Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppagalaraa..cheppamantara

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహారయాత్రలు ( మలేషియ ) - - కర్రా నాగలక్ష్మి

maleshiya

పుత్రజయ

1980 లలో అప్పటి మలేషియ దేశపు ప్రధాన మంత్రి మహథీర్ బిన్ మొహమ్మదు కౌలాలంపూర్ లో పెరుగుతున్న రద్దీని దృష్టి లో పెట్టుకొని కొత్తరాజధాని నిర్మాణం తలపెట్టి కౌలాలంపూర్ పట్టణానికి , కౌలాలంపూర్ అంతర్దేశీయ విమానాశ్రయానికి మధ్యవున్న ప్రదేశంలో కొత్త రాజధాని నిర్మాణం తలపెట్టి పనులు ప్రారంభించేడు . సుమారు 49 చదరపు కిలో మీటర్ల జాగాలో నూరు శాతం మలేషియ సాంకేతిక , ఆర్థిక సహాయంతో  పనులు ప్రారంభంగా 1997 , 1998 లలో సంభవించిన ఆసియా ఆర్థిక సంక్షోభం వల్ల కాస్త ఆలస్యం జరిగినా 1999 లో మొదటి విడతగా 300 మంది పరిపాలనాధికారులను తరలించేరు . మిగతా పరిపాలనా యంత్రాంగాన్ని 2005 లో మార్చేరు . మలేషియ మొదటి ప్రధాన మంత్రి తున్కు అబ్దుల్ రెహమాన్ పుత్ర జ్ఞాపకార్థం దీనికి పుత్రజయ అని పేరు పెట్టేరు .

పుత్రజయ నిర్మాణం లో 90 శాతం దేశ ఉత్పాదనలు వాడగా పదిశాతం దిగుమతి చేసిన ఉత్పాదనలు వాడవలసి వచ్చింది . 

2001 లో పుత్రజయను స్పెషల్ ఎకనామికల్ జోన్ గా ప్రకటించేరు , అదే సంవత్సరం పుత్రజయను సెలంగోరు రాష్ట్రానికి వప్పజెప్పేరు . 2002 లో యిక్కడకు రైలు లింక్ మార్గ నిర్మాణం జరిగింది . దీనిని  ' క్లియ ట్రాన్సిట్ ' అని అంటారు .

టాక్సీ సర్వీసులుల, బస్సు సర్వీసులతో పాటు పుత్రజయ టూర్లు కూడా వున్నాయి . ప్రస్తుతం గవర్నమెంటు అధికారుల నివాసాలతో పాటు మాల్స్ పార్కులు వున్నాయి .మేం మా కారులో వెళ్లేం . పార్క్ంగులో కారు పెట్టుకొని , మరోమాట మలేషియలో చాలామటికి ఫ్రీ  అండర్ గ్రౌండ్  పార్కింగులే అవడంతో అక్కడ పార్క్ చేసుకొని మేం పుత్రజయ తిరగసాగేం . చాలా పెద్దపెద్ద మాల్స్ వున్నాయి ఒకటిని మించి మరొకటి .  లేండుమార్క్ ప్లాజా మొక్కలు ఫౌంటెన్ల తో అలంకరించేరు . ఈ మాల్స్ వున్న ప్రాంతమంతా వాక్ వే . వాహనాలను అనుమతించరు . ల్యాండ్ మార్క్ ప్లాజా  చూసేక ఎంట్రీని ప్లాజా , కాస్కేడ్ ప్లాజా , ప్రేగ్రెన్స్ గార్డెన్ చూసుకొని కాళ్లు నొప్పులు పుట్టాయని కూచున్నాం . ఎంత గొప్పగా వున్నా మాల్స్ తిరిగి టైము వేస్ట్ చేసుకొనే బదులు  అక్కడ వున్న మోన్యుమెంట్స్ , బిల్డింగులు చూద్దామని  డిసైడ్ అయేం .

