Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue246/669/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... 

నెక్లెస్ రోడ్ మీంచి శరణ్య కైనెటిక్ హోండా సాగిపోతోంది.. ఓ పక్క ఎన్ టి ఆర్ పార్క్, మరో పక్క హుస్సేన్ సాగర్.. నది మధ్యలో ఠీవిగా నిలబడిన బుద్ధుడు .. కొంచెం ఎడంగా దర్పంగా రెప రెపలాడుతూ ఎగురుతున్న మువ్వన్నెల జండా ..

బాగా ముందుకి పోనిచ్చి సర్కిల్ నుంచి కుడి వైపు తిప్పింది బండిని. కుడి పక్క పచ్చని చెట్లు... ఎడం పక్క హుడా వారి పార్కింగ్ ఏరియా ... కొంచెం దూరం  వెళ్ళాక కుడి వైపు కనిపించింది పీపుల్స్ ప్లాజా ...ఈట్ స్ట్రీట్. నది మీంచి చల్లని గాలి వీస్తోంది. గాలికి ఆమె తలకి కట్టుకున్న స్కార్ఫ్ రెప రెప లాడుతూ ఏ క్షణమైనా ఎగిరి పోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా, హాయిగా ఉంది. .
పార్కింగ్ ఏరియా లో బోలెడు  కార్లు ఆగి ఉన్నాయి. బండి స్లో చేసి ఈట్ స్ట్రీట్ ఎంట్రన్స్ వైపు చూసింది...  కొందరు యువతీ యువకులు జంటలు, జంటలుగా,  మధ్య వయసు వారు కొందరు పిల్లలతో లోపలికి వెళ్తున్నారు. ఇంకా కొందరు ముందుకు అలా నది ఒడ్డున నడుస్తూ వెళ్తున్నారు.  ఆ జనంలో తేజ కనిపించడం కష్టం అనుకుంటూ బండి కొంచెం వేగం పెంచి ముందుకు సాగింది.  కొంచెం దూరం వెళ్ళగానే యు టర్న్ తీసుకుంది.  పార్కింగ్ లాట్ లో బండి పార్క్ చేసి ఎంట్రన్స్ వైపు నడిచింది.

గేటు దగ్గర కనుబొమలు ముడేసి సీరియస్ గా శరణ్య కోసం వెతుకుతున్నాడు తేజ. అతని కళ్ళల్లో ఆదుర్దా స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లటి టి షర్ట్ జీన్స్ ప్యాంటు.. అతన్నలా చూస్తుంటే కాస్సేపు కనిపించకుండా ఆట పట్టించాలనిపించింది. అయితే అప్పటికే అతని దృష్టి ఆమె మీద పడింది. ఆమెని చూడగానే అతని  కళ్ళల్లో వెలుగు.  చిరునవ్వుతో ఎదురు వచ్చి కుడి చేయి చాచి ఆమె చేయి అందుకుని “ హాయ్ ఇంత సేపా!”  అన్నాడు.

“ ట్రాఫిక్ బాబూ”  అంది.

“అందుకే టైం కాలికులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ... ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సిగ్నల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత టైం అక్కడ ఆగుతాము వగైరా”  అన్నాడు.

“అంత లేదు గాని ఇక్కడ ఎన్విరాన్ మెంట్ సూపర్” అతని మాటలు పట్టించుకోకుండా అంది చుట్టూ చూస్తూ.

“అందుకేగా ఇక్కడ కలుసుకుందాం అన్నాను” అన్నాడు గేటు లోంచి లోపలికీ నడుస్తూ ..

అతన్ని అనుసరిస్తూ కొంచెం కొంటెగా అంది ... “ఎంతైనా నీలో ఈస్తటిక్ సెన్స్ ఎక్కువలే”.

“ థాంక్స్..." నవ్వి " ఎక్కడ కూర్చుందాం” అన్నాడు ..

అప్పటికే జనాలు మూడొంతుల టేబుల్స్,  కుర్చీలు ఆక్రమించారు.. నదికి దగ్గరగా ఉన్న కుర్చీలు చూపిస్తూ “ అక్కడ” అంది.
వెనకగా రెండు కుర్చీలు మధ్యలో చిన్న టేబుల్.

“ సరే నువ్వు వెళ్లి కూర్చో నేను తినడానికి ఏమన్నా తెస్తాను” అన్నాడు.

“ ఏం తెస్తావు”  అడిగింది ..

“ చెప్పు నీకేం కావాలి.. ఇడ్లి, వడ, దోస, పిజ్జా, బర్గర్, స్నాక్స్...”

“ పిజ్జా...”

“ ఓకే మేడం ...” అణకువగా అన్నాడు.

“ దాంతో పాటు ఐస్ క్రీం కూడా” అంది..

“ జీ హుజూర్”అంటూ నవ్వి“ నీ సీటు రిజర్వు చేసుకో ... మళ్ళి ఎవరన్నా వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు” చెబుతూ డామినోస్ పిజ్జా స్టాల్ వైపు వెళ్ళాడు.

శరణ్య టేబుల్ వైపు నడిచింది. వెళ్లి ఒక కుర్చీలో బాగు పెట్టి మరో కుర్చీలో కూర్చుంది ..

కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులూ కట్టుకుని దీపాల కాంతులు పడి మెరిసి పోతున్న నీళ్ళను చూడ సాగింది. ప్రశాంతంగా ఉన్న నది .. దూరంగా వెలుగుతున్న దీపాలు...గాలికి కదులుతున్న అలల మీద కాంతి ప్రసరిస్తూ అందంగా ఉంది.

కాక పోతే ఒడ్డున ఉన్న చెత్త, చెదారం చూస్తుంటే చిరాకేసింది.. ఎందుకు మైంటైన్ చేయరో ఇలాంటి అందమైన ప్రదేశాలను అనుకుంది.
కొద్ది నిమిషాల తరవాత పిజ్జా తో వచ్చాడు తేజ .. బాగ్ కుర్చి లోంచి తీసి బేబిల్ మీద ఒక పక్కకి పెట్టింది శరణ్య .

“ఇది తిన్నాక ఐస్ క్రీం తెస్తా” అన్నాడు ఆమె ముందు ఒక పిజ్జా ప్లేట్ పెట్టి తను కుర్చీలో కూర్చుంటూ ..

కుడి వైపు ఉన్న స్టాల్స్ చూస్తూ అంది “అన్ని రకాల తినుబండారాలు దొరుకుతాయిలా ఉంది..”

“ఆల్ మోస్ట్ ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదా” అడిగాడు తేజ.

“ నువ్వు వచ్చావా” అడిగింది.

“ బోలెడన్ని సార్లు ...”

“ అవునులే నీకంటే బోలెడు మంది ఫ్రెండ్స్ ... నాకు నువ్వు తప్ప ఇలా రెస్టారెంట్స్ కి  తిప్పే వాళ్ళు ఎవరూ లేరు కదా! “ పిజ్జా కొసలు ముని పంట కొరుకుతూ అంది.

“ ఏం చేస్తాం కోరుకున్న వాళ్ళు దయ చూపించక పోతే, నన్ను కోరుకునే వాళ్ళని నేను మెప్పించాలి కదా ...” సీరియస్ గా చూసింది... అతని కళ్ళల్లో అల్లరి లైటు వెలుగు పడి  మరింత స్పష్టంగా కనిపించింది.

“ అలాంటప్పుడు ఇవాళ మాత్రం నన్నెందుకు పిలిచినట్టుట..”

కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా పిజ్జా తింటూ ఉండి పోయాడు. తరవాత హఠాత్తుగా అన్నాడు.“ “

శరణ్య చిరు కోపంగా చూస్తూ అంది “ఈ మాట అడగడానికా నన్ను ఇక్కడికి రమ్మన్నది.”

“ఎస్....ఇంతకన్నా మనోహరమైన ప్రదేశం ఎక్కండుంది ప్రేమికులు భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకోడానికి..” చుట్టూ పరవశంగా చూస్తూ అన్నాడు.

శరణ్య మాట్లాడ లేదు.. ఈ ప్రస్తావన ఇంత సీరియస్ గా  వస్తుందని చాలా రోజులనుంచి ఊహిస్తోంది. రానే వచ్చింది.. ఇప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పాలి. తరచూ సరదాగానో, సీరియస్ గానో తీసుకొస్తున్నా, తనే మాట మాట మళ్ళిస్తోంది.  ఇప్పుడు అతని ధోరణి చూస్తుంటే ఈ విషయం ఇవాళ ఆటో, ఇటో తేల్చేయాలని వచ్చినట్టు అనిపిస్తోంది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham