Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavtundi

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue234/645/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

వేడి, వేడి గారెకి అల్లం పచ్చడి అద్దుకుని తింటున్న శేషు వైపు చూస్తూ “ అక్కయ్య కూడా వస్తే బాగుండేది”  అంది అన్నపూర్ణ.

“ఈ సారి అసలు నేను కూడా రాగలనో లేదో అనుకున్నాను.... కానీ మీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను.“ అన్నాడు శేషు.
కాఫీ కలపడానికి వంట గది లోకి వెళ్ళ బోతున్న అన్నపూర్ణ ఒక్క క్షణం ఆగి భర్త మొహం లోకి చూసింది.. ఆయన గారె  తుంచుకుని తింటూ

" ఏ విషయం " అని అడిగాడు చాలా మాములుగా. ఏదో కొత్త వ్యాపారం గురించి చెబుతాడేమో అనుకుంటూ.  వాళ్ళ విషయాలు నాకెందుకు అనుకుంటూ అన్నపూర్ణ వెళ్లబోతుంటే “ నువ్వు కూడా ఉండమ్మా” అన్నాడు శేషు.అన్నపూర్ణ భ్రుకుటి ముడిపడింది...” ఇప్పుడే వస్తా”  అంటూ లోపలికి  వెళ్లి స్టవ్ ఆర్పేసి వచ్చింది.

“నేను చెప్పే విషయం విని మీరిద్దరూ ఆవేశ పడకుండా ఏం  చేయాలో ఆలోచించండి " అంటూ ఉపోద్ఘాతం మొదలు పెట్టిన శేషు వైపు భార్యా భర్తలిద్దరూ ఆసక్తిగా చూశారు.

ఏం చెప్పబోతున్నాడు... ఇద్దరి మనసులో సందేహం... పిల్లలకి కొంప తీసి అప్పుడే సంబంధాలు తెచ్చాడా ఏం?  లేక, ఏదన్న ఆస్తి పాస్తుల గురించి మాట్లాడతాడా... లేక తన కోడలు, కొడుకు గురించి చెప్తాడా... అదే అయితే ఆవేశ పడడం దేనికి? రక రకాలుగా ఆలోచిస్తూ అతను చెప్ప బోయే విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ కుతూహలంగా చూడ సాగారు.

“వారం క్రితం మేము కోడలిని తీసుకుని సైట్ సీయింగ్ కి వెళ్ళాం .... మ్యూజియం, గండిపేట, గోల్కొండ”  అంటూ ఆపాడు శేషు.
భార్యాభర్తలిద్దరూ ప్రశ్నార్ధకంగా చూసుకున్నారు ఒకళ్ళని ఒకళ్ళు.  ఈ విషయం ఇలా విశేషంగా ఎందుకు చెప్తున్నాడో ఇద్దరికీ అర్ధం కాలేదు.
శేషు గారెలు తినడం పూర్తీ చేసి ప్లేటు పక్కన పెడుతూ “మాంచి అల్లం ఘాటుతో వేడి, వేడిగా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా గారెలు” అన్నాడు.

“ఇంకా రెండు వేస్తాను” అని వెళ్ళబోతున్న అన్నపూర్ణని ఆపుతూ “వద్దు ఇంకా ఇది తినాలిగా” అంటూ రవ్వకేసరి బౌల్ చేతి లోకి తీసుకుని మొదలు పెట్టాడు..

“అందరం గోల్కొండ వెళ్ళాం ... అక్కడంతా కాలేజ్ పిల్లలు జంటలు, జంటలుగా., ఏంటోరా కాలం బొత్తిగా మారిపోయింది. మరీ  పదహారు, పదేహేడు ఏళ్ల అమ్మాయిలు, అబ్బాయిలు కాలేజి ఎగ్గొట్టి వచ్చేసారు.. అక్కడే కాదు జు పార్క్ కి వెళ్ళామా అక్కడా అంతే ... ఎక్కడ  చూసినా జంటలు, జంటలుగా... చూస్తుంటే ఏవిటో వొళ్ళంతా కంపరం ఎత్తింది...  బొత్తిగా దిక్కు మాలిన సినిమాలు, ఇంటర్నెట్ లు పిల్లలని పాడు చేస్తున్నాయి...ఇరవై ఏళ్ళు వచ్చే సరికి అందరికి అన్ని అనుభవాలు అయి పోతున్నాయి పెళ్ళిళ్ళు కాక పోయినా... అయినా  వాళ్ళని అని లాభం లేదు... పెద్దలే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి... “