పుత్రజయ కి చేరే రోడ్లు , యిరువైపులా పెంచుతున్న ఉద్యానవనాలు , లైట్లు అన్నీ కళ్లు తిప్పుకోనివ్వవు . ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ చుట్టుపక్కల యిలాగే వుంటుంది కాకపోతే అక్కడ మరింత బావుంటుంది . పుత్రజయ మధ్యలో 650 హెక్టార్లలో మానవనిర్మితమైన సరస్సును నిర్మించేరు . యిది మొత్తం పుత్రజయను చల్లగా వుంచుతుంది . ఇందులో బోటింగ్ , ఫిషింగే కాకుండా వాటర్ స్పోర్ట్స్ మొదలయినవి వున్నాయి , సాయంత్రం యీ సరస్సు వొడ్డున నడక అహ్లాదకరంగా వుంటుంది . సరస్సు చుట్టారా సేదతీరడానికి అనువుగా కూర్చోడానికి బెంచీలు యేర్పాటు చేసేరు . సరస్సు చుట్టూరా ప్రధాని నివాసం , కార్యాలయం మొదలయిన ప్రభుత్వ కార్యాలయాలు  , పక్కగా గులాబీ రంగు పాలరాతినిర్మితమైన మసీదు మంచి శిల్పకళతో పర్యాటకలను ఆకట్టుకుంటూ వుంటుంది . ఈ మసీదు పుత్రజయలో ప్రధానమైన మరియు పెద్దమసీదు . దీని నిర్మాణం 1997 లో మొదలు పెట్టి 1999 లో పూర్తిచేసేరు . ఈ మసీదులో ముఖ్యంగా ముందు హాలు , ప్రార్ధనా హాలు , సాహన్ హాలు అని మూడు హాల్స్ వున్నాయి . ఈ మసీదు ముస్లిం మతంలోని సున్నీ తెగకు చెందినది . ఈ మసీదులో ప్రార్ధనలతో పాటు రకరకాల మత పరమైన శిక్షణా తరగతులు నడపబడుతున్నాయి , వాటికి గాను కావలసిన తరగతిగదులు వున్నాయి . మసీదు ప్రార్ధనా మందిరం లోఒకే సారి 15 వేల మంది  కూర్చొని ప్రార్ధనలు చేసుకోవచ్చు అంటే యెంత పెద్దదో వూహించుకోవచ్చు . ఇస్లామిక్ , మోడ్రెన్ శిల్పకళలను వుపయోగించి కట్టబడింది .

పుత్రజయలో ఆకట్టుకొనే మరో కట్టడం పెర్దానపుత్ర , యిది మలేషియ ప్రధానమంత్రి కార్యాలయం . ఇదికూడా 1997 లో మొదలుపెట్టబడి 1999 లో పూర్తిచెయ్యబడింది . 1999 ఏప్రెల్ లో కౌలాలంపూర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయాన్ని యిక్కడకు మార్చేరు . దీని కట్టడంలో మలయ యిస్లామిక్ మరియు యురోపియన్ ఆర్కిటెక్చర్ ని వుపయోగించేరు . దీని నిర్మాణంలో డిజైనర్ల హస్తం తో పాటు అప్పటి ప్రధానమంత్రి తున్ డాక్టర్ మహథిర్ బిన్ మొహమ్మదు సహాయసహకారాలు కూడా వున్నాయని అంటారు . ఈ భవంతిలో ప్రధానమంత్రి కార్యాలయం తో పాటు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం చిన్న పెద్ద సమావేశపు గదులు , వ్యూ పాయింటు , డెలిగేషన్ రూము , విఐపి రూము , విఐపి బంకెట్ హాలు , నేషనల్ సెక్యూరిటీ డివిజన్ ఆఫీసు , నేషనల్ ఎకనామిక్స్ ఏక్షను కౌన్సిల్  ఆఫీసులు వున్నాయి . చాలా అందమైన భవనం అని చెప్పక తప్పదు .

