Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue299/777/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి) అతను చెప్పింది విని ఉలిక్కిపడ్డాడు. నిజమా! కావాలనే... తనకు ప్రాణభిక్ష పెట్టారా?! ఎందుకు?! తల విద్చుకుని ఆశ్చర్యంగా ఎదురుగా కూర్చున్న బౌన్సర్‌ కళ్ళల్లోకి చూసాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘మీకు ప్రాణం భయం కలిగించాలనే అలా చేసాడు రంగా. మిమ్మల్ని చంపాలనుకుంటే  అది మాకో లెక్క కాదు. కానీ, మీరు మా టార్గెట్‌ కాదు. అనుకోకుండా అమాయకులు ముగ్గురు బలైపోయారు. మీక్కావసింది ఆ హత్యలు చేసిన హంతకుడు. వాడూ చచ్చాడు. హత్యలకు ఉపయోగించిన హత్యాయుధం, అదీ దొరికేసిందిగా. ఇంకా ఎందుకీ పిచ్చి పరిశోధన. ఆపెయ్యండి! మీ మంచి కోసమే చెప్తున్నాను.’’ సీరియస్‌గా అన్నాడు ఆ ఆగంతకుడు.

‘‘నెవ్వర్‌! నేను నమ్మను. ఆ రోజు ఆ హంతకుడు నేరుగా నామీదకే వచ్చాడు. అదృష్టవశాత్తు అదే క్షణంలో నేను సీట్లో నుండి లేచిపోయాను.’’ అప్రయత్నంగా అతనితో అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మీరు లేవలేదు సార్‌! మీ వెనుక ఎవరో సూదితో గుచ్చితే ఆ బాధతో లేచారు.’’ అన్నాడు అతను.అతనా మాట అనగానే ఆ రోజు బస్సులో రిలాక్స్‌డ్‌గా కూర్చున్నవాడు వెనుక ఎవరో సూదితో గుచ్చేసరికి బాధతో ఉలిక్కిపడి లేచాడు. అదే సమయంలో ఆ హంతకుడు కర్రతో తన మీద దాడికి పరిగెత్తుకు వచ్చాడు. నిజమే! అతను చెప్పింది నిజమే! ఇదంతా ఇతనికెలా తెలుసు?! ఎలా?!ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఆశ్చర్యంగా అతనికేసి చూసాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఆ రోజు రంగాతో పాటు ఆ బస్సులో నేనూ ఉన్నాను. మీ వెనుక సీట్లో కూర్చుని మా పథకం ప్రకారం మీరు హఠాత్తుగా నిలబడేలా సూదితో బలన్ గా మీ పిర్ మీద గుచ్చింది నేనే.’’ నవ్వుతూ అన్నాడతను.

ఎస్సై అక్బర్‌ఖాన్‌కి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేసాయి. ఆ రోజు... కనికరించకుండా కడతేర్చాలనుకుంటే! ఎందుకో  గుండెలు దడదడలాడాయి.

‘‘మిమ్మల్ని చంపి మమ్మల్ని మేము పద్మవ్యూహంలో బంధించుకోలేము. మా ధ్యేయం వేరు. మా గురి వేరు. మా టార్గెట్‌ వేరు. మీరు కాదు, అందుకే చెప్తున్నాను. వినండి! మీ పరిశోధనలకి భంగం కలగకుండా కేసు క్లోజ్‌ చేసుకోండి. ఇక్కడ నుండి వెనక్కి వెళ్లిపోండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇది చెప్పాలనే ఉదయం నుండి మీ వెంట నీడలా తిరుగుతున్నాను. మీరెప్పుడు ఒంటరిగా దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాను. రూమ్‌ లోకే రావాలనుకున్నాను. అక్కడ మాట్లాడ్డం కుదరదు. పోట్లాటలకు సిద్ధమవుతాం ఒకర్నొకరు ఎటాక్‌ చేసుకోవాలనే చూస్తాం. ఎందుకంటే ఎవరి ప్రాణం వారికి ముద్దే కదా!’’ శ్రీకృష్ణుడిలా హిత బోధ చేస్తున్నట్టు చెప్పి డ్రింక్ సీసా ఖాళీ చేసి క్రింద పెట్టాడు ఆ ఆగంతకుడు.

అప్పుడు తెచ్చాడు సర్వర్‌. ఎస్సై అక్బర్‌ఖాన్‌ ఆర్డర్‌ ఇచ్చిన ఐటమ్స్‌ అన్ని బల్ల మీద పేర్చి వెళ్ళాడు.

‘‘హాయిగా భోజనం చేసి నైట్‌ బస్సెక్కి వెళ్ళిపొండి! భాయ్‌!’’ అంటూ కుర్చీలో నుండి లేచాడు ఆ ఆగంతకుడు. యలమంచిలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చైర్మన్‌ సెక్యూరిటీ గార్డులో ఒక్కడైన భౌన్సర్‌.

