Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue262/701/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి).... తేజ వెంటనే లిఫ్ట్ చేసాడు..

“హలో వెళ్ళిపోయావా.. సారీ డియర్ ... నిన్ను డ్రాప్ చేయడం కుదరలేదు వెరీ సారీ” అన్నాడు అపాలజటిక్ గా ..

“అది సరే నాకో చిన్న హెల్ప్ చేస్తావా రేపు మార్నింగ్” అడిగింది..

“ నాన్సెన్స్ చేస్తావా ఏంటి.. చేయి అని చెప్పు ...”

“సరే అలాగే చెప్తాను.. నీకు నేనున్న అపార్ట్ మెంట్ తెలుసుగా లిబర్టిలో...”

“ తెలియకేం .. అక్కడేగా మన ప్రేమ పరిమళించింది..” నవ్వింది శరణ్య ...  “వెంటనే అక్కడికి వెళ్లి నా ఫ్లాట్ ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉంటారు.. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ గారు ...ఆవిడ చేత నాతో మాట్లాడించు..”

“ఎందుకు? ఎవరావిడ?” ఆశ్చర్యంగా అడిగాడు. శరణ్య తనకి గాయత్రి కనిపించడం, తను ఇంటికి తీసుకు రావడం చెప్పి ... “చాలా విచిత్రం అయిన విషయం ఆ అమ్మాయిని మనం ఇందిరా పార్క్ లో చూసాం .. నీకు గుర్తుందా .. ఆరోజు”  అంటూ వివరంగా చెప్పి “ నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఈ అమ్మాయి పేరెంట్స్.. ఈ అమ్మాయిని , బాబుని వాళ్ళకి అప్పచేప్తే నాకు కొంత రిలీఫ్ గా ఉంటుంది” అంది.

“ఏది గుల్ మొహర్ చెట్టుకింద ... ఆ రోజు కనిపించిన జంటలో ఆడపావురమా .. అయ్యో పాపం ... నీ జోస్యం ఫలించిందా.. మై గాడ్ ... నాక్కూడా ఏదన్నా జోస్యం చెప్తావా..” కంగారుగా అడిగాడు. నవ్వి అంది “ నవ్వుతున్నా కాని నాకెందుకో  చాలా గిల్టీ గా ఉంది తేజా.. పాపం ఆ అమ్మాయి పరిస్థితి చాలా దినంగా ఉంది.. తప్పకుండా రేపు ఉదయమే వెళ్లి ఆవిడతో మాట్లాడించు ప్లీజ్ ..”

“ అదేంటి శరణ్యా .. నాకు మాత్రం బాధ్యత లేదా నీకేనా ... నీ బాధ్యత నాది కూడా తప్పకుండా వెళ్తా సరేనా..” మార్దవంగా అన్నాడు తేజ.

“థాంక్స్ తేజా ..ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం ...మన ప్లాన్ ఫలిస్తే ఆ అమ్మాయి బతుకు నిలబెట్టిన వాళ్ళం అవుతాం” అంది.

“తప్పకుండా వెళ్తాను సరేనా” తేజ మాట ఇవ్వడంతో ఎండ్ బటన్ నొక్కి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది శరణ్య.

గాయత్రిని తల్లి తండ్రుల వద్దకు చేర్చాలన్న శరణ్య కోరిక తీరలేదు. తేజ శరణ్య కోరిక మేరకు లిబర్టీ వెళ్లి చూసాడు .. కానీ తలుపు తాళం,  గోడకి టు లేట్ బోర్డు దర్శనమిచ్చాయి.

అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ని అడిగినా ఫలితం లేకపోయింది. ఏమి చెప్ప లేదని, పెద్దాయన ఆరోగ్యం బాగా లేక పోవడంతో, ఆ ఇంటి వాస్తు బాగా లేదని ఖాళి చేసారని చెప్పాడు.

అదే విషయం తేజ శరణ్యకి ఫోన్ చేసి చెప్పాడు.

గాయత్రిని తల్లి, తండ్రుల వద్దకు చేర్చి, అటు వాళ్ళ వేదన, ఇటు గాయత్రి కన్నీరు తుడవాలనుకుంది.. రమేష్ మరణంతో నైనా ఆ పెద్దల మనసు కరిగి కూతుర్ని చేరదిస్తారని ఆశించింది. మొదటికే మోసం వచ్చింది. వాళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇల్లు ఖాళి చేయడం ఏంటి.. ఆ ఇంటికి వచ్చి ఏడాది కూడా కాకుండానే షిఫ్ట్ అవడం విచిత్రం . వాస్తు బాగా లేదు అందుకే ఖాళీ చేయాలి అనుకున్నారంటే వాస్తు వాళ్ళ మీద ఎలాంటి  ప్రభావం చూపించి ఉంటుంది.

పెద్ద వాడు, మానసికంగా నలిగి పోయి ఉండడం చేత ఆరోగ్యం మందగించి ఉంటుంది.. ఇది వాస్తు ప్రభావం అనుకోడం ఎంత వరకు సమంజసం!

ఏది ఏమైనా ఈ అమ్మాయిని జాలి పడో, అనాలోచితం గానో తనతో తీసుకు వచ్చింది. ఆమెకి  ఒక దారి చూపాల్సిన  బాధ్యత తన పైన ఉంది. ఈ ఇంట్లో ఎంత కాలం ఉంచుకో గలదు .. ఇప్పుడు తను వంటరి ... రేపు పెళ్లి అయాక తేజ వస్తూ వెళ్తూ ఉంటాడు.. ఏమంటాడో.. కొత్త కాపురంలో అభిప్రాయ భేదాలు వస్తే కష్టం.