ఇక యిక్కడ వున్న  పుత్ర సరస్సు దాటడానికి కట్టిన ' జంబతాన్ సెరి వవసాన్ ' అనే 240 మీటర్ల పొడవు సుమారు 37.2 మీటర్ల వెడల్పు వున్న వ్రేలాడే వంతెన మరో చూడదగ్గ ఆకర్షణ .   వంతెనని స్థానిక భాషలో జంబతాన్ అని అంటారు . మామూలుగా వాహనాలు నడవడానికి కట్టిన వంతెన అయినా దీన్ని కట్టడంలో తీసుకున్న శ్రద్ద దీపాలు పెట్టేక చూడాలి .

ఇవి కాక మిలేనియమ్ మమాన్యుమెంటు  , పుత్ర స్క్వేర్ , సెరి గెమిలాంగ్ బ్రిడ్జ్ , సెరి సౌజన్య బ్రిడ్జ్ , సెరి ప్రదాన , నేషనల్ హిస్టరీ మ్యూజియమ్ , నేచురల్ యిన్సిపిరేటరి సెంటరు చూడదగ్గవి . అయితే యివన్నీ నచ్చి చూడాలంటే మనవల్ల అయేపనికాదు , అలాగని దూరం నుంచి చూసి రావడానికి మనస్సు వప్పుకోలేదు . ' క్రూస్ లో వెడితే ఆ భవనాలను దగ్గరగా చూడొచ్చనే ఆలోచన రాగానే క్రూస్ టికెట్లు కౌంటర్లకు చేరుకున్నాం . దీనిని ' క్రూజ్ తసిక్ పుత్రజయ ' అని అంటారు . టికెట్లు తీసుకొని క్రూజ్ లోకి వెళ్లేం , యిందులో ఓ గంట తిరిగి క్రూజ్ ముచ్చట తీర్చుకోవచ్చు అనుకున్న మా ముచ్చట తీరలేదు . ఆ క్రూజ్ లో  మాకు పుత్రజయ గురించి తెలియజేసి , లైఫ్ జాకెట్లు యిచ్చి మేం వేసుకున్న తరువాత చిన్న బోటులో యెక్కించి సరస్సు లో తిప్పేరు . అలా తిరిగేటప్పుడు మేం పైనచెప్పిన భవనాలను , బ్రిడ్జ్ లను దగ్గరగా చూసేం . పుత్ర జయ యాత్ర నిజంగా కనులవిందే .

చీకటి పడ్డతరువాత రంగురంగుల దీపాలకాంతిలో పుత్రజయలోని కట్టడాలను చూడడానికి రెండు కళ్లు చాలలేదు . చీకటి పడిన తరువాత పుత్రజయ అందం మరింత పెరిగింది . ప్రతీ భవనం మీద రంగురంగుల దీపాలకాంతి పడేటట్లు అలంకరించేరు . ఒక్కోభవనం ఒక్కోరంగులో కన్పించి కనువిందు చేసింది . ఎంతచూసినా తనివి తీరని పుత్రజయను వదిలిరాలేకపోయేం . తప్పదుకదా ? కదలలేక కదలలేక మా తిరుగు ప్రయాణం సాగించేం . కొన్ని కిలోమీటర్లు ప్రయాణించేంత వరకు కనిపిస్తున్న పుత్రజయ వెలుగులని వెనక్కి తిరిగి చూస్తూనే వున్నాం .       ఇక్కడ అన్నీ బాగున్నాయిగాని మనం తినగలిగే తిండి మాత్రం దొరకక పొట్టలో యెలుకలు పరుగెత్తసాగేయి . ఆరోజుకి వెజ్ బర్గర్ అని వాళ్లిచ్చిన బర్గర్ మధ్యలో సలాడ్ ఆకులు వేసియిస్తే సలాడ్ ఆకులను తీసి పక్కన పెట్టి బ్రెడ్డ్ పార్ట్ మాత్రం తిన్నామనిపించేం . అదీ చాలా మొత్తం చెల్లించి , యిలాంటి చోట అన్నలక్ష్మి వింటే యెంతబాగుణ్ను అని యెన్నిమార్లు అనుకున్నామో .

ఆ రోజు మన చారు అన్నం యెంత గుర్తొచ్చిందో చెప్పలేను .

పైవారం మరో కొత్త ప్రదేశం గురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
chamatkaaram