Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> నిధి

Nidhi Telugu Story
Nidhi Telugu Story

పిల్లలూ... మీకు నిధి అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి మమ్మీ... ఎలా వుంటుంది మమ్మీ... చెప్తా... బోలెడంత బంగారం... పెట్టెలకొద్దీ డబ్బూ... ఇంకా రత్నాలూ, మాణిక్యాలూ, వజ్ర ఫైడూర్యాలూ అన్నమాట... అమ్మో... అంత బంగారమే... అంతపెద్ద నిధి ఎక్కడుంది మమ్మీ? ఎవరైనా వెళ్లొచ్చా? మనమైనా వెళ్లి తెచ్చుకోవచ్చా?

ఆగండాగండి... సరిగ్గా ఇలాంటి అనుమానమే సుశాంతుడికీ వచ్చింది... ఆశ కలగడమే ఆలస్యం, ఆ నిధి తెచ్చుకోవడానికి వెంటనే బయలుదేరాడు... భలే భలే... మరి, ఆ నిధి దొరికిందా మమ్మీ? ఆహా... అంతకంటే పెద్ద నిధే దొరికింది... ఎక్కడ మమ్మీ? ఎలా దొరికింది మమ్మీ? ప్లీజ్ చెప్పవూ... చెప్తా వినండి...

పూర్వం అమరావతీ నగరంలో సుశాంతుడు అనే యువకుడు నివసించేవాడు. అతని తండ్రి అక్కడా ఇక్కడా కూలీ పని చేసేవాడు. తల్లి నాలుగిళ్ళలో పాచిపనిచేసేది. వారికి సుశాంతుడొక్కడే సంతానం.

అయితే, తల్లిదండ్రులిద్దరూ ఇంత కష్టపడుతుంటే, తాను మాత్రం ఏ చెట్టు నీడనో హాయిగా కూర్చుని మిత్రులతో కబుర్లు చెపుతూ కాలయాపన చేసేవాడు సుశాంతుడు.

ఒకసారి వాడికి తల్లిదండ్రులు పడే కష్టం తలచుకుని బాధ కలిగింది. పేదరికం అనేది భగవంతుడు ఇచ్చిన తమ పాలిటి శాపమని వాడికనిపించింది. తమ పేదరికాన్ని రూపుమాపేందుకు పరిష్కారమార్గాన్ని అన్వేషిస్తూ అతను ఎవ్వరికీ చెప్పకుండా ఒకరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. పోగా పోగా అతనికొక అడవి తగిలింది.

అడవిలో ప్రయాణిస్తున్న సుశాంతుడికి ఒక ముని ఆశ్రమం కనబడింది. దాని ఎదురుగా రావిచెట్టు నీడలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్న ఋషి కనిపించాడు. ఇలాంటి ఋషుల దగ్గర మంత్రశక్తుల లాంటివి ఉంటాయని కథల్లో విన్న సుశాంతుడికి ఈ ఋషి తమ పేదరికం తొలగిపోయేందుకు ఏమైనా మార్గం సూచించగలడేమో అని ఆశ కలిగింది. అతను భక్తి భావంతో ఆ ఋషి చెంతకు వెళ్ళి ఆయన పాదాలు తాకాడు. ఆ ముని కళ్ళు తెరచి - "ఎవరు, నాయనా, నువ్వు? ఏం కావాలి? అనడిగాడు.

సుశాంతుడు తన కథంతా చెప్పుకుని - "స్వామీ! మా పేదరికం తొలగిపోయే మార్గం సూచించండి. ఏదైనా నిధిని ప్రసాదించండి." అని వేడుకున్నాడు.

ముని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి "వెర్రివాడా! అద్భుతమైన నిధి నీ చెంత ఉండగా నేను నీకేమివ్వను!" అన్నాడు.

సుశాంతుడు ఆశ్చర్యంగా చూసి, "స్వామీ! నా చెంత నిధి ఉన్నదా! కాస్త వివరంగా చెప్పండి" అన్నాడు. అప్పుడు ముని నవ్వి - "నీ తల్లిదండ్రులు ప్రసాదించిన నీ ఆరోగ్యమైన శరీరమే ఒక నిధి. నీ కాలూ, చెయ్యీ సక్రమంగా పని చెయ్యటమే ఒక వరం. వెర్రివాడా! వృధా కాలయాపన చెయ్యక కష్టపడి పని చెయ్యి చెమటోడ్చి సంపాదించు" అన్నాడు.

అప్పుడు సుశాంతుడికి జ్ఞానోదయమైంది. 


మరిన్ని కథలు
Dharani Telugu Story