“ అవును బావ గారూ!  తెల్లారి పేపర్ తెరిస్తే  ఇంటి నుంచి లేచి పోయి పోలిస్ స్టేషన్ లో పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళు, గుళ్ళలో పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి కాకుండా కలిసి బతికే వాళ్ళు... ఏంటో బొత్తిగా భయం, భక్తీ లేకుండా తయారు అవుతున్నారు... కాలం మారుతోందంటే ఏవిటో అనుకున్నా కానీ ఇలా ఉచ్చం, నీచం లేకుండా మారుతుందనుకోలేదు” అన్నపూర్ణ కూడా శేషుని సమర్ధిస్తూ అంది.

“మొన్ననేగా పేపర్లో ఒక పదిహేడేళ్ళ అమ్మాయిని ప్రియుడే చంపేశాడు అని వార్త చదివాము... దాని వయసు పదిహేడు, అప్పటికి నాలుగేళ్ల నుంచి వాళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తోందట... అర్ధం ఉందా.. అంత చిన్న పిల్లలకి ప్రేమ ఏంటి?  వెధవ్వేషాలు  కాకపొతే....నాలుగు తన్ని ఇంట్లో పడేస్తే ఇంత దూరం వచ్చేదా...” మండి పడ్డాడు కోటేశ్వర రావు .

“అదే నేను చెప్తున్నది... వీళ్ళవి ప్రేమలని ఎలా అంటాం... ఏదో ఆకర్షణ, వెర్రి పోకడ... దానికి ప్రేమ అని పేరు పెట్టేసుకోడం... ఐ లవ్ యు అనేసుకోడం.. ఏవిటో... నిట్టూరుస్తూ అడిగాడు శేషు   అన్నట్టు మన గాయత్రి వయసెంత”.

“పదిహేడు”  చెప్పేది చెప్తూ వెంటనే ఆవిడ చిన్న ఉలికి పాటుకి గురైంది. అన్నపూర్ణ ' ఎందుకు అడుగుతున్నాడు..?'

శేషు కొన్ని క్షణాలు గంభీరంగా ఉండి “ ఇలా చెబుతున్నానని బాధ పడకండి.. పిల్లని ఓ కంట కనిపెట్టి ఉండండి ....” అన్నాడు.  అన్నపూర్ణ , కోటేశ్వర రావు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ “ఏం జరిగింది ?” అన్నారు.

అప్పటికే శేషు ' నేను చెప్పబోయే విషయం విని మీరు ఆవేశ పడకండి ' అని చెప్పడం, గాయత్రి వయసు అడగడం, ఇప్పుడిలా అనడంతో అన్నపూర్ణ మనసు కీడు శంకించింది. గాయత్రి ఏదన్నా తప్పు చేసిందా... పిల్ల అలాంటిది కాదు.. దానికంత ధైర్యం లేదు కూడా.. పైగా కాలేజికి ఇంటికి తప్ప మరో చోటికి వెళ్ళని పిల్ల గురించి ఈయన కేం తెలుస్తుంది.. మనసుకి సమాధానం చెప్పుకుంది.

శేషు రెండు క్షణాల తరవాత అన్నాడు “ దాన్ని నేను చూసి ఏడాది దాటింది అనుకో... అయినా గుర్తు పట్ట గలను’.. కోటేశ్వర రావు నొసలు చిట్లిస్తూ  అనుమానంగా అడిగాడు...' ఎక్కడ చూశావు శేషూ ...' అన్నపూర్ణ గుండె దడదడ లాడింది..

శేషు ఇద్దరి మొహాల్లో మారుతున్న రంగులు గమనిస్తూ చెప్ప డానికి కొంచెం సందేహించాడు.. కానీ ఇవాళ తను ఈ విషయం దాస్తే రేపు ఏదన్నా జరిగితే ఆ తప్పు తనదే అవుతుంది.. నీకు తెలిసి నాకెందుకు చెప్పలేదు.. నీ కూతురే అయితే అలాగే వదిలేస్తావా అని అడిగితే ... ఎంతైనా తమ్ముడు, ఒక తల్లి పిల్లలు కాకున్నా రక్త సంబంధాలు ఎక్కడికి పోతాయి.. లేదు చెప్పాలి... అనుకుంటూ నెమ్మదిగా అన్నాడు.  “గోల్కొండలో ...”

