Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఆనందో బ్రహ్మ చిత్ర సమీక్ష

anamdo brahma movie review

చిత్రం: ఆనందోబ్ర్రహ్మ
తారాగణం: తాప్సీ, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్‌, షకలక శంకర్‌, రాజీవ్‌ కనకాల, తాగుబోతు రమేష్‌, రఘు కారుమంచి తదితరులు. 
సంగీతం: కె 
సినిమాటోగ్రఫీ: అనిష్‌ తరుణ్‌కుమార్‌ 
దర్శకత్వం: మహి వి రాఘవ్‌ 
నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి 
విడుదల తేదీ: 18 ఆగస్ట్‌ 2017 
నిర్మాణం: 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 


క్లుప్తంగా చెప్పాలంటే:

సిద్దు (శ్రీనివాస్‌రెడ్డి), ఫ్లూట్‌ రాజు (వెన్నెల కిషోర్‌), తులసి (తాగుబోతు రమేష్‌), బాబు (షకలక శంకర్‌) వివిధ సమస్యలతో సతమతమవుతుంటారు. సిద్దుకి శ్రీలక్ష్మి నిలయం అనే ఇంటి యజమాని రాము (రాజీవ్‌ కనకాల) పరిచయమవుతాడు. తన శ్రీలక్ష్మినిలయం అమ్ముడుకాకపోవడానికి అందులో దెయ్యాలున్నాయనే అపోహ కారణమని రాము, సిద్దుతో చెబుతాడు. ఆ ఇంట్లో కొన్నాళ్ళు తాము ఉండి, అందులో దెయ్యాలు లేవని నిరూపిస్తామని అలా చేస్తే ఇల్లు అమ్ముడవుతుందని, అమ్ముడయ్యే సొమ్ములో కొంత వాటా తమకివ్వాలని సిద్దు ప్రతిపాదన తెస్తాడు. దానికి రాము ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సిద్దు, తన స్నేహితులతో కలిసి ఆ ఇంట్లోకి వెళతాడు. ఆ ఇంట్లో దెయ్యం ఉందా? లేదా? వారి సమస్యల్ని ఆ ఇల్లు తీర్చిందా? ఇల్లే వారికి ఓ సమస్యలా మారిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి. 


మొత్తంగా చెప్పాలంటే :
ఈ సినిమాకి గ్లామరస్‌ ఎట్రాక్షన్‌ అంటే తాప్సీనే. అయితే ఆమె పాత్రకంటే మిగతా పాత్రధారులకే ఎక్కువ స్కోప్‌ లభించింది. తాప్సీ ఉన్నంతలో బాగా చేసింది. 'గీతాంజలి' సినిమాతో సత్తా చాటిన శ్రీనివాస్‌రెడ్డి, ఈ సినిమాలోనూ చాలా బాగా చేశాడు. అతని నటనకు మంచి మార్కులు పడతాయి. షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజీవ్‌ కనకాల నటన ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

దెయ్యాలు మనుషుల్ని భయపెడ్తాయ్‌ సరే, మనుషుల్ని దెయ్యాలు భయపెడితేనో? ఈ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నామని చెప్పి దర్శకుడు సినిమాపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడు. కాన్సెప్ట్‌ కొత్తగానే అనిపిస్తుందిగానీ, హర్రర్‌ కామెడీ సినిమాకి అవసరమైనంత కామెడీ లేకపోతే ఎలా? పూర్తిగా లేదని కాదుగానీ, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటే బాగుండేదనిపిస్తుంది. మాటలు బాగున్నాయి. కథనం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా రిచ్‌నెస్‌కి సినిమాటోగ్రఫీ కూడా కారణం. ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. మ్యూజిక్‌ ఓకే. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.

ప్రధాన తారాగణం ఎదుర్కొంటున్న సమస్యల్లోంచి దెయ్యాలకు భయం పుట్టడం కొత్త కాన్సెప్ట్‌. ఒక్కోసారి ప్రధాన తారాగణం భయపడటం, ఒక్కోసారి దెయ్యాలు కన్‌ఫ్యూజన్‌తో భయపడటం ఇలా జరగడం అనేది తెలుగు తెరపై కొత్త విషయమే. ఆ రకంగా సినిమా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. కామెడీ బాగానే ఉన్నా, ఆ డోస్‌ ఇంకాస్త ఎక్కువైతే ఇంకా బెటర్‌ రిజల్ట్‌ వచ్చేదే. దెయ్యాల సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అందులో కొత్తదనం అంటే ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తుంది. సినిమాకి జరిగిన పబ్లిసిటీ, కొత్తదనంతో కూడిన కథ ఇవన్నీ ఈ సినిమాకి మెయిన్‌ ప్లస్‌పాయింట్స్‌. ఓ మంచి సినిమా చూసిన అనుభూతి అయితే ప్రేక్షకుడికి కలుగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే :
ఆనందో బ్రహ్మ - భయపెట్టినా ఆనందమే 


అంకెల్లో చెప్పాలంటే: 3.25/5 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka