Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

క్షమించాలి... పని ఒత్తిడి వల్ల ఈ కాలమ్ సకాలంలో అందించలేకపోయాను. కానీ గతవారం ఈ కాలమ్ ఆగినట్టు నా వాచీలో కాలం కూడా ఆగితే బావుండుననిపించింది. వారంరోజులూ చెన్నై లో భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల్లో పాలుపంచుకున్నాక.

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, మరాఠీ, భోజ్ పురి భాషల చిత్ర పరిశ్రమల నుంచి కొన్ని వేల మంది దర్శక రచయితలు, నిర్మాతలు, నటీనటులు ఒకచోట కలవడం, నాలుగు రోజులు రకరకాల కార్యక్రమాలు చూడటం, క్షణం తీరిక లేదు. వెండితెర మీద ఒక్కో నటుడి ప్రతిభ చూస్తేనే నోరెళ్ళబెట్టుకుని ఆరాధిస్తాం. అలాంటిది వెండితెర వందేళ్ళ పండుగకి విచ్చేసిన అంతమంది నటీనటుల్ని ఒకేసారి చూస్తే రెండు కళ్ళు సరిపోతాయా? వళ్లుమరిచి చూడమా? దురదృష్టవశాత్తూ తెలుగు పరిశ్రమ నుంచి కొందరు అగ్రదర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరుకాలేకపోయారు. అలాగే తమిళ పరిశ్రమ నుంచి కూడా. నేను, అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితం ప్రాతంభించిన మదరాసు చెన్నై గా మారింది, నేను దర్శకునిగా మారాను. ఇప్పుడెల్తే మళ్ళీ కొత్తగా ఇప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టిన అనుభూతి. గతకాల మధుర జ్ఞాపకాల పలకరింపు.

డా: పరుచూరి గోపాలకృష్ణ గారికి, డా: దాసరి నారాయణరావు గారికి, హీరో మంచు విష్ణు గారికి, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారికి, శ్రీ డి. సురేష్ బాబుగారికి, శ్రీ కె.ఎస్. రామారావు గారికి, శ్రీ సి. కళ్యాణ్ గారికి, శ్రీ మోహన్ గారికి, ఆత్మీయులు కాశీ విశ్వనాథ్ గారికి, శ్రీ జి. రామ్ ప్రసాద్ గారికి, సీనియర్ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారికి, శ్రీ సత్యానంద్ గారికి, మిత్రులు కాట్రగడ్డ సుధాకర్, వర్మ, ప్రసాద్, మురళి తదితరులకి పేరుపేరునా కృతజ్ఞతలు.

'తార'తమ్యాలు చాలా ఎక్కువున్న వ్యక్తులు కూడా చెన్నైలో తారతమ్యాలు మరచి అందరూ అందరితో ఆప్యాయంగా కలిసి భోం చేయడాలు, మాట్లాడుకోవడాలు నా ఆనందానికి కారణాలు. ఫణిమాధవ్ కస్తూరి, యం.వి. ప్రశాంత్, షేక్ మహ్మద్, విజయ్ తదితరులు అందించిన సహకారం కూడా మర్చిపోలేను. నిర్మాత అశోక్ కుమార్, కాట్రగడ్డ ప్రసాద్ గారు పడిన శ్రమ కూడా పరిశ్రమ వ్యక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎంతో తోడ్పడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకొన్న నిర్ణయం ఫలితంగా వేదిక పైన స్టార్ ప్రెజెన్స్ లేకపోయినా, వేదిక ముందున్న ప్రేక్షకులంతా సినిమా రంగంలోని లెజెండ్స్, సెలబ్రిటీస్, స్టార్స్ కావడంతో కన్నుల పండుగ వేదిక మీద కాకుండా, ప్రేక్షకులని చూసినప్పుడు కలిగింది.

అయినా వేదిక నెక్కిన వర్ధమాన తారలు కూడా బాగా శ్రమించి పెర్ ఫార్మెన్స్ తో లబ్ధ ప్రతిష్టుల ముందు తమ ప్రతిభను చాటుకొన్నారు. శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారి పుణ్యమా అని త్వరలో రిలీజు కాబోతున్న నా 'పార్క్' చిత్రం హీరో సంతోష్ సామ్రాట్, హీరోయిన్ సరయు కూడా పాల్గొనడం నాకు మరీ మరీ ఆనందం కలిగించింది.

