Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

వంటింట్లో గరళం - మనమేం చేయగలం?

what can we do?

వంటింట్లో గరళం అని ఈ మధ్య న్యూస్‌ ఎక్కువగా వినిపిస్తోంది. అవును నిజమే. చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను ఇంటి ఫుడ్డే తింటున్నాను కదా. సో నేను సేఫ్‌ జోన్‌లోనే ఉన్నాను. నాకు డాక్టర్‌తో పని లేదు.. అనుకుంటూంటారు. కానీ మనింట్లో మన చేత్తో వండుకుని తినే ఆహారంలో ఎంతవరకూ ఆరోగ్యం ఉంది అంటే లోతుగా తెలుసుకుంటేనే కదా తెలిసేది. కూరగాయల విషయానికి వస్తే, మనం ఇంట్లో చక్కగా శుభ్రం చేసుకుని, పుచ్చులు లేకుండా చూసుకుని శుభ్రంగా ఉన్న వంట పాత్రల్లో వండుకుంటాం. సో ఆ కారణంగా అనారోగ్యానికి మనం దూరం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే కూరగాయలు మన ఇంటికి వచ్చేసరికే జరగాల్సిన దంతా జరిగిపోతోంది. తొలిగించలేని విషతుల్యంగా మారిపోతున్నాయి. పంట దశలో ఉండగానే కూరగాయలపై కొన్ని రకాల హానికారక స్ప్రేలను చల్లుతున్నారు. ఎందుకంటే పురుగు పట్టకుండా పంట చేతికి రావడానికి. ఆ తర్వాత వాటిని మార్కెట్‌లోకి తీసుకెళ్లేటప్పుడు మరికొన్ని రకాల క్రిమిసంహారకాలు చల్లుతున్నారు రైతులు. వీటి ప్రభావం ఆ కూరగాయలపై ఐదు రోజుల నుండి, పదిహేను రోజుల దాకా ఉంటుంది. చల్లే మందును బట్టి, ఆ ప్రభావం మరింత ఎక్కువ రోజులు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అనుభవం లేకనే రైతులు ఈ పని చేస్తున్నారు. కాగా మార్కెట్‌లోకి కూరగాయలు వచ్చాక, వాటిని ఫ్రెష్‌గా ఉంచేందుకు మరిన్ని స్ప్రేలు వ్యాపారులు చల్లుతున్నారు. ఇలా కూరగాయలపై మితిమీరిన మందుల ప్రభావంతో వాటిలోని పోషకాల విలువలు తగ్గి విషవాయువుల ప్రభావం అధికమవుతోంది. 

కూరగాయల సంగతి ఇలా. ఇక ఆకుకూరల గురించి చెప్పనే అక్కర్లేదు. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ ఏ ఆకుకూరలు తినాలి. ఏ ఆకుకూరైనా అత్యంత ప్రమాదకరమైన విషమే ఇప్పుడు. మురికి కాల్వలలోనూ, హానికారక విష వ్యర్ధాలు పారే నీటి సందుల్లోనూ ఆకుకూరలు పెంచేస్తున్నారు. కానీ అవి ఎంతవరకూ మనం తినడానికి అనుకూలం? కూరగాయలు, ఆకుకూరల సంగతి ఇలా ఉంచితే, పళ్లు, పప్పుధాన్యాలు పరిస్థితి కూడా ఇంతే. పండ్ల విషయంలో పరిస్థితి మరీ ఘోరం. ఉదాహరణకు యాపిల్‌నే తీసుకుంటే, రోజూ యాపిల్‌ని తీసుకునే వారికి డాక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు అనే నానుడి ఉంది. కానీ ఇప్పుడు యాపిల్‌ తింటే వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్లాల్సిందే. అత్యంత ప్రమాదకరమైన ఫ్రూట్‌ యాపిల్‌ అయిపోయింది. పుచ్చకాయ.. వేసవిలో దాహార్తిని తీర్చే ఫ్రూట్‌. దీనిలో కల్తీకి అవకాశమేముంటుందిలే అనుకుంటే, వీటికీ రంగు, రుచి బాగుండడం కోసం కెమికల్‌ ఇంజక్షన్స్‌ చేస్తున్నారన్న విషయం తాజాగా బయటపడింది. చూడగానే నోరూరి, కొని తినాలనిపించే ఆకర్షణ కోసం పండ్లపై వ్యాపారులు చేస్తున్న ప్రయోగాల కల్తీ అలా ఇలా లేదు. తాజాదనం కోసం వారు వాడే అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ మన శరీరాన్ని విషతుల్యం చేస్తున్నాయి. కొంచెం కొంచెంగా మనిషి ఆయువుని హరించేస్తున్నాయి. 

వీటిని ఎదుర్కోవాలంటే ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కూరగాయలు, పండ్లను వాడే ముందు 20 నిముషాల పాటు ఉప్పు నీటిలో ఉంచితే సమస్య దుష్ప్రభావం కొంతవరకూ తగ్గించుకోవచ్చు. కానీ ఇది తాత్కాలికమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కాదని ఆ ఆరోగ్య నిపుణులే చెప్తున్నారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? తరువాతి తరాల సంగతి పక్కన పెడితే, ఈ తరాన్ని కాపాడుకోవడమే అతి కష్టంగా మారిపోయింది. అన్నింటా కల్తీ రాజ్యమేలుతున్న ఈ పరిస్థితుల్లో మానవ మనుగడ సాధ్యమేనా? అంటే.. తలలు పండిన సైంటిస్టులకే చిక్కు ప్రశ్నగా మారింది. 

మరిన్ని యువతరం
smart bussiness