Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavtundi

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue234/646/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

ఇంటికి వచ్చే సరికి మృదులా దేవి ఇంట్లో లేదు.

కాని శ్రీధర్ తండ్రి పక్కన కుర్చీలో కూర్చుని ఏంటో మాట్లాడుతున్నాడు.

కీర్తనని చూసి వినయంగా నమస్కరించాడు.

ఎందుకో అతి వినయం అనిపించింది.

తండ్రిని కూడా పలకరించకుండా లోపలికి వెళ్ళి పోయింది.

అశోక్ కూడా లేట్ గానే వచ్చాడు. మనిషి రావడమే చిర్రు బుర్రు లాడుతూ వచ్చాడు.

విసుగ్గా తన గది లోకి వెళ్ళి తలుపేసుకుని పడుకున్నాడు.

శ్రీధర్ వెళ్ళి పోయాక కీర్తన బయటకి వచ్చింది.

నానమ్మ కూడా కస్సు బుస్సు లాడుతూనే వుంది. ఏమయింది ఇంట్లో అందరికీ?

అసలు పిన్ని ఎక్కడికి వెళ్ళింది?

మళ్ళీ గొడవేదన్నా జరిగుంటుందా?

భయ పడుతూనే నానమ్మని అడిగింది.

‘మీ పిన్ని గురించి ఏమడుగుతావులే....! మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళి పోయింది.’’

‘‘మొన్నే కదా వచ్చింది! ఆశ్చర్యంగా వుంది.’’

‘‘అయితే ఆవిడకేంటి? ఈ క్షణంలో వచ్చి మరు క్షణంలో నయినా వెళ్ళి పోతుంది.’’

‘‘ఇంతకీ ఏమయింది?’’ విసుగ్గా అంది.

అది గమనించింది నానమ్మ.

‘‘నీకే ఇంత విసుగ్గా ఉంటే, నా మనవడికి ఇంకెంత విసుగ్గా ఉండాలి. నీ గురించే దెబ్బలాడుకున్నారిద్దరూ. నువ్వు ఈ ఆటలూ అదీ మానేస్తేనే మీ పిన్ని ఇంట్లో వుంటుందట. లేక పోతే పుట్టింటిలోనే నంట! ఆస్తి పంచమని గొడవ. నవ్వి పోతారెవరైనా. మంచంలో పడ్డ మొగుడిని వదిలేసి తగుదునమ్మా అని పుట్టింటికి పోయింది.

అయినా అంతా నీ వల్లనే వచ్చింది. ఇంత మంది చెపుతున్నాం. వినొచ్చుకదా! నీ పట్టుదల నీదే! మీ ఇద్దరికీ చెప్ప లేక వాడు నలిగి పోతున్నాడు. ఏదో పెద్ద కుటుంబాల వాళ్ళం. పరువుగా, గుట్టుగా బతకాలే తప్ప ఇలా ఆస్థులు పంచుకుని వీధి కెక్కితే ఎలా?’’ నానమ్మ చాలా సేపు నసుగుతూనే వుంది.

కీర్తన ఏమీ మాటలు రాని దానిలా చాలా సేపు అలాగే కూర్చుంది. ఇన్ని వైపుల నుంచీ సమస్యలు ఇలా చుట్టు ముట్టడం మనస్సుని ఆందోళనకి గురి చేస్తోంది.

అశోక్ గది వైపు వెళ్ళి తలుపులు తట్టింది. కాసేపటికి తలుపు తీసాడు. జుట్టు చెదిరి మొహం మీద పడుతోంది. కళ్ళు ఎర్రగా వున్నాయి. మనిషి చాలా అసహనంగా కనిపిస్తున్నాడు.

‘‘ఒంట్లో బాగా లేదా?’’ ఆప్యాయంగా అంది.

‘‘బాగానే వున్నాను.’’ ముభావంగా అన్నాడు.

‘‘నాన్న గారికి ఇంకా స్నానం చేయించ లేదు.’’ బైటకి రమ్మనట్లు చెప్పింది.

‘‘నాకు ఒంట్లో బాగా లేదు. తోట మాలిని రమ్మను. చేయిస్తాడు’’ చెప్పి తలుపు వేసుకున్నాడు.

మొదటి సారిగా తండ్రి విషయంలో అశోక్ ఇలా అన్నాడు. ఇంతకు ముందెన్నడూ తను అతని నోటి వెంట యిలాంటి మాట విన లేదు.
మౌనంగా వచ్చి తండ్రి పక్కనే కూర్చుని తదేకంగా ఆయన మొహం వంకే చూడ సాగింది.

ఒంట్లో బాగోక మధ్యాహ్నం వేసుకున్న టాబ్లెట్ మూలంగా మగతగా నిద్ర పోతున్నాడు భూపతి.

విశాలమైన నుదురు, వెండి తీగల్లా మెరుస్తున్న జుట్టు.....బోర్లించిన ముత్యపు చిప్పల్లాంటి కళ్ళు.....ఠీవిగా పైకి లేచిన ముక్కు.
ఏ పొల్యూషనూ లేక పోవడం మూలంగా తేటగా వున్న మొహం. యింత కాలం ఏ లోటూ లేకుండా చూశాం. యిక తమలో ఆ ఓపిక నశిస్తోందా...?

అన్నయ్య అలా అన గలడని అసలు వూహించ లేదు. అసలు తన కన్నా ఎక్కువ తండ్రికి సేలు చేసేది అతనే. అతను లేక పోతే తండ్రికి స్నానం అదీ ఇబ్బందవుతుందని వేరే వూరు కూడా వెళ్ళే వాడు కాదు.

ఇంకా తనే గేమ్స్ కోసం బయట వూర్లకి తిరగాల్సి వచ్చేది. మనసంతా దిగులు వ్యాపించింది.

పది నిమిషాలు అయ్యాక అశోక్ బయటికి వచ్చి తండ్రిని లేపి స్నానం చేయించాడు.

కీర్తన అన్నం కలిపి తెచ్చి తినిపించింది. అన్నయ్యని అనుమానించినందుకు తనని తనే తిట్టుకుంది.

ఈ రోజు జరిగిన గొడవ తో బాగా అప్ సెట్ అయి అలా అనుంటాడు. లేకపోతే అశోక్ సంగతి తనకి తెలీదా....? తేలిక పడిన మనసుతో అనుకుంది.

ప్రణీత్ చెప్పినట్లు మైండ్ ని కంపార్ట్ మెంటలైజ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది కీర్తన.

ఎక్కడ బాధలు అక్కడే, ఎప్పటి బాధలు ఆ మరు క్షణానికే మర్చి పోవడానికి అలవాటు పడ్తోంది.

మనసంతా లక్ష్యం మీదే గురి పెట్టింది. మణి బిందు కూడా కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. బహుశా ఆకాష్ ప్రభావమేమో! ఇకనైనా గేమ్స్ మెరుగు పర్చుకుని గెలవమని చెప్పి వుంటాడు.

గ్రౌండ్ కి వెళ్ళ గానే సర్వం మర్చి పోయి ఆటలో నిమగ్న మైనా రాత్రి పక్క మీద వాలగానే ఆకాష్ గుర్తొస్తున్నాడు. అతనితో తన సాన్నిహిత్యం గుర్తు వస్తోంది.

అతను పరాయి వాడన్నట్లు తనకి ఎప్పుడూ అనిపించ లేదు. ఎపుడూ తన నడుం చుట్టూనో, భుజాల చుట్టూనో చేతిని వేసి ఆప్యాయంగా స్పృశిస్తూనే వుండే వాడు.

అది ఆప్యాయత అని తననుకుంది.

మణి బిందు తోనూ అలాగే కనిపించాడు. అది ఆప్యాయత కాదు. వ్యామోహం.

అతని మాటలూ, చూపులూ గుర్తొచ్చి మనసంతా ఒకటే దిగులు. అతన్ని చూడాలనీ, అతని మాటలు వినాలనీ జరిగిందంతా ఒక కల అని ఎవరైనా వచ్చి చెబితే బావుండుననీ అనిపిస్తోంది.

కానీ అది కల ఎలా అవుతుంది? పచ్చి నిజం. గుండెల్ని రంపంలా కోసే నిజం.

ఆకాష్! ఎందుకిలా చేశావ్....?నువ్వు తల్చుకుంటే లక్షల మంది నీకు దొరకొచ్చు. కానీ నాకున్నది ఒకటే జీవితం. దాన్నే చిందర వందర చేయడానికి ప్రయత్నించావు.

వికసించి పరిమళిస్తుందనుకున్న ప్రేమ మొగ్గ లోనే వాడి పోయింది. మల్లెల్ని మంటల్లో వేసినట్లు తన హృదయాన్ని అతనికి అర్పించింది. చివరికి ఏంచేశాడు? కన్నీళ్ళతో దిండంతా తడచి పోయింది.

ఏ రాత్రికో నిద్రా దేవి బద్దకంగా వచ్చి కరుణించేది. ఈ ఆలోచనల ప్రభావం మాత్రం తన గేమ్ మీద పడకుండా చూసుకుంటోంది.
మృదులా దేవి రోజుకో ఫోన్ చేసి తనని గురించి అడుగుతుంటే, మొండి కెత్తిన అశోక్ జాహ్నవి గురించిన బాంబు కూడా పేల్చేశాడు.
అటు వైపు ఫోన్ పెట్టేసిన శబ్దం వినిపించింది. అశోక్ తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.

అయితే ఆ మర్నాడు తెలిసింది. పిన్ని అసలు స్వరూపం....ప్రకాష్ వాళ్ళింటికి జగన్నాధం....గోపాలం గూండాలని వెంటేసుకుని వెళ్ళి బెదిరించారని.

అది తెలిసి అశోక్ అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు.

ఈ ఇంటికి కోడలిగా రాబోయే అమ్మాయికి జరిగిన ఈ అవమానాన్ని అంత తేలికగా తీసుకో కూడదనుకున్నాడు.

డైరెక్ట్ గా మృదులా దేవి వాళ్ళింటికి బయలుదేరుతుంటే భయంతో కంపించి పోయింది కీర్తన.

వద్దన్నయ్యా! అక్కడికి వెళ్ళొద్దని కాళ్ళా వేళ్ళా పడింది. కానీ వినిపించుకో లేదతను.

వెళ్ళి ఛడా మడా దులిపేసి వచ్చాడు. అంతే కాదు, మాటా మాటా పెరగడంతో పెళ్ళి ఎల్లుండే జరుగుతుందని, దమ్ముంటే ఆపమని చెప్పి సవాల్ చేసి వచ్చాడు.

ఇంటికి వచ్చి గది లోకి వెళ్ళి తలుపేసుకొని పడుకున్నాడు. ఈ విషయమంతా అతనితో వెళ్ళిన శ్రీధర్ ఒకటికి రెండు చేసి చెప్పాడు.
కీర్తన ధైర్యంగా డెసిషన్స్ తీసేసుకుంది. తన ఫ్రెండ్స్ సహాయం కోరింది.

ఉత్సాహంగా తరలి వచ్చేశారందరూ. ఆమె క్లాస్ మేట్స్ అబ్బాయిలు కూడా వచ్చారు. ఆ రోజే వెంటనే శివాలయానికి వెళ్ళి అశోక్, జాహ్నవి పెళ్ళికి ముహూర్తం పెట్టించు కొని వచ్చింది.

ఇంటికి రాగానే అశోక్ గది తలుపులు తట్టింది. తలుపు తీసి ఇంట్లో జరుగుతున్న కోలాహలానికి ఆశ్చర్య పడ్డాడు. ‘‘ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకి మా ఏకైక సోదరుడు చిరంజీవి అశోక్ కి...చి॥॥సౌ॥ జాహ్నవి కి....శివాలయంలో వివాహం నిశ్చయించాం. కావున మీరెల్లరూ విచ్చేసి...’’ తమాషాగా అంది.

‘‘నాకిపుడే పెళ్ళి....? నేనేదో ఆవేశంలో....’’ మాట తడబడిరది.

‘‘ఆవేశంలో అన్నా, ఆలోచనతో అన్నా మా అన్నయ్య ఓడి పోకూడదు. మాట మీదే నిలబడాలి.’’

‘‘అయినా ముందు నీ పెళ్ళి జరగాలి. తర్వాతే నా పెళ్ళి.’’

‘‘అన్నయ్యా! ఇలా లింక్స్ పెట్టకు. అయినా ప్రకాష్ గారు ఆఫీసుకి వచ్చేశాక, వదిన ఒక్కతే వాళ్ళింట్లో వుండటం అంత మంచిది కాదు. రాత్రి జరిగిన గొడవ సంగతి చూశావుగా!

అలాగని పెళ్ళి కాకుండా తను మనింట్లో వుండటం మంచిది కాదు. ఇక ఇంత కన్నా నీకు నచ్చ చెప్పడానికి నాకు సమయం లేదు. పెళ్ళంటే మాటలా....? ఎన్నిపన్లు....?’’ ఆరిందాలా హడావిడి పడి పోతూ వెళ్ళింది.

ఇక ఇంట్లో పెళ్ళి సందడి ప్రారంభమైంది.

‘‘అన్నయ్యా! ఇంక నువ్వు ఈ రెండు రోజులూ పొదుపు చర్యలు మానేసి కాస్తంత లాకర్ ఓపెన్ చెయ్యి’’ హాస్యంగా అంది.
క్రెడిట్ కార్డ్ కీర్తన చేతికిచ్చి ‘‘నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో’’ చెప్పాడు.

వెంటనే తండ్రి దగ్గరకి వెళ్ళింది కీర్తన. ఆనందంతో దీప్తి వంతంగా వున్న ఆమె మొహాన్ని తనివి తీరా చూస్తున్నాడు భూపతి.
‘‘అన్నయ్యకి పెళ్ళి తెలుసా?’’ అడిగింది. తెలీదన్నట్లు తల తిప్పాడు.

‘‘నేనే పెళ్ళి పెద్దని’’ అని క్షణమాగి ‘‘మీరు కూడా! ఏం చెయ్యాలో ఫ్రెండ్స్ అందరికీ పురమాయించండి. ఎవరైనా మాట వినక పోతే చెప్పండి. వాళ్ళ పని అంతే!’’ బెదిరింపుగా అంది. నవ్వాడాయన.

అందరూ తలొక పని మీద పరుగు తీశారు. మొన్న పండగకి ఇల్లంతా రంగు వేయించడం మంచిదయింది.

పెద్ద కోట లాంటి ఆ యింటిని స్టీరింగ్ లైట్లతో అలంకరించడం మొదలు పెట్టారు.

‘‘వంట పని ఏం వద్దు, కాటరింగ్ కి యిచ్చేద్దాం’’ అశోక్ అంటే కీర్తన గునిసింది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్