Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
satya sai baba information

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఊళ్ళోవాళ్ళందరూ మనకంటె బాగా ఉన్నారనే concept మొట్టమొదట మన బుల్లితనంలో ప్రారంభం అవుతుంది. ఆ సుబ్బారావుగారి బాబు అప్పుడే పాకేస్తున్నాడుట, వాడికి అప్పుడే పళ్ళుకూడా వచ్చేశాయిట,మొదలైనవి...

ఇంక హైస్కూల్లోకి వచ్చేసరికి అడగఖ్ఖర్లేదు! ఎప్పుడూ ఎవడో కోన్కిస్కా పక్కవాళ్ళ అబ్బాయికో,అమ్మాయికో మనకంటె మార్కులు ఎప్పుడూ ఎక్కువే వస్తాయి,అదేం కర్మమో  అదే వాతావరణం లో పెరిగేము కాబట్టి,ప్రతీదీ అవతలివాడికంటె తక్కువేమో అనే ఓ దరిద్రపు ఫీలింగొచ్చేస్తుంది!

ఏ విషయం తీసికోండి,ఎప్పుడైనా సొసైటీ లో ఇంకోళ్ళ పిల్లల్ని చూసినప్పుడు,మన పిల్లలకంటె, వాళ్ళే బొద్దుగా ఉన్నారేమో అనిపిస్తుంది.వాడే ఇంగ్లీషు రైమ్ములూ అవీ పాడుతున్నాడేమో, వాడు వెళ్ళే స్కూలే మనవాడు వెళ్ళేదానికన్నా బెటరేమో,ఇలా ప్రతీదీ వాడితో కంపేర్ చేసి,మనకున్న ఆనందం కాస్తా గంగపాలు చేసికోవడం చూస్తూంటాము.అలాగని ఆ అవతలివాళ్ళేమీ సుఖపడిపోవడం లేదు. వాడు, వాళ్ళ బాసు  పిల్లలు వెళ్ళే స్కూలికి పంపలేకపోయామే అని ఏడుపు! ఉన్నదాంట్లో సంతృప్తి అనేది,మనం ఆలోచించేపధ్ధతిలో ఉంటుంది.

రైల్వే స్టేషనుకెళ్ళండి,మామూలుగా త్రీ టైర్ లో ఉండేవాళ్ళు, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళుపడుతూ ఉంటారు.ట్రైనుకి చివర్లోఉండే ఏసీ లో ఉండేవాళ్ళు, ఓ పెద్ద పోజు పెట్టేసుకుని, ప్లాట్ఫారం మీద బయటే నుంచుంటారు, ఎందుకంటే, వాడు ఏ బుక్ స్టాల్ కైనా ,ఏ క్యాంటీను కైనా వెళ్ళాలంటే, చచ్చేటంత దూరం వెళ్ళాలి,అంతదూరం వెళ్ళే ధైర్యం వీడికుండదు,ఈ లోపులో రైలెళ్ళిపోతే అమ్మో ! వాడితిప్పలు వాడివీ. ఏసీ టు టైరులో ఎప్పుడైనా గమనించారో లేదో, ఉన్న నలుగురూ ఒకళ్ళతో ఇంకోళ్ళు ఛస్తే మాట్లాడుకోరు.ఎవడికివాడే బలే హిరో అనుకుంటాడు, చేతిలో ఓ ఇంగ్లీషు నవల తప్పకుండా ఉంటుంది.పైగా బయటకి వెళ్ళి ఏ ఇడ్లీయో, ఇంకోటో కొనుక్కోడానికి నామోషీ, టు టైరులో ప్రయాణం చేస్తున్నాడాయే! పైగా అలా వెళ్ళేవాళ్ళలో ప్రతీవాడూ చెప్పే స్టాండర్డ్ డయలాగ్గు-- 'ఎప్పుడూ ఫ్లైట్ లొనే వెళ్తానూ, ఏమిటో ఈసారే ఆఖరినిమిషంలో ఇలా వెళ్ళవలసివచ్చిందీ' అనేది.వాడే గంగలో దిగితే మనకెందుకూ? ఓ సంగతి చెప్పడు-వాళ్ళ బాసు ఫ్లైట్ లో అదేదో పెద్ద క్లాసులో వెళ్తాడూ, వీడేమో ఎకానమీ లో వెళ్తాడూ,ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత కూడా,వాళ్ళ బాసుకి మెర్సిడీజూ, వీడికి ఇండికాయో, లేక ఎంబాసడరో ఇస్తారని.    వినేవాడుంటే ఎన్నైనా చెప్పేయడం.

అంతదాకా ఎందుకూ, మన పిల్లకాయల్ని చూడండి, ఏడాది తిరిగేసరికి చేస్తున్న జాబ్ బోరుకొట్టేస్తోందిట. ఇంకో కంపెనీలో అదేదో బావుంటుందీ,ఆ జాబ్ profile బావుంటుందీ అని మారిపోతూండడం. అయినా ఈ వేషాలన్నీ పెళ్ళై పిల్లలు పుట్టేదాకానే లెండి. ఆ తరువాత ఉన్న ఉద్యోగం లక్షణంగా చేసికుంటాడు!

అదేమిటో ఎవరింటికైనా భోజనానికి వెళ్తే ఆ ఇంటావిడ చేసిందే బాగుందేమో అనిపిస్తూంటుంది! రోజూ పెళ్ళాం చేసినది పీకలదాకా మింగుతున్నా సరే. 'అన్నయ్యగారూ, మరీ మారడగలేదు. వదినగారి చేతివంటంత బావుండలెదేమో' అనగానే, ఛాన్సొచ్చిందికదా అని, అబ్బే అలాటిదేమీ లేదమ్మా, నీచేతివంట అమృతం ఎట్సట్రా వల్లించేస్తాడు.భార్య ఎదురుగా ఉండగానే. అసలు ఆ ఇంటావిడడిగిందెందుకూ, ఇంట్లో ఉన్న మొగుడికి తెలియచేయడానికి'ఓరి బడుధ్ధాయీ, నా చేతి వంట ఊళ్ళోవాళ్ళందరికీ బాగానే ఉంటుందీ, నీకే తిన్నదరక్క రోజూ వంక పెడుతూంటావూ' అని చెప్పడానికి.ఈ పెద్దమనిషీ వాళ్ళూ అవతలివారింటికి వెళ్ళినప్పుడు సీన్ రిపీట్ !

పక్కవాళ్ళింట్లో ఏ ప్లాస్మా టి.వీ యో తెచ్చారనుకోండి,ఇంట్లో పగలనకా, రాత్రనకా ఆ టి.వీ గురించే गुण गान् !వాళ్ళింట్లో ఫ్లోరింగు బావుందీ, అబ్బ వాళ్ళాయన జుట్టుకి రంగేసికుంటే ఎంత బావుంటాడో, మీరూ ఉన్నారు.వాళ్ళకి,ఎంచక్కా శాంట్రో ఉంది. మనమూ ఉన్నాము,ఆటోలూ, బస్సులూనూ.దేనికైనా పెట్టిపుట్టాలి అంటూ.ఆ అవతలివాడు, ఇంకోళ్ళని గురించి అలాగే అనుకుంటూంటాడు. అలా కాకపోతే మానవ జన్మే కాదు! 

అందుకనే 'పొరుగింటి పుల్లకూర రుచి' a.k.a. 'Neighbour's wife is always beautiful' అనే సామెతలు వచ్చాయి! ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతీ విషయంలోనూ , ఇంకోరితో పోల్చుకోకుండా ఉండలేము. ఎంతచెట్టుకంత గాలి.. అదేం చిత్రమో, ఎప్పుడూ మనకంటే బాగా ఉన్నవారితో పోల్చుకుని, ఏడవడం కంటే, ఒక్కసారి , మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారితో పోల్చుకుని, అబ్బ ఎంత అదృష్టవంతులమో కదా అని అనుకుంటే పొందే ఆనందం వెలకట్టలేనిది.  ప్రతీవారికీ “ సంతృప్తి (  contentment) “  అనేది ఉండాలి. లేకపోతే ప్రతీదానినీ పోల్చుకుంటూ, అందుకోలేక , జీవితాన్ని దుర్భరం చేసికోవడం తప్ప మిగిలేదేమీ లేదు.. 

సర్వేజనా సుఖినోభవంతూ. 

మరిన్ని శీర్షికలు
paryatakam