Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి... http://www.gotelugu.com/issue258/693/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... దూరంగా ఉన్న సిమ్మెంట్‌ చప్టా క్రింద రాళ్ల గుట్టల మీద ఎర్రగా రక్తపు మరకలు కనిపించే సరికి ఒక్క ఉదుటున అక్కడకు చేరుకున్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఎస్సై అంత ఆతృతగా అటు కేసే వెళ్ళే సరికి ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని అనుసరించారు.

‘‘రాళ్ల గుట్టల మీద రక్తపు మరకలు చూసారా?’’ ఆతృతగా అన్నాడు ఎస్సై.

‘‘ఎస్‌ సార్‌!’’ అంటూ క్లూస్‌ టీమ్‌ నిపుణులు ‘రక్తం’ మరకలను జాగ్రత్తగా బ్లేడ్‌తో ఒలిచి తమ దగ్గరున్న ప్లాస్టిక్‌ కవరులో భద్రపరిచారు.
సిమ్మెంట్‌ చప్టా ప్రక్కనే రొట్టెల కవరు, జామ్‌ కవరు కనిపించే సరికి గబుక్కున వెళ్ళి క్రిందకు వంగి వాటిని జాగ్రత్తగా తీసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘సార్‌! రొట్టెల కవరు, జామ్‌ కవరు ఇక్కడ కూడా ఉన్నాయి సార్‌’’ అంటూ ముసలమ్మ శవం దగ్గర ఆధారాల కోసం వెదుకుతున్న క్లూస్‌ టీమ్‌ మెంబర్‌ ఒకరు గట్టిగా అరిచి ఎస్సై అక్బర్‌ ఖాన్‌కి చెప్పాడు.

‘‘ఎస్‌! వీటిని బట్టి చూస్తే రాత్రి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బస చేసారనిపిస్తోంది. అందులో ఒకరు ఈ హతురాలు ముసలమ్మ. రెండో వ్యక్తి ఎవరు?!’’ ఆలోచిస్తూనే అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘అంతే కాదు. ముసలమ్మ హత్య అక్కడ జరిగింది. ఆ రక్తపు మరకలు ఈ రాళ్ల గుట్టల వరకూ వచ్చి పడ్డాయంటే....చాలా విడ్డూరంగా వుంది సార్‌.’’

‘‘విడ్డూరం ఏముందీ! ఇక్కడ హత్యాయుధం లేదూ అంటే హంతకుడు దాన్ని మాయం చేసినప్పుడు దాని నుండి కారిన రక్తం చుక్కు ఆ రాళ్ల గుట్ట మీద పడి ఉండొచ్చు కదా!’’ కాలర్‌ ఎగరేస్తూ హుషారుగా అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్‌ సార్‌! మీరన్నదే నిజం.’’ అన్నాడు క్లూస్‌ టీమ్‌లో ఒకతను.

‘‘మీరు మీ పని కానివ్వండి. నేను ఈ చుట్టు ప్రక్కల ఎంక్వయిరీ చేసుకు వస్తాను. ఈలోగా మీ పని పూర్తయితే శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించండి.’’ అంటూనే ఒక కానిస్టేబుల్ ని వెంట తీసుకుని కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు వెళ్లాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఎస్సై చేతిలో రొట్లటె కవరు, జామ్‌ కవరు ఉన్నాయి.

‘‘త్రీనాట్‌ వన్‌! కొండ మీద రొట్టెలు, జామ్‌ అమ్మే కిరాణా దుకాణాలు పాన్‌ షాప్‌లు ఎన్నున్నాయో కనుక్కుని రా.’’ బస్సు స్టాండ్‌లో నిలబడి పరిసరాలను గమనిస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘ఎస్‌ సార్‌!’’ అంటూ కానిస్టేబుల్‌ కొండ బస్సు టిక్కెట్లు బుక్కింగ్‌ కౌంటర్‌ కేసి వెళ్లాడు.

సరిగ్గా అప్పటికి ఉదయం ఏడు గంటలు కావస్తోంది. భక్తులతో కొండంతా రద్దీగా వుంది. దర్శనాలు లేక పోవడంతో కొండ పైకి చేరుకున్న భక్తులంతా క్యూ లైన్ ల లోనూ, షాపుల దగ్గర పోగై ఉన్నారు.

ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ఇంతలో కొండ దిగువ నుండి బస్సు వచ్చి ఆగింది. దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కరొక్కరుగా క్యూ పాటిస్తూ బస్సులో నుండి దిగుతున్నారు.

భక్తుల మధ్యలో నిలబడ్డ ఆమె తల నిండుగా ముసుగు వేసుకుని బస్సు దిగుతున్న యాత్రీకుల వెనకే నెమ్మదిగా కదులుతోంది. బస్సులో నుండే కొండ బస్సు స్టాండ్‌ పరిసరాలను గమనిస్తోంది.

రాత్రి జరిగిన సంఘటనలు ఆమె కళ్ల ముందు కదలాడుతూనే వున్నాయి. అన్నెం పున్నెం ఎరుగని ముసలమ్మని చంపడం కళ్లారా చూసింది. రాత్రంతా ఘాట్ రోడ్‌లో నడుచుకుంటూ తొలి పావంచా దగ్గరకు చేరుకుంది. తెల్లవార్లూ అక్కడే మెట్ల పక్కన యాచకులతో పాటు నిద్ర పోయింది.

తెల్లారే సరికి అలజడి. కొండ మీద అన్నదానం భవనం దగ్గర ఎవరో ఎవర్నో చంపేసారని యాచకుల ద్వారానే వింది. అయితే, ఆ వార్త ఆమెకి ఆశ్చర్యం కలిగించ లేదు. తన కళ్ళ ముందే ముసలమ్మని ఎవరో చంపడం చూసింది. కొండ మీద ఏం జరుగుతోందో చూడాలనిపించింది. అంతే! చక చకా బయలుదేరింది.

ఏం జరుగుతోంది?! ముసలమ్మని చంపిందెవరో పోలీసులు కనుక్కో గలిగారా? ఏమో?! ఆలోచిస్తూనే బస్సు స్టాండ్‌కి చేరుకుంది ఆమె.
మెట్ల దారిలో నడవ లేక బస్సులో బయలుదేరింది. పాపం! ఆ ముసలమ్మని చంపిందెవరో? ఎందుకు చంపారో? రాత్రి ముసలమ్మతో పాటు తనూ అక్కడే ఉందని  పోలీసులు గ్రహించేస్తారా. ముసలమ్మ మీద కప్పిన శాలువాని గమనిస్తారు. అవును గమనిస్తే! తన ఉనికి పసి గడితేనో?

అమ్మో! తన అన్వేషణ ఎలా? ఏం చెయ్యాలి? తనింకా ఇక్కడే ఉండడం క్షేమం కాదు. కానీ, తన ఆశ...శ్వాస...! ఏం కావాలి? నిన్నంతా తిరిగింది. మెట్ల దారిలో మొదలై కొండ మీద అన్ని ప్రాంతాలూ తిరిగింది! పిచ్చి దాన్లా అన్వేషించింది.

తన అన్వేషణ ఫలిస్తుందా?! నిద్రాహారాలు మాని కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని వెతుకుతున్న తన ఆశ ఫలిస్తుందా?!

‘‘దిగమ్మా! అలా దిక్కులు చూస్తావేంటి?!’’ వెనుక నిలబడ్డ భక్తురాలు చిరాగ్గా వీపు తట్టి ముందుకు తోసే సరికి ఇహానికి వచ్చింది ఆమె. అప్పటికే బస్సులో ఆ చివర నుండి గేటు దాకా వచ్చేసింది ఆమె.

రాడ్‌ పట్టుకుని నెమ్మదిగా బస్సులో నుండి దిగింది.

ఎదురుగా యూనిఫాంలో వున్న ఎస్సైని చూసి క్షణం తత్తర పాటు చెందింది. మరు క్షణం తేరుకుని ఓ మూలకు వెళ్లి ఎటో చూస్తున్నట్టు నటిస్తూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ని గమనిస్తోంది ఆమె.

ఇంతలో ఓ కానిస్టేబుల్‌ పరుగు పరుగున ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దగ్గరకు వచ్చాడు.

‘‘సార్‌! కొండ మీద రొట్టెలు, జామ్‌ అమ్మే దుకాణం ఒకటే ఉందట. వరహాల శెట్టి గారి కిరాణా దుకాణం.’’ చెప్పాడు పోలీస్‌ కానిస్టేబుల్‌

‘‘గుడ్‌! పద వెళ్దాం!’’ అంటూ ఎస్సై అక్బర్‌ ఖాన్‌ దుకాణాల సముదాయం కేసి నడిచాడు. అతన్ని అనుసరించాడు కానిస్టేబుల్‌.
ఎస్సై, కానిస్టేబుల్‌ ఇద్దరు వెళ్తున్న దిక్కే చూస్తూ నిలడిందే గాని ఆమె మనసు మనసులో లేదు. భక్తులు తండోపతండాలుగా మెట్లెక్కుతూ అడ్డుగా నిలబడ్డ ఆమెని నెట్టుకుంటూ ముందుకు సాగి పోతున్నారు.

తాను రాత్రి బస చేసిన మర్రి చెట్టు దగ్గర ఏం జరుగుతోందో చూడాలనిపించి నెమ్మదిగా అడుగులో అడుగులు వేసుకుంటూ కొండ బస్సు స్టాండ్‌ను అనుకునే ఉన్న అన్నదానం  భవనం గోడ దగ్గరకు చేరుకుంది ఆమె.

అప్పటికే అక్కడ ముసలమ్మ శవాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించడానికి దేవస్థానం స్వీపర్లు ముగ్గురు మోసుకుంటూ అంబులెన్స్‌ దగ్గరకు వెళ్తున్నారు.

దూరంగా నిలబడి అంతా గమనించింది. దిక్కు మొక్కు లేని ఆ ముసలమ్మ చావు చూసి మనసులోనే కుమిలి పోయింది ఆమె. రాత్రి ముసలమ్మ తనని చూస్తూనే ‘అమ్మా తల్లి! నువ్వేనా! తల్లీ’ అంటూ పిలవడం గుర్తొచ్చి ‘అయ్యో! పాపం! ఎవరో? ఈ ముసలమ్మకే మవుతుందో?’ అనుకుంది.‘ఇక్కడ ఇలాగే నిలబడి ఉంటే తన ఉనికి ఎవరైనా కనిపెట్టెయ్యవచ్చు. రాత్రి తనని పాడు  చెయ్యాలని వచ్చిన దుండగులన్నా చూడొచ్చు. కసితో దాడి చెయ్యచ్చు. ముసలమ్మ దగ్గరున్న తన శాలువా చూసి పోలీసు కైనా అనుమానం కలగొచ్చు! అంత ఖరీదైన శాలువా ఈ ముసలమ్మ దగ్గరకెలా వచ్చిందని ఆరా తీస్తే తన గుట్టు రట్టవుతుంది. పోలీసులకు అనుమానం కలిగితే క్షణాల్లో ఊరంతా గాలిస్తారు. ఎక్కడ దాక్కున్నా జల్లెడ పట్టి వెదికి పట్టేసుకుంటారు.

ఏం చెయ్యాలి? తానిక్కడ నుండి సురక్షితంగా బయట పడాలంటే ఏం చెయ్యాలి? చెయ్యని నేరానికి అనుమానితురాలిగా పోలీసుల కంట పడితే ఇంకేమన్నా ఉందా?! తన గమ్యం అగమ్యమై పోదూ?! తన ఆశ అడియాశ కాదూ?!

స్వామి! సింహాద్రి నాథా! నన్ను రక్షించు! నా మనోభీష్టాన్ని నెరవేర్చు! నా అన్వేషణ కొన సాగేలా ఆశీర్వదించు. నా బ్రతుక్కి...నా జీవితానికి ఆశ...శ్వాస అందించు.’

