Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

లక్కున్నోడు చిత్ర సమీక్ష

lakkunnodu movie review

చిత్రం: లక్కున్నోడు 
తారాగణం: మంచు విష్ణు, హన్సిక, జయప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, రఘుబాబు, ప్రభాస్‌ శీను తదితరులు 
నిర్మాణం: ఎం.వి.వి.సినిమా 
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ 
దర్శకత్వం: రాజ్‌ కిరణ్‌ 
సంగీతం: అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు 
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా 
విడుదల తేదీ: 26 జనవరి 2017

క్లుప్తంగా చెప్పాలంటే

లక్కీ (మంచు విష్ణు)ని దురదృష్టం దగ్గరి చుట్టంలా వెంటాడుతూ ఉంటుంది. లక్కీ తండ్రి (జయప్రకాష్‌) లక్కీతో అస్సలు మాట్లాడడు. పద్మావతి (హన్సిక) పోజిటివ్‌ థాట్‌తో ఉంటుంది. ఏ విషయాన్ని అయినా ఆమె పోజిటివ్‌ యాంగిల్‌లోనే తీసుకుంటూ ఉంటుంది. దురదృష్టవంతుడైన లక్కీ, పద్మావతిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తన చెల్లెలి పెళ్లి కోసమని కట్నం డబ్బులు తీసుకుని వెళ్తున్న లక్కీ ఆ బ్యాగును కోల్పోతాడు. దాంతో తండ్రి కోపానికి గురై, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఓ బ్యాగ్‌ తెచ్చిస్తాడు. ఆ బ్యాగ్‌ని ఒక్కరోజు తన దగ్గరుంచుకుంటే కోటి రూపాయలు ఇస్తానంటాడు. దాంతో జీవితంపై ఆశలు మొదలవుతాయి లక్కీకి. అసలు ఆ బ్యాగు ఇచ్చింది ఎవరు? అందులో ఏముంది? అసలు ఆ తర్వాత లక్కీ జీవితం ఎలా మారింది? దురదృష్టవంతుడైన లక్కీ లక్కున్నోడు ఎలా అయ్యాడో తెలుస్కోవాలంటే సినిమా చూడాల్సిందే!

మొత్తంగా చెప్పాలంటే

విష్ణు తెరపై ఎనర్జిటిక్‌గా కనిపించాడు. కామెడీ సీన్స్‌లోనూ, యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. బాడీ లాంగ్వేజ్‌ పరంగా కూడా కొత్తదనం ట్రై చేస్తున్నాడు. అందుకు అతన్ని అభినందించాలి. కామెడీ టైమింగ్‌ విషయంలో విష్ణుకి మంచి మార్కులు పడతాయి. నటనలో సినిమా సినిమాకీ మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నాడు విష్ణు.

హీరోయిన్‌ హన్సిక గ్లామరస్‌గా కన్పించింది. ఆమెలోని క్యూట్‌నెస్‌ ఆమెకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. నటనతోనూ ఆకట్టుకుంటుంది. డాన్సుల్లో విష్ణుతో పోటీ పడేందుకు ప్రయత్నించింది. విష్ణుతో గతంలో సినిమాలు చేసి ఉండటంతో ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా పండింది. టాలీవుడ్‌ మీద ఫోకస్‌ పెంచితే, తెలుగు తెరపై హీరోయిన్ల కొరత నేపథ్యంలో హన్సికకి మళ్ళీ మంచి మంచి అవకాశాలు రావొచ్చు. మిగతా పాత్రధారులంతా అవసరమ్మేరకు రాణించారు.

కథ మరీ కొత్తదేమీ కాకపోయినా, ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తోనే సినిమాని తెరకెక్కించారు. కథనం బాగుంది. ఇంకాస్త బెటర్‌గా ఉండి వుండాల్సింది. దర్శకుడు కథ, కథనమ్మీద కన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరమనిపిస్తుంది. సంగీతం బాగుంది, పాటలు తెరపై చూడ్డానికీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సినిమా రిచ్‌గా తెరకెక్కిందంటే సినిమాటోగ్రఫీ ప్రతిభ అందుకు సహాయపడిందని చెప్పవచ్చు. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్పయ్యాయి.

ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంటుంది. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌, హీరో హీరోయిన్ల మధ్య ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌, అక్కడక్కడా ఎమోషనల్‌ టచ్‌ ఇలా ఫస్టాఫ్‌ ఓకే అనిపిస్తుంది. హీరోకీ విలన్‌కీ మధ్య సన్నివేశాలు ఇంకాస్త బలంగా ఉంటే, సినిమా ఇంకో లెవెల్‌కి వెళ్ళి ఉండేది. ఓవరాల్‌గా ఎమోషన్‌ని మిక్స్‌ చేసిన ఎంటర్‌టైనింగ్‌ మూవీని దర్శకుడు తెరకెక్కించాడని చెప్పవచ్చు. సినిమాకి అన్నీ తానే అన్నట్లుగా తన భుజాల మీద మోసేశాడు విష్ణు. తన ఎనర్జీతో చిన్న చిన్న లోటుపాట్లు తెలియనీయకుండా చేయగలిగాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలకు ఆదరణ బాగా దక్కుతున్న ఈ ట్రెండ్‌లో ఇది పైసా వసూల్‌ సినిమానే అయ్యేందుకు అవకాశాలెక్కువ.

ఒక్క మాటలో చెప్పాలంటే

ఎంటర్‌టైనింగ్‌ 'లక్కున్నోడు'

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
mahesh in  sambhavami movie  shooting