Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram telugu serial fifteenth part

ఈ సంచికలో >> సీరియల్స్

కాలం x వేగం = దూరం -- దొడ్డిగల్లు నారాయణరావు

kalam, vegam , dooram story by diddigallu narayanarao

ఇల్లు కట్టుకొనే వాళ్ళను బెర్నార్డ్ షా అంతమాట ఎందుకన్నాడో నాకు అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. రిజిస్ట్రేషన్ ఆఫీసర్లూ ప్లానింగ్ ఇంజనీర్లూ మున్సిపల్ అధికార్లూ బ్యాంకు ఆఫీసర్లూ వీళ్ళందరినీ దాటుకుంటూ... వాళ్ళడిగే సవాశేరు కాగితాల్ని సమర్పించుకోవడం ఒక ఎత్తైతే...

ఇల్లు కట్టేటన్ని రోజులూ మేస్త్రీలనీ, లేబర్ నీ, ఎలక్ట్రీషియన్లనీ కార్పెంటర్ లనీ మేనేజ్ చేయడం అంతకు నాలుగింతలు!

మొత్తానికి వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ పని పూర్తి చేసుకోవడం మెదడుని మల్టిపుల్ డైమన్షన్ మిక్సీలో పెట్టడమే. అయితే ఇల్లు కట్టడం వలన లాభం లేదా అంటే - ఉంది. అద్దె ఇళ్ళవెంట తిరిగే బెడద ఉండదు... ఆల్రెడీ ఇల్లు కట్టిన కొలీగ్స్ కంటే వెనుకబడిపోయామన్న దిగులుండదు... బంధువర్గంలో మన రేటింగ్ రాత్రికి రాత్రే పెరిగిపోతుంది. అన్నిటికీ మించి పెళ్ళాం మనల్ని ఓ మనిషిగా చూడ్డం మొదలు పెడుతుంది.

ఈ లాభనష్టాలన్నీ బేరీజు వేసుకొని పైన చెప్పిన వాళ్ళందరూ నా బుర్రతో ఫుట్ బాల్ ఆడుకోవడానికి నేను స్వయంగా సిద్ధపడి రెండు నెలలయింది.

ఇదిగో ఈరోజు ఉదయం నేను లేచీ లేవడంతోనే గోడలు నీటితో తుడిపించడానికి బయలుదేరబోతుంటే ప్రకాశంగారి నుండి ఫోన్! ఆయన శివగాడి బావమరిది. శివ నా కొలీగ్.

"సర్, నమస్తే... నేను..."

శివ నాకు క్లోజ్ కానీ అతని బావమరిదితో పరిచయం అంతంతమాత్రమే అటువంటిది... అతను నాకు ఫోన్ చేయడం...

"నమస్తే, చెప్పండి..."

"మా బావ జాబ్ కి రిజైన్ చేశాడట, ఏంటండీ..." ఆందోళనగా అడిగాడు.

"జాబ్ కి రిజైన్ చేశాడా?!" నాకు షాక్ కొట్టినట్లయింది.

అదేంటీ, మీకు తెలియదా?" నమ్మలేనట్లుగా అడిగాడు.

"నేను రెండు నెలల నుంచి సెలవులో ఉన్నాను. మేం కలిసి చాలా రోజులైంది... రాజీనామా ఏంటి?"

"అదే అర్ధం కావడం లేదండి. నిన్న అమ్మాయినీ పిల్లల్నీ తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళిపోయాడట. రాత్రి నేను ఆఫీసు నుంచి లేటుగా వచ్చాను. ఆ వెర్రిబాగుల్ది ఇప్పుడే చెప్పింది" బాధగా అన్నాడు.

శివ రాజీనామా ఎందుకు చేశాడో నాకూ అర్ధంకావడంలేదు.

"ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా?" ఆలోచిస్తూనే అడిగాను.

"ఏం లేవు శివని అడుగుదామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నాకేం పాలుపోక మీకు చేస్తున్నాను."