ప్రేక్షకుల్లో స్టార్లంతా ఒకెత్తు. డా: మోహన్ బాబు గారి రెండో అబ్బాయి హీరో మంచు మనోజ్ ఒకెత్తు. అచ్చ తెలుగు పంచెకట్టు, లాల్చీ, కండువాలతో ఆ పెదరాయుడి కొడుకు చినరాయుడిలా చాలా ఆకర్షణీయంగా, సంప్రదాయబద్ధంగా ఉన్నారు. వేదిక మీద తారాపధంలో దూసుకెళ్తున్న గాయనీ గాయకులంతా కలిసి శ్రీ కోటి గారు, వందేమాతరం శ్రీనివాస్, శ్రీలేఖ, దేవిశ్రీప్రసాద్, తమన్, మధుర గాయకులు డా: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్ల సమక్షంలో పాడిన పాటలెలా ఉన్నా విజువల్ మాత్రం హమ్ ఆప్కే హై కౌన్ సినిమా అంత ఆహ్లాదంగా ఉంది. సినీ గాన కుటుంబం అది. కార్యక్రమంలో నిర్వహణాలోపాల్ని నేను సమర్ధించట్లేదు కానీ, కోరి వచ్చినవారి తేజస్సు ముందు అవి చిన్నబోయాయని నేను పర్సనల్ గా భావించాను.

నేను డిగ్రీ చదువుతున్న మూడేళ్ళూ ఒకే కల పదే పదే వచ్చి నన్ను వెంటాడుతుండేది. పున్నమి వెన్నెలలో అర్ధరాత్రి ఒక పెద్ద కొండ. ఆ కొండ మీద విద్యుద్దీపాలతో జేగేయమానంగా వెలిగిపోతున్న పెద్ద రాజభవనం. దూరంగా కొండ క్రింద నుంచి సగం వరకు వచ్చి ఒక బండరాయి వెనక నక్కి, భవనం వైపు చూస్తున్న నేను. నా వెనకొచ్చిన వేరే అతను నా వైపు చూసి "ఇక్కడే వెయిట్ చెయ్యాలి మనం. ఏడాదికోసారి ఆ భవనం సింహద్వారం తెరుచుకుని ఒక మేఘంలాంటి పొగ వచ్చి తనక్కావలసిన వాళ్లని చుట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. వెంటనే తలుపులు మూసుకుపోతాయి" అన్నాడు. కొంతసేపటి తర్వాత నా వెనుక కొన్ని వేలమంది క్యూలో నించునేవారు. ఇంతలో పొగ వచ్చి నన్ను, నాతోపాటు ఇంకొంతమందిని చుట్ట చుట్టి గాల్లో ఎగరేసుకుపోయింది. సింహద్వారం మూసుకుపోయింది. లోపల చూస్తే చిరంజీవి,, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రోజా, రంభ, రమ్యకృష్ణ, ఆమని, శ్రీదేవి, జయప్రద, జయసుధ, వేటూరి, సిరివెన్నెల, విశ్వనాథ్, బాపూ, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, బాలసుబ్రహ్మణ్యం, పరుచూరి బ్రదర్స్ వంటి చిత్రపరిశ్రమ ప్రముఖలంతా గెట్ టు గెదర్ పార్టీ అన్నమాట.

అలా ఇండస్ట్రీ నన్ను తనలో లాక్కుంటుందని తరచుగా కల కనేవాణ్ణి. వంద సంవత్సరాల వేడుక సందర్భంగా ఇంచుమించు అదే దృశ్యాన్ని ఇలలో చూశాను. ఆనందంతో నా కళ్ళు చెమర్చాయి. డా: అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్ డే సెలబ్రేషన్ ఈ వంద సంవత్సరాల వేడుకలో అలాగే జరిగింది. నాలుగు రాష్ట్రాల స్టార్ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్ లు, ఆర్టిస్ట్ లు, ప్రొడ్యూసర్లు సమక్షంలో గెట్ టు గెదర్. నా కల నిజమైనందుకు ఆ సర్వేశ్వరుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోని క్షణం లేదు. ఇది చాలదా సినిమా పరిశ్రమ కోసం నేనేదైనా చేయడానికి? ఇది చాలదా నాకిలాంటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోవాలి అని అనుకోవడానికి?

(వచ్చేవారం మరిన్ని విశేషాలతో...)





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
Pawanism is ahead of Piracy