Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue250/678/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి).....‘‘నాకు కాస్తంతగా విశ్రాంతిగా ఏ టెన్షన్ లేకుండా వుండాలని వుంది.
సంభ్రమంగా చూశాడు ఆకాష్.

‘‘నా దగ్గర వుంటావా?’’ అడిగాడు.

‘‘ఊ!’’

నమ్మలేనట్లు చూసి టైం చూసుకున్నాడు. ఏడుంబావు అయింది.

‘‘ఒక్క పావు గంట.....నువ్వు నా బెడ్రూంలో రిలాక్స్ అవ్వు, నేను ఈ వర్కంతా అడ్జస్ట్ చేసి వస్తాను. సీ ఫుడ్ ఆర్డర్ చేశాను. అటెండర్ తెచ్చేస్తాడు. ఈ లోపు రెస్ట్ తీసుకో’’ అతను తన స్వభావానికి విరుద్దంగా కంగారు పడిపోతూ అన్నాడు.

ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అతను తన సబార్డినేట్స్ ని పిలిచి వర్క్ అప్పగించేశాడు. అసలు ఎనిమిదికే ఆఫీసు క్లోజవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు.

ఈ రోజు ఆఫీసు లోనే వుంటాననీ, అవసరమయితే ఫోన్ చెయ్యమనీ ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు.

అటెండర్ ఫుడ్ తెచ్చి లోపల ఒవెన్ లో పెట్టి వెళ్లిపోయాడు.

ఇంకా తర్వాత ఆకాష్ ఛాంబర్ డోర్స్ క్లోజయ్యాయి. తెల్లారే లోపు అతన్ని ఎవరూ డిస్టర్బ్ చెయ్యకుండా జాగ్రత్తపడ్డాడు.

అతను స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి వచ్చే సరికి పావు తక్కువ ఎనిమిది.

‘‘సారీ కీర్తనా! పావుగంట లేటు....’’ నొచ్చుకుంటూ అన్నాడు.

‘ఫర్లేదు’ మెల్లగా అంది.

ఆమె పక్కన కూర్చుని తన చేతుల్ని ఉయ్యాలగా చేసి ఆమెని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు.

కీర్తనతో పరిచయమయ్యాక అతని మనసుకి శాంతంగా అనిపించిన క్షణం అదే!

ఆమెకి ఎందరు ఎన్నివిధాలుగా సహాయం చేసినా, చివరికి అసలైన సమయంలో ఆమె తన సమక్షాన్నే కోరుకుంది.

తన ప్రేమ మీద నమ్మకం ఏర్పడింది.

ఇక కీర్తనకి అతని చేతులు తనని చుట్టగానే మనసులో వున్న టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్లుగా పోయింది. మత్తుగా, హాయిగా వుంది.
‘‘నిద్రొస్తోంది’’ మత్తుగా అంది.

‘‘భోజనం చెయ్యవూ?’’ ఆమె పాపిటలో చుంబిస్తూ అడిగాడు.

‘‘ఊహూ!’’

‘‘అలా అంటే ఎలా? పుడ్ తీసుకోవాలి. లేకపోతే నీరసం అయిపోతావు’’ ఆమెని మెల్లగా దిండు మీద పడుకోబెట్టి...

ఓవెన్ లో ఐటమ్స్ అన్నీ తీసి టేబిల్ మీద సర్దాడు. అంతా సాత్వికాహారం.

డైటీషియన్ కి ఫోన్ చేసి రేపు గేమ్ ఆడేవాళ్ళు ఈ రోజు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అడిగి అదే తెప్పించాడు.

‘‘బుజ్జీ రా!’’ పిలిచాడు.

‘‘రాలేను’’ అంది

అతనే ప్లేట్లో ఐటమ్స్ వేసి బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆమెను లేపి కూర్చోపెట్టాడు. అతను తినిపిస్తుంటే మాట్లాడకుండా అతని మొహం చూస్తూ తింది.

ఆ సమయంలో కూడా ఆమె చేతులు రెండూ తన పొట్ట చుట్టూ విడవకుండా వుండటం గమనించి హృదయం ద్రవించింది.

‘‘పిచ్చి పిల్ల’’ అప్రయత్నంగా అన్నాడు.

‘‘ఎవరూ?’’

‘‘నువ్వే!’’

‘మంచిదాన్ని కాదా!?’ అడిగింది.

‘‘మంచే.... మరీ మంచి ఎక్కువైతే పిచ్చివాళ్ళు అవుతారు.’’

‘‘మీలాగానా?’’ అతని హృదయానికి చేరబడుతూ అంది. చిన్న నవ్వు నవ్వాడు.

‘‘రేపు నేను గెలుస్తాను. ష్యూర్....కాబట్టి మన పందెంలో నేను గెలిచినట్లు’’ గర్వంగా అంది.

‘‘పోనీ మంచిదే! నీ గెలుపు నాకు సంతోషమే!’’ మనస్ఫూర్తిగా అన్నాడు.

‘‘కానీ మన పందెం ప్రకారం మీరు ఓడిపోతే మనిద్దరి పెళ్ళి జరగదు..నన్ను మర్చిపోవాలి కదా?!’’

‘‘అవును. అందుకే మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకుని ప్రేమించమన్నావుగా!’’ గుర్తుచేశాడు.

‘‘అబ్బా! తెలివి....మీరంటే నాకస్సలు ఇష్టం లేదు.’’ అతన్ని మరింత హత్తుకుపోతూ అంది.

‘‘నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం....’’ చేతులు ఆమె చుట్టూ మరింతగా బిగిస్తూ అన్నాడు. భోజనం కాగానే ఆమె కళ్ళు అరమూతలు పడ్డాయి. దగ్గరగా తీసుకుని గుండెల్లో పొదుపుకుని పడుకోబెట్టాడు. రెండు నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది కీర్తన.

******

తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచింది కీర్తన. దగ్గరలోవున్న జిమ్ కి తీసుకుని వెళ్ళాడు ఆకాష్. ఆరుగంటల  వరకూ అక్కడ ఎక్సర్ సైజు చేసింది. మళ్ళీ ఆకాష్ ఆఫీసుకి వచ్చి, అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి ప్రణీత్ దగ్గరకి బయలు దేరింది.

ఆకాష్ దింపుతానన్నాడు కానీ కీర్తన వారించి ఆటోలో బయలుదేరింది.

కీర్తన వెళుతుంటే తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. పదినిమిషాలు గడిచాక అతనికి ఎందుకో అస్థిమితంగా అనిపించింది. ఈ రోజంతా కీర్తన తోనే గడపాలనిపించింది.

వెంటనే కారు తీసుకుని బయలుదేరాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?