"సరే, నేను ఆఫీసుకి ఫోన్ చేసి కనుక్కుంటాను, మీరు పెట్టేయండి."

శివకు చేస్తే, స్విచ్ ఆఫ్. మా యూనియన్ లీడర్ కి చేశాను. రాజీనామా నిజమేనట. రెండు రోజులైందట. ఎవరు చెప్పినా వినలేదట. దగ్గరుండి మరీ ఏక్సెప్ట్ చేయించుకున్నాడట.

నాకు నిజంగా షాకింగ్ గా ఉంది.

పదేళ్ళ సర్వీసు కూడా పూర్తికాలేదు... రిజైన్ చేయడమేంటి? వేరే జాబ్ వచ్చేవయసూ కాదు. వాడికి మొన్నే నలభై దాటాయి. పోనీ ఆఫీసులో ఎవరితోనైనా గొడవపడ్డాడా అంటే... వాడు పట్టించుకొనే రకం కాదు.

మరి ఎందుకీ రిజిగ్నేషన్?!

వాడికి ఆఫీసులో ఏకైక ఫ్రెండుని నేనే. అటువంటిది నాక్కూడా చెప్పకుండా...

వెనకాల ఆస్తులున్న కుటుంబమూ కాదు. కేవలం జీతం రాళ్ళమీద ఆధారపడ్డ జీవితం.

జనాలు గవర్నమెంట్ జాబ్ జోసం కొట్టుకు చస్తుంటే, పెళ్ళాం, ఇద్దరు పిల్లలుండి ఈ వయసులో రాజీనామా చేయడం ఎంత పిచ్చిపని? ఆలోచించేకొద్దీ బుర్ర వేడెక్కిపోతోంది.

అసలు ఈ విషయం అనే కాదు, వాడి పనులే విచిత్రంగా ఉంటాయ్. దేన్నీ సీరియస్ గా తీసుకోడు కానీ అంతా గమనిస్తున్నట్లే ఉంటాడు నలుగురు కలిసి సరదాగా మాట్లాడుకుంటుంటే చిరాగ్గా లేచిపోతాడు. ఒక్కోసారి తనకు సంబంధంలేని విషయం అయినాసరే. మధ్యలో దూరి ఏదో మాట్లాడతాడు... అర్ధం లేకుండా.

ఈ కారణం చేతనే మా ఆఫీసులో వాడంటే ఎవరికీ గిట్టదు. నేనొక్కన్నే వాడితో ఫ్రెండ్లీగా ఉంటాను( ఆ మధ్యన మా ఆవిడకి ఆపరేషన్ జరిగితే వాడూ వాళ్ళావిడా దగ్గరుండి చూసుకున్నార్లెండి).

వాడికి మళ్లీ చేశాను. స్విచ్ ఆఫ్.

వెధవ ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నాడో!

'కాల్ మి' అని మెసేజ్ పెట్టి, ఈ సారి మా అకౌంటెంట్ కి చేశాను.

"పోయాడు... ఏవో వ్యాపారాలు చేస్తున్నాడట కదా. అయినా మీరిద్దరూ మంచి దోస్త్ లు... ఏం తెలియనట్లు అడుగుతావేం?" అన్నాడు.

వాడికి శివ అంటే మంట. పాత కోపాలున్నాయ్ లెండి. మా అకౌంటెంట్ తన ఐదేళ్ళ కొడుకుని తీసుకెళ్లి ఆ హీరో చేత షేక్ హ్యాండ్ ఇప్పించి మరుసటి రోజు ఆఫీసులో ఆ వివరాలు మా అందరికీ చెప్తూ ఆ ఫోటోలు చూపించాడు. మేమంతా ఆ హీరో, మా అకౌంటెంట్ కి అంత క్లోజయినందుకు అసూయపడుతుంటే. ఈ శివగాడు మా గుంపు మధ్యకు వచ్చి మా అకౌంటెంట్ తో "నువ్వెలాగూ ఆ హీరోకి దాసోహం అయిపోయావ్. పిల్లల్ని కూడా ఎందుకు సరెండర్ చేసేస్తున్నావ్" అన్నాడు.

