Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
charan act in sukumar direction

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

GHAZI movie review

చిత్రం: ఘాజీ 
తారాగణం: రానా, కెకె మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సీ, ఓంపురి, నాజర్‌, సత్యదేవ్‌, భరత్‌రెడ్డి తదితరులు. 
నిర్మాణం: పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
సినిమాటోగ్రఫీ: మది 
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ 
సంగీతం: కె 
దర్శకత్వం: సంకల్ప్‌ 
విడుదల తేదీ: ఫిబ్రవరి 17, 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వీటిల్లో 1971లో జరిగిన యుద్ధం ప్రత్యేకమైనది. ఆ యుద్ధంలో పాకిస్తానీ జలాంతర్గామి ఘాజీ, భారతదేశంపైకి దండెత్తి వచ్చింది. కానీ భారత నేవీ అత్యంత సమర్థవంతంగా ఆ దాడిని తిప్పికొట్టింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ ఘాజీ జలాంతర్గామిని కోల్పోయింది. ఈ యుద్ధంలో కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కెకె మీనన్‌), లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా) ఎంత సాహసోపేతంగా శతృ జలాంతర్గామిని మట్టుబెట్టగలిగారన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 

రానా మరోసారి అద్బుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అర్జున్‌ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా చూస్తున్నంతసేపూ తెరపై అర్జున్‌ పాత్రే కనిపిస్తుంది తప్ప, అందులో రానా తనను తాను కనపడనివ్వలేదు. అర్జున్‌గా జీవించేశాడు రానా. కెకె మీనన్‌ ఈ సినిమాకి మరో అదనపు బలం. తనదైన నటనా ప్రతిభతో అన్ని సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంటాడు. తాప్సీ పాత్ర చిన్నదే. పెద్దగా ప్రాధాన్యతలేని పాత్ర ఆమెది. నాజర్‌, ఓంపురి తమ అనుభవంతో చిన్న పాత్రలే చేసినా మెప్పించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 
ఇండియా, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా విజయగర్వంతో ఉప్పొంగిపోతాం. కారణం అన్ని యుద్ధాల్లోనూ పాకిస్తాన్‌ని మనం మట్టి కరిపించడమే. నీటి యుద్ధం చాలామందికి తెలియనిది. ఆ యుద్ధాన్ని సినిమాగా మలచడం అన్న ఆలోచనతోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యాడు. కథ బాగా రాసుకున్నాడు, కథనాన్ని కూడా పకడ్బందీగా ప్లాన్‌ చేశాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ బాగుంది. సంగీతం, నేపథ్య సంగీతం కూడా చాలా చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ అద్భుతం అని చెప్పక తప్పదు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించాలి. సబ్‌మెరైన్‌ సెట్‌ వేయడం అంటే చిన్న విషయం కాదు. కాస్ట్యూమ్స్‌ కూడా బాగా కుదిరాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు సినిమాని రూపొందించిన తీరుకి ప్రశంసలు దక్కుతాయి. 
ఆద్యంతం కథని దర్శకుడు పరుగులు పెట్టించిన తీరు అమోఘం అనిపిస్తుంది. దేశభక్తి నింపేలా డైలాగులు, సన్నివేశాలతో సినిమాలో పూర్తిగా ప్రేక్షకుడ్ని లీనమయ్యేలా చేయగలిగాడు దర్శకుడు. సన్నివేశాల చిత్రీకరణ ఔరా అనిపిస్తుంది. కాస్సేపు మనం కూడా సబ్‌మెరైన్‌లోనే ఉన్నామా? అనే అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారు. ఎటు చూసినా నీరే, ఆ నీటిలోనే కథ అన్నాక దర్శకుడు ఎంత బిగువైన స్క్రీన్‌ప్లేతో సినిమా తెరకెక్కించాలి? అదంతా సినిమాకి బాగా కలిసొచ్చింది. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ ఓవరాల్‌గా సినిమా అంతా దర్శకుడు ఇష్టపడి ప్రేమించి ఓ దృశ్యాద్భుతంగా చిత్రీకరించాడనడం నిస్సందేహం. సినిమాకి జరిగిన ప్రమోషన్‌ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుంది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు సినిమాలో ప్రేక్షకుడు లీనమయ్యేలా చేస్తాయి. ఓవరాల్‌గా సినిమా ఓ మంచి ప్రయత్నంగా ప్రశంసలు అందుకుంటుందనడం నిస్సందేహం. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

దేశభక్తిని పెంపొందించే 'ఘాజీ' 

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
rituvarma got bumper offer