మ్రాన్పడి పోయింది అన్నపూర్ణ.. మొహంలో నెత్తురు చుక్క లేనట్టు పాలి పోయింది ఆవిడ మొహం. కాళ్ళు, చేతులు వణకడం మొదలు పెట్టాయి. నిస్తేజంగా భర్త వైపు చూసింది.

కోటేశ్వర రావు మొహం ఆవేశంతో ఎర్ర బడింది.... పళ్ళు పట పటలాడిస్తూ గభాల్న లేచి నిల్చుని  “ఎప్పుడు?”  అనడిగాడు.. కంచులా మోగింది ఆయన కంఠం ...

“అదే మేము వెళ్ళిన రోజే.. ఎవరో  కుర్రాడితో కనిపించింది ...”

“ శేశూ .....”  కోటేశ్వర రావు కొంచెం గట్టిగా అరిచాడు..

శేషు కూడా లేచి నిలబడి అనునయంగా అన్నాడు “ఆవేశ పడద్దని చెప్పానా .... కూర్చో... ముందు కొంచెం ఉద్రేకం తగ్గించుకో.. ..”
కోటేశ్వర రావు అతని మాట వినిపించుకోకుండా మళ్ళి అడిగాడు..” ఎక్కడ చూశావు, ఎవరితో చూశావు? ఏ రోజు చూశావు... చెప్పరా ...”
శేషు తల అడ్డంగా ఆడిస్తూ చెప్పను ....” ముందు నువ్వు ఆవేశం తగ్గించుకుని కూర్చో సావకాశంగా మాట్లాడుకుందాం.. అది కూడా చిన్న పిల్ల... తెలిసో తెలియకో తప్పు చేసింది... అలా అని ఆవేశ పడి అది రాగానే రభస చేస్తావా ఏం ? ఈ రోజుల్లో ఆడ పిల్లల సంగతి నీకు తెలియదు.. నువ్వు ఏ మాత్రం నీకి విషయం తెలిసినట్టు  దాన్ని కట్టడి చేస్తావో అయి పోయినట్టే... ఒక్క సారి తన స్వేచ్చని అరికడితే వాళ్ళల్లో కసి పెరుగుతుంది.. నేటి తరం పిల్లల్లో ఇలాంటి స్వభావం బాగా ఉందని మనస్తత్వ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.. నువ్వు కోపంగా ఏమన్నా పరిస్థితి వికటిస్తుంది కోటేశ్వర రావు ... నా మాట విను... ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఆత్మ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి.. వాళ్ళ స్వేఛ్చ అరి కట్టడం వలన... ఈ కాలం పిల్లలకి ఏం ఉన్నా లేకున్నా స్వేఛ్చ కావాలి.. అందుకే నా మాట విని నీకేమి తెలియనట్టు ఉండు... తల్లిగా అన్నపూర్ణ  విషయం ఎలా తెలుసుకోవాలో, ఏం  చేయాలో ఆలోచిస్తుంది... “ అంటూ నెమ్మదిగా నచ్చ చెప్ప సాగాడు శేషు.

కానీ కోటేశ్వర రావు ఆవేశం తగ్గ లేదు.. కూతురుని క్రమశిక్షణ తో పెంచుతున్నాడు.. భయ, భక్తులతో పెంచుతున్నాడు.. కాబట్టి తన పిల్లలు తప్పు చేయరని ధీమా ఉంది.. ఇప్పుడు శేషు చెప్పేది వాస్తవం ఆయితే  తప్పు చేసింది గాయత్రి కాదు.. తను... తన భార్య.... ఆ పిల్లని పెట్టాల్సినంత కట్టు దిట్టాల్లో పెట్ట లేదు అనే కదా అర్ధం... ఇదెలా జరిగింది? ఆలోచిస్తూనే శేషు బలవంతంగా భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టడంతో కుప్ప కూలి పోతున్నట్టుగా కూర్చున్నాడు.