అంతే! మా అకౌంటెంట్, అతని కులానికే చెందిన మరో ముగ్గురు కొలీగ్స్ శివగాడి మీదకొచ్చి కొట్టినంత పనిచేశారు. సమయానికి నేను అడ్డుపడి వాళ్ళను శాంతింపజేశాను.

అయినా వీడు నోరు మూసుకోకుండా -

"మనందరికీ పిల్లల్ని కనడం వచ్చు... పెంచడం రాదు" అన్నాడు.

ఇలా ఉంటుంది వాడి తంతు.

చాన్నాళ్ళకిందట ఓసారీ ఇలాగే జరిగింది. మూడేళ్ళ మా చంటిది టీవీలో హీరోయిన్ డాన్స్ చూసి అచ్చం అలానే నడుం ఊపుతూ డాన్స్ చేస్తుంటే ఆశ్చర్యపోయిన నేను మరుసటి రోజు లంచ్ అవర్ లో క్యాజువల్ గా ఆ విషయం మా కొలీగ్స్ కి చెబుతుంటే వీడు నా దగ్గరకు వచ్చి సీరియస్ గా ఫేస్ పెట్టి "అర్జెంటుగా మీ ఇంట్లో టీవీ అమ్మేయ్" అన్నాడు.

వాడేం మాట్లాడుతున్నాడో నాకర్ధం కాలేదు. పోన్లెండి, ఆ మాట నా దగ్గర అన్నాడు కాబట్టి సరిపోయింది. అదే మా ఆవిడ దగ్గర అనుంటే ఎడాపెడా దులిపేసుణ్ణు!

మా ఆవిడకి టీవీ అంటే ప్రేమ... సీరియల్స్ అంటే పిచ్చి. ఇదిగో, ఇన్నాళ్ళూ ఇలా పొంతనలేకుండా మాట్లాడేవాడు ఇప్పుడు పొంతనలేని పనులు చేస్తున్నాడన్నమాట.

మళ్ళీ ఫోన్... వాడి బావమరిది నుంచే.

"కనుక్కున్నారా?..."

"అడిగాను. కారణాలు తెలియలేదు."

"ఏం చేద్దామంటారు... వెధవ, పిల్లల మొహం కూడా చూళ్ళేదు."

"మీరేం బాధపడకండి. ఇవ్వాళ వాడి ఇంటికెళ్ళి చూస్తాను. మీతో సాయంత్రం మాట్లాడతాను. నాకు వేరే కాల్ వస్తోంది."

మున్సిపల్ క్లర్క్ నుండి ఫోన్... ప్లాన్ లో మార్పుకు టౌన్ ప్లానింగ్ అధికారి ఒప్పుకున్నాడట సాయంత్రం ఆయన్ను అమృతా బార్ కి తీసుకొస్తాడట. అక్కడకు వస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందామన్నాడు. సాయంత్రపు బార్ బిల్లు గురించి ఆలోచిస్తూ కొత్త ఇంటి దగ్గరకు వెళ్ళిపోయాను.
 

*****           


ఈరోజు పని పూర్తి అయిందనిపించి, వర్కర్లను పంపించి శివగాడి ఇంటికి వెళదామనుకుంటుంటే వాడి దగ్గర్నుంచే ఫోన్. ఆత్రుతగా లిఫ్ట్ చేశాను.

"ఏమైపోయావ్, ఎందుకు చేశావ్ ఈ పిచ్చిపని?"

"ఇంట్రస్ట్ లేక..." కూల్ గా చెప్పాడు.

"ఇంట్రస్ట్ లేదా? ఏం తింటావ్... వెనకాలేమైనా ఎకరాలున్నాయా?"

"అంత ఆలోచించలేదు. చిన్న సాయం చేస్తావా..."

అప్పుడే మొదలు...

"కొంచెం డబ్బు అవసరంపడింది. పీఎఫ్ సెక్షన్ లో మీ కజిన్ ఉన్నాడు కదా... అతనితో చెప్పి నా పి.ఎఫ్. అకౌంట్ కొంచెం తొందరగా సెటిల్ చేయించు."

"ఇక్కన్నుంచి డబ్బే అవసరపడుతుంది. నా మాట విని..."

"ప్లీజ్... ఆ విషయం అయిపొయింది. వదిలేద్దాం."

కసిగా ఫోన్ కట్ చేశాను.

అమృత బార్ కి వెళ్ళేటప్పటికి మున్సిపల్ క్లర్క్ ఆవురావురుమంటూ ఉన్నాడు. నేనూ అతనూ కలిసి ఫోన్ చేసిన అరగంట తర్వాత మూలవిరాట్టుగారు వేంచేశారు.

మా ముగ్గురి తరపున ప్రభుత్వ ఖజానాకి నావంతు సాయం చేసి ఇంటికి చేరేసరికి పదకొండంపావు.

మా ఆవిడ నాకోసం గుమ్మంలోనే వెయిట్ చేస్తోంది.. ప్రేమతో అనుకునేరు... పిల్లలిద్దరూ హాస్టల్లో ఉండటంతోనూ ఆ టైముకి సీరియల్స్ అయిపోవడంతోనూ మా ఆవిడకి ఏం తోచదు. నేను మందుతాగి ఇంటికివెళ్తే తిట్లతో స్వాగతం పలికి ఏడుపుతో గుడ్ నైట్ చెబుతుంది. ఆ ప్రకంపనలు మరుసటిరోజు కూడా ఉంటాయి. ఈ గొడవలు మా అమ్మకు తెలియడమెందుకని నా దగ్గర ఉంచుకోకుండా మా అమ్మను పల్లెలోనే ఉంచుతాను.

అటువంటిది ఈ రోజు మా ఆవిడ చిరునవ్వుతో ఎదురొచ్చి నేను తాగొచ్చిన విషయం గమనించనట్లుగా చూస్తూ "ఇవ్వాళ టైల్స్ సెలెక్షన్ కి తీసుకెళతానన్నారు" అంది.

"పనిమీద వెళ్లాను... రేపెళదాం" అంటూ నేను లోనికి వెళుతుంటే మౌనంగా నన్ను అనుసరించింది. టైల్స్ కి థాంక్స్... తిట్లు తప్పించినందుకు...
 

*****


ఈ మధ్య ఇంటి విషయంలోపడి శివ విషయం పూర్తిగా మరచిపోయాను. మొత్తానికి ఇల్లు పూర్తయింది. గృహప్రవేశానికి పిలవడానికి శివ గురించి ఆరాతీస్తే టౌనుకి దూరంగా ఉన్న పల్లెలో ఉన్నాడని తెలిసి వెళ్ళాను.

హైవేకి దూరంగా ఉండటంతో ఆ పల్లెలోని చెట్లు పొగరుగా నిలబడి ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ లా ఉన్న ఓ రావి చెట్టు పక్కన మూడు కుంటల స్థలంలో రెండు గదుల రేకుషెడ్డు వేసి పైన ఏదో తీగ పాకించాడు. ఇంటిముందు ఖాళీ స్థలంలో ఆకుకూరలూ కూరగాయ మొక్కలూ వేసి బీరపాదు పువ్వులు పూసి లోనికి వెళుతున్నవారికి స్వాగతం పలుకుతోంది.

