Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది ?

premiste emavutundi

గతసంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue229/635/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)...  అంతేకాదు,  ఆమెకి హద్దులు బాగా తెలుసు. అందుకే  ఇద్దరి మధ్యా ఉన్న స్థాయి భేదం ఆమె మరచిపోదు..  అతని స్థాయి వేరు... తన స్థాయి వేరు.. స్నేహానికి అంతస్తులు అడ్డుకాకపోవచ్చు ....కానీ ప్రేమ, పెళ్లి వీటికి అంతస్తులో తను ఏ మాత్రం అతనికి సూట్ అవదు.. మోహంతోటో , ప్రలోభంతోటో ఈ సాన్నిహిత్యాన్ని ప్రేమ అనుకోడం, అది శాశ్వతం చేసుకోడం కోసం అనాలోచితంగా పెళ్లి చేసుకోడం, ఆ తరవాత, మనస్పర్ధలతో విడిపోడం ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు.. మంచి స్నేహాన్ని ప్రేమా పేరుతొ కలుషితం చేయడం కూడా ఇష్టం లేదు..  పైగా తనకి ఒక లక్ష్యం ఉంది.. ఆ  లక్ష్యం చేరాలి.. ఆ తరవాతే ప్రేమ అయినా, పెళ్లి అయినా అనేది ఆమె నిర్ణయం. 

‘’ ఏయ్  ఏంటి ఆలోచిస్తున్నావు... లంచ్ చేద్దాం రా’’  ఆర్తి తట్టడంతో లేచి ఆమెని అనుసరించింది.

ఆలస్యంగా నిద్ర లేచి పరిగెత్తుకు రావడంతో బ్రేక్ ఫాస్ట్ చేయలేదు.. ఆకలి దంచేస్తోంది.. కమ్మటి ఆ భోజనం కడుపునిండా తింది. 

నలభై నిముషాలు  లంచ్ తరవాత షార్ట్ ఫిలిం.. ప్రెజంటేషన్.. 

షార్ట్ ఫిలిం అంటే ఎలా ఉంటుందో అనుకుంటూ అనాసక్తంగా కూర్చున్న శరణ్య కొద్ది క్షణాల్లోనే అందులో మునిగిపోయింది. ప్రారంభం నుంచే ఆసక్తి కలిగించింది.  మంచి థీమ్ ...పెట్రియాటిజం ... ఇద్దరు యువకులు. చిన్నప్పటినుండి ప్రాణ మిత్రులు. . ఇద్దరిది చెరో లక్ష్యం... అభిరుచులు వేరు.. ఆదర్శాలు వేరు.. ఒకరికి విదేశాలకు వెళ్లి మిలియనీర్ అవాలని ఆశ ... ఒకరికి సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కోరిక... 

నీ దేశభక్తి ఎవరు గుర్తిస్తారు.. నీ త్యాగం ఎవరికీ కావాలి.. స్వార్ధ పరులైన ఈ నాయకులు నీ సేవలకు మెచ్చి నీకేదో చేస్తారన్న భ్రమలో ఉన్నావు  అంటాడు రెండో యువకుడు సైన్యంలో చేరడానికి వెళ్తున్న మిత్రుడితో...

నన్ను ఎవరో మెచ్చుకోవాలని నేను చేయడం లేదురా.. నా కన్నతల్లికి సేవ చేస్తే నన్నెవరో గుర్తించాలని చేస్తానా.. అది నా బాధ్యత.. అలాగే ఈ దేశం నా తల్లి... కష్టాల్లో ఉన్న నా తల్లిని వదిలి పరాయి దేశం వెళ్ళేంత స్వార్ధ పరుడిని కాను... 

అనుకున్నట్టే  మొదటి అతను సైన్యంలో చేరతాడు... 

రెండో యువకుడు అమెరికా వెళ్ళడానికి అనేక అడ్డంకులు... రెండేళ్ళు గడిచిపోతాయి..

