Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అదృశ్య శక్తి

adrshyashakti

'మంచీ చెడూ మాట్లాడుకోవడం'  అనే మాట మనం వింటూ ఉంటాము. ఎక్కడయినా నలుగురు కలిసి నపుడు సంభాషణలు మనకు తెలిసిన మంచి గురించి గానీ చెడు  గురించి గాని దొర్లడం సహజం. అవి రాజకీయాలు కావచ్చు, సినిమాలు కావచ్చు. కాని  అవే  మంచి చెడులు మనకి తెలిసిన వ్యక్తుల గురించి అయినపుడు చెడ్డవాళ్ల లాగ ప్రవర్తించకూడదనీ, వీలయితే మంచి వాళ్ళలాగా  ప్రవర్తించడానికి ప్రయత్నించాలని అంతరాంతాలలో మనకి తెలియకుండానే నిర్ణయాలు జరుగుతాయి. అందుకే నాకు అవకాశం చిక్కి నప్పుడల్ ఇద్దరు గురించి  చెప్పడం నాకు ఇష్టం. అందులో రామరాజుగారు ఒకరు . వాళ్ళ గురించి చెబితే  అవతల వాళ్ళు ఎంతో కొంత ప్రభావితం అవుతారేమోనని ఆశ.
 
రామ రాజు గారితో నాకు పరిచయం స్టాక్ మార్కెట్ వ్యవహారాల సందర్భంగా జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్ప బోయే విషయాలు స్టాక్ మార్కెట్ గురించి కాదు. రామ రాజు గారి గురించి.  ఆయన సలహాలతో చాలా లబ్ది పొందిన నా ఆఫీసు కొలీగ్ నారాయణ సలహా మేరకు ఆయన్ని కలవడం జరిగింది.ఆయన ఒక పెద్ద పెస్టిసైడ్ కంపెనీలో రీజినల్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. వారసత్వ భూముల మీద వచ్చే ఆదాయం, ఉద్యోగ రీత్యా చేసిన సేవింగ్స్ అన్నీ షేర్ మార్కెట్ లో పెట్టి ఆయన చాలా వృద్ధి చేశారు
 
నేను ఇల్లు మారిన సందర్భం లో రామ రాజు గారి ఇంటికి పక్క ఇంట్లో చేరడంతో ఆయన తో నాకు పరిచయం బాగా పెరిగింది. ఆయన స్నేహశీలి అవడం, ఆయన సాధించిన విజయాలు చాలా ఎక్కువ అయినా, ఆయనలో నేను గమనించిన వినయం నన్ను ఆయనకీ చాలా దగ్గర చేసింది.
 
ఖాళీ ఉన్నప్పుడల్లా వాళింటికి వెళ్లి రక రకాల మేగజైన్లు చదవడం అలవాటయింది నాకు. ఆయన  పిల్లలు ఇద్దరి లో కొడుకు అమెరికా లో ఉంటె, కూతురు సంధ్య కుటుంబం , నేను కొత్త గా చేరిన ఇంటికి పక్క ఇంట్లోనే ఉంటోంది.    ఇంట్లో ఆయన,  భార్య జానకమ్మగారు ఇద్దరే  ఉండేవారు. ఆవిడ చూపించే ఆప్యాయత వల్ల ఆయన ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళింటికి వెళ్లి కూర్చోవడం నాకూ నా భార్యకీ కూడా అలవాటయింది. మేము వాళ్లింటికి  వెళ్ళినప్పుడు చాలా మాట్లు ఆయన కూతురు సంధ్య  ఆమె పిల్లలు ఇద్దరు అక్కడ కనపడేవారు. మనవరాలికి తొమ్మిది, మనవడికి ఐదేళ్లు ఉంటాయి. అల్లుడు మాత్రం ఎప్పుడూ కనపడే వాడు కాదు. కొద్దిరోజులలో మా ఆవిడ ద్వారా తెలిసిన విషయం మేమిటంటే సంధ్య భర్త త్రాగుడుకి బానిస అని, వేరే స్త్రీ తో సంబంధం పెట్టుకున్నాడనీ,  పిల్లలినీ , భార్యనీ అసలు సరిగ్గా చూడడనీ. ఆర్థికంగా రామరాజు గారే చూసు కుంటూ ఉంటారని. 
 
సింపుల్ లాజిక్ తో ఆయన నా చేత పెట్టించిన కొన్ని షేర్లలో పెట్టుబడులు నాకు అద్భుత లాభాల్ని తీసుకు వచ్చాయి. ఆయన మీద గురుతుల్య గౌరవం ఏర్పడింది. ఆయన తో పరిచయం నా జీవితం లో చాలా పెద్ద మలుపు.
 
  ఆయన సలహాలతో ఆర్థికంగా  చాలా లబ్ది పొందడం అటుంచి. నా వ్యక్తిత్వం మీద ప్రభావం చూపేన  మానవతా విలువలు గురించి ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. రామరాజు గారు తన గురించి తాను ఎప్పుడూ చెప్పుకునేవారు కాదు. ఆయన గురించి నాకు తెలిసిన చాల విషయాలు జానకమ్మ గారి ద్వారానే. .
 
నేను ఉండగా ఒకటి రెండు మాట్లు కొందరు వ్యక్తులు తమ పిల్లల తో వచ్చి ప్రోగ్రెస్ కార్డులు చూపి వెళ్లడం, ఆ పిల్లలని ఈయన 'బాగా చదవండి' అని చెప్పడం చూశాను. దాని గురించి ఆయన చెప్పలేదు కానీ జానకమ్మ గారి ద్వారా తెలిసిందేమిటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ  పిల్లలకి,  తెలుసున్న వాళ్లు చెప్పిన మీదట,  వాళ్ళ ఫీజులు రామరాజు గారు కడుతున్నారని
 
మిగతా టయిం లో కలిసినా కలవక  పోయినా ఇద్దరం వాకింగ్ కి మాత్రం రోజూ కలిసి వెళ్లడం జరిగేది.  అలా వాకింగ్ చేసే సమయంలోనే ఆయన చాలా విషయాలు చెప్పే వారు. ఆయన చెప్పిన విషయాలలో ఒకటి నాకు మొదట నమ్మకం కలగక పోయినా మెల్లగా అనుభవంలో నిజమే ననిపించింది. అదేమిటంటే మన జీవితం లో మంచి జరిగినా చెడు  జరిగినా అది మన వ్యక్తిగత ప్రవర్తన వల్ల కంటే  ఒక అదృశ్య శక్తి ప్రభావం వల్ల మాత్రమే జరుగుతుందని.

  " అదేమిటి ఏదయినా మనం ముందు సంకల్పం చేసే చేస్తూ ఉంటాము కదా? " అన్నాను.

" నిజమే. నేను చెప్పేది ఏమిటంటే ఆ సంకల్పం కూడా ఒక అదృశ్య శక్తి వల్ల  మనలో కలుగుతుంది"

" అంటే భగవంతుడి నిర్ణయం అంటారా?" అన్నాను ఆ అదృశ్య శక్తీ అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందామని

" కైలాసంలో శివుడో, వైకుంఠం లో విష్ణువో అని వ్యక్తిత్వ ధోరణి లో దేముడని చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ అది ఒక మానవాతీతమైన నిష్పక్ష పాత మయిన శక్తి అని నమ్మకం. ఆ నమ్మకమే సంధ్య విషయం లో ఎక్కువ క్రుంగి పోకుండా నన్ను నిలపెట్టింది.' అన్నారు ఆయన కూతురు  సంసారం తలుచుకుని

" అయితే మన కష్టాలు తీర్చమని దేముడిని ప్రార్థించడం, మొక్కడం సరి కాదంటారా?" అన్నాను

" అది ఒక బలహీనత కానీ, మనకి ఏది మంచిదో ఆ శక్తికి తెలియదంటారా? చిన్నప్పుడు మా తాత పాడుతూ ఉండేవాడు " నా కేది  మంచిదో నాకంటే బాగుగా నా స్వామి కెరుక" అని.   'స్వామి' రామరాజు గారు చెప్పే అదృశ్య శక్తే అయి ఉండాలి అనుకున్నా . అలా ఆయన ఇచ్చిన జవాబు ఆయన వ్యక్తిత్వంలో ఒక షేడ్ చూపించింది నాకు రోజూ వాకింగ్ కి వెళ్లి , తిరిగి వచ్చేటప్పుడు, ఇంట్లోకి కావలసినవి ఏవన్నా ఉంటె కొనుక్కు రావడం జరుగుతూ ఉండేది. ఆయన వ్యక్తిత్వం లో మరి కొన్ని అంశాలు ఆ సందర్భం లో గమనించడం జరిగింది. కూరగాయలు బండి వాడి దగ్గరయినా, పండ్ల బండి వాడి వద్ద నయినా ఆయన ఎక్కువ బేరమాడే  వారు కాదు. మొదటి సారి నేను అటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అప్పటికి ఊరుకుని, మేము వచ్చేస్తున్నప్పుడు చెప్పారు. "వాడు ప్రొద్దుట నుంచి సాయంత్రం దాకా ఆ ఎండ లో నుంచుని ఏమాత్రం లాభం గడిస్తాడు? ఇంకోటి ఆలోచించారా? మీకు నాకు పని చేసినా చేయక పోయినా నెల నెలా జీతం చేతికి వస్తుంది. వాడికి ఏరోజు అమ్ముడవుతుందో ఏనాడు అవ్వదో   తెలియదు. అవన్నీ మనసులోకి వస్తే నాకు ఎప్పుడూ బేర మాడ బుద్ధి అవదు "

" అయితే బేరమాడడం తప్పంటారా ?" అన్నాను మా విడ గుర్తుకు వచ్చి. ( పళ్ళు అయినా, కూరలు అయినా "మీకు తెలియదు మీరు మాట్లాడకండి" అంటూ  వాడు చెప్పిన దాంట్లో సగం ధర తో ప్ర్రారంభించి, ముందుకు వెనక్కి రెండు మాట్లు  వెళ్లి, వాడు బేరం వదులుకో లేక ఏడుపు ముఖం తో అమ్మడం జరిగేది. "చూశారా ఎలా కొనాలో"  అని నాకో లుక్ చివరి ఘట్టం. )

"బేర  మాడడం తప్పు అని అనను.  వాడికి ఇచ్చే మన కొద్దీ పాటి డబ్బు  మన ఆర్ధిక పరిస్థితి లో పెద్ద ప్రభావం చూపనప్పుడు. అల్లాంటి వాణ్ని కాస్త ఆనంద పరిస్తే మనకీ ఆనందమే కదా?" వివరించారు రామ రాజుగారు

.రామరాజు గారు చెప్పినది మా ఆవిడకి చెప్పిన తరువాత ఆవిడ లో మార్పు రావడం నాకు చాలా సంతోష మేసింది అయన తో పరిచయం అయిన మూడు సంవత్సరాలలోనూ, ఆయన సలహాలతో స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు పొందడమే కాకుండా, నా వ్యక్తిత్వంలో చాలా మార్పులకి ఆయన తో కలిసి తిరగడంతో జరిగింది. ఆయన ఎక్కడికి వెళ్లినా నన్ను కూడా రమ్మనేవారు. అలా ఆయనతో, బస్సులో, ఆటోలో,  కార్లలోనూ ప్రయాణించడం,  పెద్ద పెద్ద హోటల్స్ లో జరిగే ఇన్వెస్టర్ల కాన్ఫరెన్సులకి వెళ్లడం చాలా మాట్లు  జరిగింది. చాలా చిన్న  విషయాలలో ఇతరులని ఆనంద పరచడం లో ఆయన  చాలా ఆనందం పొందుతారని  చాలా సందర్భాలలో ఆయన ప్రవర్తన లో చూశాను. ఆటో వాళ్లతో పెద్ద బేరమాడక పోవడం. వాళ్ళకి చెల్లించేటప్పుడు ఓ పది రూపాయలు ఎక్కువ ఇవ్వడం చాలా మాట్లు  చూశాను. అటువంటప్పుడు ఆటో వాడి మొహం లో కనపడే ఆనందంతో కూడిన ఆశ్చర్యం చూడవలసిందే. కొందరు మెల్లిగా థాంక్స్ గొణిగితే, అది కూడా చెప్పడం తెలియని వాళ్లలో కనపడే బాడీ లాంగ్వేజ్ వింత గా ఉండేది. హోటల్స్ లోకి వెళ్ళినప్పుడు  సర్వర్ కి టిప్పు అందరూ ఇస్తారు, ఆయన కూర్చున్న టేబుల్ క్లీన్ చేస్తున్న కుర్రాడి చేతిలో పది రూపాయల నోటు పెట్టడం చాలా మాట్లు  చూశాను.

పెద్ద హోటల్స్  కి వెళ్ళినప్పుడు ట్రిమ్ గా డ్రెస్ చేసుకుని సెల్యూట్ కొట్టే గార్డ్ చేతి లోనూ, పార్కింగ్ గైడ్ చేసే వాళ్ళ చేతుల్లోనూ నోట్లు పెట్టడం ఆయనకి ఆనందం. వీటన్నిటిలోనూ నాకు ఇంకో విషయం స్పష్ట మయింది. తిరిగి కలుసుకునే అవకాశం లేని వాళ్లకు కూడా ఆయన చేసే సహాయాలలో ఆయన పొందే ఆనందం నిస్వార్థ మైనదని నాకు అనిపించింది.

నేను ఇదివరకే చెప్పినట్టు రామరాజు గారు తన గురించి తాను చెప్పుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. కాని  ఆయన లో గొప్పదనం నాకు అనుకోకుండా వేరోకళ్ల ద్వారా నాకు తెలియడం జరిగింది.
 
నేను వాళ్లింటికి వెళ్లి నప్పుడు ఆయన స్నేహితుడు రాజారావు అని ఒకాయన తరచు వాళ్ళింటికి రావడం చూశాను. ఆయన తో కాసేపు గడిపి వెడుతూ ఉండేవాడు. తన చిన్నప్పటి క్లాస్ మేట్ గా పరిచయంచేశారు రామ రాజు గారు. అంతకి మించి ఏమీ చెప్పలేదు. రాజారావు గారిని చాలామాట్లు రామరాజు గారింట్లో కలిసినా కొద్దీ సేపు మామూలు పలకరింపులు తప్ప ఎక్కువ సేపు ఆయనతో గడపడం జరగలేదు. కానీ ఆయనకి  రామరాజు గారంటే మామూలు స్నేహ భావం కంటే చాలా ఎక్కువ గౌరవం ఉన్నట్టు నాకు అనిపించింది. దానికి  కారణం   నేను ఆయన,  ఒక మాటు అనుకోకుండా పార్క్ లో కలిసి నప్పుడు ఆయనే చెప్పాడు. రాజారావు ఓ ప్రైవేట్ కంపెనీ లో చిన్న ఉద్యోగం చేసే వాడట . ఇద్దరు పిల్లలతో కష్టంగానే ఉండేది.

అన్న దమ్ముల మధ్య  తండ్రి ఆస్తి వాటాల పంపకం లో తన  వాటాగా కొంత డబ్బు వస్తే చిన్న వ్యాపారంలో పెట్టి అంతా పోగుట్టుకున్నాడట. ఇల్లు గడవని పరిస్థితి లో, ఒక స్నేహితుడి ద్వారా రామరాజు గురించి కనుక్కుని వచ్చి కలిసి   సిగ్గు పడుతూనే కొంచెం ఆర్థిక సహాయం అడిగాడేట. ఆయన వెంఠనే సహాయం చేయడమే కాకుండా, పరిస్థితులు తెలుసుకుని ఆయన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేసి,  తెలుసున్న కంపెనీ లో ఉద్యోగంలో చేర్పించి, స్థిరపడేదాకా పిల్లల చదువులు మొత్తం ఆయనే బాధ్యత తీసుకుని మొత్తం కుటుంబాన్ని ఒడ్డున పడేశారు. మొత్తం అంతా చెప్పి కుచేలుడి కి జరిగినది నా జీవితంలో కూడా జరిగింది. చిన్న నాటి స్నేహితుడిగా  రామ రాజు చేసిన సహాయం తాను మరువలేనని అన్నాడు ఆయన. ఇంత కంటే మంచి వ్యక్తులు ఉండరు అనిపించింది అప్పుడు  . ఉంటారని ఆ తరువాత రెండు సంవత్సరాలకి కానీ తెలియలేదు నాకు
 
***
 
నేను రాజారావుగారు  ఒక రోజు   రారామరాజు గారింట్లో ఉండగానే సంధ్య పరిగెత్తుకు వచ్చింది వాళ్ళాయన  రక్తం వమనం చేసుకుని ఇంట్లో పడిపోయాడ ని. మేము ముగ్గురం పరిగెత్తుకు వెళ్లి అతన్ని  హాస్పిటల్ కి తరలించాము. ఆ తరువాత పరీక్షలు చేసి డాక్టర్లు లివర్ పూర్తిగా పాడయిందని చెప్పడం, ఆ తరువాత వారం రోజులకే అతను హాస్పిటల్ లోనే మరణించడం జరిగింది.

ఆ తరువాత సంధ్యని పిల్లలినీ రామరాజు గారు ఇంటికి తీసుకువచ్చేశారు. సంధ్య కొంచెం అమాయకురాలు . చదువు పెద్దగా పెద్దగా చదువుకో లేదు. ఆర్థికంగా అవసరం లేకపోయినా, ఒక వ్యాపకం లో ఉంటె మంచిదని, ఒక తెలిసిన స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ లో అసిస్టెంట్ గా చేర్చారు. రాజారావు గారు రోజూ వస్తూ పిల్లల చదువులో సహాయం చేస్తూ ఉండేవారు. పైకి చెప్పక పోయినా రామరాజు గారు  కూతురు జీవితం అలా అయిపోవడం తో చాల మనస్తాపానికి గురవుతున్నారని మాకనిపించింది.

ఒక ఏడాది పైన గడిచిన తరువాత ఒక రోజు హఠాత్తు గా రాజారావు గారు మా ఇంటికి వచ్చారు. ఆయన మాఇంటికి రావడం తక్కువ. ఎప్పుడూ రామరాజు గారింట్లోనే కలుస్తాము. మా ఆవిడ తెచ్చిన కాఫీలు ముగించగానే రాజారావు గారు పెద్ద ఉపోద్ఘాతం లేకుండానే అన్నారు " మనం సంధ్య కి ఏదయినా సంబంధం చూసి తిరిగి మళ్ళీ పెళ్లి చేసియాలండీ. మన జీవితాల్లో మన ఇప్పటి ఆనందానికి కారణమయిన రామ రాజు ని చూస్తే నాకు చాల బాధ గా ఉండండి. పైకి చెప్పక పోయినా ఆయనకి  సంధ్య భవిష్యత్ జీవితం పట్ల ఆందోళన ఉందేమో అనిపిస్తోంది. ఎంత ఆర్ధిక సమర్థత కల్పించినా సరయిన తోడు లేకుండా పిల్లలిని పైకి తీసుకు రావడం కష్టమే కదా? వీళ్లా పెద్దవాళ్లయిపోయారు కదా? తరువాత ఏమిటనే ఆలోచన వస్తే మనస్తాపం గానే ఉంటుంది. నాకు జానకమ్మ గారిద్వారా తెలిసిన విషయం ఇది. నా జీవితం లో అతను చేసిన సహాయం మీకు తెలియనిది కాదు. సంధ్య కి పిల్లలికి భవిష్యత్తు ఆశాజనకం చేయడం లో ఆయనకి  మనం ఏంచేయగలం అని ఆలోచిస్తే ఇది తట్టింది. మీతో కూడా ఆలోచిద్దామని వచ్చాను"

" చాలా మంచి ఆలోచన సార్. నేను కూడా చేతులు కలుపుతాను. ఆయన వల్ల చాలా విధాలుగా నేను కూడా లబ్ది పొందాను కదా. ఆయన కి ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య సంధ్య విషయమే కదా? మనం ఒక పని చేద్దాం . ముందు సంధ్య అభిప్రాయం, ఆ  తరువాత, జానకమ్మ  గారి అభిప్రాయం కనుక్కున్న తరువాత మాత్రమే ప్రయత్నాలు ప్రారంబిద్దాము.  ఇంకో ముఖ్య విషయం   పిల్లలు మరొక వ్యక్తిని తండ్రి గా ఆహ్వానించడానికి తయారు గా ఉన్నారా ? ఏమంటారు" అన్నాను నా మనసులోని మాట చెప్పి

"గత చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను కదా. సంధ్యకి కానీ  పిల్లలికి కానీ రామరాజు గారి అల్లుడు కిరణ్ తో పెద్ద ఆత్మీయ అనుబంధం లేదు. అతను ఎప్పుడూ ఆ రెండో ఆమె తో ఉండి, అప్పుడప్పుడు వచ్చినా  పూర్తి మత్తు లో ఉండేవాడు. పిల్లలిని చేర  తీయడం కానీ, సంసారాన్ని పట్టించుకోవడం కానీ ఎప్పుడూ జరగలేదు. . అందు చేత సంధ్య కానీ, జానకమ్మ గారు కానీ మన ప్రతిపాదన కాదనరనే  నమ్మకం నాకుంది" అని ఆశా భావం వ్యక్తం చేశారు ఆయన. 

రాజారావు గారు ఆయన భార్య కలిసి సంధ్య దగ్గర విషయం కదిపారు . మొదట సంధ్య సానుకూలంగా స్పందించలేదు. తల్లి తండ్రులు పెద్ద వాళ్ళయి పోవడం, తమ్ముడు విదేశాలలో ఉండడం, పిల్లల భవిష్యత్తు అన్నీ వివరిస్తే సుముఖత తెలిపింది. కానీ ఆమె చాలా సమంజసమయిన సందేహం వెలిబుచ్చింది.  "పిల్లతో సహా తనని పెళ్లి చేసుకునే వ్యక్తి దొరకడం సాధ్యమయే పనేనా? అటువంటి వాళ్ళు ఉంటారా?"  అని.

మనకి అన్నీ సానుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్ళ వచ్చని. ఒక ప్రయత్నం చేయడం లో లోపం లేదని నేను మా ఆవిడా కూడా  సంధ్యకి నచ్చ చెబితే "సరే" అంది. పిల్లల విషయం తరువాత ఆలోచిద్దాము అని అనుకున్నాము.  ఆ తరువాత ఎవరూ లేనప్పుడు పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని నేను అన్నాను " మనింటికి ఒక మంచి కొత్త నాన్న వస్తే ఎలా ఉంటుంది ?" అని. దానికి సంధ్య కొడుకు సాయి " కొత్త నాన్న కొడతాడా? అన్నాడు అమాయకం గా ."అదేమీ ఉండదు నీకు చాక లెట్లు అవీ తెచ్చి మంచి కథలు చేబుతాడు. రోజూ పార్కుకి, సినిమాలకి తీసుకువెడతాడు " అని వివరిస్తే ఇద్దరూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారుఆలస్యం చేయకుండా నేను రాజారావు గారు సంబంధిత మాట్రిమోనియాల్ లో సంధ్య వివరాలు పెట్టాము.  భార్య పోయిన వాళ్ళు కానీ, విడాకుల వాళ్ళు కానీ కూడా స్పందించవచ్చని.పెట్టాము. సెల్ నెంబర్స్  నాది, రాజారావు గారిదీ మాత్రమే  ఇచ్చాము.
పది హేను రోజులకి ఇద్దరు కాంటాక్ట్ చేశారు. ఒకతను మోహన్.  విడాకులు తీసుకున్నతను, ఇంకొకరు  వేణుగోపాల్,  భార్య చనిపోయినతను. వేణుగోపాల్ ని కాంటాక్ట్ చేశాము. కానీ అతను పిల్లల బాధ్యత తీసుకోవడానికి ఇష్ట  పడలేదు. పిల్లలిని ఎవరయినా బంధువులు పెంచితే తాను పెళ్ళికి రెడీ అన్నాడు. ఇంకో రెండు ఎంక్వయిరీలు వచ్చాయి కానీ వాళ్ళ ఆకార వ్యవహారాలు మాకే నచ్చలేదు.  వాటిని సంధ్య దాకా  కూడా తీసుకువెళ్ళలేదు.
 
ఇంక ఆశలు సన్నగిలుతోంటే నాకు  కార్తికేయన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. కడలూరు దగ్గర ఒక సోలార్ ఎనర్జీ కంపెనీలో పనిచేస్తున్నాననీ,  అవివాహితుడననీ , సంధ్య ని చేసుకుంటానని చెప్పాడు.  ఎక్కడో తమిళనాడు వాడని నేను రాజారావు గారితో చెప్పలేదు . కానీ కొన్ని రోజుల తరువాత, ఫేస్ బుక్ లో సంధ్య వివరాలు, పిల్లల వివరాలూ చూశానని, పిల్లలతో సహా సంధ్య బాధ్యత తీసుకుంటానని అతను మళ్ళీ ఫోన్ చేశాడు. అతని కుటుంబ వివరాలు చెప్పాడు. ఎప్పుడో నాలుగు తరాల క్రితం గుంటూరు జిల్లా నుంచి వలస వెళ్లిన కుటుంబం. ఒక అన్నగారు ఇద్దరు అక్కలు.  అన్నగారు సుందరం ఫైనాన్స్ లో బ్రాంచ్ మానేజర్. అక్కలు  ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. తండ్రి తమళనాడు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో రిటైర్  అయ్యాడు. అన్నగారికి ఇద్దరు పిల్లలు. అతను, అన్నగారి కుటుంబం, తల్లి తండ్రులు, బామ్మ, అమ్మమ్మ అందరూ ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. అమ్మమ్మకి ఇతని తల్లి ఒక్కర్తే తప్ప వేరే సంతానం లేనందున వీళ్లతోనే ఉంటుంది. అతనికి ముఫై ఆరు సంవత్సరాలు.  అంటే సంధ్య కంటే రెండేళ్లు పెద్ద.  పెళ్లి తరువాత అతను పని చేసే కంపెనీకి దగ్గరగా ఇల్లు తీసు కుంటాననీ . నెలకి యాభై వేలు  జీతం అనీ చెప్పాడు. 

రాజారావు గారి తో చర్చించిన తరువాత  సంధ్య తోటీ  జానకమ్మ గారితోటీ చర్చించాము.వాళ్ళకి  వచ్చిన మొదటి సందేహం. అతనికి ఎందుకు ఇంతవరకూ పెళ్లి కాలేదు? ఎక్కడో తమిళనాడు నుంచి ఇంత  దూరం రావాలా? అని.  మాకు కూడా కొన్ని సందేహాలు అచ్చాయి.  తండ్రి రిటైర్ అయ్యి , బామ్మా, అమ్మమ్మ కూడా ఉన్నారంటే, వాళ్ళకి సేవకోసం ఈ పెళ్లి చేసుకోవటం లేదు  కదా? కానీ పెళ్లి తరువాత వేరుగా కాపురం పెడతానంటున్నాడు కనుక ఆలోచించ వచ్చేమో అనుకున్నాము . అందరం చర్చించుకుని, రామ రాజు గారు తో చర్చించాము. ముందు ఆయన ఆశ్చర్య పోయారు. ఎందుకంటే అంత  వరకూ ఆయనకీ ఈ  విషయం చెప్పలేదు. విషయం చెప్పా గానే ఆయన ముఖం లో వచ్చిన మార్పు బట్టి ఆయన లోలోపల చాలా ఆనందిస్తున్నారని అనిపించింది. కానీ ఒకటే అన్నారు. గతం లో సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయక పెద్ద తప్పు చేశానని, ఆ తప్పు ఇప్పుడు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని అన్నారు. అదంతా మా ఇద్దరికీ వదిలేయమని ఆయనకి చెప్పాము
ఈ లోపులో  కార్తికేయన్ ఫోన్ చేసి ఫేస్బుక్ లోనూ, వాట్సాప్ లోనూ సంధ్య తోనూ, పిల్లలతోనూ పరిచయం పెంచుకోవడానికి అనుమతి అడిగాడు. అతని వదిన గారూ. అక్కలూ కూడా వేరుగా ఫోన్ చేసి దూరం అని ఆలోచించ వద్దనీ, వాళ్ళ తమ్ముడు మంచి వాడనీ చెప్పి వాళ్ళు కూడా సంధ్య తోటీ పిల్లల్తోటీ పరిచయం లోకి వస్తామన్నారు.

అందులో పోయేది ఏమున్నదని  నేను, రాజారావు గారు ఆలోచించుకుని, పెద్దమనిషి తరహాగా వ్యవహరిస్తున్నారని అనిపించి, అనుమతి ఇచ్చాము. 

ఆ తరువాత, వాళ్లందరికీ సమ్మత మేనని  కార్తికేయన్ వదిన గారు ఫోన్ చెప్పింది . కార్తికేయన్   బామ్మ ఒక కోరిక కోరింది. వయసు మీరిన దృష్ట్యా హైదరాబాద్ రావడం కష్టమనీ, వీలయితే చెన్నై లో అందరూ ఒక మాటు కలుద్దామని అంది. చెన్నైలో రామరాజు గారి మిత్రుడి ఇంట్లో కలిసినప్పుడు. రాజారావు గారు ఆకార్తికేయన్ వదిన గారు సుధారాణి తో మాటలు కలిపి  కొన్ని వివరాలు సేకరించారు.

అక్కల పెళ్లిళ్లు లేటు అవడం తో నాగరాజన కి వివాహం లెట్ అయింది. పెళ్లి విషయం లో కూడా తాను ఎవరికయినా సహాయ కారి కావాలని అతని మనసు లో ఉన్న ఉద్దేశ్యం వదిన గారి ఒక్క దానితో చెప్పాడు. చూసిన సంబంధాలలో సంధ్య చాలా బాగుండడం తో, ఇద్దరు పిల్లలు ఉన్నా సంధ్యకి,  పిల్లలికి కొత్త జీవితం ఇవ్వాలని నిర్ణయించు కున్నాడు. ఇంట్లో చాలా నిర్ణయాలు బామ్మ గారి అనుమతి తో జరుగుతాయి. అందరికన్నా ఆఖర్న ఆవిడకి  చెప్పాడు. ఆవిడ ఒక్కటే మాట అందిట  " ఇద్దరు పిల్లలున్న మగవాళ్ళు భార్య చనిపోతే తిరిగి పెళ్లి చేసుకుంటూ ఉంటె ఇద్దరు పిల్లలున్నా భర్త చనిపోతే ఆమెకి ఎందుకు కొత్త జీవితం ఇవ్వకూడదు? "  ఇంట్లో అందరూ ఆనందంగా సంధ్యని పిల్లలతో తమ మధ్యకి ఆహ్వానించడానికి తయారు అయ్యారు. ఈ విషయాలు విని రామరాజు గారు చాలా సంతోషించారు. మా ఇద్దరికీ అన్ని విషయాలూ బాగానే కనిపించాయి.

హైద్రాబాదు తిరిగి వచ్చి జానకమ్మ గారికీ, సంధ్య కీ అన్ని వివరాలు చెప్పాము. ఇంకా జానకమ్మ గారు సందేహిస్తూ ఉంటె నేను ఒకటి చెప్పాను . ఎక్కడో పై కుటుంబంనుంచి వచ్చిన పెద్దకోడలు సుధారాణి ఆ కుటుంబంలో చాలా ఆనందంగా ఉండి, మరిది గురించి మంచిగా చెప్పిందంటే, మనం ఇంక ఆందోళన పడకుండా ముందుకు పోవచ్చని చెప్పాను. రాజారావు గారు కడలూరు వెళ్లి ఎవరికీ తెలియకుండా కార్తికేయన్ ఇంటి చుట్టూ పట్ల, ఆ కుటుంబం గురించి వాకబు చేశారు. ఎవరు చెప్పినా కుటుంబం 'బంగారం' అని చెప్పడంతో ఇంకా మేము ఆలోచించ లేదు.

పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉండగా, పెళ్ళికి పిల్లలిని తీసుకువెళ్ళడమా వద్దా అని సందేహం వెలిబుచ్చారు జానకమ్మగారు.  కార్తికేయన్ అన్నగారు పిల్లలికి పెళ్లి టయింలో కట్టుకునే బట్టలు కొనడానికి డబ్బు పంపి ఎలాంటివి కొనాలో కూడా చెప్పడంతో ఆ సందేహం తీరింది. వాళ్ళు దగ్గరలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయం లో పెళ్లి చేయమంటే , రాజారావు గారూ నేనూ అక్కడికి వెళ్లి ఏర్పాట్లు అన్నీ చేశాము.

పెళ్లి రోజున రామరాజుగారి  గారి దగ్గరి బంధువులు, కార్తికేయన్ బంధువులు, మిత్రులు  నీల కంఠేశ్వర ఆలయం లో సమావేశ మయ్యాము. అక్కడ పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయట. మాకు అందరికీ చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏమిటంటే సంధ్య కి కార్తికేయన్ కి  పెళ్లి తంతు నడుపుతూ, పిల్లలిద్దరికీ మెడలో దండలు వేసి పక్కన కూర్చోపెట్టి కార్యక్రమం అంతా  నడిపారు.

పెళ్లి అయిన తరువాత కార్తికేయన్ పిల్లలని వదలలేదు, తనతోనే తిప్పుకున్నాడు. పిల్లలు కూడా నాన్న నాన్న అంటూ అతనితోనే తిరుగుతున్నారు.

కొంచెం దూరంగా నేను, రామరాజు గారు, రాజారావు గారు వాళ్ళని చూస్తున్నాము. రామ రాజు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను కల చూస్తున్నానా ? ఇది నిజమేనా?   మన దేశం లో ఇలాంటి కుటుంబాలున్నసంగతి ఎంతమందికి తెలుసు?అన్నారు కళ్ళు తుడుచు కుంటూ.
మా ఇద్దరి చేతులూ పట్ట్టుకుని ' అద్భుతమయిన షహాయం చేశారు మీరిద్దరూ " అన్నారు

నేను అన్నాను "  సార్ ఎదో 'అదృశ్య శక్తి' రాజారావుగారికి  ఆలోచన తట్టించింది. మన చేతిలో ఏముంది? అన్నాను మనఃస్ఫూర్తిగా
కార్తికేయన్ లాంటి వాళ్ళ గురించి గొంతెత్తి చాలా మందికి చెప్పాలనిపించింది. ఇప్పుడు చేసినది అదే!

మరిన్ని కథలు
nanna