పదవ తరగతి చదువుతున్న వాడి కొడుకు మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. వాళ్ళావిడ రుబ్బురోట్లో కొబ్బరి-మామిడి పచ్చడి చేస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న కూతురికి పాఠం చెబుతున్న శివ నన్ను చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఎండలో వెళ్ళిన నాకు శివ వాళ్ళమ్మ ఇచ్చిన మజ్జిగ తాగుతుంటే ప్రాణం లేచివచ్చింది. మా అమ్మ గుర్తొచ్చింది. ఇంటికి ఎవరువచ్చినా మా అమ్మ ధబ్బాకు వేసిన మజ్జిగ ఇస్తుండేది.

"The product of time and speed is equal to distance.

దూరం... కాలము వేగములపై ఆధారపడుతుంది. అంటే కాలమూ వేగమూ పెరిగితే ఎక్కువ దూరం కవరవుతుంది. గమ్యం తొందరగా చేరతాం" అని ఆపి -

"గమ్యం నెమ్మదిగా చేరాలంటే..." పాప నడిగాడు.

"స్పీడ్ తగ్గించుకోవాలి" పాప పూర్తి చేసింది.

వాడు లేచి నా చేతిలోని కార్డు తీసుకొని బయటకు నడిచాడు. విశాలంగా ఉన్న రావి చెట్టు చుట్టూ ఉన్న దిమ్మెపై ఎవరో ముసలతను పడుకొని ఉన్నాడు. దూరంగా పిల్లలు ఆడుకొంటున్నారు. రావిచెట్టుపై కోయిల ఒకటి మంద్రంగా కూస్తోంది. రావిచెట్టు దిమ్మెపై కూర్చొని కార్డు చూస్తున్న వాడిని "ఎలా ఉన్నావ్ రా" అంటే తేలిగ్గా భుజాలెగరేశాడు.

జాబ్ కి రిజైన్ చేయడం వల్ల వచ్చిన రెండున్నర లక్షలతో లక్ష రూపాయలకి ఈ స్థలం కొని, యాభై వేలతో రేకుషెడ్డు వేసి మిగతా లక్ష అత్యవసర వైద్య ఖర్చులకోసం బ్యాంకులో దాచాడట టౌన్ లో ఇద్దరిళ్ళలో హోమ్ ట్యూషన్ చెబుతుంటే నాలుగువేలు ఇస్తున్నారట. అదే ఆదాయమట. పిల్లలిద్దర్నీ గవర్నమెంటు స్కూల్లో చదివిస్తున్నాడట.

నేనేం ప్రశ్నలు వేయకుండా అన్నీ వాడే చెబుతున్నాడు కానీ ఆఖరిమాటకు ఆశ్చర్యాన్ని ఆపుకోలేకపోయాను.

"గవర్నమెంటు స్కూల్లో చదువా?!"

నా బుర్ర తిరిగిపోతోంది. వాడు మాత్రం తేలిగ్గా - "ఏం ఫర్లేదు... వాళ్లు బాగానే చెబుతున్నారు. మనమూ అక్కణ్ణించి వచ్చిన వాళ్ళమే కదా. నేను కూడా రోజూ ఓ పూట స్కూలుకెళ్లి, పిల్లలందరికీ మాథ్స్, ఇంగ్లీషు చెబుతున్నాను" అన్నాడు.

ఆ రెండింటిలో వాడు బి.ఎడ్.

నాలుగువేలు ఎలా సరిపోతున్నాయో అడుగుదామనుకొన్నాను కానీ హోమ్ లోనూ, వేరే కటింగ్ లు పోనూ నా చేతికొచ్చే జీతం మూడువేలే! ఇంకేం మాట్లాడనూ...?

నాకెందుకో వాడు చేసిన దానికి పశ్చాత్తాప పడితే బావుణ్ణని ఉంది. కానీ ఆ భావం వాడిలో ఏ కోశానా లేదు. "మరి, టైము ఎలా గడుస్తోంది" కసిగా అడిగాను.

