Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Anubandhaalu twenty first Part

ఈ సంచికలో >> సీరియల్స్

నడిచే నక్షత్రం పదిహేనవ భాగం

nadiche nakshatram telugu serial fifteenth part

సెల్ ఫోన్ రింగైంది. స్క్రీన్ పై మాతంగరావు అన్న అక్షరాలు కనిపించాయి. చాల్రోజుల తర్వాత కాల్ చేసాడు. విషయం ఏమై ఉంటుంది? ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది గాయత్రి.

"హలో... నేను. మాతంగరావుని. గుర్తున్నానా?" అడిగాడతడు.

"ఈ ఇండస్ట్రీకి నేనెక్కివచ్చిన మెట్లని నేనెలా మరిచిపోతాను?"

"అంటే..."

"మీరు గుర్తున్నారని అర్ధం. ఏంటిలా కాల్ చేసారు?" అడిగింది గాయత్రీపాటిల్.

"నువ్వు కాల్ షీట్స్ ఇస్తే నీతో మళ్లీ ఓ సినిమా తీద్దామనీ..."

"ఫంక్షన్ లో పదిమంది ముందూ మీరే నన్ను కాదనుకున్నారు కదా!"

"బుద్ధి గడ్డితిని... అలా జరిగిపోయింది.. కొత్త హీరోయిన్ అనూషతో తీసిన సినిమా టూడేస్ కూడా ఆడలేదు. ఆతర్వాతి డబ్బింగ్ సినిమా కూడా సక్సెస్ కాలేదు. వరుస ఫ్లాప్ ల్తో సతమతమవుతున్నా..."

"అయితే..."

"ఇవాళ ఇండస్ట్రీలోని క్రేజీ హీరోయిన్స్ టాప్ ఫైవ్ లో నువ్వూ ఉన్నావు. మీ అయిదుగురిమధ్యే తెలుగు సినిమా ప్రదక్షిణాలు చేస్తోంది. మిగిలిన నలుగురి దగ్గరా నాకు అంత చనువు లేదు... నువ్వంటే..."

"మీ ఇన్నోవేషన్. ఇండస్ట్రీకి దారిచూపించినవాళ్లు మీరు. అదేగా మీ భావన."

"కేవలం ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుందా? ప్రతిభ ఉంటేనే ఎవరైనా రాణించేది. అనూషని ఇంట్రడ్యూస్ చేసాను. కానీ... ఫలితం లేదే. మోహంలో ఏ భావమూ పలకదు..."

"మనమధ్య లేని అనూష గురించి మనకెందుకు? అయినా, ఆ అమ్మాయితో నాకసలు పరిచయం లేదు" అతడి మాటల్ని మధ్యలోనే ఖండించింది గాయత్రి.

"నీకు కథ చెప్పి కాల్ షీట్స్ ఖరారు చేసుకోవాలనుంది. ఇందులో హీరో ప్రదీప్"

"ఇవాళ సాయంత్రమే రండి... మాట్లాడుకుందాం"

నిజానికి ఆమె ముందు 'నో' చెప్పాలనుకుంది. కానీ, ప్రదీప్ పేరు వినగానే మాతంగరావుకి 'ఓకే' చెప్పింది గాయత్రి.

ఆ సాయంత్రమే మాతంగరావు కొత్త సినిమాకి కావాల్సిన కాల్ షీట్స్ కేటాయించింది గాయత్రి. అయితే, అంతకుముందు ఓ షరతు విధించింది. ఆ షరతు ప్రకారం... మాతంగరావు లేటెస్ట్ ప్రాజెక్ట్ నుంచి హీరో ప్రదీప్ 'అవుట్'.

 గాయత్రి సెమిన్యూడ్ గా వేసిన మూవీ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఆ కేరక్టర్ గాయత్రి వేయడాన్ని క్రిటిక్స్ కూడా ప్రశంసించారు. అంతవరకూ కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఇమిడిపోయిన గాయత్రి... ఇకనుంచి ఫర్ ఫార్మెన్స్ కూడా చూపిస్తోందనడానికి ఈ కేరక్టరే రుజువని జర్నలిస్ట్ లు రివ్యూలు రాసారు.

