Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవయ్యోవ భాగం

Anubandhaalu twentieth Part

"చూడు నాయనా. పుట్టుకతోనే మనిషికి స్వార్ధం ఉంటుంది, ఈ స్వార్ధం అదుపుతప్పిన వారే విపరీతాలకు పాల్పడి కష్టాలపాలవుతారు. తాను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, బాగా సంపాదించాలి, తన వాళ్ళంతా సుఖసంతోషాలతో ఉండాలని, అన్నిటా మమకారంతో సంసారంలో నిత్యం మునిగితేలేవాడు సామాన్యుడు డబ్బు మీద మమకారం లేనివాడు అలాంటివాడు సామాన్యుల్లా ఎవరూ ఉండలేరు. కాదంటే డబ్బు ఉన్నాపోయినా ఒకేలా ఉండేవాడు గొప్పవాడు. దేనిమీదా మమకారం లేకుండా విశ్వశ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోరడం, భగవంతుని ధ్యానంలో మునిగితేలడం ఇవి మహాత్ముల వల్లే సాధ్యం. అంచేత సంపాదన మీద మమకారం లేని మహాపురుషులు ఎప్పుడూ అంటూనే ఉంటారు. వారి ఆశీస్సులే ఈ ప్రపంచాన్ని నిత్య నూతనంగా, పచ్చగా కళకళలాడేలా చేస్తుంది" అంటూ వివరించింది.

ఇలా అన్నపూర్ణేశ్వరి కొడుక్కి, కోడలుకి ధైర్యం నూరిపోసి మామూలు మనుషుల్ని చేయడానికి పక్షం రోజులు పట్టింది. వాళ్ళు బాగా తేరుకున్నారు. ఇక్కడ లావాదేవీలు ముగించుకొని అంతా ఇండియా వెళ్లిపోదామనే నిర్ణయానికి వచ్చేశారు.

గోపాల్ నిర్ణయాన్ని విని సత్యవతి, అన్నపూర్ణేశ్వరి ఇద్దరూ సంతోషించారు.

యధాప్రకారం ఆస్పత్రికి వెళ్లిరావడం ప్రారంభించాడు గోపాల్.

నాలుగు రోజుల తర్వాత తల్లిని, భార్యని కూర్చోబెట్టి సమస్య చెప్పాడు.

"అమ్మా! ఇక్కడ మన ఆస్థులు అమ్మేసి, ఒప్పుకున్న వైద్య సేవలు ముగించుకుని అప్పట్నుంచి మన ఇండియా వెళ్ళిపోవడానికి మనం కనీసం మూడు నెలలు పడుతుంది. ఈలోపల కెనడాలో మనకు ఉన్న ఆస్థుల్ని అమ్ముకుని వచ్చేస్తాను. రావడానికి రెండుమూడు వారాలు పడుతుంది అన్నాడు"

"ఏమిటమ్మాయ్! నీ అభిప్రాయం ఏమిటి? వాడు మామూలు మనిషి అయ్యాడు చాలు. మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఆ దేశంలో ఆస్థులేవో ఉన్నాయంటున్నాడు. అమ్ముకు వచ్చేస్తేనే మంచిది గదా...?" అంటూ కోడల్ని అడిగింది అన్నపూర్ణేశ్వరి.

"అలాగే అత్తయ్యా! అంతా సవ్యంగా జరిగి మనం ఇండియా వెళ్ళిపోతే, అటు షిరిడీకి, ఇటు తిరుపతికి కూడా వెళ్లోద్దాం" అంది.

అలా వాళ్ళిద్దర్నీ ఒప్పించి కెనడాకు బయల్దేరాడు గోపాల్. అయితే అతడు నిజానికి ప్రయాణమైంది కెనడాకు కాదు ఇండియాకు. ఆ విషయాన్ని అతడు చాలా గోప్యంగా ఉంచాడు. మరునాడే డాక్టర్ గోపాల్ ఎయిర్ ఇండియా విమానంలో ఇండియాకు బయల్దేరాడు. డాక్టర్ గోపాల్ మున్నలూరు వచ్చి, వెళ్ళిపోయి నెలదాటిపోయింది.

అతని పిల్లలు అనంతసాయి, సాయిశివానీల్లో మార్పులేదు సరికదా తండ్రి తమను వెంట తీసుకుపోలేదన్న కోపంతో మరింత డబ్బు ఖర్చు పెట్టసాగారు. ఇప్పుడు వారంలో నాలుగు రోజులు హైదరాబాద్ కి కేటాయిస్తున్నారు. అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లోనూ, డిస్కో థెక్కుల్లోనూ కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి.

అమెరికా నుంచి వచ్చిన తమను వాళ్ళంతా పొగుడుతూ ప్రత్యేక గుర్తింపునిచ్చి మాట్లాడుతుంటే అన్నాచెల్లెళ్లిద్దరూ ఎన్నారైలుగా వాళ్ళు తమకిస్తున్న మర్యాదగా భావించారు. వాళ్ళ కోసం కూడా తామే ఖర్చు పెట్టసాగారు. అలాంటి ఫ్రెండ్స్ లో ఒకడికి లక్ష, ఇంకొకడికి రెండు లక్షల రూపాయలు అప్పుగా కూడా ఇచ్చారు. పెదనాన్నను డబ్బు అడగడం మానేసి తమ దగ్గరున్న పదిలక్షలని యధేచ్చగా కరిగించేయసాగారు.

అక్కడ అమెరికాలో డాక్టర్ గోపాల్ కి కోలుకోలేని దెబ్బతగిలింది. జీన్ లేబోలేటరీస్ షేర్లు కుప్పకూలడంతో భారీ నష్టం ఏర్పడి అయిదు వందల కోట్లు కొట్టుకుపోయి షాక్ లో మంచానపడ్డాడు గోపాల్.

విషయం తెలిసి ఇక్కడి వాళ్ళంతా దుఃఖంలో మునిగిపోయారు. ఫోన్లు చేసి అమెరికాలోని అన్నపూర్ణేశ్వరి, సత్యవతిలతో మాట్లాడుతూ వచ్చేయమని సలహాలు, సూచనలు ఇచ్చారు.

ఈ విషయం తెలిసినా మొక్కుబడిగా రెండు మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడి ఊరుకున్నారు అన్నాచెల్లుళ్ళు. ఏమీ జరగనట్టే తమ దారిన తాము ఎ.సి. కార్లో హైదరాబాద్ కి షికార్లు చేస్తున్నారు. రామలింగేశ్వర్రావు వాళ్ల ధోరణికి విసిగి వాళ్ళని హెచ్చరించడంగాని, మందలించడంగాని చేయడంలేదు. డబ్బు ఇవ్వకుండా ఆపేశాడు. ఈ పరిస్థితుల్లో నెలరోజులు గడిచిపోయాయి.

ఈరోజు శుక్రవారం ఓ విశేషం జరిగింది.

చేతిలో డబ్బు తరిగిపోవడంతో అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ఈ రోజూ హైదరాబాద్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలప్పుడు మహేశ్వరి అనంతసాయి దగ్గరకు గుడికి వెళ్ళడం కోసం వచ్చింది. చక్కగా పట్టుదుస్తుల్లో చక్కగా ఉంది.

"ఏమిటి మహీ? ఇలా వచ్చావ్?" అని అడిగాడు.

"నీ కోసమే. గుడికి వెళ్తున్నాను. నువ్వు గుడికి రావాలి" అంది.

"నేనెందుకు?"

"బావా నిన్ను తీసుకొని గుడికి వస్తానని మొక్కుకున్నాను. రావాలి నువ్వు."

"నేను రాను"

"అదేమరి అమెరికాలో మామయ్య ఆరోగ్యం చక్కబడితే నిన్ను తీసుకొని గుడికి వస్తానని మొక్కుకున్నాను."

కాసేపు వాదోపవాదాల తరువాత ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటూ తనూ బయల్దేరాడు. అన్నాచెల్లెళ్లిద్దరూ అమెరికా నుండి వచ్చి ఇన్ని రోజులైనా వాళ్లు మున్నలూరు వీధుల్లో తిరిగింది చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడూ కార్లలోనే తిరుగుతుంటారు కాబట్టి గ్రామస్థులు వాళ్ళని చూడడం అరుదు. అనుకోకుండా బావామరదళ్ళు ఇద్దరూ కాలి నడకన గుడికి బయల్దేరే సరికి గుళ్ళో అందరి చూపులు వాళ్ళమీదే ఉన్నాయి.

బయల్దేరే  ముందు చెల్లెలు శివానీని కూడా రమ్మని అడిగాడు అనంత్. ఆమె టీవీ లో ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తూ రానని చెప్పడంతో తానే బయల్దేరాడు.

మహేశ్వరి పక్కన నడుస్తుంటే అతడిలో ఏదో తెలియని అనుభూతి కల్గుతోంది.

ఇవాళ మహేశ్వరి సరికొత్తగా కన్పిస్తోంది. చక్కగా పట్టుచీర, జాకెట్టు ధరించింది. చెవులకు దిద్దులు, మెడలో గొలుసు, వాలుజడ చివర జడ కుచ్చులు, జడనిండుగా మల్లెలు. ముఖంలో అమాయకత్వంతో కూడిన వింత అందం. ఆమె చేతి చెమ్మీ గాజుల గలగలా శబ్దాలకు తాళం వేసినట్టు ఆమె పాదాల వెండి పట్టీలు. అమెరికా అమ్మాయిలకి సాంప్రదాయ కుటుంబాల్లోని తెలుగింటి అమ్మాయిలకి ఉన్న తేడా ఆరంభమైంది. ముగ్ధమనోహరంగా పూజా సామాగ్రితో కూడిన వెండి సజ్జతో తన పక్కనే నడుస్తున్న మహేశ్వరి పట్ల తెలియని ఆకర్షణ అనంత్ కి మొదలైంది.

ఊరిలో తెలిసినవారు అనంత్ గురించి అడుగుతుంటే చిరునవ్వుతో బదులిస్తూ గుడివైపు అడుగులేస్తోంది.

మహేశ్వరి బావ పక్కన ఇలా నడుస్తుంటే, ఊరంతా తమను ప్రత్యేకంగా చూస్తుంటే మహేశ్వరికి సంతోషంగా, గర్వంగా ఉంది.

అమ్మలక్కల తమాషా మాటలు ఆమె బుగ్గల్లో కెంపులు అవుతుంటే ఓరకంట ఆమెను గమనిస్తూనే ఉన్నాడు అనంత్.

ఇద్దరూ గుడికి చేరుకున్నారు.

గుడిలో మావయ్య పేరిట అర్చన చేయించింది మహేశ్వరి. పూజానంతరం ప్రసాదం తీసుకొని వచ్చి గుడిమెట్లమీద కూర్చున్నారు.

కూర్చోవడం దేనికి? వెళ్లిపోవచ్చుగా..." అన్నాడు కూచుంటూ.

"అయ్యో బావా, నీకేం తెలుసు. గుడికి వచ్చి అలాగే వెళ్ళిపోకూడదు. కాస్సేపు కూర్చుని వెళ్ళడం సాంప్రదాయం. ప్రసాదం తీసుకో." అంటూ ప్రసాదం చేతిలో పెట్టింది.

"బావా తప్పో రైటో నాకు తెలియదు. ఓ మాట అడుగుతాను చెప్తావా?" అతడికి కాస్త ఎడంగా ఒదిగి కూర్చుంటూ అడిగింది.

"అడుగు ఏమిటామాట?" పరిసరాల్ని వీక్షిస్తూ శుక్రవారం కావడం చేత స్త్రీలే వస్తున్నారు. సాయంకాలం వేళ గుడిలో చాలా ఆహ్లాదంగా ఉంది.

"శివాని నీ చెల్లెలు. దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా దానితో చేరి, నగరాలకు పోయి ఫైవ్ స్టార్ హోటళ్ళలో తాగడం, డాన్స్ చేయడం ఇదేమన్నా బాగుందా? అక్కడ మావయ్య కష్టాలలో ఉన్నాడని తెలిసి కూడా మీ పద్ధతి మార్చుకోలేదు. ఇదేమన్నా మీకు న్యాయంగా ఉందా?" అడగాల్సిన మాట సూటిగానే అడిగింది.

తన మాటలకు అతడు కోప్పడతాడేమోనని భయపడింది. అలా జరగలేదు. భారంగా నిట్టూర్చి ఆమెవంక చూశాడు అనంత్.

"మహీ నువ్వు ఒళ్లంతా కవర్ చేసుకుని సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ఉన్నావ్. అదే అమెరికా స్టయిల్లో స్కర్టు, ఫ్రాక్, గౌను ఇలా ఆ డ్రస్సు వేసుకుంటే మరింత అందంగా ఉంటావ్. నా చెల్లెలు ధరించే బట్టలు చూస్తున్నావ్ గా? నువ్వు వాటిని ధరించగలవా?"

"ఛీపాడు! సిగ్గులేకుండా ఒళ్లు కనబడేలా అరకొర దుస్తులు వేసుకొని తిరగడం మీ అమెరికా అమ్మాయిలకి అలవాటేమోగానీ, ఇక్కడ కుదరదు. నాకు అలాంటివంటే గిట్టవు." చెప్పింది. "చూశావా! దుస్తుల విషయంలోనే నీ పద్ధతి మార్చుకోనని ఖచ్చితంగా చెప్పావు. మరి మేం పెరిగిన వాతావరణంలోని అలవాట్లను మేం ఎలా మార్చుకోగలం? ప్రతి దేశంలోని వాళ్లకి ప్రత్యేకంగా వాళ్ల అలవాట్లు, ఆచారాలు ఉంటాయి. అంతమాత్రం చేత ఇవన్నీ మనం కూడా ఆచరించాలా?"

"ఏ సమాజంలోనైనా మంచి చెడులుంటాయి. మంచిని తీసుకోవాలి. చెడు వదిలేయాలి. అత్తయ్య కూడా అక్కడే ఉంటోందిగా. చీరలు మానేసి గౌనులు వేసుకోవాలిగా. మీ తండ్రులు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే ఉండాలని ఎందుకనుకోరు?"

"ఇది వితండవాదం. మాకు ఇష్టాయిష్టాలు, స్వేచ్ఛ ఉన్నాయిగా."

"ఏదీ! బాబు సంపాదించాడు కాబట్టి లక్షలకు లక్షలు హారతి కర్పూరంలా హరించేయడమా?

డబ్బు ఖర్చు పెట్టినంత సులువుకాదు సంపాదించడం"

"నువ్వు పంతులమ్మవైతే బాగుంటుంది పాఠాలు బాగా చెప్పగలవు. అలవాట్లు మార్చుకోవడం మాటలు చెప్పినంత ఈజీకాదు"

"తెలివైన వాళ్ళెవరూ ఒకరిచేత చెప్పించుకోరు. జీవితంలోంచే పాఠాలు నేర్చుకొని, ఎప్పటికప్పుడు తమను తాము సరిదిద్దుకుంటూ ఉంటారు. మీ అన్నాచెల్లెళ్ళ పద్ధతులు బాగాలేవని అక్కడ అమెరికాలోనూ, ఇక్కడ మేము అంతా బాధపడ్తున్నాం. ఇవేమీ మీకు పట్టవా?" బాధపడ్తున్నట్టు అడిగింది.

మౌనంగా ఉండిపోయాడు అనంత్.

మహేశ్వరి ఇప్పుడు సరికొత్తగా కనబడుతోంది అతడికి. తాను ఊహించినట్లు ఆమె పల్లెటూరి అమాయకురాలు కాదని అర్ధమౌతోంది. అన్నీ ఆకళింపు చేసుకున్న ఆరిందలా మాట్లాడుతోంది.

"బావా నీకీ విషయం తెలుసా?" తిరిగి తనే అడిగింది.

"ఏ విషయం?" ముఖంలోకి చూశాడు.

"ఈ మధ్య పేపర్లలో కొన్ని విచిత్రమైన విషయాలు చదివానులే. పిల్లి పిల్లలకు కుక్క పాలిస్తోందని, కుక్క పిల్లలకు పంది పాలిస్తోందని విచిత్రంగా లేదు."

"విచిత్రమే అప్పుడప్పుడూ అలాంటి విచిత్రాలు జరుగుతాయి"

"కానీ అందులో ఒక విశేషం కూడా ఉంది కదా. కుక్క పాలు తాగినంత మాత్రాన పిల్లిపిల్లలు కుక్క పిల్లలుగా మారడంలేదు. స్వభావరీత్యా కుక్క పిల్లలుగానే ఎదుగుతున్నాయి. పిల్లి పిల్లలు పిల్లి పిల్లలుగానే ఎదుగుతున్నాయి. అమెరికాలో ఉన్నంత మాత్రాన తెలుగు వాళ్ళు మాత్రం అమెరికా వాళ్ళలా ఎందుకు మారిపోవాలి?"

ఆమె మాటల గారడీకి నిశ్చేష్టుడయ్యాడు అనంతసాయి.

అటుతిప్పి ఇటుతిప్పి విషయం తనకు అర్ధమయ్యేలా ఆమె తన దృష్టికి తీసుకువచ్చిన తీరు అతన్ని అప్రతిభున్ని చేసింది.

ఆమెలో అందమే కాదు. అద్భుతమైన ప్రతిభ కూడా ఉందని సృష్టమైంది. అందుకే తనను తాను మర్చిపోయి కాసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

ఏమిటి బావా? నేనేమన్నా అర్ధంకాని భాషలో మాట్లాడానా?" ఆవిడ అమాయకంగా అడుగుతుంటే చిన్నగా నవ్వేశాడు.

"ఏమో అనుకున్నాను. అసాధ్యురాలివే. ఎనీవే. నీ సలహాలకి థాంక్స్. మారడానికి ప్రయత్నిస్తాను." అన్నాడు.

"ఎప్పుడు? మారాలి బావా. నువ్వేకాదు శివాని కూడా మారాలి. అప్పుడే అందరం సంతోషిస్తాం."

"అందరూనా... నువ్వేనా?"

"అందరికన్నా నేను ఎక్కువ సంతోషిస్తాను."

"నన్ను మార్చి పెళ్ళి చేసుకోవాలన్న ఆశతోనా"

ఈసారి ఈమె కళ్ళల్లో కొంత కోపం తొంగిచూసింది.

"నేనేమీ కొత్తగా ఆశపడ్డం లేదు. అలాగని నిన్ను ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్ను పెళ్లిచేసుకోమనీ అడగను. కానీ ఒక్కటి నిజం. చిన్నప్పట్నుంచి నువ్వే నా మొగుడువని ఊహల్లో పెరుగుతూ వచ్చినదాన్ని. అందుకేనేమో నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. ఇది మాత్రం నిజం" అంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకుంది.

ఆమెకు ఏం బదులు చెప్పాలో అనంత్ కి అర్ధం కాలేదు.

"ఇక బయల్దేరదామా?" అంటూ లేచాడు.

మౌనంగా తలవూపి తనూ లేచింది మహేశ్వరి.

ఇద్దరూ మెట్లుదిగి నడక ఆరంభించారు.

ఇంతలో ముగ్గురు యువకులు వాళ్ళ ముందుకు వచ్చారు.

వాళ్ళని చూడగానే మహేశ్వరి ముఖంలో రంగులు మారాయి.

వాళ్లలో ఒకడు కొంచెం పొడుగ్గా, కొంచెం లావుగా, మొరటుగా వున్నాడు. మిగిలిన ఇద్దరూ ఓ మోస్తరుగా బలంగానే ఉన్నారు. వాళ్ళంతా అనంత్ వయసు వాళ్ళే. మధ్య వున్నవాడు అనంతసాయిని ఎగాదిగా చూస్తూ దగ్గరకొచ్చాడు.

"ఏయ్ మహీ! వీడేనా అమెరికా నుండి వచ్చిన నీ బావ?" అంటూ వెటకారంగా మహేశ్వరిని అడిగాడు.

"ఏయ్! నోరు దగ్గర పెట్టుకో. తప్పుకో. పద బావా! వీడితో మనకేమిటి?" అంటూ అనంత్ చేయి పట్టుకొని తీసుకెళ్లిపోవాలని చూసింది మహేశ్వరి. కాని వెళ్ళే ఉద్దేశం లేనట్టు ఆమె చేతిని మృదువుగా విడిపించుకున్నాడు అనంత్.

"ఆగు మహీ! అతిథులు మనకు బాగా కావలసిన వాళ్ళలా ఉన్నారు. కొంచెం పరిచయం చేసుకొనీ. హలో... నా పేరు అనంత సాయి. ఫ్రమ్ అమెరికా. మహేశ్వరికి బావని. నీ సంగతేమిటి? ఎవరు నువ్వు?" అంటూ అడిగాడు.

అదేదో వినకూడని మాట విన్నట్టుగా "నేను ఎవరా?" అంటూ పెద్దగా నవ్వాడతను.

"ఏమిటే మహీ! చెప్పలేదా నా గురించి?" నవ్వాపుకుంటూ అడిగాడు.

అప్పటికే గుడికి వచ్చిన గ్రామ మహిళలు చాలామంది దూరంగా నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు.

మహేశ్వరికి కంగారుగా ఉంది.

"నా పేరు గణపతి. ఈ వూరి ప్రెసిడెంట్ కొడుకుని. ఈ మహేశ్వరికి కాబోయే మొగుడిని. అర్ధమైందా? మేమంతా ఒకే కాలేజీలో చదివాంలే. ఇదంటే నాకు పిచ్చి ప్రేమ. పెళ్ళంటూ చేసుకుంటే తిన్నే చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నాను. ఏమిటే? మన ప్రేమ గురించి నీ బావకి చెప్పలేదా?" అంటూ మరోసారి పగలబడి నవ్వాడు.

"ఇదన్యాయం. వాడు చెప్పిందంతా అబద్ధం" అని అరిచింది మహేశ్వరి. 

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram telugu serial fourteenth part