Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.... http://www.gotelugu.com/issue256/690/telugu-serials/anveshana/anveshana/

 

(గత సంచిక తరువాయి)... ‘‘ఆ గట్టు మీద పడుకో అమ్మా! ఇక్కడ కింద పడుకుంటే విష పురుగులు కరుస్తాయి కదా’’ అంటూనే ముసలమ్మ అన్న మాటలు వినీ విననట్టు రెండు చేతులతో ముసలమ్మని లేవనెత్తి మర్రి చెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టా మీద పడుకో బెట్టింది ఆమె.

‘‘అమ్మా బుజ్జీ. నువ్వేనా తల్లీ! నీతో యాత్రకు ఎవరూ రాలేదా తల్లీ! అమ్మా బుజ్జి! అమ్మా బుజ్జి!!’’ అంటూ కలవనిస్తున్నట్టే మర్రి చెట్టు చప్టా మీద పడుకుంటూ అడిగింది ముసమ్మ. సమాధానం చెప్పడం ఇష్టం లేక మౌనంగా తల వూపింది ఆమె. ముసలమ్మ మతి లేని మాటలు వింటూ మనసు లోనే నవ్వుకుంది.

ముసలమ్మ పడుకోగానే శాలువా ముసుగారా కప్పి అక్కడ నుండి మరో చోట దూరంగా ఉన్న సిమ్మెంటు చప్టా దగ్గరకు వెళ్ళి కూర్చుంది ఆమె. ముసలమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలనిపించ లేదు. వినీ విననట్టు తల వూపి వచ్చేసింది.

ఆ ప్రాంతమంతా  చీకటి చిక్కగా అలుముకుని ఉంది. చెట్టు మీద గబ్బిలాల రెక్కల చప్పుడు ఉండుండీ కర్ణ కఠోరంగా విన్పిస్తోంది.
కొండ బస్సు స్టాండ్‌లో తాటి చెట్టులా నిటారుగా నిలబడ్డ హైమాక్స్‌ లైట్ల కాంతి గుబురుగా పెరిగిన చెట్టు కొమ్మల సందుల్లో నుండి చొచ్చుకు పోతూ ఉండుండీ గాలికి వూగుతున్న ఆకుల రెపరెపకి అటూ ఇటూ వూగుతూ క్రింద పడుతోంది వెలుగు.

గట్టు మీద అలసటగా మేను వాల్చింది. తలక్రింద బ్యాగ్‌ పెట్టుకుంది. మనసంతా ఆందోళనగా ఉంది. గుండెల్లో నుండి దు:ఖం పెల్లుబుకుతోంది. ఆమెకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. చీర చెంగుతో కళ్ళొత్తుకుంది.

పిచ్చిదాన్లా పిచ్చి పిచ్చిగా ఏవేవో ఆలోచనలు మనసంతా కారు మబ్బుల్లా కమ్మేస్తుంటే ఆమె మెదడంతా మొద్దు బారిపోయింది. కళ్ళు వర్షించి వర్షించి రెప్పల మాటున వాలి పోయాయి. మగత కమ్మేసి నిద్ర లోకి జారుకుంది ఆమె.

ఎవరో ఇద్దరు అగంతకులు మీద పడబోతున్నారని గ్రహించి ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఆంబోతుల్లా ఆగంతకులు ఇద్దరూ ఒకడు కాళ్ల దగ్గర, మరొకడు తల దగ్గర నిలబడి ఆమె మీద ఒరిగి ఒడిసి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

వాళ్లిద్దర్నీ అలా చూసే సరికి గబుక్కున లేచి కూర్చుంది. ఒకడ్ని కాళ్లతో తన్నేస్తూ, మరొకడ్ని చేతుల్తో నెట్టేసి ఆడపులిలా లేచి నిబడిరది. చెదిరిన చీర సరి చేసుకుని పయిట చెంగు నడుం చుట్టూ త్రిప్పి బొడ్లో దోపుకుంది ఆమె. ఇద్దరు ఆగంతకులు చెరో వైపు నిలబడి ‘ఆమె’ మీద లంఘించడానికి సిద్ధమయ్యారు.