మామూలుగానే. మా అమ్మను కూడా నా దగ్గరకు తెచ్చుకొన్నాను. మా ఆవిడ ఇక్కడి పిల్లలకు ఉచితంగా టైలరింగ్ నేర్పుతోంది. ఓ విధంగా నేను అదృష్టవంతుణ్ణి... మా
వాళ్ళు నన్ను అర్ధంచేసుకున్నారు. నేను టౌన్లో ఓ మాస్టార్ దగ్గర గిటార్ నేర్చుకొంటున్నాను. అది నా చిన్నప్పటి కోరిక."

"గిటార్ నేర్చుకొంటున్నావా?! కన్ఫర్మ్... నిజంగానే నీకు పిచ్చిపట్టింది" నా భావాలు దాచుకోదల్చుకోలేదు నేను.

"పట్టిందో వదిలిందో తెలియదు కానీ... ఇంతకుముందు వరకు మనసులో ఏదో ఆందోళన, వెలితి. గడియారంతో లేవడం... కాలంతో పరుగెత్తడం... ఊపిరాడేది కాదురా...

ఎల్ కేజీలో ఉండగానే ఐఐటీ ప్లానింగ్... అవయవాలు కూడా ఎదగకుండా ఎక్స్ పోజింగ్ డాన్స్ లు... చదువు పూర్తవకముందే ఉద్యోగ నియామకాలు... ఉద్యోగంలో చేరిన రెండో రోజే హోమ్ లోన్ కాలిక్యులేషన్స్... ఇవన్నీ చూస్తుంటే ఊపిరాడేది కాదు.

ఎందుకీ స్పీడు... ఎటెళ్తున్నాం మనం...

చదువుల పేరుతో పిల్లల్ని దూరంగా ఉంచకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం?

ఆఖరి దశలో కన్నవాళ్ళని మనతో ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం?

నీకు తెలుసా... మనదేశంలో లోన్ తీసుకొని ఇల్లు కట్టేవాళ్ళంతా... లోన్ తీరి "హమ్మయ్య... ఇన్నాళ్ళకు సొంతింట్లో ఉన్నాం అని ఊపిరి తీసుకున్నాక బతికేది రెండు సంవత్సరాలేనట. ఎంత దారుణం?!"

వాడు నన్ను ఉద్ధేశించి అంటున్నాడేమో అనుకొన్నాను కానీ వాడు నన్ను పట్టించుకోకుండా శూన్యంలోకి చూస్తూ -

"అసలే కాలం వేగంగా పరిగెడుతోందిరా... దాంతో పోటీ పడుతూ మనం మరింత వేగాన్ని జోడిస్తే... దూరంగా తొందరగా తరుగుతుంది. అంటే, మనందరి అంతిమగమ్యం అయిన మరణాన్ని తొందరగా చేరతాం. అందుకే నాకు -

ఈ పరుగు ఆపాలనిపించింది!

నా కాలాన్ని నేను అనుభవించాలనిపించింది!

అందుకే రాజీనామా... అంతకుమించి వేరే ఉద్దేశం లేదు" నవ్వుతూ లేచాడు.

వాడు చెప్పేదేదీ కాదనలేని పరిస్థితి నాది. అయినా "ఆర్ధికపరమైన లక్ష్యాలు కూడా ఉండాలికదరా" అన్నాను.

"నాకు ఉన్నాయ్ రా. నా లక్ష్యం ఇప్పుడు గిటార్ కొనుక్కోవడం. దానికోసం అప్పుడే రెండువేలు కూడబెట్టాను తెలుసా!" వాడి కళ్ళలో మెరుపు.

వాడు చేసింది కరెక్టో కాదో తెలియదు కానీ వాడు చేసిన పనులలో ఏ ఒక్కటీ నేను చేయలేను.... ఆఖరికి మా అమ్మను నా దగ్గర పెట్టుకోవడంతో సహా!

మౌనంగా వెనుదిరిగిన నాకు చేతిలోని ఇన్విటేషన్లు భారంగా అనిపించాయి.
 


(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్