Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ప్రశ్నార్ధకం

question mark

‘నమ్మబుద్ది కావట్లేదు రా! నేను అసలు తన గురించి అలా మాట్లాడానంటె నాకస్సలు నమ్మబుద్ది కావట్లేదు!’ అని బాధతో అన్నడు అంకిత్.
‘నేను చెప్పింది ఇంకా చాలా తక్కువ రా...నిన్న రాత్రి నువ్వు అసలు తనని అన్న మాటలు తను గనకా విని ఉంటే ఈపాటికి చచ్చిపోయుండేది. నీకేంటి... అసలు నాకే నమ్మబుద్ది కావట్లేదు!’ అని అన్నాను.

మాటల్లోనే అంకిత్‍కి తన నుంచి ఫోన్ వచ్చింది. ఓ అర నిమిషం పాటు ఆలోచించి కళ్ళు తుడుచుకుని, ఫోన్ కట్ చేశాడు అంకిత్.
‘ఎత్తి వుండాల్సింది..’ అన్నాడు.

‘ఎవరో చెప్తే వినకపోవచ్చు కాని, నాకు నేనే చెప్పుకున్నప్పుడు కూడా వినకపోవడంలో అర్థం లేదు రా..వెళ్ళొస్తాను’’ బాధతో అని బయలుదేరబోయాడు.

‘జాగ్రత్త రా...’ అని అంటూ అంకిత్‍ని హగ్ చేసుకున్నా.

‘థ్యాంక్స్ రా! జీవితంలో నాకు ఎప్పుడు అవసరమొచ్చినా నాకు తోడున్నది రెండే. ఒకటి నువ్వు.. రెండోది మందు.’ అని అన్నాడు అంకిత్.
‘అది సరే కాని, తను నాకు ఫోన్ చేస్తే నేనేం చెప్పాలి మరి?’ అని అడిగాను.

‘నువ్వు కూడా ఫోన్ ఎత్తకు..’ అని జవాబిచ్చాడు అంకిత్.

***

రెండు రోజుల తర్వాత.

రోడ్ పక్కన నిలబడి అప్పుడే సిగరెట్ వెలిగించబోతూ ఉండగా..

‘మణి!’

నేను వెనక్కి తిరిగి చూడగానే కళ్ళనీళ్ళు పెట్టుకున్న స్వాతి కనబడింది. వెంటనే నా సిగరెట్ కింద పడేసి కాలితో తొక్కేసా. ‘స్వాతి.. ఎలా ఉన్నవ్?’ ఏం మాట్లాడాలో తెలియక అడిగేశా.

‘ఎలా ఉన్నానో నీకు తెలీదా?’ అని వెంటనే ఏడవడం మొదలుపెట్టింది.

స్వాతిని ఏడుస్తుండగా చూడడం అదే మొదటిసారి. చాలా బాధేసింది.

‘ఏడవకు స్వాతి... అందరూ చూస్తున్నారు ప్లీజ్’ అంటూ సద్దిచెప్పబోయాను.

‘ఎలా ఉన్నాడో తెలియదు. ఫోన్ ఎందుకు ఎత్తడో తెలియదు. ఫేస్‍బుక్.. వాట్సాప్.. అన్నిచోట్లా బ్లాక్ చేశాడు. కనీసం నీకు ఫోన్ చేసి తెలుసుకుందామంటే నువ్వు కూడా అంతే!’ అంటూ కుమిలి కుమిలి ఏడవసాగింది స్వాతి, ‘నేనేమనుకోవాలి మణి? చెప్పు..’
‘స్వాతి. వాడినింక మర్చిపో’

‘ఎలా మణి? మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం. ఏవో చిన్న చిన్న గొడవల వల్ల ఇలా వదిలేసుకుంటారా?’

‘నీకు అవి చిన్న చిన్నవే స్వాతి... కాని వాడికి కాదు. వాడికి నీకు నచ్చినట్టు ఉండడం అసాద్యం అనిపిస్తుంది.’

‘నేనేమైనా నాకోసం చెప్పానా? వాడికోసమేగా చెప్పింది! అయినా ప్రేమించిని వాళ్ళ కోసం చిన్న చిన్న సర్దుబాట్లు తప్పదు’ అని గట్టిగా అరిచింది స్వాతి.