"మీ ఇంటర్వ్యూ కావాలి మేడమ్" అడిగాడు ఫిల్మ్ జర్నలిస్ట్ సుదర్శన్.

"రేపు గోల్కొండ ఫోర్ట్ లో సాంగ్ పిక్చరైజేషన్. అక్కడికి రండి. ఇంటర్వ్యూ ఇస్తా" చెప్పింది గాయత్రి.

మర్నాడు ఇంటర్వ్యూ చేస్తూ మధ్యలో అడిగాడు సుదర్శన్ - "మీరు ఇన్ని సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో నటించారు కదా! రియల్ లైఫ్ లో ఎవర్నీ లవ్ చేయలేదా?"

చురుకున్న చూసిందతనివేపు. కాస్త కంగారుపడ్డాడు సుదర్శన్. ఆమె ఇదివరకటి గాయత్రి కాదు. సినిమా సినిమాకీ క్రేజ్ తో పాటు, 'కోటితార' గా రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్.

"నా ప్రేమ సంగతి మీకు తెలీదా?"

"తెలీదు..." అన్నాడు సుదర్శన్. మనసులో మాత్రం - "నిన్ను మూగగా ఆరాధిస్తున్న శతకోటి అభిమానుల్లో నేనూ ఒకడినే" అనుకున్నాడు.

"అయితే తెలీకుండానే ఆ న్యూస్ రాసారా?"

"ఏ న్యూస్...?"

"అదే... హీరో ప్రదీప్ కీ నాకు మధ్య సమ్ థింగ్... సమ్ థింగ్ అని రాసారు కదా! అది వర్కవుట్ కాకపోవడంతో కోపంతో నేనే మాతంగరావు సినిమా నుంచి అతడ్ని తప్పించానని కూడా రాసారు"

"ఔను..."

"అంతేనా...? ఆ ఆర్టికల్ కి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న ప్రదీప్ తో నేనున్న ఫోటోల్ని కూడా పబ్లిష్ చేసారు. అంటే... నమీ ఉద్దేశం నేను ప్రదీప్ తో అతి సన్నిహితంగా ఉన్నాననే కదా! నేను కోరుకుని ఆయన కాదంటే... కోపంతో ఉడికిపోయి నేను హీరోయిన్ గా నటిస్తున్న సినిమా నుంచి తప్పించాననే కదా ఆ ఆర్టికల్ సారాంశం"

"అదీ... హీరో ప్రదీప్ చెప్తే..."

"అలా రాసానంటారు. ఆ సంగతి నాకు తెలిసే ఇంటర్వ్యూ అడగ్గానే మిమ్మల్ని పిలిచింది. ఔను... మేమిద్దరం ప్రేమించుకున్నాం. కాదు... కాదు. ప్రదీప్ మాటల్లో చెప్పాలంటే మేమిద్దరం 'డేటింగ్' చేసుకున్నాం. ఆ 'డేటింగ్' లో ఆయన నన్ను కోరరానిది కోరాడు. నేను కాదన్నాను. సిన్మాల్లోకొచ్చిన అమ్మాయిలకు ఆ అనుభవం పెళ్లికి ముందే ఖచ్చితంగా ఉంటుందన్నాడు. కోపం వచ్చింది. అయినా, నేను విడిపోలేదు. అతడే నన్ను కాదనుకున్నాడు. అలా కాదనుకున్నవాడు హీరోగా  ఉన్న సినిమాలో నేను హీరోయిన్ గా ఎలా చేస్తాను? ఇదీ నువ్వు ఆర్టికల్ లో సవరించాల్సిన పచ్చి నిజం. నీకు దమ్ముంటే... నేను చెప్పిన ఈ విషయాన్ని పబ్లిష్చెయ్యి ..." హకుం జారీచేసింది గాయత్రి.

"చివరగా ఒక్క విషయం. నువ్వన్నట్లు ఎన్నో ప్రేమ సిన్మాల్లో నటించాను. ఎంతోమంది  హీరోల్తో రైటర్స్ రాసిన ప్రేమ డైలాగులు చెప్పాను. మంచి మంచి లోకేషన్స్ లో డ్యూయెట్స్ పాడాను. అంతేకాదు... నాతో నటించిన ప్రతి హీరో నన్ను కావాలనుకున్నాడు. కొంతమంది 'డేటింగ్' పేరుతో చీటింగ్ చేస్తే ఇంకొంతమంది 'లవ్' పేరుతో నన్ను కోరుకున్నారు. కొంతమంది ఒక్కరాత్రి సుఖం ఇమ్మంటే... ఇంకొంతమంది పర్మనెంట్ గా 'లివ్ ఇన్' రిలేషన్ షిప్ కంటిన్యూ చేద్దామన్నారు. ఇలా ఎంతోమంది నిజస్వరూపాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఇప్పటికీ ప్రేమకోసం అన్వేషిస్తున్నా"

"ప్రేమ కోసం అన్వేషణా? అంటే... నిజమైన ప్రేమ మీ చుట్టూ లేదనేగా"

"నిజమైన ప్రేమ ఉంది. కానీ, అదెక్కడ... ఎవరిదగ్గర ఉందో తెలీడం లేదు. అందుకోసమే నా అన్వేషణ"

"ఒకసారి ప్రేమలో మోసపోయి... మళ్ళీ అదే ప్రేమలో పడాలనుకుంటున్నారా?" అడిగాడు సుదర్శన్.

"ఔను... ప్రేమ ఎంతో మధురం. క్షణిక సుఖాల కోసం మనుషులు ప్రేమని మోసగించొచ్చు. కానీ, ప్రేమ ఎపుడూ మనుషుల్ని మోసగించదు..." చెప్పింది గాయత్రి.

అలా చెప్తున్నప్పుడు భావుకతతో లవ్ ప్రపోజ్ చేసిన సాగర్ ఆమె కళ్లలో మెదిలాడు.

అతడి పేరు కిషోర్. డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ కావాలనుకుంటున్నాడు. నాల్రోజుల నుంచి గాయత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేసి  సఫలీకృతుడయ్యాడు.

"మీ ఆరాధ్య నటి సావిత్రే కదా?" అడిగాడతను.

"ఇండస్ట్రీలోకొచ్చిన తొలినాళ్లలో తెలిసీ తెలీక ఆ మహానటి పేరు చెప్పాను. ఇపుడు బాధపడ్తున్నాను" సిన్సియర్ గా అంది గాయత్రి. "అప్పట్లో ఆమె గురించి నాకేమీ తెలీదు. ఓ పిఆర్ఓ మాటలు పట్టుకుని ఏదో తెలిసినదానిలా బిల్డప్ ఇవ్వాలని చూసాను. బెడిసికొట్టింది. అయితే, జరిగినదానికి అపుడు సిగ్గుపడలేదు. తలచుకుంటే ఇపుడు సిగ్గుతో తలెత్తలేకపోతున్నాను" ఎన్నాళ్ళగానో మనసులో గూడుకట్టుకున్న బాధని అతడితో పంచుకుందామె.

"ముఫ్ఫయిఅయిదేళ్ళ వయసులో బొద్దుగా ఉన్న ఆమె చేతుల్లో పుస్తకాలు పట్టుకుని కాలేజీకెళ్తుంటే ఈ జనాలు ఎలా చూసారా? అని అప్పట్లో ఆశ్చర్యపోయాను. మా పక్కింటి ఆంటీలా ఉందే...? అని కామెంట్ కూడా చేసాను. కానీ... ఆమె నిజంగా మహానటి. కెరీర్ ని సీరియస్ గా తీసుకున్న తర్వాత ఆమె చిత్రాలే నాకు సిలబస్ అయ్యాయి. ఏ ఒక్క చిత్రాన్ని విడవకుండా చూసాను. 'బతుకుతెరువు', 'దేవదాసు', 'అర్ధాంగి', 'మిస్సమ్మ', 'దొంగరాముడు', 'కన్యాశుల్కం', 'మాయాబజార్', 'మాంగల్యబలం', 'నమ్మినబంటు', 'ఆరాధన', 'డాక్టర్ చక్రవర్తి', 'మూగమనసులు', 'మంచిమనసులు'... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే. అప్పట్లో ఆమె చాలా గొప్ప సినిమాలు చేసారు. ఎవరో అన్నట్లు ఆమెది నిండైన విగ్రహం... నటనలో నిగ్రహం. ఆ ఠీవీ, ఆ దర్పం, ఆ నడక, ఆ వయ్యారం, పెదాల చివర్నుంచి జాలువారే ఆ మెత్తని చిర్నవ్వు... కళ్ళతో అభినయం... మాకెవరికీ రావు" అందామె.