శరణ్య ఆలోచిస్తూ ఉండగానే వారం రోజులు గడిచి పోయాయి.

శరణ్య త్వరగా లేచి రెడీ అయి ఆఫీసుకి వెళ్లి పోతుంది. ఊళ్లోనే ఉంటే మధ్యాహ్నం భోజనానికి వస్తుంది... ఇన్స్ పెక్షన్ కి వెళ్తే రాత్రి ఎనిమిది, ఎనిమిదిన్నరకి  వస్తుంది.  నందిగామ చుట్టు పక్కల ఉన్న ఇరవై ఐదు గ్రామాల బాగోగులు చూసుకునే పెద్ద బాధ్యత ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయినా ఏ మాత్రం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో తన విధులు నిర్వహిస్తుంటుంది.

గాయత్రికి మొదటి, రెండు రోజులు శరణ్య లేకుండా ఆ ఇంట్లో  స్వతంత్రంగా ఉండడం, వంట మనిషి వంట చేసి పెడితే తినడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ శరణ్య వాత్సల్యం, ఆమె ఇచ్చిన చనువు త్వరగా పరిస్థితులకు అలవాటు పడేలా చేశాయి.

రెండో రోజు నుంచే తను కూడా శరణ్యతో పాటే లేచి ఆవిడ వెనకాలే తిరుగుతూ ఆవిడకి ఏం కావాలో గమనించి తనే చేయడం మొదలు పెట్టింది. శరణ్య బ్రేక్ ఫాస్ట్ గా  బ్రెడ్ టోస్ట్ కానీ, సీరియల్ కానీ తింటుంది. గాయత్రి  తనే టోస్ట్ చేయడం నేర్చుకుంది. పాలు కాగ బెట్టేస్తుంది .. కాఫీ కలిపేస్తుంది. 

శరణ్య  “అప్పుడే లేచావేంటి పడుకో” అని వారించినా “పర్వాలేదక్కా.. రాత్రి బాగానే పడుకున్నాను” అంది. శరణ్య కూడా ఆ అమ్మాయికి కొత్త పోవాలన్న ఉద్దేశంతో పెద్దగా ఏమీ అన లేదు.

శరణ్య వెళ్ళిన కాసేపటికి వంట మనిషి వస్తుంది.. గాయత్రి ఆవిడకి కూరలు తరిగిస్తూ అవి ఇవీ అందిస్తూ ఆవిడతో కూడా కలిసి పోయింది. ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం, శరణ్య హడా వుడిలో ఎక్కడివక్కడ వదిలేసిన బట్టలు, కాగితాలు, మేకప్ సామాగ్రి అన్నీ సర్ది పెట్టడం.. వాలంటీర్ గానే చేయడం మొదలు పెట్టింది.

ఇదంతా శరణ్యకి బాగానే ఉంది కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు.. ఎంత కాలం తనింట్లో పని మనిషిగా వాడుకుంటాను అనుకుంది. అలా అనుకున్న మరునాడే అంగన్ వాడికి ఇన్స్పెక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది.

అక్కడికి వెళ్ళాక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ పిల్లలను చూసుకోడానికి టీచర్స్ కొదవ ఉంది. ఆ విషయం తను ఇంతకు ముందే ఎం ఆర్ వో గారికి నోట్ పంపింది. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకో లేదు. గాయత్రిని తాత్కాలికంగా ఒక టీచర్ గా నియమిస్తే! 
వెంటనే ఎం ఆర్ వో సనత కుమార్ కి ఫోన్ చేసింది. ఏదన్నా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే చాలు అని అతను ఇంతకు ముందే చెప్పడంతో ఫోన్ చేయచ్చా, లేదా అనే సంశయం, బెరుకు పోయాయి.

గాయత్రి విషయం చెప్పి, “ఆ అమ్మాయి పెద్దగా చదువుకో లేదు.. ఇంటర్ డిస్ కనెక్ట్ చేసింది అనుకుంటా.  డిపార్ట్ మెంట్ నుంచి టీచర్స్ ని అపాయింట్ చేసేలోగా టెంపరరీగా ఈ అమ్మాయిని అప్పాయింట్ చేసుకునే అవకాశం ఉందా సర్” అని అడిగింది.

అతను వెంటనే స్పందించాడు. “తప్పకుండా తీసుకోండి. నేను పెర్మిషన్ ఇస్తాను. అఫ్ కోర్స్...  మీ ప్రపోజల్ పంపాను. వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిందాకా తాత్కాలికంగా తీసుకో వచ్చు.  బై ద బై ఒక సూపర్ వైజర్ ని కూడా డెప్యుటేషన్ మీద తాత్కాలికంగా పంపిస్తున్నాను. మిగతా విషయాలు  కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వేకన్సీస్ ఫిలప్ చేసేటప్పుడు ఈ అమ్మాయిని రెగ్యులర్ చేసే ఏర్పాటు చేస్తా”  అన్నాడు.
శరణ్యకి చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది.

ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఎన్ని మంచి పనులైనా చేయచ్చు అనుకుంది.

ఆయనకీ థాంక్స్ చెప్పి తేజకి ఫోన్ చేసింది. అతని ఫోన్ ఎంగేజ్ రావడంతో రాత్రికి చెప్పచ్చులే అని తన పనిలో పడిపోయింది.

(గాయత్రికి శరణ్య చూపించబోయే పరిష్కారం ఎంతవరకు ఆమె జీవితానికి స్థిరత్వాన్నిచ్చింది? తెలుసుకోవాంటే వచ్చే శుక్రవారం ఒంటి గంట దాకా ఆగాల్సిందే....)
జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana