Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue248/673/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి)... ద్వేషించే మనిషిని ప్రేమిస్తూ, ప్రియుడు ఇస్తున్న ముద్దు ఇంత మధురంగా వుంటుందా?
కీర్తన మనసు బాధగా మూలిగింది. వదల లేనట్లుగా అతని పెదాలు విడిచాయి.

ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి గోడకు ఆనుకునిపోయింది.

‘‘వెళ్ళొస్తాను....’’ చెప్పి వెను తిరిగాడు.

ఆ రాత్రి కీర్తన హాయిగా నిద్రపోయింది. బామ్మ దిండుని కౌగిలించుకుని, ఆకాష్ దిండుతో కబుర్లు చెపుతూ!

******

నేషనల్ గేమ్స్ ప్రారంభ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.

అన్ని ఈవెంట్స్ లో ప్రైమరీ రౌండ్స్ జరుగుతున్నాయి. మహిళల వాలీబాల్ లో ఆంధ్రా జట్టు, మహారాష్ట్ర జట్టు ప్రత్యర్ధులకు అందనంత స్థాయిలో ఆడుతూ దూసుకు పోతున్నాయి.

కీర్తన ఒక విధమయిన తపస్సులో వుంది.

ప్రణీత్ అనుక్షణం ఆమెకి తోడూ`నీడలా వుంటున్నాడు.  అన్నివిధాలుగా ఆమెని ప్రిపేర్ చేస్తూ, అది తన జీవన్మరణ సమస్యలా భావిస్తున్నాడు.

అన్ని రౌండ్ల లోనూ సునాయాసంగా నెగ్గి, ఫైనల్ కి చేరుకుంది ఆంధ్రా జట్టు. అందరూ వూహించిన విధంగానే ఫైనల్లో ప్రత్యర్ధి మహారాష్ట్ర జట్టే!

రేపు ఉదయం పది గంటకి ఫైనల్!

ఆ రోజు రాత్రి కీర్తన చాలా టెన్షన్ ఫీలవుతోంది.

ప్రణీత్ కన్ సోల్ చేస్తున్నాడు కానీ, ఆమెలో రిలాక్సేషన్ రాలేదు.

‘‘మీరు బాగా రిలాక్స్ అవ్వాలి, మైండ్ ఫ్రెష్ గా వుంచుకోండి’’ అంటూ కామెడీ మూవీ సి.డి. తెచ్చాడు.

ఆమె దృష్టి టి.వి. స్క్రీన్ మీద వున్నా, మనస్సు ఎక్కడో వుంది.

‘‘మేము గెలుస్తాం కదూ!’’ వున్నట్లుండి అడిగింది.

‘‘తప్పకుండా మీరే గెలుస్తారు. అసలు దాన్ని గురించి ఆలోచించకండి....’’ చెప్పాడు.

కాసేపాగి లేచి నిలబడి పచార్లు చెయ్యసాగింది.

ఆమె బాధ ఏమిటో అర్ధమయింది. కానీ ఎలా ఆ టెన్షన్ ని తప్పించడం? నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. ఆమె సడెన్ గా ఆగి...‘‘నన్ను....నన్ను ఆకాష్ దగ్గరకి తీసుకుని వెళ్ళగరా?’’ అడిగింది.

అప్రతిభుడయ్యాడు ప్రణీత్!

‘‘ఇప్పుడా....? ఈసమయంలో....?!’’

‘‘ప్లీజ్....’’

ఏమనుకున్నాడో ఏమో లేచి డ్రస్ ఛేంజ్ చేసుకుని, బైక్ తీసుకుని బయలుదేరాడు. కీర్తన కూడా బయటకి వచ్చింది. అప్పటికి సమయం ఆరున్నర!

‘‘ఈ టైమ్ లో అతను ఆఫీస్ లో వుంటాడేమో!’’ ప్రణీత్ అన్నాడు.

‘‘అక్కడికే వెళదాం.’’ మారు మాట్లాడకుండా అటు వైపు పోనిచ్చాడు. అరగంటలో ఆఫీసు బిల్డింగ్ ముందాగింది. ప్రణీత్ కూడా రాబోతే, ఆగిపోయి ‘‘నన్ను ఆకాష్ దింపేస్తారు’’ అంది.

‘‘సరే! త్వరగా వచ్చేసి రెస్ట్ తీసుకోండి’’ చెప్పి వెనుదిరిగాడు ప్రణీత్. అతనికి కీర్తన మనసు అర్ధమయి, విషాదంగా నవ్వుకున్నాడు. కొంత మందికి అన్ని అర్హతలూ వుండి అభిప్రాయాలు, అభిరుచులూ కలిసినా ఒకటి కాలేరు. అదృష్టం వుండదు. అంతే! అని నిట్టూర్చి వెను దిరిగాడు.

కీర్తనకి తను ఇది వరకు వాళ్ళ ఆఫీసుకి వెళ్ళడం గుర్తొచ్చింది.