మనసులోనే వేనోళ్ల భగవంతుడ్ని ప్రార్ధించింది ఆమె. ఉన్నట్టుండి తళుక్కున మదిలో ఏదో ఆలోచన మెదిలే సరికి చక చకా మెట్లు ఎక్కి కేశ ఖండన శాల కేసి సాగి పోయింది.

దుకాణాల సముదాయంలో మూడో వరుసలో ఉన్న రెండో దుకాణమే వరహాల శెట్టి కిరాణా షాపు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌, కానిస్టేబుల్‌ ఇద్దరూ కిరాణా దుకాణం దగ్గరకు వెళ్ళారు. పోలీసులు తన దుకాణం దగ్గరకు రావడం గమనిస్తూనే లోపల కేష్‌ కౌంటర్‌ దగ్గర కూర్చున్న వరాహాల శెట్టి గాబరాగా షాపులో నుండి బయటకు వచ్చి చేతులు కట్టుకుని వినయంగా ఎస్సై అక్బర్‌ ఖాన్‌ ముందు నిలబడ్డాడు.

‘‘సార్‌! నాతో ఏమైనా పనుందా సార్‌?!’’ వినయంగా అడిగాడు కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి.

‘‘ఈ కవరు జామ్‌కి సంబంధించిందేగా...ఇది రొట్టెల కవరు, అవునా?’’ చేతిలో జామ్‌ అంటిన కవరు, రొట్టె ముక్క అవశేషాలున్న ప్లాస్టిక్‌ కవరు చూపిస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌. ముక్కు సూటిగా అడిగితే ‘నాకేమీ తెలీదు సార్‌’ అని తప్పించుకుంటారని అలా అడిగాడు.
‘‘ఆ...అవును సార్‌!’’ అయోమయంగా అన్నాడు వరహాల శెట్టి.

‘‘ఇవి నీ దగ్గర దొరుకుతాయా?!’’ వరహాల శెట్టి కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘దొ...దొ...దొరుకుతాయి సార్‌! మీకు కావాలా?’’ అంటూ హుషారుగా షాపు లోకి వెళ్ల బోయాడు వరహాల శెట్టి.

‘‘అక్కర లేదు. ఇవి రాత్రి ఎవరికి అమ్మావో చెప్ప గలవా?!’’ అడిగాడు ఎస్సై.

‘‘అవి....అవి....చాలా మంది....’’ బుర్ర గోక్కుంటూ ఏదో చెప్ప బోయాడు కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి.

‘‘డ్రామాలొద్దు. నిన్ను సాక్ష్యానికి  పిలవటం లేదు. జస్ట్‌! ఆరా కోసం అడుగుతున్నాను.  నిజం చెప్పు. అబద్ధాలొద్దు.’’ వరహాల శెట్టి కళ్ళల్లోకి కోపంగా చూస్తూ చేతిలో లాఠీ చక్రంలా తిప్పుతూ అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

‘‘చెప్తాను సార్‌! చెప్తాను!’’ అంటూ ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఎటో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు వరహాల శెట్టి.

‘చెప్తే ఏమౌతుందో? చెప్పక పోతే ఏం చేస్తారో?! ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి!’ మనసులోనే తర్జన భర్జన పడ్డాడు వరహాల శెట్టి.

‘‘ఏంటాలోచిస్తున్నారు? చెప్పండి?!’’ గొంతు పెంచి అడిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌

......................................

పోలీసుల అపరాధ పరిశోధనను రహస్యంగా గమనిస్తున్న ' ఆమె ' అసలు అన్వేషణ దేనికోసం? వరహాల శెట్టి ఏం చెప్పాడు? అది అక్బర్ ఖాన్ కి ఏ విధంగా ఉపయోగపడింది?

ఈ ప్రశ్నలకు సమాధానాలకోసం.....వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఎదురుచూడాల్సిందే........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్