శేషు చెప్ప సాగాడు. “ అక్కడ దాన్ని చూడగానే ముందు అవునా, కాదా అని ఆలోచిస్తూ నిలబడి పోయా.. తరవాత ఉమకి చూపించా.. తను చూసి మన గాయత్రే అంటూ కన్ ఫర్మ్ చేయడంతో అక్కడే ఆగి నిలబడి అబ్సర్వ్ చేశా.. అది చాలా బిడియ పడుతూ కూర్చుంది... కళ్ళల్లో భయం, బెదురు.. వాడిని చూస్తే ఉత్త వెధవలా ఉన్నాడు..  మన పిల్ల కదా దారి తప్పి నడుస్తోంది.. ఏదో ప్రలోభం లో పడుతోంది అని చూస్తూ, చూస్తూ నాకెందుకులే అని వదిలేయ లేక పోయా.  అందుకే పని గట్టుకుని వచ్చాను చెప్పడానికి... వాడు వెధవ,  పిట్టలు పట్టే వాడిలా ఉన్నాడు చూడ్డానికి... అది బలవంతంగా వచ్చిన దానిలా బిత్తర చూపులు చూస్తూ కూర్చుంది...అంటే అర్ధం కాలా ఎవడో దాని అమాయకత్వం చూసి బుట్టలో వేశాడు.. “

అన్నపూర్ణ నోరు విప్పింది...” ఎవరో ప్రలోభ పెడితే మాత్రం, ఆడ పిల్ల సిగ్గు, శరం లేకుండా అలా పరాయి మగాడితో గోల్కొండ, గండి పేట తిరిగితే మా పరువు ఏం కాను బావగారు.. మీలాగా ఎందరు చూశారో... ఎక్కడెక్కడ చూశారో... అసలు కాలేజ్ కి వెళ్ళకుండా అలా కోటలు , పార్క్ లు తిరగమని ఎవరు చెప్పారు దానికి,, అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది... నాకేం అర్ధం కావడం లేదు..” ఆవిడ మాటలు పూర్తీ కాకుండానే కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి..

“బాధ పడకమ్మా... బాధ పడితే సమస్య తీరదు.. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి.. మన పిల్లని మనం అదుపులో పెట్టుకోవాలి.. కాలేజ్ కాకా ఎటూ వెళ్ళకుండా కట్టడి చేయాలి.. అంతే.. కొంత కాలం అలా ఉన్నాక దానికే తెలిసి వస్తుంది...పళ్ళు పట, పట లాడిస్తూ అన్నాడు కోటేశ్వర రావు “అవును దాని కాళ్ళు, చేతులు కట్టేసి ఇంట్లో కూర్చో బెట్టు అన్నపూర్ణా... రేపటి నుంచి దానికి కాలేజ్ లేదు, ఏం లేదు.. రెండు రోజులు తిండి, నీళ్ళు కూడా ఇవ్వకుండా మాడ్చు ... దరిద్రపు .......”  కసిగా అంటున్న భర్త  వైపు భయంగా చూసింది అన్నపూర్ణ.
“అదే వద్దు అంటున్నా ... ఏదైనా సరే నెమ్మదిగా నచ్చ చెప్పే ధోరణిలో ఉండాలి కానీ మన పెద్దరికంతో హింసించ కూడదు...”

“నరికి పోగులు పెట్టాలి... నచ్చ చెప్పడం కూడానా .... కాలేజ్ కనీసం కో ఎడ్యుకేషన్ కూడా కాదు దీనికి అప్పుడే బాయ్ ఫ్రెండ్, వాడితో తిరగడం.... రాని దాన్ని .... “

“ఇదిగో నువ్వలా నా మాట వినకుండా అది రాగానే అరిచి, తిట్టి, కొట్టి గగ్గోలు చేశావంటే జరగ బోయే పరిణామాలకు నేను బాద్యుడిని కానురా.. చెబితే వినవేం నీ ధోరణి నీదే ....”  విసుగుతో కూడిన  శేషు మాటలు పూర్తీ అవుతుండగా గేటు చప్పుడు అవడం గాయత్రి గాల్లో తేలుతూ లోపలి అడుగు పెట్టడం జరిగింది.     

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham