Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఇందూరమణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..... http://www.gotelugu.com/issue286/750/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... ఆ రోజు
నాలుగ్గంటలవుతోంది. ఇంకా తెల్లార లేదు. వార్డంతా ఓ సారి తిరిగి తిరిగి వచ్చాను. సోముకి తెలివి వచ్చి అందరితో హాయిగా మాట్లాడాక రాము ఎంతో సంతోషపడి పోయాడు. తన దగ్గరున్న ఏటిఎమ్‌ కార్డు నా చేతికి ఇచ్చేసాడు.

ఆ రోజు రాత్రే ‘ఆమె’ కూడా నాకు డబ్బు ఆశ చూపించి ఎలాగైనా రామూ దగ్గర ఏ.టి.ఎమ్‌. కార్డు తీసుకుని నా దగ్గర ఉంచమన్నారు. ఆమె తన ఫోన్‌ నెంబర్‌ నాకు ఇచ్చి కార్డు చేతికి రాగానే ఫోన్‌ చెయ్యమన్నారు. అందుకే నానా యాతన పడి రాముని నమ్మించి ఏ.టి.ఎమ్‌ కార్డు తీసుకున్నాను.

రాము వార్డు బయట వరండాలో బల్ల మీద హాయిగా పడుకున్నాడు. నేను వార్డు బయట కుర్చీలో కూర్చుని కునికి పాట్లు పడుతున్నాను. ఇంకో రెండు గంటల్లో డ్యూటీ దిగి పోతాను. కార్డు నా జేబులో భద్రంగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆమెకి  ఫోన్‌ చేసి కార్డు నా దగ్గరే ఉందని  చెప్పేస్తేనో!’’ అనుకుంటూనే సెల్‌ఫోన్‌ తీసి ఆమెకి ఫోన్‌ చేసాను. చాలా సేపటికి గాని ఆమె ఫోన్‌ ఎత్తలేదు.

‘‘హలో! అమ్మగారా! నేనమ్మా! వార్డుబోయ్‌ని.’’ అన్నాను.

అట్నుంచి ఎలాంటి సమాధానం లేదు. మళ్లీ  చేసాను. మళ్లీ చేసాను, అలా పదే పదే ఫోన్‌ చేసాను. కానీ  అవతల నుండి సమాధానం లేదు. చివరికి స్విచాఫ్‌ అని సమాధానం వచ్చింది.

డ్యూటీ దిగి ఇంటి కెళ్లినా నేను ఆమె ధ్యాస లోనే ఉన్నాను. నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఆమెకి పోన్‌ చేస్తూనే ఉన్నాను. కానీ రెస్పాన్స్‌లేదు.
ఆ మర్నాడు రాత్రి మళ్ళీ  నైట్‌ డ్యూటీకి వచ్చాను.

డ్యూటీ దిగిపోతున్న సమయంలో ఆమె నుండి నాకు ఫోన్‌ వచ్చింది. అప్పటికే ఆలస్యమైపోయింది. ఆరో గంటకి డ్యూటీ దిగాల్సిన వాడిని నాకు రిలీవర్‌ రాక ఎనిమిది గంటల వరకూ ఉండిపోవాల్సి వచ్చింది.

రాము, సోమూ హాయిగా కబుర్లాడుకుంటున్నారు. సోముకి తలకి మాత్రమే గాయం కావడం వలన ఆ కట్టుతోనే వార్డంతా తిరుగుతూ అందర్నీ పలకరిస్తూ పరిచయం చేసుకుంటున్నాడు.

రాము రెండు రోజులుగా హాస్పటల్‌ లోనే ఉండి పోయాడు. సోమూ తోడే లోకంలా నవ్వు...కబుర్లు...రాము తన దగ్గరున్న డబ్బుల్లో అయిదు వందలు ఖర్చు చేసి వార్డులో పేషెంట్లందరికీ పళ్లు కొని పంచి పెట్టాడు. డాక్టర్లు, నర్సు ఆ ఇద్దరు కుర్రాళ్ళ హుషారు చూసి పొంగి పోయారు.

అదే సమయంలో

ఎనిమిదివుతుండగా నాకు ఆమె నుండి పోన్‌ వచ్చింది. ఆతృతగా ఎత్తాను. ఎవరూ లేని ఓ మూలకు వెళ్లి ‘హలో’ అన్నాను. ఆమె నాకు ఫోన్‌ లోనే సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చింది. ఎందుకు అలా మాట్లాడుతోందో నాకర్థం కాలేదు.

ఒకే ఒక్క మాట అంది. ‘వెంటనే కలెక్టర్ ఆఫీసు ప్రక్కనే ఉన్న సందు లోకి అర్జెంటుగా రమ్మని చెప్పింది ఆమె. అంతే! సిస్టర్‌తో చిన్న పనుందని పరుగు పరుగున అక్కడకు వెళ్లాను.

ఆమె చాలా నీట్‌గా తయారయి దొరసానమ్మలా కనిపించింది. ఒక్క క్షణం పోల్చుకోలేక ఆమె ప్రక్కనే నిలబడి ‘ఆమె’ కోసమే ఎదురు చూస్తుంటే తనే నన్ను భుజం మీద చరిచి మరీ పలకరించింది. అంత అందంగా ఉన్న ఆమెని చూసి నన్ను నేనే మైమరచిపోయాను.
‘‘ఇదిగో! ఇది నీ కోసం! జేబులో పెట్టుకో! నాకో సహాయం చెయ్యాలి.’’ అంది ఆమె.

ఆమె ఎంతిచ్చిందో తెలీదు. కాగితం చుట్టిన డబ్బు కట్ట జేబులో పెట్టుకోమంది. అది లెక్క పెట్టాక నా దగ్గరున్న ఏ.టి.ఎమ్‌ కార్డును ఇద్దాంలే అని మర్చిపోయినట్టు వూరుకున్నాను.

‘‘చెప్పండమ్మా!’’ అన్నాను. ఏ.టి.ఎమ్‌ కార్డు విషయం ఎత్తకుండా.

‘‘సరిగ్గా అరగంటలో నేను కెజిహెచ్‌ మెయిన్‌ గేట్‌ ఎదురుగా కారులో ఉంటాను. రాముని, సోమూని ఒకసారి చూసి మాట్లాడి వెళ్ళిపోతాను. వాళ్లని నా దగ్గరకు తీసుకు రావాలి.’’ అంది ఆమె.

‘‘మీరే హాస్పటల్‌కి రండమ్మా! హాయిగా గంటో అరగంటో వాళ్ళతో మాట్లాడొచ్చు.’’ అన్నాను.

‘‘నేను రాగలిగితే నీకింత డబ్బు ఎందుకిస్తాను? నా పని నేనే చేసుకునే దాన్ని కదా!’’ కోపంగా అంది ఆమె.

ఆమె కోపం చూసి ఒక్కసారే నా శరీరం జలదరించింది.

‘‘అలాగేనమ్మా! అలాగే!’’ అన్నాను. కానీ అప్పుడు కూడా ఏ.టి.ఎమ్‌ కార్డు విషయం కావాలనే ఎత్తలేదు నేను.

‘వెళ్ళు....టైమ్‌ లేదు.... అరగంటలో వాళ్ళు నా దగ్గరుండాలి. నేను నీకు మిస్డ్‌కాల్‌ చేస్తాను. కాల్‌ అందిన అయిదు నిమిషాల్లో మెయిన్‌గేట్‌ దగ్గరుండాలి.’’ అంటూనే ఆమె హుందాగా నడుచుకుంటూ బీచ్‌ కేసి వెళ్లి పోయింది.

గాబరాగా వార్డు దగ్గర కొచ్చేసాను. వార్డు బయట వరండాలో రాము కూర్చున్నాడు. నాకు రిలీవర్‌ గా వచ్చే వార్డుబోయ్‌ కూడా వచ్చి కూర్చున్నాడు.

రాత్రంతా బయట ఓపి ముందు పడిగాపులు పడి ఉన్న పోలీసు నాకు ఆ క్షణం అక్కడ కనిపించ లేదు. నేను మొదట వాళ్లని పోలీసులనుకోలేదు. కానీ, ఆమె చెప్పింది. వాళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసుని. రాము, సోముల మీద పోలీసుల నిఘా పెట్టారని.
ఆ క్షణం మఫ్టీలో ఉన్న పోలీసులు ఎక్కడికెళ్ళారో అర్థం కాకపోయినా నా పని సులువవుతుందని ఆనంద పడ్డాను.
వార్డు దగ్గరకెళ్తూనే రాముకి ఆమె గురించి చెవిలో చెప్పాను. ‘నిన్నూ, సోమూని చూడాలని అంటున్నారని గేటు బయట రోడ్డు మీద కారులో ఉంటానన్నారని చెప్పాను. నా మాట వింటూనే రాము ఎగిరి గంతేసాడు. ఆమె అంటే వాళ్లకి అంత గౌరవం ఉందా అనుకున్నాను. అదే సమయంలో ఆమె నుండి ఫోన్‌ వచ్చింది ఎత్తలేదు. అది సంకేతం కదా.

నేను చెప్పిందే తడవుగా సోమూని తీసుకుని రాము బయట వరండాలో ఊరికే అలా తిరిగి వచ్చేస్తామని  సిస్టర్‌కి చెప్పి వెళ్లారిద్దరూ. నేను కూడా వారిని  అనుసరిస్తూ  వెళ్లాను. అప్పుడే ఓ మూలకి వెళ్లి జేబులో ఉన్న నోట్ల కట్టకు చుట్టిన పేపరు తీసి చూసుకున్నాను. గబగబా లెక్క పెట్టుకున్నాను.

పదివేల రూపాయలు...! వంద రూపాయల కట్ట. అయ్యో! ఇంతేనా! రెండున్నర లక్షలకు వస్తాయనుకున్నానే. అయ్యో! ఎంత దగా...ఎంత మోసం! అనుకుంటూ రామూ, సోమూ కోసం చూసాను.

అదే సమయంలో ఆమె నుండి ఫోన్‌. ఛటుక్కున ఎత్తి గట్టిగా కడిగెయ్యాలనుకున్నాను. కానీ రింగ్‌ ఆగి పోయింది.

పదివేల రూపాయలకి మళ్లీ కాగితం చుట్టి జేబులో దాచుకుని రాము సోమూల దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళి వాళ్లని ఆమెని కలవకుండా లాక్కొచ్చెద్దామన్న కోపంతో... ఆవేశంతో ముందుకు పరిగెట్టబోయాను.

ఎదురుగా హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ గారు కారు దిగి హాస్పిటల్‌ లోపలకు వస్తున్నారు. స్వీపర్లు, వార్డుబోయ్‌ లు, నర్సు లు, డాక్టర్లు అందరూ ఆయనకి వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఆయన దారికి అడ్డు తప్పుకుంటూ నిలబడుతున్నారు.

అల్లంత  దూరం నుండి హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ గార్ని చూస్తూనే ఓ మూలకి వెళ్లి దాక్కున్నట్టు నిలబడ్డాను.నా దృష్టి అంతా రోడ్డు మీదే ఉంది. రామూ, సోమూలు  హాస్పటల్‌ గేట్‌ దాటి రోడ్డు మీదకు వెళ్లారు.

అప్పుడే ఓ కారు వచ్చి వాళ్ల ముందు ఆగింది. ఆమె వాళ్ళతో ఏదో మాట్లాడింది. అంతే! రామూ, సోమూలిద్దరూ కారు డోరు తెరుచుకుని ఎక్కి కూర్చున్నారు.

రామూ సోమూలిద్దరూ కారు ఎక్కి కూర్చోగానే నా గుండెలు దడదడలాడాయి. ఏం జరిగిందో....ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కళ్ళు బైర్లు కమ్మాయి. కాళ్ళూ చేతులూ ఆడలేదు. భయంతో గజగజ వణికి పోయాను.

మౌనంగా తేలు కుట్టిన దొంగ లాగ డ్యూటీ దిగి ఇంటి కొచ్చేసాను.

ఇది సార్‌ జరిగింది! ఇంత కంటే ఇందులో నా తప్పేమీ లేదు సార్‌! ఆమె మోసగత్తె సార్‌! దగాకోరు. నన్ను నమ్మించి నట్టేట ముంచింది. వలవల ఏడుస్తూ  ఎస్సై అక్బర్‌ఖాన్‌ కాళ్ల మీద పడిపోయాడు వార్డుబోయ్‌.

వార్డుబోయ్‌ చెప్పింది విని అదిరిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

ఆ ఇద్దరు కుర్రాళ్లని కిడ్నాప్‌ చెయ్యాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏ.టి.ఎమ్‌ కార్డు కోసం వస్తుంది. ఆ కుర్రాడ్ని కలుస్తుందనుకున్నాడు. కానీ ఇలా జరిగిందేమిటి?!

‘‘రైటర్‌ గారూ! ఇతని దగ్గర స్టేట్‌మెంట్‌ తీసుకోండి. ఆ కుర్రాళ్ల కోసం ఎవరూ రారు. రిపోర్ట్‌ ఇవ్వరు. అవసరమైతే ఇతన్ని స్టేషన్‌కు పిలుద్దాం.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

వార్డుబోయ్‌ చెప్పిందంతా రికార్డు చేసి సంతకం తీసుకున్నాడు రైటర్‌. ఆమెకి చెందిన ఏ.టి.ఎమ్‌ కార్డుతో పాటు ఆమె ఇచ్చిన పదివేల రూపాయల నోట్ల కట్ట కూడా అతని దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు డబ్బులు లాక్కుంటుంటే  వలవలా ఏడ్చేసాడు వార్డుబోయ్‌.

బుల్లెట్‌ మీద ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యారు. చెంగల్రావుపేట నుండి దుర్గమ్మ గుడి వరకూ వచ్చారు. ఆలోచిస్తూ డ్రైవ్‌ చేస్తున్న ఎస్సై అక్బర్‌ఖాన్‌ నేరుగా టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. రైటర్‌కి ఇక్కడికెందుకొచ్చామో అర్థం కాలేదు. అయోమయంగా ఎస్సై అక్బర్‌ఖాన్‌ కేసి చూసాడు.

‘‘లోపలకురా! ఎస్సైని కలిసి వెళ్దాం’’ అంటూ ఎస్సై గది కేసి వెళ్లాడు అక్బర్‌ఖాన్‌. గదిలో ఏదో పనిలో ఉన్న టూటౌన్‌ ఎస్సై అనుకోకుండా అక్బర్‌ఖాన్‌ని చూసి ఆశ్చర్యపోయాడు.

‘‘రండి సార్‌! మీ కోసమే ఆలోచిస్తున్నాను. కాంప్లెక్స్‌లో జరిగిన జంట హత్య తాలూకా పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ వచ్చింది. మీ స్టేషన్‌కు పంపిద్దామనుకుంటున్నంతలో మీరే వచ్చారు.’’ ఎస్సై అక్బర్‌ఖాన్‌ని చూసి ఆహ్వానిస్తూ అన్నాడు టూటౌన్‌ఎస్సై. ఆతృతగా పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ తీసుకుని చూసాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌..

ఇద్దరి వయసు, వారి శారీరక పరిస్థితులు రాసి ఉన్నాయి. చనిపోయే ముందు ఇద్దరూ శారీరకంగా ఒకరికొకరు దగ్గరైనట్టు రాసారు. వారి చావుకు వినియోగించిన కత్తి పరిమాణం, గాయం తాలూకా లోతును బట్టి కత్తిమొన కొలతలు రాసి ఉన్నాయి

పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ చదివి ఆశ్చర్యపోలేదు ఎస్సై అక్బర్‌ఖాన్‌. కొండ మీద యాచకురాలైన ముసలమ్మ (సత్యవతమ్మ)ని ఏ కత్తితో అయితే హత్య చేసాడో అదే కత్తితో కాంప్లెక్స్‌లో ఇద్దరి హత్యా జరిగుంటుందని ముందే ఊహించాడు. అదే ఇప్పుడు పోస్టుమార్టమ్‌లో డాక్టర్లు రాసారు. అంతవరకే తమ పరిశోధనకి అవసరం.

 

 కళ్ళకు కట్టినట్టు చెప్పిన వార్డ్ బాయ్ మాటలు నిజమేనా..కట్టు కథలు కల్పించి చెబుతున్నాడ.. వాటిలో వాస్తవమెంత.. వాడి మాటల ద్వారా పరిశోధన సాగేదెంత.. ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం దాకా ఆగాల్సిందే..    

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani