Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue259/696/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)...‘‘సార్! రాత్రి .... రాత్రి నేను కొట్టు కట్టేసే ముందు ఒకావిడ వచ్చింది సార్. వెయ్యి నోటు ఇచ్చి రెండు రొట్టెల ప్యాకెట్లు, రెండు జామ్ ప్యాకెట్లు అడిగింది. నా దగ్గర చిల్లర లేదమ్మా అన్నాను.’’ నసుగుతూ చెప్పాడు వరహాల శెట్టి.

‘మరి, ఈ ప్యాకెట్లు ఆమె ఎక్కడ కొన్నట్టు?’’ సీరియస్ గా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘నా దగ్గరే సార్!....’’ చేతులు రెండూ నులుముకుంటూ అన్నాడు కిరాణా షాపు యజమాని వరహాలశెట్టి.

కిరాణా షాపు దగ్గరకు పోలీసు రావడం గమనించగానే చుట్టు ప్రక్కల షాపు వాళ్ళు దూరం నుండే ఓ కన్నేసి ఓరగా వాళ్ల సంభాషణ అంతా వింటూ ఏదో పనిలో ఉన్నట్టు నటిస్తున్నారు.

రాత్రి ‘ఆమె’ని శారీరకరంగా లోబర్చుకుందామని రేప్ చెయ్యబోయిన ఇద్దరు యువకులు రెండు షాపులకు అవతల నిలబడి వరహాలశెట్టిని పోలీసు ఏమడుగుతున్నారో వాడేం చెప్తున్నాడో అనుకుంటూ దొంగ చాటుగా నక్కినక్కి భయం భయంగా వాళ్ళనే గమనిస్తున్నారు. రాత్రి తగిలిన కత్తి గాట్లకి ఆర్.ఎమ్.పి. డాక్టర్  దగ్గర మందు రాయించుకుని తిరిగి పని లోకి వచ్చేసారు. లోప గాయాలు చురుక్కుమన్నా భరిస్తూ మర్రిచెట్టు దగ్గర ఎవరో ఎవరినో చంపేసారన్న వార్త తెలియగానే ఇద్దరూ ఆందోళనగా కొండకొచ్చేశారు.

‘‘డబ్బు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చావా?!’’ కిరాణా దుకాణం యజమాని వరహాలశెట్టి కేసి కోపంగా చూస్తూనే అనుకోకుండా చుట్టు పరికించి చూసాడు ఎస్సై అక్బర్ ఖాన్.

రెండు షాపుల అవతల ఇద్దరు కుర్రాళ్ళు నక్కి నక్కి తమనే గమనించడం ఎస్సై అక్బర్ ఖాన్ కనిపెట్టకపోలేదు. వరహాలశెట్టితో మాట్లాడుతూనే వాళ్లిద్దరి మీద దృష్టి పెట్టాడు. వాళ్ళిద్దరి మీద అనుమానం కలిగింది.

‘‘సార్! వ్యాపారమన్నాక డబ్బు తీసుకోకుండా ఫ్రీగా వస్తువు ఎలా ఇచ్చేస్తాను సార్?’’ ఆశ్చర్యంగా ఎస్సై కేసి చూస్తూ అన్నాడు వరహాలశెట్టి.  

‘‘ఏం జరిగిందో చెప్పు. సోదంతా ఎందుకు?’’ చిరాగ్గా అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

‘‘నేను వెయ్యి నోటుకు చిల్లర లేదనే సరికి ఈ ప్రక్కనే ఉండే కుర్రాళ్ళు వచ్చి ఆవిడకి చిల్లర ఇచ్చారు సార్! ఆ తర్వాత నేను ఆవిడ దగ్గర డబ్బు తీసుకుని ఈ వస్తువు ఇచ్చాను.’’ చెప్పాడు వరహాలశెట్టి.

‘‘కుర్రాళ్ళా? ఎక్కడుంటారు?’’ కుతూహలంగా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. ‘ఇదంతా అనవసర ఆరా ఏమో!’ అనుకుంటూ వెనుదిరగబోయిన ఎస్సై అక్బర్ ఖాన్ దూరంగా తననే చాలా సేపట్నుండి నక్కి నక్కి చూస్తున్న కుర్రాళ్ల కేసి  టక్కున ఆగాడు. ఎస్సై అక్బర్ ఖాన్ తమనే గమనించడం చూసిన యువకు ఇద్దరూ టక్కున వెనుదిరిగి ఏమీ ఎరగనట్టు నిలబడ్డారు.

‘‘కానిస్టేబుల్!....ఆ షాపు దగ్గర నిలబడి మనల్నే గమనిస్తున్న వాళ్లిద్దర్నీ ఇలా లాక్కురా!’’ అంటూ తన వెనకే వినయంగా నిలబడ్డ కానిస్టేబుల్ని వాళ్ల దగ్గరకు పంపించాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ ఎటో చూస్తూ ఎవర్నో లాక్కు రమ్మనడం విన్న కిరాణా దుకాణం యజమాని వరహాలశెట్టి కూడా అటుకేసి చూసాడు. రాత్రి ఆమెకి చిల్లర ఇచ్చిన యువకులు కనిపించారు.

ఆమె ఆ కుర్రాళ్లిద్దర్నీ చూస్తూనే ‘హమ్మయ్య! వాళ్లని ఇరికించేసి నేను తప్పించుకోవచ్చని’ మనసులోనే అనుకుంటూ టక్కున ఎస్సై దగ్గరకు వచ్చాడు వరహాలశెట్టి.

‘‘సార్!...రాత్రి ఆవిడకి రెండువేల రూపాయ నోటుకి చిల్లర ఇచ్చింది వాళ్లిద్దర్లో ఒకడు సార్!...అదిగో అతడే.’’ హుషారుగా వాళ్లని చూస్తూ చెప్పాడు వరహాలశెట్టి.

కానిస్టేబుల్ని చూస్తూనే ఆ యువకుల ఇద్దరికి పై ప్రాణాలు పైనే పోయాయి. పరిగెత్తి పారిపోదామన్నా దారే లేదు. కానిస్టేబుల్ని పిలిచి తామిద్దర్నీ చూపించి ఎస్సై ఏదో చెప్పే సరికి ఇద్దరూ భయంతో గజగజా వణికిపోయారు. 

ఇద్దరూ తేరుకునే లోపే కానిస్టేబుల్ వాళ్ల దగ్గరకు చేరుకున్నాడు.

‘‘మీ ఇద్దర్నీ ఎస్సైగారు పిలుస్తున్నారు. రండి.’’ అంటూ హూంకరిస్తూ ఇద్దరి వెనుక నిలబడి గొర్రెల్ని తోలుతున్నట్టు చేత్తో తోసుకుంటూ వాళ్లని ఎస్సై దగ్గరకు లాక్కువచ్చాడు కానిస్టేబుల్.

‘‘రాత్రి మీరేం చేసారు?’’ వాళ్లిద్దర్నీ దగ్గరకు రాగానే నర్మగర్భంగా మాట్లాడుతూ వాళ్ళ మీద కన్నెర్రజేస్తూ అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్. కావాలనే అంతా తెలిసినట్టు తెలివిగా అడిగాడు ఎస్సై.

‘‘సార్!...సార్!....మేము....’’ ఒకడు ఆందోళనగా

‘‘లేద్ సార్....లేదు.....ఆవిడే....’’ రెండో వాడు భయంగా

‘‘ఆవిడా?! ఏం చేసింది?’’ వాళ్ళద్దరిలో ఏదో రహస్యం దాగి ఉందనుకుంటూ వాళ్లని గదమాయించాడు ఎస్సై.

‘‘ఆవిడ....! ఆవిడ....’’ ఇద్దరూ నసుగుతూ నిలబడ్డారు.

‘‘చెప్పవయ్యా! రాత్రి నువ్వే కదా ఆవిడ దగ్గర వెయ్యినోటు తీసుకుని చిల్లర ఇచ్చావు. నువ్వు చిల్లర ఇచ్చుండకపోతే ఆ వెధవ రొట్టె, జామ్ అమ్మి ఉండేవాడ్ని కాదు కదా!’’ నిష్ఠూరంగా అన్నాడు వరహాలశెట్టి వాళ్లతో.

‘‘నువ్వు నోరు ముయ్యవయ్యా! నువ్వెందుకు మధ్యలో దూరుతావు?’’ వరహాలశెట్టి మీద అంతెత్తున లేచాడు ఎస్సై.

ఎస్సై అక్బర్ ఖాన్ కోపంగా అరిచేసరికి గజగజా వణికపోతూ భయం భయంగా షాపులో కెళ్ళి కేష్ కౌంటర్లో కూర్చుండిపోయాడు వరహాలశెట్టి.   ఇంతలో అంబులెన్స్ లో ముసలమ్మ శవాన్ని ఎక్కించి ఎస్సై అక్బర్ ఖాన్ దగ్గరకు పరిగెట్టుకు వచ్చాడు మరో కానిస్టేబుల్.

‘‘సార్! ఫోరెన్సిక్ డిపార్టుమెంట్ వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేసి వెళ్లిపోయారు. శవాన్ని పోస్టుమార్టం కోసం అంబులెన్స్ ఎక్కించాము.’’ ఆయాసపడుతూ చెప్పాడు ఆ కానిస్టేబుల్.

‘‘అక్కడున్న కానిస్టేబుల్స్ ని అంబులెన్స్ లో పెద్దాసుపత్రికి వెళ్ళమను. నేను ఇక్కడ ఇంటరాగేషన్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను. నువ్వు సాయంత్రం వరకూ మర్డర్ స్పాట్ దగ్గరే ఉండు. అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా అటుగా వస్తే వదిలిపెట్టకు.’’ అంటూ ఆ కానిస్టేబుల్ కి చెప్పి ఎదురుగా ఉన్న ఇద్దరు యువకుల కేసి చూసాడు ఎస్సై.

ఆ కానిస్టేబుల్ యోట్ చేసి  అంబులెన్స్ దగ్గరకు పరిగెట్టాడు. అప్పటికే అంబులెన్స్ బయలుదేరడానికి సిద్ధంగా వుంది. ఇద్దరు కానిస్టేబుల్స్ అంబులెన్స్ ఎక్కారు. మూడో కానిస్టేబుల్ అన్నదానం బిల్డింగ్ కేసి వెళ్తూ మెట్లు దిగాడు.

‘‘చెప్పండి....! అలా నీళ్ళు నమిలితే ఆ ముసలమ్మని మీరే చంపారనుకోవాలి....నిజమేనా?!’’ చేతిలో ఉన్న లాఠీతో ఒకడి బుర్ర మీద కొడుతూ అన్నాడు ఎస్సై.

‘‘సార్!....మేము ఆ ముసలమ్మనా...?! ఎందుకు సార్! దాన్నెందుకు చంపుతాం!’’ అయోమయంగా అన్నాడొక కుర్రాడు.

‘‘ఎందుకా?! అదీ నేనే చెప్పాలా?! డబ్బు కోసం....ముసలమ్మ ముష్టెత్తుకుని దాచుకున్న డబ్బు కోసం, లేదా మెడలోనో....చెవుకో....ఉన్న బంగారం కోసం....అవునా!’’ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అక్బర్ ఖాన్ మాటలు వింటూనే ఆ యువకులిద్దరికీ ముచ్చెమటలు పోసాయి. నోరు విప్పకపోతే నిజంగానే హత్యానేరంలో ఇరికించేసేలా ఉన్నాడు ఈ ఎస్సై.’’ అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

‘‘కానిస్టేబుల్! వీళ్లిద్దర్నీ స్టేషన్ కు తీసుకుపద! అడిగే రీతిలో అడిగితే గాని నిజం కక్కరు.’’ కర్కశంగా అన్నాడు ఎస్సై.

‘‘సార్!....సార్!.... చెప్పడానికేముంది సార్! ఆవిడ శెట్టిగారి దగ్గర కొచ్చింది. ఈయన చిల్లర లేదంటే నా దగ్గరుందని  చిల్లర తీసి ఇచ్చాను. అంతే సార్ జరిగింది.’’ వినయంగా వంగిపోతూ చెప్పాడొక యువకుడు.