"సావిత్రి రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఆధారంగా చేసుకుని ఓ సినిమా చేయాలని సంకల్పించాం. అందులో మీరే నాయిక" బాంబు పేల్చాడు కిషోర్.

"అంటే... సావిత్రి జీవితం ఆధారంగా సినిమా చేస్తున్నారా... అందులో నేను నాయికా? ఆమె ఆశ్చర్యపోయింది.

"ఎందుకు చేయకూడదు. అలనాటి సినీప్రముఖుల జీవితాలు ఎన్ని తెరకెక్కడం లేదు? సిల్క్ స్మిత జీవితాన్ని కూడా సినిమా తీసారు. అందులో నటించిన విద్యాబాలన్ కి జాతీయ పురస్కారం కూడా లభించింది" చెప్పాడతను.

"అయినా... అది 'డర్టీ పిక్చరే' అంటున్నారు కదా?"

"సినిమా మీద విమర్శల గురించి మాట్లాడటం లేదు. సినీప్రముఖుల జీవితాలను తెరకెక్కిస్తున్న వైనం గురించి చెప్తున్నా. తెలుగుతెరకు దొరికిన అపురూపవరం మహానటి సావిత్రి. మనల్ని వదిలి మూడు దశాబ్దాలు దాటిన ఆమె మన మనస్సులపై మరిచిపోలేని ప్రగాడముద్రే వేసింది. అలాటి నటిపై ఈతరం వాళ్లకి మరింతగా తెలిసేందుకు సినిమా
చేయాలనుకుంటున్నాం"

"బాగుంది... అయితే, ఆమె నటించే కాలంలో కెమెరాలు కేవలం నటీమణుల నయనాలపైనే ఉండేవి. ఇపుడో... నడుంఒంపుల పైనే ఉంటున్నాయి. నేను ఈ కాలం హీరోయిన్ ని. ఆ మహానటి కేరక్టర్లో ఇమడగలనా?"

"నయనతార 'సీత' పాత్రలో ఇమిడిపోలేదా? అలాగే, మీరూనూ. ఆమె కెరీర్ లో 'శ్రీరామరాజ్యం' బెస్ట్... అభినేత్రి సావిత్రి సినిమా బెస్ట్ కావాలనుకుంటున్నా"

"ఇంకో హీరోయిన్ ని సెలక్ట్ చేస్తే బాగుంటుందేమో?" ఒప్పుకునే సాహసం చేయలేకపోయింది గాయత్రి.

"మీరైతేనే ఆ కేరక్టర్ కి సరిపోతారు. ప్లీజ్... ఒప్పుకోండి" అభ్యర్ధించాడు కిషోర్.

కాదనలేకపోయింది గాయత్రి.

ఉపసంహారం:

"షాట్ రెడీ" అరిచాడు కిషోర్.

"నన్ను వదిలి నువ్వు పోలేవులే... ఇది నిజములే" పాట వినిపిస్తోంది.

కెమెరా ఫోకసంతా  సావిత్రి గెటప్ లో ఉన్న గాయత్రి ముఖంపైనే ఉంది. ఆమె నయనాలనే టార్గెట్ చేసింది. ఓ మహానటి జీవితం దృశ్యకావ్యమై చిరయశస్సు పొందేందుకు... ఇపుడు వెండితెరపై వెలుగునీడల కవిత్వం పురుడుపోసుకుంటోంది.

----    సమాప్తం    ----

మరిన్ని సీరియల్స్
kalam, vegam , dooram story by diddigallu narayanarao