Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> కొత్త సంవత్సరం... పాత కథ!

kotta samvasaram ...paata katha

23 డిసెంబర్ 2017.
అర్జున్ అప్పుడే వాళ్ళ ఫ్లాట్‍కి వచ్చాడు. 
‘ఒరేయ్ అలీ.. మనోడు ఎక్కడ?’ అడిగాడు.
వీడియో గేమ్స్ లో లీనమయి ఉన్న అలీ అది వినిపించుకోక పోయేసరికీ అర్జున్‍కి చిర్రెత్తుకొచ్చింది.
‘అడిగేది నిన్నే రా... డేవిడ్ ఎక్కడ?’ అని అర్జున్ కోపంగా అడగడంతో ‘ఎవడికి తెలుసు...లోపల చూస్కో’ అంటూ అలీ గేమ్ నుంచి కళ్లు కొంచెం కూడా తిప్పకుండా విసుగ్గా చెప్పాడు.
అర్జున్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి డేవిడ్ మంచం మీద గురక పెట్టి నిదరపోతూ కనపడ్డాడు. అర్జున్ డేవిడ్ ని ఒకే ఒక్క తన్ను తన్ని లేపి హాల్ లోకి తీసుకెళ్లాడు. 
అర్జున్ వెళ్ళి అలీ ఆడుతున్న వీడియో గేమ్‍ని ఒక్కసారిగా కట్టేసాడు. అలీ కోపంగా ’ఎందుకలా చేసావని?’ కసురుకునే సరికి అర్జున్ గట్టిగా ఇలా చెప్పసాగాడు...
‘అసలు ఏం చేస్తున్నార్రా ఇద్దరూ? ఒకడేమో ఇంకో నెలలో పరిక్షలు పెట్టుకుని చిన్నపిల్లాడిలా వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. ఇంకొకడేమో రూంలో చెయ్యాల్సిన పనులు వంద ఉన్నా పందిలా పొద్దున్నా, సాయంత్రం తేడా లేకుండా పడుకునే ఉంటాడు. సంవత్సరాలకి సంవత్సరాలు మారుతూన్నా మీరు మాత్రం కొంచెం కూడా మారట్లేదు...’
‘మీరు ఏంటి? మనం అను. అలా రూంలోకి వచ్చావో లేదో రూమంతా సిగరెట్ కంపు ఛ...’ అని ఆవలిస్తూ అన్నాడు డేవిడ్.
‘అవును. మనందరం ఇకనైనా... కనీసం మన కోసమైనా మారాలి. అందుకే... నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇంకొక వారంలో కొత్త సంవత్సరం రాబోతోంది. మనకిది ఓ కొత్త ఆరంభం అవ్వాలి. ఈ కొత్త సంవత్సరం నుంచి నేను మారడానికి సిద్ధం... మరి మీరు?’ అని అడుగాడు అర్జున్.
‘అవును......నువ్వు చెప్పేది నిజమే. ఈ మధ్యన నేను మరీ మొద్దులా తయారవుతున్నా. అసలు మోడల్ అవడానికి కావల్సిన అందం.. శరీరం నాకు అస్సలు లేదు. పొట్ట బాగా పెరిగిపోయింది. ఈ సంవత్సరం నుంచి నేను రోజూ పొద్దున్నే లేచి జిమ్‍కి వెళ్ళి కష్టపడతా. వచ్చే సంవత్సరం అయినా ఓ హేండ్ సమ్ మోడల్ అయి అందరికీ నేనేంటో చూపిస్తా..ఆఁ’ అని అన్నాడు ఉత్సాహంగా డేవిడ్.
వెంటనే అలీ ‘ఇంషా అల్లా... నేను కూడా ఒకటవ తారీకు నుండి శ్రద్ధగా చదువుకుని టాప్ కొడతా....’ అని అనడంతో ముగ్గురూ ఒకరి భుజం మరొకరు తట్టుకున్నారు.
***
2017 నుంచి 2018కి మారడానికి ఇంకో ఐదు నిమిషాలు ఉంది.
డేవిడ్ అప్పుడే ఫోన్ పెట్టి అలీ దెగ్గరికి వచ్చాడు. 
‘ఎవడితోరా ఇంతసేపు?’ అని అలీ అడగడంతో, ‘రాయల్ జిమ్ రా... మెంబర్‍షిప్ కోసమని అడిగా. రేపటి నుంచి ఫీజ్ ఓ పది శాతం పెంచుతారంట. అదేంటని అడిగితే ‘ఈ కొత్త సంవత్సరం మాకు కూడా మరింత ఆదాయం రావాలి కదా’ అని వెటకారంగా జవాబు ఇచ్చాడు రా!’ చెప్పాడు డేవిడ్.