‘అవును. కాని వాడు నిన్ను ప్రేమించట్లేదు!’

‘అని అంకిత్ నీకు చెప్పాడా?’

‘అవును’

‘నేను నమ్మను!’

‘నిజం స్వాతి. నేను నీకెందుకు అబద్ధం చెప్తాను. నాకు వాడెంతో నువ్వూ అంతే. మొన్న బార్ లో కూర్చునుండగా వాడే నాకు చెప్పాడు. అంతే కాదు. ఇంకా చాలా చాలా చెప్పాడు స్వాతి. వదిలెయ్.’

‘తాగాక వంద అంటారు మణి... అవన్నీ పట్టించుకుంటామా? అయినా నేను వాడిని తాగుడు మానేయమని చెప్తే, నువ్వు కూడా వాడితో తాగావా?’

‘నేనేం తాగలేదు స్వాతి. అంకిత్ కి ఓ సిద్ధాంతం ఉంది. వాడికి ఎప్పుడు జీవితంలో ఏం చెయ్యలో తెలియకపోయినప్పుడు, నన్ను వాడితో పాటూ బార్ కి తీసుకెళ్తాడు. తాగిన తర్వాత వాడు ఏం అంటాడో మరుసటి రోజు లేవగానే మర్చిపోయాక, నేను వాడికి వాడి మాటలే తిరిగి చెప్తాను.

దాని ప్రకారంగానే వాడు నిశ్చయించుకుంటాడు. తాగాక నిజాలే మాట్లాడతారన్న ఓ నమ్మకం ఉంది చూడూ.. అలానే.. అంకిత్ నమ్మకం ఏంటంటే, మనకి ఏం చెయ్యలో తెలియని అనిశ్చితస్థితిలో తాగి మాత్రమే నిశ్చయించుకోవచ్చని. నువ్వేమో తాగుడే .మానేయమన్నావు. అది వాడి వల్ల కాక నిన్ను వదిలేద్దామని నిశ్చయించుకున్నాడు.’ అని వివరినిచ్చాను.

ఓ నిమిషం పాటు తను మౌనంగా ఉంది. ఏడుపాపేసింది.

‘అర్ధమైంది’ అంటూ కళ్ళు తుడుచుకుని, ‘నేను ఇంక అంకిత్ చెడిపోవడానికి కారుణం వాడే అనుకున్నా. కాని అది వాడు కాదు.. నువ్వు’ అని వేలెత్తి చూపుతూ చెప్పింది స్వాతి.

నాకేం అర్ధం కాలేదు.

‘నేనేం చేశా?’ అని అడిగా.

‘ఒక మనిషి స్పృహలో ఉంటేనే ఏం మాట్లాడుతున్నాడో, అది ఏ భావంతో అంటున్నాడో తెలియదు. అలాంటిది మద్యం తాగాక మన స్పృహలోనే ఉండరు. అలాంటప్పుడు నిజాలే మాట్లాడతారని నువ్వు ఎలా చెప్పగలవు? అంకిత్ ఇలా వారానికి మూడు సార్లు తాగి చెడిపోతూంటే నేను బాధపడి నిన్ను హెల్ప్ చెయ్యమంటే, నువ్వు వాడిని ఇంకా ప్రోత్సాహిస్తున్నావా? ఇప్పుడు విను. వాడు ఈ జీవితంలో ఎప్పుడు ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది నీ వల్లే! మా బ్రేకప్ కూడా..’ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది స్వాతి.
నేను మాత్రం అక్కడే, అలానే, నుంచునుండిపోయాను.

***

రాత్రి పన్నెండు.

నిద్ర పట్టట్లేదు.

కళ్ళు మూసుకున్న ప్రతి సారి స్వాతి మాటలు వినిపించింది. తను కళ్ళనీళ్ళు పెట్టుకున్న దృశ్యం అసలు వదలట్లేదు. ఎక్కడో గుండెలో ఏదో బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. ఒక స్నేహితుడుకి సహాయం చేద్దామన్న ఉద్దేశ్యంతో నేనుంటే, ఇప్పుడు మొత్తం అపరాధం నా వల్లే జరిగిందనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే నా ఫోన్ మోగింది. అంకిత్.

‘సారి రా...నువ్వు పడుకుని ఉంటావని తెలుసు... కాని..’ అని అంకిత్ అంటూ ఉండగానె,

‘నేనేం పడుకోలేదు రా!’ అని అన్నాను.

‘అదేంటి? పదింటికే పడకేసే నువ్వు పన్నెండైనా పడుకోలేదా?’ అని అడిగాడు ఆశ్చర్యంగా.

‘నిద్ర పట్టట్లేదు రా!’

‘ఏ?’

‘జీవితంలో మొట్టమొదటిసారి నేను అనిశ్చితస్థితిలో ఉన్నా రా! అసలు...ఏం చెయ్యాలో కూడా అర్ధం కావట్లేదు!’ అన్నాను బాధతో.

‘ఇలాంటప్పుడే ఏం చెయ్యాలో తెలుసా?’ అని అడిగాడు అంకిత్.

‘ఏంటి?’ అని అడిగాను నిరాసక్తంగా...

***

మరుసటి రోజు.. మధ్యాన్నం గం.1:30 లు.

నిద్ర లేవడంతోనే విపరీతమైన తలనొప్పి. లేచి ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నా. అప్పుడే నాకు నా పక్కనే అంకిత్ పడుకుని ఉండి కనబడ్డాడు.

వెంటనే అంకిత్ నిన్న అర్ధరాత్రి నన్ను బార్ కి తీసుకెళ్ళడం... నేను సౌండ్ రికార్డర్ ఆన్ చేసి, ఇద్దరం విపరీతంగా తాగడం లీలగా గుర్తొచ్చింది. వెంటనే నా ఫోన్ తీసుకుని, నిన్న రాత్రి మేము రికార్డ్ చేసుకున్న ఆ ఆడియో ని వినసాగాను...

అంకిత్ : నేను గందరగోళంలో ఉన్న ప్రతి సారి మణి నాకు హెల్ప్ చేశాడు. కాని మొదటిసారి మణికి ఏదో సమస్య వచ్చింది. అందుకే నేను ఈ సిట్టింగ్ ప్లాన్ చేశా. ఈ సారి మేమిద్దరం తాగబోతున్నాం కాబట్టి.. తాగి మనం ఏం మాట్లాడుకున్నామో మర్చిపోతాము కాబాట్టి, ఈ సౌండ్ రికార్డర్ ఆన్ చేసి చీర్స్ కొట్టబోతున్నాం..

ఒ ఐదు నిమిషాల పాటు ఏ మాటలూ వినిపించలేదు... ఇక మెల్లగా అంకిత్ మాటలు నాకు మత్తు మత్తుగా వినిపించింది.
అంకిత్ : మణి... ను..వ్వు నా బెస్ట్ ఫ్రెండ్ మణి... నీకంటె..నాకు ఎవ్వ..రూ ఎక్కువ కాదు.. స్వాతి అయినా సరే.. చెప్పు.. ఏంటి నీ సమస్య?
మణి : ఒరేయ్.. నువ్వు స్వాతిని బానే వదిలేసావ్.. కాని ఓ మూడు రోజుల తర్వాత... స్వాతి నన్ను కలిసింది... చా..లా బాధ పడింది రా.. ఏడుస్తూ.. ఏడుస్తూ.. ఏమందో తెలుసా? నిన్ను నేనే తప్పుదోవ పట్టిస్తున్నానంది.. నువ్వు ఇలా తాగి నిర్ణయాలని తీసుకోవడం తప్పని.. దానిని ప్రోత్సహించడం నా తప్పని.. నువ్వు తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయానికి కారుణం నేనే అని తిట్టింది.. నేనేదో నీకు సాయం చేద్దామని ఇదంతా చేస్తుంటే, చివరికి... చివరికి.. తప్పంతా నాదే అన్నట్టు చెప్పింది రా... అందుకే... నేను నిన్ను అడిగి తెలుసుకుందామను కుంటున్నా..   స్వాతి కరెక్టా? నువ్వు కరెక్టా?

అంకిత్ : (గట్టి గట్టిగా నవ్వుతూ..) ఒరేయ్.. స్వాతి కరెక్ట్ రా. మనం జీవితంలో ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి కాని, మద్యం తాగి స్పృహలో లేకుండా తీసుకుంటామా? అందుకే.. తను చెప్పిందే కరక్ట్..

మణి : మరి.. అది తప్పని తెలిసినప్పుడు కూడా ఇంకా ఎందుకురా ఇలా?

అంకిత్ : ఎందుకంటే, జీవితం అన్నది ఆగదు కాబట్టి. నేను నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బలహీనుణ్ని. నాకంటూ ఏది సరైనదో, ఏది కాదో కూడా తెలుసుకో్లేను. కాని, ఏ నిర్ణయం తీసుకోకపోవడం కంటే, ఏదో ఓ నిర్ణయం తీసుకోవడమే మేలు కదా! ఎంత సేపని అదే గందరగోళంలో ఇరుక్కుని ఉండాలి? అందుకే... నాకంటూ నేను పెట్టుకున్న సిద్ధాంతమే ఇది! ఇది తప్పు కావచ్చు... కాని నాకు మాత్రం ఇది సరైనదే! ఇది అబద్ధం కావచ్చు... కాని నాకు మాత్రం ఇది నిజమే!

ఓ అరనిమిషం పాటు నాకు మా మాటలేవీ వినిపించలేదు..

అంకిత్ :  నీ కన్ఫ్యూషన్ తీరినట్టేనా?

మణీ : ఆఁ..

అంకిత్ : కాని...కాని నాకు నువ్వో సాయం చెయ్యాలి రా...

మణి : చెప్పు..

అంకిత్ : రేపు పొద్దున్న నేను లేచాక, ఈ ఆడియో నాకు వినిపించకు. ఇప్పటివరకూ నేను తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలయ్యుండచ్చని నాకు తెలిస్తే, నేను ఇంక జీవితంలో ముందడుగు వెయ్యలేను! అందుకే.. నా అబద్ధాన్ని నాకు నిజంగానే ఉండనివ్వు...

మణి : స..రే....!

అంకిత్ : లవ్ యూ రా! నాన్ను ఎవరైన అర్ధం చేసుకునేవాళ్ళు ఉన్నారంటే అది నువ్వే! నువ్వు లేకపోతే అసలు నా జీవితం ముందుకి సాగదు..

వెంటనే అంకిత్ నిద్రలేస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా రికార్డర్ ని ఆపేశా. అంకిత్ కళ్ళు నలుపుకుంటూ నా వైపు చూడసాగాడు..
‘గుడ్ మార్ని...ఓహ్...గుడ్ ఆఫ్టర్నూన్ రా’

‘గుడ్ ఆఫ్టర్‍నూన్ రా’

‘ఏమైంది రా? లేవడం లేవడం సౌండ్ రికార్డర్ పట్టుకుని కూర్చున్నావ్?’ అని ఏదో గుర్తురాగా, ‘ఓహ్... అన్నట్టు... నిన్న మనం సిట్టింగ్ వేసాం కదా? సిట్టింగ్‍కి ముందు రికార్డర్ ఆన్ కూడా చేశాము... ఏది... నాకు వినిపించు’ అని ఆసక్తిగా ఒక్కసారి లేచి కుర్చున్నాడు అంకిత్.
ఓ పక్క స్వాతి మాటలు గుర్తొచ్చాయి- ‘వాడు ఈ జీవితంలో ఎప్పుడు ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది నీ వల్లే!’, మరో పక్క వీడి మాటలు- ‘నన్ను ఎవరైన అర్ధం చేసుకునేవాళ్ళు ఉన్నారంటే అది నువ్వే! నువ్వు లేకపోతే అసలు నా జీవితం ముందుకి సాగదు..’
ఇప్పుడు నేను ఆ రికార్డింగ్ అంకిత్‍కి వినిపించాలా వద్దా?

(కారణం ఏదైనా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం)                         -
 

 

 

మరిన్ని కథలు
ajamaayishi