Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu twentieth Part

ఈ సంచికలో >> సీరియల్స్

నడిచే నక్షత్రం పధ్నాల్గవ భాగం

nadiche nakshatram telugu serial fourteenth part

"నిజం చెప్పనా... నువ్వు లేని సిమ్లా నాకు బోర్ కొట్టింది. అందుకే, నేనూ నువ్వున్న హైద్రాబాద్ కి వచ్చేసాను" చెప్పాడు.

"మరి అంత అభిమానం ఉన్నవాడివి... మెసేజ్ లు తప్ప ఒక్కసారి మాట్లాడలేదేం... ఒక్కసారి కలవలేదేం?"

"కలవాలనే అనుకున్నా. తీరా కలిస్తే... సిమ్లాలో చూసినపుడు నువ్వు అందర్లాంటి అమ్మాయివే. ఇపుడు అభిమానించే అందర్లోనూ నువ్వే. అపుడంటే కనీసం వెంటపడొచ్చు. కానీ, ఇపుడో... అందని నక్షత్రానివి" అన్నాడు.

"ఇవాళ హీరోయిన్ గా నీకెంతోమంది అభిమానులు. వాళ్లలో కాస్తంత ప్రత్యేకంగా కనిపించాలనిపించి నీ సెల్ నంబర్ దొరకపుచ్చుకుని ఎస్ ఎస్ఎంఎస్ లు పంపించడం మొదలెట్టాను. ఎప్పుడైనా ఒక్కసారంటే ఒక్కసారి నీ దగ్గర్నుంచి పిలుపు వస్తుందని నాకు తెలుసు. అపుడు... నిన్ను దగ్గరగా కళ్లారా చూసుకుని మురిసిపోవాలనే వెర్రితపనతో ఇన్నాళ్ళూ అల్లాడిపోయాను. ప్రతిరోజూ కలలో నువ్వే... మెలకువలో నువ్వే. మనసులో నీకు గుడికట్టి మరీ పూజిస్తున్నాను" అతడు చెప్తుంటే అభిమానమంటే ఈ స్థాయిలో ఉంటుందా? ఆమె కళ్ళు చెమర్చాయి. ఆమెకి ఆ క్షణంలో రిలీజైన తన మొదటి సినిమా గుర్తొచ్చింది. ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకోవాలని యూనిట్ తో కలిసి ఆ సినిమా మొదటి ఆట చూసిన జ్ఞాపకాన్ని ఇపుడామె నెమరువేసుకుంటోంది.

ఆరోజు స్క్రీన్ పై తను కనిపించినంత సేపూ - "డార్లింగ్... ఐ, లవ్ యూ" అంటూ ప్రేక్షకులు వేసిన ఈలలు ఇప్పటికీ ఆమె చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి. ఒకేసారి అంతమంది మూకుమ్మడిగా అరుస్తూ గుండెల్లో ఎగిసిపడిన అభిమానాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తుంటే ఊపిరాడనిస్థితిలో పడిపోయిన మధుర జ్ఞాపకం అది. ఒక్క చిత్రం రిలీజైన కొన్ని క్షణాల్లోనే తనకింతమంది ఫాన్సా?

సరిగ్గా అపుడే... సిల్వర్ స్క్రీన్ పవరేంటో తెలిసి వచ్చింది. తను ప్రొడ్యూసర్ ఇచ్చిన రెమ్యూనరేషన్ తీసుకుని ఈ సినిమాలో నాయికగా నటించింది. హీరోని ప్రేమించింది. కానీ... ఈ థియేటర్లోని ప్రేక్షకులు తెరపై తనని చూసిన క్షణంలోనే ప్రేమలో పడిపోయారు. రంగురంగుల పేపర్లని గాల్లోకి ఎగురవేస్తూ తమ హర్షాతిరేఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు సరే... తెరపై తనని చూసి అభిమానిస్తున్నారు.

మరి, తనకో... సన్నటి చీకట్లో ఒక్కరంటే ఒక్కరూ కనిపించలేదు. అయినా... వాళ్ల మనసులోని భావాల్ని ఆహ్వానిస్తోంది. మనసారా ఆస్వాదిస్తోంది.

"మూవీ సూపర్బ్"

"హీరోయిన్ అదుర్స్"

"హండ్రెడ్ డేస్ పక్కా"

థియేటర్లో మీడియా ముందు కూడా ఫాన్స్ హడావుడి. దానికి అంతేలేదు. ఆ కేకలు, అరుపులు ఇప్పటికీ ఆమెలో నవ్యోత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకు మించి అందుకోవాల్సిన మెమెంటోలు వేరే ఏముంటాయి? ఇపుడు మొదటి సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయలేననే బాధ లేదు. అంతమంది ప్రముఖుల మధ్యలో అవార్డు అందుకోలేదన్న కొరత అస్సలు లేదు.

"పెళ్లయిందా?" అడిగింది గాయత్రి.

"రెండు నెలల క్రితమే" చెప్పాడు ధీరజ్.

"ఇంకో విషయం చెప్పనా... నవ్వకూడదు" అన్నాడతడు.

"చెప్పు..." ధైర్యం చెప్పింది.

"తప్పుగా అనుకోకూడదు"

"అనుకోను..."

"నా భార్యలో నాకెపుడూ నువ్వే కనిపిస్తావు. అసలు నిజం ఏమిటంటే... నిన్ను మొదటిసారి సిమ్లాలో చూసినపుడే ప్రేమలో పడిపోయాను. తర్వాత్తర్వాత నిన్నందుకోలేనని తెలిసినా నా మనసు మార్చుకోలేకపోయాను. నిత్యం నీగురించి తెలుసుకోవడంలోనే ఆనందాన్ని అందుకుంటున్నాను. నీకు ఓ సినిమా వస్తే గుళ్లో అర్చన చేయిస్తాను. నీ చేతుల్లో పడాల్సిన ఆఫర్ పోతే బాధతో విలవిలలాడతాను. జర్నలిస్ట్ లు నీ గురించి గాసిప్స్ రాస్తే నవ్వేమనుకుంటున్నావోనని బెంగపడతాను. నిన్ను ఊరడిస్తూ మెసేజ్ పంపేవరకూ నాకేమీ తోచదు..." చెప్తున్నాడు ధీరజ్.

"ఔను... సంతోషంతో, బాధలో అతడి మెసేజ్ లు కొండంత అండగా నిలిచేవి. ఎప్పుడెక్కడ ఉన్నా 'హలో' చెప్తూ మనసుకి సాంత్వన ఇచ్చేవి' - అనుకుంది గాయత్రి.

"నువ్వు నన్ను ఇంతలా ఆరాధిస్తున్నావని నీ భార్యకి తెలుసా?"

"తెలుసు..."

మళ్లీ ఆశ్చర్యపోయింది ఆమె.

"తన భర్త పరస్త్రీని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఏ భార్య అయినా సహిస్తుందా?"

"నా భార్య సహిస్తుంది. ఎందుకంటే... నేను మిమ్మల్ని ప్రేమించేదానికన్నా ఆమె నన్ను అమితంగా ప్రేమిస్తోంది"

"ఓ మైగాడ్. అభిమానం కూడా ఇలా హద్దులు దాటుతుందా?" అనుకుందామె.

"నీ భార్యని చూడాలనుంది" అంది గాయత్రి.

"తీసుకొస్తాను..."

"వద్దు... నేనే వచ్చి చూస్తాను" చెప్పింది.

"నువ్వు మా ఇంటికి వస్తావా?"

"మీ ఇంట్లోని టీవీలోకి వస్తున్నా కదా!"

"గుండెల్లో దేవత ఇంట్లోకి అడుగుపెడ్తానంటే కాదంటానా... తప్పకరండి" అడ్రస్ ఇస్తూ ఆహ్వానించాడతడు.

"ఒక్క ఫోటో... నిన్ను కలిసానని నా భార్యకి చెప్పుకోవాలి కదా!" అంటూ తన సెల్ కెమెరా ఆన్ చేసాడు.

"ఓకే..." అంటూ చిర్నవ్వుల ఫోజిచ్చింది గాయత్రి.

ఆర్తిగా ఆర్టిస్ట్ లు దేనికోసం ఎదురు చూస్తారో అర్ధమైంది గాయత్రికి. ఒక్క సినిమా రిలీజైతే చాలు... కులం, మతం, భాషాభేదం లేకుండా నచ్చిన నాయికని గుండెల్లో గుడికట్టి మరీ పూజిస్తారు. రంగురంగుల కాంతిదీపాల్తో థియేటర్లను అందంగా అలంకరిస్తారు. అభిమాన కథానాయిక కటౌట్లకు దండలు వేస్తారు. తమ జేబులోని డబ్బులు ఖర్చుపెట్టి వీలైనన్నిసార్లు సినిమా చూస్తారు. ఎవరు వ్యతిరేఖించినా ఒంటికాలిపై లేస్తారు.

అలాటి ఆభిమానుల కోసం తను నటించాల్సిందే. ఔను... ఇంతకింత అంకితభావంతో తను మరిన్ని సినిమాల్లో నటిస్తుంది. తన ఫాన్స్ ని అలరిస్తుంది. ప్రదీప్ లాంటి హీరోల డేటింగ్ లు... సాగర్ లాంటి హీరోల లవ్ ప్రపోజల్స్ కి తనింకేమాత్రం చలించదు. తను చెన్నయ్ వెళ్లి వచ్చేసరికి ఎంతలా మారిపోయాడు. కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన అనూషని కన్విన్స్ చేసుకునేందుకు తెగ తాపత్రయపడ్తున్నాడు. అంటే... తనతో 'డేటింగ్' కేవలం బూటకం. ఆ సంగతి అతడితో గడిపిన కొన్నాళ్ళ సహచర్యమే తెలియజేసింది.

'ఆ ఒక్కటీ వద్దు' అని తనెంత చెప్తున్నా ఏకాంత సమయాల్లో ఆవేపే చొరవచూపించేవాడు.

"ఎంచక్కా మాట్లాడుకుందాం... ఒకరికొకరం అవగాహన చేసుకుందాం" అనేసరికి... 'అమ్మానాన్న' ఆటాడుకుందాం... అంటూ మారాం చేసేవాడు. కనిపించగానే కౌగలించుకునేవాడు. చెక్కిలిపై ముద్దుల్తో ముద్రలేసేవాడు. శరీరంలో ఎక్కడెక్కడో తాకుతూ - 'బాగుందా?' అనేవాడు.

"ఇవన్నీ పెళ్లయ్యాకే?" అని అంటే...

"పెళ్లికి రిహార్సల్స్ అనుకో" అనేవాడు.

"రిహార్సల్స్ లోనే అన్నీ అనుభవించేస్తే శోభనంరోజున అసలు థ్రిల్లేముంటుంది?" అడిగేది గాయత్రి.

"అంటే... ఆ థ్రిల్ అస్సలు తెలీదా?" అడిగేవాడు.

"ఊహూ..." తల అడ్డంగా ఊపితే -          

"అబద్దం..." అంటూ శాడిస్టిక్ గా నవ్వేవాడు ప్రదీప్.

"అబద్దమా?" కోపం తెచ్చుకునేది గాయత్రి.

"మరి, కాదా?"

"ఎలా చెప్తున్నావ్?"

"సొసైటీలోనే చాలామంది అమ్మాయిలు పెళ్లికాకుండానే ఆ 'అనుభవాల్ని' రుచి చూస్తుంటే... నువ్వో సినిమాస్టార్ వి. గ్లామర్ ప్రపంచంలో ఉన్నదానివి... ఆ 'అనుభవం' లేకుండానే అవకాశాలు వచ్చాయంటే నేను నమ్మాలా?" అనేవాడు.

"చూడు... నువ్వు చాలామందిని అవమానపరుస్తున్నావు. ఇటు నన్ను, అటు సొసైటీలోని అమ్మాయిల్ని... అంతేకాదు... నీకు తిండిపెట్టే ఇండస్ట్రీని అవమానపరుస్తున్నావు" ఓరోజు కోపంతో శివాలెత్తిపోయింది గాయత్రి.