‘ఇవాళ నాన్నని అకౌంట్ లో ఓ మూడు వేలు వేయమంటే, ‘ఎందుకని’ అడిగారు. ‘చదవుకోవడానికి కొన్ని పుస్తకాలు కొనుక్కోవాలి’ అంట ’ఏ నవల?’ అని అడిగారు. ‘నవల కాదు నాన్నా, కాలేజ్ పుస్తకాలు’ అని అంటే వెంటనే ఫోన్ పెట్టేశారు. అదేమిటని తిరిగి కాల్ చేస్తే, నేను అలీ కాదేమోనన్నట్టుగా వెటకారంగా మాట్లాడారు. ఒక గంట తర్వాత బ్యాంక్ ఎకౌంట్‍లో పది వేలు వేశారు.’ అంటూ నవ్వుతూ చెప్పాడు ఆలి.
కాసేపు ఇద్దరూ నవ్వుకున్నాక, ‘మరి ఇంతకీ జిం కు వెళ్తున్నట్టేనా?’ అని అడిగాడు ఆలి.
‘తప్పకుండా!’ అని జవాబిచ్చాడు డేవిడ్.
‘మంచిది రా... ఇంకొక ఐదు నిమిషాలలో మన జీవితాలు మారిపోతున్నాయంటే చాలా కొత్తగా అనిపిస్తోంది. వచ్చే కొత్త సంవత్సరంలో మనమేంటో అందరికీ చూపించాలి.’ అన్నాడు ఆలి.
‘అవును రా. ఇంతకీ అర్జున్ ఏడి? న్యూ ఇయర్‍కి ఇంకా రెండు నిమిషాలే ఉన్నాయి..’ అన్నాడు డేవిడ్.
‘పన్నెండు తర్వాత సిగరెట్ ముట్టుకోకూడదు కాబట్టి, ‘పన్నెండు లోపల ఆఖరి సిగరెట్ కాల్చి వస్తా’ అని వెళ్లాడు...’ అని చెబుతుండగానే అర్జున్ రూం లోకి వచ్చేశాడు.
ముగ్గురూ కలిసి ఇక కౌంట్‍డౌన్ స్టార్ట్ చేసారు.
`5..4...3....2.....1.....హ్యాపీ న్యూ ఇయర్!!!’
***
15 జనవరి 2018
'అర్జున్.... ఇవాళ సిగరెట్ కాల్చావు కదా?’ అనుమానంగా అడిగాడు అలీ.
‘లేదే....ఏ?’ అని అడిగాడు అర్జున్.
‘ఇలా రూంకి వచ్చావో లేదో... మొత్తం సిగరెట్ కంపు... నిజం చెప్పు...’ అంటూ ముక్కుకి కర్ఛీఫ్ అడ్డం పెట్టుకున్నాడు అలీ.
‘అవును రా...కాల్చాను.’ అన్నాడు అర్జున్.
‘ఇది చాలా తప్పు రా... మా అందరికీ నీతి చెప్పిన నువ్వే దానిని సవ్యంగా పాటించకపోవడం చాలా తప్పు.’ అని కసురుకున్నాడు అలీ.
‘సిగరెట్ అలావాటు వదులుకోవడమంటే జిం లో చేరడమో, లేదా రోజు పాఠాలు చదువుకునేంత సులువో కాదు. కొన్ని అలవాట్లు వదిలించుకోడానికి సమయం పడుతుంది. అయినా రోజూ సిగరెట్ల మీద సిగరెట్లు ఊదేసే నేను ఓ పదిహేను రోజుల పాటు అసలు సిగరెట్‍ని ముట్టుకోనేలేదంటే అదొక ప్రపంచ వింత. నేనేం రోజూ కాల్చను, రోజు రోజుకు తగ్గించుకుంటూ పోయి త్వరలోనే దీన్ని వదిలించుకుంటా. ఒకప్పుడు రోజుకొక ప్యాకెట్ కాల్చేవాడిని. ఇవాల కేవలం పది కాల్చాను. రేపు ఐదు, ఎలుండి రెండు... అవతల ఎల్లుండి ఇక అసలు ముట్టుకోను కూడా ముట్టుకోను’ అన్నాడు అర్జున్.
‘అంతా బానే ఉంది కాని, జింకి వెళ్ళడం నువ్వనుకున్నంత సులభమేం కాదు... ఒకసారి చేరితేగానీ నీకు అర్ధం అవదు. ఒళ్ళు హూనం అయిపోతుంది...’ అని డేవిడ్ పక్క రూంలో పడుకుని అరవడం అర్జున్-డేవిడ్‍లకి వినపడింది. 
‘అదేంటి? వీడు ఇవాళ కూడా జిం కి వెళ్ళలేదా?’ అని అర్జున్ ఆలి ని అడగడంతో, ‘పట్టుమని పది రోజులు అలా వెళ్ళాడో లేదో, నడుము నొప్పి, కాళ్ళనొప్పి అంటూ మంచానికి అతుక్కుపోయాడు. అదేంటని అడిగితే, నువ్వు వెళ్ళు... నీకే అర్ధమవుతుందని అంటాడు..’ అని చెబుతూనే తన పుస్తకం మూసేసాడు ఆలి.
***
మళ్లీ కొత్తసంవత్సరానికి జస్ట్ ముందు వీళ్ల నిర్ణయాలు వికసించి, కొత్త సంవత్సరంలో వాడిపోతాయి.

మరిన్ని కథలు
manasuloni maata