ఒక రోజు దారుణమైన వార్త ...ఉగ్రవాదుల దాడిలో బలైపోతాడు మిత్రుడు.. .      

తను అన్నట్టే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మిత్రుడి గురించి వార్తా పత్రికల్లో కానీ, న్యూస్ చానెళ్ళలో ప్రత్యేక వార్త లేకపోవడం బాధ కలిగిస్తుంది. ఒక సినిమా నటుడి రాసలీలలు,, రాజకీయ నాయకుడి ప్రతాపాలు లాంటి అనవసరమైన వార్తలు పతాక శీర్షికలో  ప్రచురించే పత్రికలు,  కధలు, కధలుగా ప్రసారం చేసే ఛానళ్ళు తన స్నేహితుడి ప్రాణత్యాగం గురించి ఏ మాత్రం ప్రాధాన్యత లేని విధంగా ఒక మూల చిన్నగా ప్రచురించడం చూసి మండిపడతాడు.  

దేశం కోసం చేసే త్యాగానికి ఎవరి గుర్తింపు అవసరం లేదని, అంతరాత్మ సాక్షిగా చేసే పనికి ఆ భగవంతుడి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని అన్న  స్నేహితుడి తండ్రి మాటలకి కదిలిపోయిన అతను అమెరికా  వెళ్ళాలన్న తన నిర్ణయం మార్చుకుంటాడు.

ఎంతో  ఆర్ద్రంగా... ముగింపు కళ్ళు చెమర్చేలా ఉంది.. లైట్లు వెలగగానే అభినందనల జల్లుల్లో తడిసిపోతున్న  తేజ వైపు చూసింది శరణ్య... ఎప్పుడూ అల్లరిగా మాట్లాడుతూ, చిన్న పిల్లాడిలా ప్రవర్తించే  తేజ లో ఇంత ప్రతిభ ఉందా... మొదటిసారిగా అతనిలో మరో వ్యక్తిని చూసింది.. అతని పట్ల అభిమానం, ఆరాధన వెల్లువగా పొంగింది.. తన క్లాస్ మేట్ గా, తన స్నేహితుడిగా, ఆత్మియుడిగా, ప్రేమ, ప్రేమా అంటూ వెంటపడే అల్లరి కుర్రవాడిగా మాత్రమే ఇంతవరకు తెలుసు.. ఇప్పుడు ఈ తేజ వేరుగా, ... నమ్మలేనట్టుగా తనని తానూ గిల్లుకుంది. 

అందరూ అతన్ని ప్రశంసలతో మున్చేస్తున్నారు.. వాళ్ళకి సమాధానం చెబుతూనే కళ్ళతో శరణ్య కి సైగ చేసాడు ఎలా ఉంది అన్నట్టు..

కళ్ళతోటే ప్రశంసించింది.. 

ఆర్తి కళ్ళు తుడుచుకుంటూ “ గ్రేట్ ఫ్రెండ్..  వుయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ తేజ” అంది. అందరి కళ్ళు తడిగా అవడం గమనించిన శరణ్య ఇంత మందిని కదిలించిన తేజ సామాన్యుడు కాదు అనుకుంది.

తేజ దగ్గర అందరు సెలవు తీసుకుంటున్నారు. మిత్రులంతా  పొందిన పారవశ్యం లోంచి  బయటికి రాలేక అలాగే కూర్చున్నారు.. 

తేజ కొద్ది సేపటికి వాళ్ళ దగ్గరకి వచ్చాడు. మిత్రులంతా అభినందనలతో ముంచెత్తారు. పూనమ్ కౌగలించుకుని విష్ చేసింది.  శరణ్య చేయి చాచి షేక్ హ్యాండ్ ఇస్తూ “ ఎక్సలెంట్ తేజా కంగ్రాట్స్ “ అంది మనస్ఫూర్తిగా .

“థాంక్స్ శరణ్య “ అన్నాడు.. 

అందరు బై చెప్పి వెళ్ళిపోయారు. శరణ్య కూడా బయలుదేరుతూ “, ఈవెనింగ్ ఇంటికి రా”  అంది. 

“ ఎందుకు ఏదన్నా గిఫ్ట్ ఇస్తావా....” కళ్ళనిండా అల్లరి నవ్వుతో అడిగాడు..

“ ఇస్తాను... రా “ అంది.

“ అయితే కచ్చితంగా వస్తాను... ఇక్కడ మొత్తం సెటిల్ చేసి వస్తాను..” అన్నాడు. బై చెప్పేసి బయలుదేరింది.   లిబర్టిలో ఉన్న  తన అపార్ట్ మెంట్ కి వచ్చిన శరణ్య చాలాసేపటి దాకా ఆ మూడ్ లోంచి బయటికి రాలేకపోయింది. తేజాలో ఇంత మంచి భావాలున్నాయా?  తేజ లాంటి ఆదర్శ భావాలు , చక్కటి అభిరుచులు ఉన్న యువకులు సినిమా ఫీల్డ్ లో ఉంటె తెలుగు సినిమా కూడా ఆస్కార్ స్థాయికి ఎదిగే సమయం త్వరలోనే వస్తుంది అనుకుంది..

నాలుగు అవుతుండగా  తేజ కోసం గులాబ్ జాం చేసింది...మ్యాగి  చేసింది. 

ఫ్రెష్ అయి  షార్ట్స్, టి షర్ట్ వేసుకుని అతనికోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

ఐదున్నర అవుతుండగా వచ్చాడు తేజ..” హాయ్ డార్లింగ్ ఎలా ఉంది ఫిలిం”  వస్తూనే అడిగాడు ..

శరణ్య సమాధానం చెప్పకుండా లేచి వెళ్లి రెండు బౌల్స్ లో  మూడేసి గులాబ్ జాం వేసి , తీసుకొచ్చింది ..

సోఫాలో వెనక్కి జారగిలి కూర్చుని రిమోట్ తీసుకున్న తేజ చేతిలోంచి రిమోట్ తీసి పక్కన పడేసి అతని పక్కన కూర్చుంది.

“వాట్సప్ “ కళ్ళెగరే స్తూ అడిగాడు..

స్పూన్ తో గులాబ్ జాం చిన్న ముక్క కట్ చేసి అతని నోటికి అందిస్తూ  “ఇలా ఉంది”  అంది. 

“ గులాబ్ జాం  తీయగా ఉంది.. యూ మీన్ షార్ట్ ఫిలిం కూడా .....”

“ అంతేనా నీకర్ధం అయింది.. మొద్దు...” అంటూ నెత్తిన చిన్నగా మొట్టి...” నేనిలా నీకు తీపి తినిపించడం నువ్వెలా ఫిల్ అవుతున్నావు.. “ భుజాలెగరేసి “ నాకేం అనిపించడం లేదు “ అన్నాడు... 

 “అయితే నీ ఆరోగ్యం విషయం అనుమానించాల్సిందే. . ఓసారి మంచి డాక్టర్ కి చూపించుకో.”

“అవునా... రెండేళ్ళ నుంచి పిచ్చి వెధవలా నీ వెంట ప్రేమ, ప్రేమ అని తిరుగుతుంటే ఏ మాత్రం చలనం లేని నీ ఆరోగ్యం సంగతేంటో...”  కోపంగా అన్నాడు.

శరణ్య నవ్వింది. 

“  నీకింత మంచి టేస్ట్  ఉందని  ఇంతవరకు నాకు తెలియదు తేజా... కధ ఎక్కడిది.. ఎవరు రాసారు?”  అతని బౌల్  అతని చేతికిచ్చి, తను ఒక బౌల్ తీసుకుంటూ అంది.

అతను సమాధానం చెప్పకుండా గులాబ్ జామ్ తినసాగాడు.

“నువ్వేదో మీడియా అంటే ఇంట్రస్ట్ చూపిస్తావు అనుకున్నానే కానీ, ఇలాంటి మంచి ఫిలిమ్స్ తీస్తావని నేను అసలు ఊహించలేదు... చెప్పు తేజా స్టొరీ ఎవరు రాసారు?”

“నేనే ....” ఖాళి బౌల్  సెంటర్ టేబుల్ మీద పెట్టాడు. 

“నువ్వా? నువ్వు కధలు కూడా రాస్తావా! “ ఆశ్చర్యంగా చూసింది..

“ ఇందులో నువ్వంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం ఉంది? ఆ మాత్రం చిన్న కధ రాయడం బ్రహ్మ విద్యా? “

“అలా అని కాదు... కానీ... ఐ కాంట్ బిలీవ్ ....”

 ఆమె వైపు తదేకంగా కొన్ని క్షణాలు చూసి చిన్నగా మందహాసం చేసాడు..  కూర్చున్న దగ్గరనుంచి లేచి కిచెన్ వైపు వెళ్లి, నాన్ స్టిక్ పాన్ లో ఉన్న మ్యాగి కొంచెం ప్లేట్ లో పెట్టుకుని, అక్కడే స్టాండ్ లో ఉన్న ఫోర్క్ తీసుకుని తింటూ వచ్చి సోఫాలో సెటిల్ అయాడు.

“తరవాత తినచ్చు lExxలే చెప్పు అంది రవ్వంత విసుగ్గా” .... సస్పెన్స్ భరించలేనట్టు. 

“చాలా బాగుంది..  వేరీ టేస్టీ “ అన్నాడు.. గబుక్కున ప్లేట్ లాగేసి  “ ముందు చెప్పు.... తరవాత ఉన్నదంతా నువ్వే తిందువుగాని... కావాలంటే ఇంకా చేసి పెడతా” అంది. 

తేజ గట్టిగా నవ్వి... శరణ్య చేయి తన చేతిలోకి తీసుకుని అరచేయి ముద్దు పెట్టుకుని అన్నాడు. “ఓసి పిచ్చి శరణ్యా! ఇలాంటి కధలు రాయడానికి గొప్ప మేధావులు కావాలా... నీలాగా పుస్తకాలు నమిలి  మింగేయాలా.. న్యూస్ పేపర్లో చదివిన న్యూస్ నన్ను కదిలించింది.. దాని నుంచి వచ్చిన చిన్న ఆలోచన. ఒక స్టొరీ లైన్... కొంచెం స్క్రీన్ ప్లే... నాలుగు డైలాగ్స్ ...కొంత క్రియేటివిటి.... వెరసి ఒక మూవీ. “

అప్పటిదాకా ఇంకా ఏదో చెప్పబోతున్నాడని సీరియస్ గా వింటున్న శరణ్య మ్యాగి  ప్లేట్ ఇస్తూ దీర్ఘంగా “ తిను” అని  సోఫాలో వెనక్కి వాలుతూ అంది దీనివలన నీకు మోనిటరీ బెనిఫిట్ ఏమన్నా ఉంటుందా..” 

“అదంతా నేను ఆలోచించడం లేదు... నాకు ఈ ఫీల్డ్ నచ్చింది ... ఫాలో అవుతున్నాను... ఉంటె ఉంటుంది.,.. లేకపోతె లేదు...”

 “అవునులే నీకు మీనాన్న సంపాదించి ఇచ్చిందే బోలెడుంది...నువ్వు సంపాదిస్తే ఎంత... లేకుంటే ఎంత..?”

“సరేలే ఇంతకీ మన పెళ్లి ఎప్పుడు?”  అడిగాడు తేజ..

“ఇప్పుడే చేసుకుందామా...” అంటూ గట్టిగా నవ్వి కుషన్ అతనిమీద విసిరేసి లేచి కిచెన్ వైపు వెళ్ళిపోయింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్