ఆ ప్రాంతమంతా చీకటి గుబురుగా అలుముకుని ఉంది. అంత చీకట్లోనూ వాళ్ళ ఆకారాలని నిశితంగా పరీక్షిస్తూనే మీద పడ్డానికి సిద్ధంగా ఉన్న ఇద్దర్నీ ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ నిలబడింది ఆమె.

ఉన్నట్టుండి ఒకడు ఆమె మీదకు దూకి ఒడుపుగా నడుముకు చుట్టుకున్న పైట చెంగు అంది పుచ్చుకున్నాడు.  బలంగా లాగుతూ ఆమెని వివస్త్రని చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. జారి పోతున్న చీర చెంగు గట్టిగా పట్టుకుని వాడితో పెనుగులాడుతోంది ఆమె. ఇంతలో రెండో వాడు కూడా మొదటి వాడికి సహకరిస్తూ పైట చెంగు పట్టుకుని ఇద్దరూ బలంగా గుంజారు.

రాక్షసుల్లా ఇద్దరూ ఒక్కటై చీర చెంగు పట్టుకుని గుంజుతుంటే ఆమెలో సత్తువ సన్నగిల్లి పోతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఒక కాలు వెనక్కి వేసి మరో కాలు ముందున్న చిన్న బండకి ఆన్చి చీర జారి పోకుండా పైటని తన వైపుకు లాక్కుంటోంది.

ఆగంతకులిద్దరూ ఆమెని ఎలాగైనా వివస్త్రని చేసి తమ వశం చేసుకోవాని కామోద్రేకంతో వూగి పోతూ పైట లాగుతున్నారు. ఎవరెనన్నా సహాయం కోసం గొంతెత్తి అరవాలనుకుంది. కానీ, అంత అర్ధ రాత్రి ఎంత అరచినా తన రోదన అరణ్య రోదనే అవుతుందనుకుంది. ఎవరి సహాయమో అర్ధించే నిస్సహాయురాలు కాదు. ధైర్యాన్ని కోల్పోయే అబల కూడా కాదు.

ఇక ఉపేక్షించకూడదనుకుంది ఆమె. ఒక చేత్తో పైట చెంగు పట్టుకుని రెండో చేత్తో రహస్యంగా బొడ్లో దోపుకున్న చుర కత్తి తీసి సర్రున చీర చెంగును కోసేసింది.

చీకట్లో ఆమె ఏం చేస్తోందో గ్రహించేలోపే ఇద్దరూ సగం చిరిగిన చీర చెంగుని బలంగా లాగుతూ చిరిగిన సగం చీరని పూర్తిగా చించేస్తూ వెనక్కి తూలి క్రింద పడ్డారు. ఎగుడూ-దిగుడూగా ఉన్న ప్రాంతం అంతా  రాళ్ళు పైకి  తేలి పోయి ఉన్నాయి.

క్రింద సూదుల్లా ఉన్న రాళ్ల మీద పడ్డం తోనే ఇద్దరూ ‘అమ్మా’ అని బాధతో మూలుగుతూ ఒకరి మీద ఒకరు పడ్డారు. రాళ్ల మధ్య నుండి లేవబోతున్న ఇద్దరు ఆగంతకుల మీదకు చిరుత పులిలా దూకింది ఆమె. చేతిలో ఉన్న చుర కత్తితో ఇద్దర్నీ ఎడా పెడా కొడుతున్నట్టే చుర కత్తితో వారి శరీరాలని అందిన దగ్గరల్లా గాయ పరిచింది. చుర కత్తి మొన సర్రున దిగుతుంటే ఇద్దరూ అమ్మో....నాయనో.... అని గగ్గోలు పెడుతూ రాళ్ల గుట్ట మీద నుండి పడుతూ లేస్తూ పరుగందుకున్నారు. అయినా, వాళ్ళని వదలకుండా కొంత దూరం వెంబడించి మరీ చుర కత్తితో అందిన దగ్గరల్లా వాళ్ళ శరీరాలని చీరేసింది ఆమె. చేతుల మీద, కాళ్ల మీద, గుండెల మీద చురకత్తి మొన చేసిన గాయాకి బెంబేలెత్తి పోతూ ‘అమ్మో ఇది ఆడది కాదురా నాయనోయ్‌’ అంటే ముందు పరిగెడుతున్న వాడ్ని ‘ఆగరా ఒరేయ్‌ ఆగరా! ఈ దెయ్యానికి నన్నొదిలేసి పారి పోకురా’’ అంటూ రెండో వాడు కూడా అరుస్తూ పరిగెడుతున్నాడు.

అన్నదానం భవన క్రింద నుండి మనుషుల అలికిడి, అరుపు విన్పించే సరికి రాత్రి గస్తీ తిరగాల్సిన గూర్ఖా ఆద మరిచి పడుకున్న వాడల్లా ఉలిక్కి పడి లేచాడు.

ఆగంతకులు ఇద్దరి అరుపులూ విని టార్చి లైటు పట్టుకుని ‘ఎవర్రా అక్కడ? ఏం చేస్తున్నారు?’ అంటూ ఎవరో పరిగెడుతున్నారన్న అలికిడి శబ్దం విన వచ్చిన వైపు టార్చి లైటు ఫోకస్‌ చేస్తూ గట్టిగా అరిచాడు గూర్ఖా.

గుర్ఖాకి దొరికితే తమ పరువు పోతుందని ఆ ఆగంతకులిద్దరూ మెరుపు వేగంతో కొండ దిగువకు రెండేసి మెట్లు దాటి గెంతుకుంటూ దిగి పారి పోయారు.

చుర కత్తి చేత్తో పట్టుకుని చిరిగిన పైట భుజం మీద కప్పుకుంటూ  పారిపోతున్న ఆగంతకుల కేసి చూసింది ఆమె.మెట్ల దారిలో వెలుగుతున్న వీధి లైట్ల క్రింద నుండి పారి పోతున్న ఆ ఆగంతకులు ఆయాసంతో ఒగరుస్తూ క్షణం నిలబడి అన్నదానం భవనం క్రింద వున్న చెట్టు కేసి చూసారు.

గుబురుగా పెరిగిన చెట్టు క్రింద క్రీనీడలో దెయ్యంలా తమ కేసే చూస్తున్న ఆమెని చూసి భయంతో ఇద్దరూ ఒకర్నొకరు ఎగాదిగా చూసుకున్నారు.

‘‘ఒరేయ్‌! నీ ఒళ్లంతా గాయాలేరా! రక్తం చిమ్ముతోంది!’’ అన్నాడు ఒకడు.

‘‘నాకేనా! నీ చేతులు, ఒళ్ళు చూసుకోరా’’ అన్నాడు రెండో వాడు.

‘‘ఇంకొంచెం సేపు ఉంటే మనల్ని చంపేసి ఉండేదిరా!’’ అన్నాడు మొదటి వాడు.

‘‘గాయాల మాటకేం! పదరా! ఆ గూర్ఖాకి దొరికితే మన పరువు బజారున పడుతుంది.’’ అంటూ రెండో వాడు ఆకాశ ధార కేసి పరిగెట్టి మెట్లు దిగుతూ ముందుకు సాగాడు. అతన్ని అనుసరించాడు మొదటి వాడు. ఆగంతకులు ఇద్దరూ మెట్ల దారిలో పరిగెడుతూ వీధి లైటు క్రింద నిలబడి తన కేసి చూడ్డం గమనించింది ఆమె.

ఆ వెలుగులో ఇద్దర్నీ గుర్తు పట్టి ఉలిక్కి పడి. రాత్రి కిరాణా దుకాణం దగ్గర రొట్టె కొన్నప్పుడు రెండు వేల రూపాయ నోటుకు చ్లిర ఇచ్చిన వాడు, వాడి స్నేహితుడు.

చుర కత్తి మొనకి అంటిన రక్తం  మరకలని తుడిచేస్తూ జాగ్రత్తగా మళ్లీ బొడ్లో దోపుకుంది. చీర సర్దుకుని చెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టా దగ్గరకు వెళ్లి బ్యాగ్‌లో ఉన్న మరో కాటన్‌ చీర తీసి కట్టుకుంది. చిరిగిన చీర ఉండలా చుట్టి కొద్ది దూరంలో పడుకున్న ముసలమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె తల దగ్గర పెట్టింది.

‘‘పాపం! ఎక్కడ పుట్టిందో? ఎలా పెరిగిందో? దిక్కూ మొక్కూ లేకుండా ఇక్కడ పడి ఉంది! ఈ చిరిగిన ‘చీర’ ముసలమ్మకి అవసరమౌతుందిలే’’ అనుకుంటూ వెనక్కి వచ్చేసింది ఆమె. బ్యాగ్‌ తల క్రింద పెట్టుకుని కళ్ళు మూసుకుందే గాని ఆమెకి నిద్ర పట్టడం లేదు. జరిగిన సంఘటనే కళ్ళ ముందు కదలాడుతోంది. యమ కింకరుల్లా ఆ దుండగులిద్దరూ తన మాన ప్రాణాలని బలి గొనేవారే కదా! అప్రమత్తంగా ఉండబట్టే వాళ్ళ కబంధ హస్తాల నుండి బయట పడగలిగింది!’ ఆలోచిస్తూ కళ్ళ మూసుకుంది ఆమె. చెట్టు మీద పక్షుల కిలకిలలు... పారుతున్న జల ధారల గలగలలు నిశబ్డాన్ని ఛేదిస్తూ కమ్మనైన సంగీతంలా వినిపిస్తుంటే నిద్ర మత్తు లోకి జారుకుంది. ఇంతలో ఎవో గుస గుసలు అస్సష్టంగా చెవిన సోకే సరికి భయంతో వులిక్కి పడి లేచిందామె.

అన్న దానం భవనం ప్రక్క నుండి ఎవరో ఇద్దరు వ్యక్తులు మెట్లు దిగుతూ తమ వైపే రావడం గమనించింది ఆమె.ఛటుక్కున సిమ్మెంటు దిమ్మ మీద నుండి లేచి బ్యాగు భుజాన తగిలించుకుని చెట్టు చాటుకు వెళ్లి దాక్కుంది.

ఒకడు అడుగులో అడుగు వేసుకుంటూ ముసలమ్మ పడుకున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. అతని వెనుకే మరొకడు వచ్చి చేరుకున్నాడు.
ఇద్దరూ ఆజాను బాహుల్లా ఎత్తుగా దృఢ కాయుల్లా ఉన్నారు. చెట్టు చాటున నక్కి కళ్ళు చిట్లించుకుని చూసింది ఆమె. కొంప దీసి రాత్రి తనపై దాడి చేసిన దుండగులు కాదు కదా! కసితో వస్తున్నారా చీకట్లో మసగ్గా నీడల్లా కనిపిస్తున్నారు. చెట్టు ఆకుల సందుల్లోనుండి పడుతున్న హైమాక్స్‌ లైటు వెలుగులో వారిని గమనించింది ఆమె. ‘గంట క్రితం తన మీద దాడి చేసిన వాళ్ళు కాదు. వాళ్లిద్దరూ పొట్టి వాళ్ళు. బక్కపల్చగా ఉన్నారు. కానీ, వీళ్ళు మాత్రం అలా లేరు ’

‘ఎవరై ఉంటారబ్బా! దొంగలా?! వాళ్ల లాగే వీళ్ళూ పోకిరీ వెధవలా?’ ఆలోచిస్తూనే వాళ్లిద్దరినీ గమనిస్తూ చెట్టు చాటున నక్కి కూర్చుంది ఆమె.
‘‘ఇదిగోరా! ఇదే! ఇక్కడే ఉంది!’’ ఇద్దర్లో ఒకడన్నాడు.

‘‘అవునా?!....మరెందుకు ఆలస్యం?’’ బొడ్లో నుండి పొడవాటి కత్తి తీస్తూ అన్నాడు రెండోవాడు. చెట్టు చాటున నక్కి నక్కి చూస్తున్న ఆమె వారిద్దరి సంభాషణ వింటూనే అదిరి పడింది. మరింతగా చెవులు రిక్కించి వారి సంభాషణ మీద మనసు కేంద్రీకరించింది.
‘‘శాలువా కప్పుకుని ఎంత దర్పంగా పడుకుందో! చూడు....ఇంకెందుకు ఆలస్యం....నిద్ర లోనే యమ లోకం పంపించేద్దాం. నువ్వు సిద్ధంగా ఉండు. అరచి అల్లరి చెయ్యకుండా చూస్కో.’’ అంటూనే రెండో వాడు కత్తి నిలువునా పైకి ఎత్తి ముసుగు తన్ని పడుకున్న ముసలవ్వ గుండెల్లో  కసుక్కున దించాడు.

( ఈ సస్పెన్స్ వచ్చే శుక్రవారం దాకా....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్