంటూ నన్ను బరబరా లోపలికి లాక్కొని పోతుంటే వెనక నుంచి వాడు అరవడం తప్ప ఏం చేయలేకపోయేవాడు. ఒకతూరి ఇట్టాగే సినిమాకి నన్ను తీసికెళ్లిండాది. టికెట్‌ కాడ గబాలున ఎత్తుకుని ముందుకు నడిచింది. వాడు టికెట్లు లెక్కపెట్టి..‘యా యప్ప టికెట్టు యాడ...’ అంటే ‘ఎత్తుకున్న పిలగాడికి కూడా తీయాలా...’అని అమ్మ ఆర్గ్యుమెంట్‌ వినేసరికి వాడికి కోపం నెత్తికెక్కేసింది. ‘అమ్మో ఎత్తుకునింది ఇంకసాల్లే...పిల్లోడి కాళ్లు నేలకి తగులుతుండాయి గానీ...హాపు తీయాల్సిందే’ అని గట్టిగా గదమాయించాడు. అయితే మనం తగ్గిందెక్కడ. ‘నువ్వేం చేస్కుంటావో నీయిష్టం. ఆడ సినిమా సురు అయితుండాది పోతండామంతే...’ కర్టెన్‌ పక్కకి తీసుకుంటూ ముందుకు తోసుకుంటూ వెళతున్న అమ్మని చూసి బిత్తరపోవడం తప్ప వాడేం చేయగలడు? నాన్న టాకీసుకెళ్లి సినిమా చూసింది లేదు...అమ్మ టాకీసు ఇడిసిందీ లేదు. మా ఇంట్లోనే కాదు కమానులో చాలా ఇండ్లల్లో ఇదే స్థితి. టాకీసులో సినిమా చూసేందుకు ఆడోళ్లు చూపినంత ఉత్సాహం...మగోళ్లు చూపేవాళ్లు కాదు. 
ఓ బారి నేను రఘుగాడు నిర్మల్‌ టాకీసులో శ్రీకృష్ణసత్య సినిమాకి పోయిండాము. ఎప్పట్లాగానే క్యూలో మా వంతు వచ్చేసరికి టికెట్లు క్లోజ్‌ అయ్యిండాయి.  ఏం చేయాలా అని ఇద్దరం టెన్షను పడుతుండామా...బెంచీ టికెట్టు కాడ నిల్చున్న ఆయప్ప  రమ్మనిండాడు. ‘ఏం టికెట్టు దొరకలేదా...సినిమా చూస్తారా...రండి మల్ల ’ అంటూ పావలా తీసుకుని రఘగాణ్ని లోపలికి నూకినాడు. నాకు బలే సంతోసమేసిండాది. నిక్కరు జేబులోంచి పావలా తీసి దగ్గరకెళితే లాగి చెంపకు కొట్టేసిండాడు. కండ్లు బైర్లు కమ్ముకుండాయి. తోలు చుర్రుమనిండాది. ఏం తప్పు చేసిండానో...ఆయప్ప యాల అట్టా కొట్టిండాడో...నాకు రొవంత కూడా అర్థం కాలే! కండ్లల్లో నీళ్లు వస్తుంటే తుడుసుకుంటుండాను. ‘ఏమిరా...టికెట్టు ఉంటే లోపలికి పోవాల...సూడాల. అంతేగానీ నాకే పావలా ఇచ్చేకొచ్చిండావా ...ఏమనుకునిండావు’ అంటూ గాఠిగా రంకెలు వేస్తున్నాడు. ‘థూ నాయాల...యాలలే అట్టరుస్తుండావు...నీవే కదా పిల్సిండేది...’ మనసులోనే తిట్టుకుంటుండానా...టాకీసు ఓనరు అట్టా వచ్చి ఏమైండాది అంటుంటే ‘సూడన్నా...నాకే పావలా లంచమిచ్చేకి వస్తుండాడు ఈ పొట్టోడు...’అంటూకంప్లైంటు చేశాడు. ‘సర్లేరా ఇంక యిడిసేయి...’ అంటూ ముందుకెళ్లాడు. ఓనరు వెళ్లిండాడో లేదో గబగబా నాకాడ వచ్చి ‘ఎనకా ముందు ఎవ్రు వస్తుండారో సూస్కోకుండా వచ్చేసేదేనా...నీ దుడ్లు తీస్కుంటే నా ఉద్దోగం ఊడేది. పావలా త్యా మరి. ..’ లాక్కొని అటుఇటు చూసి లోపలికి తోసిండాడు.  లోపలికి పోయి కూర్చుండానో లేదో లైట్లు ఆన్‌ ‘ఇంటర్వెల్‌’ స్లైడు ... ఎట్టా చచ్చేది!

కాలేజీ మెట్లెక్కినాంక   ఏ సినిమా అయితే ఏముండాది టాకీసులో చూడాలి అనే మాట ఇడిసి...ఈ హీరో సినిమానే చూడాలి...ఈయప్పకి నేను పేద్ద ఫ్యాను అంటూ కొత్త పాట అందుకునిండాను. ఖర్చులు కూడా పెరిగిండాయి. ఒక సినిమానే కాదు సానా వాటిల్లో ఇలాగే ఉండాలి అన్నది బాగా పెరిగిపోయిండాది. టెన్త్‌ వరకు మామూలుగా కటింగ్‌ ...ఇంటర్‌ ఎక్కగానే స్టెప్‌ కటింగ్‌ , అట్టాగే బెల్‌బాటమ్‌ ప్యాంట్లు కుట్టించుకునేది ఈ ధ్యాస ఎక్కువయిండాది. ఆడికీ నాన్న బ్రేకులేసేకి ప్రయత్నించినా...మా బండి టాప్‌గేరులో ఉండేసరికి ఇది యాడైనా గుద్దుకుంటే తప్ప ఆగేది లేదని ఆయప్పకీ బాగా అర్థమై పోయిండాది. అందుకే ‘ఎట్టాగైనా సేసుకుని చావుగానీ ఇంట్లోకి  గొడవలు తేకుంటే చాలురా నాయనా’ అనుకునిండాడేమో మాట్లాడే వాడు కాదు. కాలేజీకి పోతుండాము...మాకు ఖర్చులుంటాయి కదా! రూపాయ రెండ్రూపాయలకీ యాడ చేయి సాచేది. అంటూ ప్యాకెట్‌ మనీ పోట్లాడి సాధించుకున్నాక... ముప్పాతిక భాగం సినిమాకే పోయేది. రోజూ ఇంటికాడ ఇదే మీటింగే. ఏ సినిమా యాడ ఆడుతోంది...పేపర్లలో సినిమా బొమ్మ వేసి ఇన్ని సెంటర్లలో ఇన్ని రోజులు అని రాసి ఉన్నదాన్ని బట్టీ పట్టి మరీ డిస్కషన్‌ చేసేటోళ్లం. 

కమాను మధు...కుంబారోణి మధు...చింతకుంట మధు మేం ముగ్గురం ఏయన్నార్‌ ఫ్యాన్సే. ఏడంతస్తుల మేడ సినిమా ఏడుసార్లు...ప్రేమాభిషేకం పదిసార్లు...ఎప్పుడొచ్చినా నాల్గు సార్లు తగ్గకుండా ప్రేమనగర్‌ ఇట్లా మా రికార్డులు మేమే బద్దలు కొట్టుకుంటూ ఆనందించేవాళ్లం. మా ఫ్యాన్సు వాళ్ల కోసం సినిమాలో స్టెప్పులున్న పాటలు మళ్లీ వేసేదాకా గొడవలు పెట్టుకున్న సందర్భాలు లెక్కలేనన్ని. వాడు మళ్లీ పాట వేసేదాకా అరిచింది అరిచిందే! ఇంక శివరాత్రి వచ్చిందంటే కత మామూలుగా ఉండేది కాదు. దాన్ని సినిమాల పండగ అని పిలుచుకునే వాళ్లం. అర్ధరాత్రి దాటిన తర్వాత సినమాల్లో ఈలలు కేకలతో గోలెత్తిపోయేది. ఓ సారి మెహబూబియాలో రాత్రి ఒంటిగంట షో ఏయాన్నార్‌...వాణిశ్రీల ‘ఆత్మీయులు’కు మా మూక మొత్తం వెళ్లాం. సినిమాలో అన్నీ సూపర్‌డూపర్‌ పాటలే. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే...చామంతి ఏమిటే ఈ వింత..స్వాగతం ఓహో ...అయితే ఈ పాటలు సినిమాలో ఎవరూ చూడలేనంత...వినలేనంతగా ఈలలు వేసి గోలపెట్టాం. సినిమాలో హీరో ఏయన్నార్‌ కాఫీ కప్పులు పట్టుకుని ఒక్కసారిగా స్క్రీనుపై రాగానే మేం వేసిన ఈలలు...కేకలు...గోలలు అంతింత కాదు... కాస్త గుండెపోటున్నవాళ్లు  టపా కట్టేసేంత గోల అది.  చిన్న గుండా, నేను , చింతకుంట మధు మామూలుగా కాదులే! ఇంతా చేసి ఇంటికి అదే మైకంలో చేరుకోగానే  అమ్మ  ‘ఏం అవతారంరా మీది . ఎవర్నైనా సినిమా చూసేకి యిడిసిండారా...అడ్డగాడిదల్లా  ఆ అరిచేదేంట్రా సిగ్గుందా...’ తిట్లు సురు చేసిండాది. ఆ తర్వాత తెలిసింది తను కూడా అదే సినిమాకు వచ్చిందని.