"అంటే... నే చెప్పినవన్నీ జరగడం లేదా? ఒక్క చాన్స్ ఇస్తామంటే ఒక్కరాత్రి గడిపేందుకు వచ్చేవాళ్ళు ఇండస్ట్రీలో లేరా?"

"అక్కడక్కడా ఉంటే ఉండొచ్చు. అంతమాత్రాన ప్రతిఒక్కరూ అలాగే అనుకోవడం పొరపాటంటాను. అన్నిటికీ మినహాయింపు ఉంటుంది కదా!"

"ఆ మినహాయింపులో నువ్వున్నానంటావ్?" అడిగాడు ప్రదీప్.

"ఎస్... గర్వంగా చెప్పుకోగలను. ఏ ముడుపులు కట్టకుండానే... ఎక్కడా, ఎవరితో, ఏ రాత్రీ గడపకుండానే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. సక్సెస్ తర్వాత సక్సెస్ ఇస్తున్న స్టార్ హీరోయిన్ గా మొదటి సినిమానుంచి నన్ను ఇండస్ట్రీ గుర్తించింది..." నిబ్బరంగా అంది గాయత్రి.

"సరే... హీట్ హీట్ డిస్కషన్స్ తో ఈ ఏకాంత సమయాన్ని వృధా చేసుకోవద్దు..." అంటూ దగ్గరికి వచ్చాడు ప్రదీప్. వచ్చి... ఆమెని గాడంగా కౌగలించుకుని పెదాల్తో ఆమె పెదాల్ని బంధించి ఆపుకోలేని తమకంతో అదేపనిగా ముద్దులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత నుంచీ ఎడం పాటిస్తూ... చివరాఖరికి వర్కవుట్ కాదని వదిలించుకున్నాడు. ఇక, సాగర్ కూడా ప్రదీప్ ఫ్రెండే. ప్రపోజ్ చేసే రూట్ వేరైనా... కథ క్లయిమాక్స్ ఒకటే... అనే నిర్ధారణకి వచ్చింది గాయత్రి.

ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమల్ని పక్కన పెట్టి సీరియస్ గా కెరీర్ పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందామె. వస్తున్న వరుస ఆఫర్లను 'ఓకే' చేస్తూ 'ట్వంటీ ఫోర్ ఇంటూ సెవన్' పని రాక్షసిలా మారిపోయింది.

ఆ తర్వాత గాయత్రీపాటిల్ ఇక వెనక్కి చూసుకోలేదు.

'ప్రేమే ప్రాణం... ప్రేమే లోకం', 'ప్రేమ... ప్రేమ... ప్రేమ' ఇలా వరుస సినిమా ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

ఉదయం కోటీ...

సాయంత్రం ఊటీ...

మర్నాడు అరకు...

ఆ మర్నాడు అబ్రాడ్...

ఇలా వరుస షూటింగ్ ల్తో ఉక్కిరిబిక్కిరవుతోంది గాయత్రీపాటిల్.

ఇపుడు -

ఎక్కడ చూసినా ఆమె నిలువెత్తు కటౌట్లే.

ఏ దిక్కున చూసినా తడిసిన పల్చటి తెల్లచీర చాటు వయారాల వడ్డనల కనికట్లే.

ఎదురుగా కన్పించే ఓ ఎత్తయిన భవనం అంచున...

ఫ్లై ఓవర్ల పక్కన... బస్ బేల నుదుట...

సుందరంగా, సురుచిరంగాతన ఒళ్లుని ఓ విల్లులా వంచి...

ఆ వంపుసొంపుల్లో హంపీశిల్పాల్ని...

రామప్ప రమణుల్ని... రమణీయంగా,

కమనీయంగా కళ్ళముందుకు తెస్తున్న సొగసుగత్తె ఆమె.

మహామాయగత్తెలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది కూడా ఆమె.

(.... ముగింపు వచ్చేవారం)

మరిన్ని సీరియల్స్
kumaratheertham lo sadhuvu