లిఫ్ట్ లో  వెళ్ళి బెరుకుగా ఆఫీస్ లో అడుగు పెట్టింది. ఇది వరకటి రిసెప్షనిస్ట్ చిరునవ్వుతో, ‘‘వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ’’ స్మూత్ గా అడిగింది.

కీర్తన ఏదో అడిగే లోపే ఇంటర్ కమ్ మోగింది. అప్పటికే తన ఛాంబర్ బ్లాక్ గ్లాసెస్ నుంచి ఆకాష్ కీర్తనని చూశాడు. పట్టలేని ఆశ్చర్యం కలిగి, రిసెప్షనిస్ట్ కి ఫోన్ చేసి లోపలికి పంపించమన్నాడు.

మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో అతనే బయటికి వచ్చాడు. స్నఫ్ కలర్ సూట్ లో తెల్లగా, పొడవుగా వున్న అతను డోర్ ఓపెన్ చేసి బయటకు రాగానే చాలా మంది కళ్ళు అతని వైపు తిరిగాయి.

అందరూ లేచి నిలబడ్డారు. అతను ఎవరి వైపూ చూడటం లేదు. డైరెక్ట్ గా తన దగ్గరకు వస్తుంటే కళ్ళు విప్పార్చి చూస్తూ వుండిపోయింది.
‘‘వెల్ కం బుజ్జీ!’’ విశాలం గా నవ్వుతూ ఆహ్వానిస్తుండగా రిసెప్షనిస్ట్ తెల్లబోయి చూసింది.

అతను బయటకి వచ్చి మరీ ఇరవై ఏళ్ళ ఆ అమ్మాయిని సాదరంగా లోపలికి తీసుకుని వెళ్ళడం చూసి, అతనికి ఎంత కావలసిన మనిషో అనుకున్నారందరూ. లోపలికి వెళ్ళగానే డోర్స్ మూతపడ్డాయి. లోపలి వాళ్ళు బయటకు కనిపించే ఆస్కారం లేదు.
అతని ఛాంబర్ చాలా రిచ్ గా వుంది. అన్ని ఫెసిలిటీస్ వున్నాయి. దాన్ని ఆనుకుని అతను రిలాక్స్ అవడానికి బెడ్రూం వుంది.
‘‘వాటే సడెన్ సర్ పైజ్’’ మొహంలో నవ్వు విరబూస్తుండగా అన్నాడు.

తన రాక అతనికి ఎంత ఆనందాన్ని కలిగిస్తోందో తెలిసింది కీర్తనకి.

‘‘కూర్చో!’’ సోఫా చూపించాడు. కూర్చుంది కీర్తన. అతను కోటు తీసి హేంగర్ కి తగిలించి టై వదులు చేసి ఫ్రీ అయ్యాడు. బెల్ కొట్టాడు. అటెండర్ వచ్చాడు. రాగానే ఏదో చెప్పాడు. అతను కార్నర్ లో వున్న ఫ్రిజ్ దగ్గర కెళ్ళి రెండు గ్లాసుల్లో జ్యూస్ పోసి ఇచ్చాడు. వద్దనకుండా తీసుకుంది.

ఆ అటెండర్ వెళ్ళేముందు మళ్ళీ ఏదో చెప్పాడు ఆకాష్. అతను వినయంగా తలూపి వెళ్ళిపోయాడు. ‘‘ఏంటి దేవి గారు నామీద కరుణించారు?’’ సంతోషంగా అన్నాడు.

అతను దూరంగా వుంటే ఏంటోగా వుంది. అతని స్పర్శలో ఎంత తొందరగా సేద దీరాలా అన్నట్లు వుంది.

‘‘నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు....’’ మనస్పుర్తిగా చెప్పాడు.

థాంక్స్ కూడా చెప్పకుండా కూర్చుంది.

‘‘నేనొకసారి ఒక కోరిక కోరాను మర్చిపోయావా?’’

‘‘ఏంటీ?’’

‘‘నా ముందు వాలీబాల్ ఆడమని’’ కొంటెగా అన్నాడు. నవ్వ లేదు. సిగ్గు పడ లేదు. నిర్నిమేషంగా చూస్తూ కూర్చుంది.
‘‘ఏమయింది?’’ కంగారుగా పక్కకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు లేచొచ్చింది ప్రాణం. ఎపుడెపుడు అతను దగ్గరకు తీసుకుంటాడా అని ఎదురు చూస్తోంది.

అది ఆఫీసు కావడం మూలంగానో ఏమో అతను ఆ ప్రయత్నం చేయ లేదు.

‘‘నేను చాలా అలిసి పోయాను.’’

‘‘అవును! గేమ్స్ వారం నుండి జరుగుతున్నాయి కదా!’’ ఒప్పుకున్నాడు.

‘‘రేపు ఫైనల్స్.’’

‘‘వూ....’’

సశేషం

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్