బళ్లారి పక్కన హంపిలో మేఘసందేశం సినిమా షూటింగ్‌. ఎట్టాగైనా చూసిరావాలి. చివరికి ఎవరికి వాళ్లు ప్లాన్లు వేసుకున్నాం. అక్క బళ్లారిలో ఉంటుంది. కొడుకు పుట్టి ఆరునెలలవుతోంది. అమ్మతో ‘నాకు  వాణ్ని చూడాలనిపిస్తోంది...’ అనగానే పాపం కరిగిపోయి నాన్నతో మాట్లాడి ఒప్పించేసింది. నాన్న దేనికైనా వద్దు అని చెప్పడం మానుకుని చాలా కాలం అయింది కాబట్టి దుడ్లు చేతికొచ్చేసిండాయి. రాత్రికి రాత్రే ఎంజీ బస్సు ఎక్కి బళ్లారికి చేరుకునిండాను. మరుసటి రోజు హంపీకెళితే ఆడ పెద్ద జాతర. ఆ గుంపులో కిందా మీదాపడి తోసుకెళ్లి ఓ రూము ముందర నిలుచున్నాం. కిటికీలోంచి ఏయన్నార్‌ మేకప్‌ వేసుకుంటున్నది కనిపిస్తోంది. వెనకల నుంచి జనాలు తోస్తున్నా... వెనకా ముందూ ఊగుతూనే నోట్లో రెండువేళ్లు పెట్టి గట్టిగా విజిల్‌ వేశా. అక్కడ నిలుచున్న ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆశ్చర్యం..ఏదో తెలియని సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుండాది. ఇంతలో జయసుధ..నాగేశ్వర్రావు పాట ‘సిగలో అవి విరులో’ షూటింగ్‌ సురు అయింది. కాసేపటికే నాకు విసుగు పుట్టేసింది. ఎంత సేపయినా మొదటి లైను దాటి వెళ్లకుండా...అరిగిపోయిన గ్రామఫోను రికార్డులా పాట వస్తుంటే విసుగు కాక ఇంకేముంటుంది. పైగా వెనకాల ఒకటే తోపుడు. ఇది చాలదన్నట్టు మద్రాసు నుంచి వచ్చిన లైటుబాయి మాటిమాటికీ నా నెత్తిపై టొంగ పెడుతుంటే...నాకు తిక్కలేసింది.‘లేయ్‌..చంపుతా నా కొడకా..’ అంటూ అరిచాను. వాడికేమో  తెలుగు రాదు. వికారంగా నవ్వాడు. ఆడ ఉన్నంత సేపు వాడు వదిలితే ఒట్టు. కరెక్టు రెండు గంటలయ్యాక మళ్లీ నాగేశ్వర్రావు– జయసుధ సాంగు ‘ఎవరో ఎవరో వస్తున్నారు...’ షూటింగ్‌. డైరెక్టర్‌ దాసరి నారాయణరావు కుర్చీలో కూర్చొని టేపురికార్డర్‌లో ఆ పాట ఇంటుండాడు. నాగేశ్వర్రావుని ప్యాంటు షర్టులో చూసేసరికి నాకు తికమక అయ్యింది. ఆ తర్వాత తెలిసింది అది ‘రాగదీపం’ సినిమా అని . ఈ తంతు ముగిసే సరికి సాయంత్రం అయ్యింది. అంతసేపు షూటింగ్‌ చేసిన  ఏయన్నార్‌ మాటేందోగానీ జనాలతోపులాట మధ్య నిలుచున్న నాకు మాత్రం వళ్లు పులిసిపోయిండాది. 
వయసుతో పాటు బుద్ధి పెరుగుతుందంటారు. కానీ మా పిలగాళ్లకి మాత్రం సినిమా పిచ్చి  బాగా పెరిగింది. పెద్దోళ్లు ఎవరు ఎదురైనా రేయ్‌ ఎప్పుడూ సినిమా ధ్యాసేనా కాస్త చదువుకోవచ్చు కదా అలా బేవార్సుగాళ్లా తిరిగేది బదులూ అంటూ తిట్టేవాళ్లు. అయితే మా ఎదుగుదలకు అదో గుర్తుగా కొన్నిసార్లు...మేం ఎంజాయ్‌ చేస్తున్నది చూసి తట్టుకోలేకపోతున్నారని ఇంకొన్నిసార్లు అనుకునేటోళ్లం. మా క్లాసుమేట్లు  కొందరు క్లాసుల్లోనో...పుస్తకాలతో కుస్తీపడుతుంటే...మేం  టాకీసుల్లోనో...డిస్కషన్లలోనో అంతకన్నా ఎక్కువగా కుస్తీపడేవాళ్లం. అదంతా సరే గానీ  ఇప్పటికీ నాకర్థం కానిది ఒక్కటే... ఒక్కో సినిమా అన్నేసిసార్లు ఎలా చూసేవాళ్లమా...విసుగు ఎందుకనిపించలేదా...అని!!

––––––

గడార్‌ - గొప్పవాడు, హీరో 
టొంగ - మొట్టికాయ
మరిన్ని కథలు