‘‘నిజమా?!...’ ఎగతాళిగా అంటూనే ఆ యువకుల చేతుల మీద మెడ దగ్గర గాయాలు చూసి అదిరిపడ్డాడు ఎస్సై అక్బర్ కాన్.అంతే!    కోపంతో రెచ్చిపోతూ చేతిలో ఉన్న లాఠీతో ఇద్దర్నీ ముడుకుల మీద, చేతుల మీద గట్టిగా కొడుతూ గట్టిగా అరుస్తూ అన్నాడు ఎస్సై అక్బర్ కాన్.

‘‘నా కొడకల్లారా! అబద్ధాలు చెప్తార్రా! మీ చేతుల మీద మెడ మీద ఆ కత్తి గాట్లేమిట్రా...విప్పండ్రా! మీ చొక్కాలు  విప్పండి.... కానిస్టేబుల్....వీళ్లిద్దరి చొక్కాలు వూడదియ్యి.’’ పూనకం వచ్చిన వాడిలా వణికిపోతూ అన్నాడు ఎస్సై అక్బర్ ఖాన్.

ఎస్సై అలా కేకలేస్తూ అరిచేసరికి దుకాణాల దగ్గర ఉన్న యాత్రీకులు, వర్తకులు అందరూ ఏం జరిగిందోనని ఆశ్చర్యపోతూ వరహాలశెట్టి దుకాణం దగ్గరకు గుంపులుగా వచ్చి చేరుకున్నారు.

యాత్రీకులు, వర్తకులు అందరూ ఆ యువకులిద్దర్నీ దొంగల్లా చూస్తూ ఏం జరిగుంటుందోననుకుంటూ  కుతూహలంగా కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డారు. వర్తకులందర్నీ చూసి ఆ యువకులిద్దరూ సిగ్గుతో తలు దించుకున్నారు.

ఇంతలో ఒక వ్యక్తి గుంపులో నుండి ధైర్యంగా చొచ్చుకు వచ్చి ఎస్సై అక్బర్ ఖాన్ ముందు నిలబడ్డాడు.

‘‘సార్! వీళ్లిద్దరూ మా కుర్రాళ్ళే! మా దుకాణాల్లో పని చేస్తూ ఉంటారు. వీళ్ళ వలన ఏదైనా పొరపాటు జరిగి వుంటే క్షమించి వదిలెయ్యండి సార్.’’ అన్నాడతను.

‘‘వీళ్ల తరఫున నువ్వు వకాల్తా పుచ్చుకుంటున్నావా! వీళ్ళిద్దరూ ఏం చేసారో తెలుసా?!...’’అంటూనే ఆ ఇద్దరు యువకుల కేసి తిరిగి

‘‘చెప్పండ్రా! ఈ కత్తిగాట్లేమిటి? ఏం చేసారో చెప్పండి.’’ లాఠీతో ఇద్దర్నీ కొట్టినట్టు బెదిరిస్తూ అడిగాడు ఎస్సై అక్బర్ కాన్.ఎస్సై చెప్పింది వింటూనే ఆ యువకులిద్దరినీ సమర్థిస్తూ వచ్చిన వ్యక్తి ఇదేదో పెద్ద వ్యవహారమేననుకుంటూ అక్కడ నుండి నెమ్మదిగా జారుకున్నాడు.    అదే సమయంలో `

ఆమె తన బుజాల మీద ఉన్న బ్యాగ్ భ్రదంగా మోసుకుంటూ కేశఖండనశాల కేసి నడుస్తోంది.

‘తనతో ఈ బ్యాగ్ ఉండడం మంచిది కాదు. నిన్న తనని చూసినవాళ్లంతా తప్పక గుర్తు పట్టేస్తారు. ఏం చెయ్యాలి?’’ అనుకుంటూ గాబరాగా నడుస్తున్న ఆమె స్వామివారి రథశాల దగ్గరకు చేరుకుంది.

 

 

దొరికిన వారిచేత పోలీసులు ఏం నిజం కక్కించగలిగారు? వాళ్ళ నోటినుండి ఈ అపరిచిత " ఆమె " విషయమేమైనా రాబట్టగలిగారా....ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఆగాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్