సర్వర్‌ తెచ్చిన బిర్యాని పొగలు కక్కుతోంది. ముట్టుకోడానికి కూడా మీలేనంత వేడిగా వుంది. లివర్‌ కర్రీ కూడా ఘుమఘుమలాడుతోంది.
ఆ ఆగంతకుడు వెళ్ళిన వైపే చూస్తూ అన్యమనస్కంగా బిర్యానీ గిన్నె తీసి ప్లేట్‌లో సర్వ్‌చేసుకోబోయిన ఎస్సై అక్బర్‌ఖాన్‌ చెయ్యి కాలి టక్కున గిన్నె టేబుల్‌ మీద పడేసాడు.

‘‘అయ్యో! నేను వస్తా కదా సార్‌! సర్వ్‌ చేస్తా కదా! మీరు సారు వాడితో మాట్లాడుతున్నారని ప్లేట్‌లో సర్వ్‌ చెయ్యలేదు.’’ దూరం నుండే ఎస్సై అక్బర్‌ఖాన్‌ బిర్యానీ గిన్నె  టేబుల్‌ మీద దబీమని పడేసినట్టు పెట్టడం చూసి పరుగున వచ్చాడు సర్వర్‌.

‘‘సరి సరి! సర్వ్‌ చెయ్యి’’ చిరాగ్గా అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

******

సాయంత్రం అయిదవుతోంది. చకచక బ్యాగులు సర్దుకుంది మనోరమ. తన గదికి తాళం వేసి సర్వెంట్‌ చేతికి తాళం ఇచ్చేసింది. మేడమ్‌ శోభాదేవి గారికి తను వెళ్ళిపోతున్నానని ఇంటర్‌కమ్‌ లో చెప్పి అక్కడ నుండి బయుదేరింది మనోరమ.

గబగబా పోర్టుకోలో నుండి గార్డెన్‌ లోకి వచ్చింది. అక్కడ నుండి నేరుగా మెయిన్‌ గేటు దగ్గరకు చేరుకుంది. లోపల నుండి వడివడిగా వస్తున్న మనోరమని చూస్తూనే గేటు ఓరగా తెరిచి పట్టుకున్నాడు గూర్ఖా.

మనోరమ లోపల నుండి గేటు దాటి బైటకు రాగానే ‘గుడ్‌ ఈవినింగ్‌ మేడమ్‌’ అంటూ మర్యాద పూర్వకంగా సెల్యూట్‌ చేసాడు గూర్ఖా.   బస్సులో వెళ్తే లేటవుతుందని వడపళనికి ఆటోలో బయలుదేరింది. ఆటో ఎక్కి ఎక్కగానే ఎస్సై అక్బర్‌ఖాన్‌ కి ఫోన్‌ చేసింది మనోరమ.    అవతల చాలా సేపటికి గాని ఫోన్‌ రిసీవ్‌ చేసుకోలేదు. రెండో సారి.... మూడో సారి రింగ్‌ ఇచ్చాక లైన్ లోకి వచ్చాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘సార్‌! హాయిగా పడుకున్నారా?’’ నవ్వుతూ అడిగింది మనోరమ.

‘‘లేదు. చెప్పండి.’’ అడిగాడు అట్నుండి ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘వడపళినిలో మురుగన్‌ టెంపుల్‌ తెలుసు కదా! అక్కడ కొచ్చేస్తాను. మీరు అక్కడకొచ్చెయ్యండి’’ అంది మనోరమ.

‘‘అలాగే!’’ అంటూ అవతల ఫోన్‌ కట్‌ చేసాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘ఏమిటీ మనిషి?! మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా ఫోన్‌ చేస్తే ఏదేదో మాట్లాడాడు. ఎంతో అప్యాయంగా.... ప్రేమగా పలకరించాడు. ఇప్పుడేమిటి కట్టె కొట్టె తెచ్చె లా షార్ట్‌కట్‌ లో మాట్లాడుతున్నాడు. నిద్ర మత్తులో మాట్లాడుతున్నాడా?!’ మనసులో మధన పడింది మనోరమ.

ఆరు గంటల కల్లా వడపళిని మురుగన్‌ గుడి ముందు ఆటో దిగింది. ట్రాఫిక్‌జామ్‌ వలన అరగంట లేటయి పోయింది.

‘ఈ సరికి ఆయన వచ్చేసే ఉంటారు.’ అనుకుంటూ గాబరాగా చెప్పు బైట స్టాండ్‌లో వదిలేసి పరుగందుకుంది మనోరమ. చాలా  పెద్ద  ఆలయం. గర్భాలయం చుట్టూ బేడా మండపం విశాలంగా ఉంది. గుడి ఆవరణ అంతా ఖాళీగానే ఉంది. ఆ రోజు ఎందుకో భక్తులు అంతగా లేరనుకుంటూ గర్భాలయం లోపలకు వెళ్ళింది. ఎక్కడ వెదికినా ఎస్సై అక్బర్‌ఖాన్‌ జాడ కానరావటం లేదు. బేడ మండపం లోనూ గుడి చుట్టూ తిరిగి తిరిగి వెతికింది మనోరమ.

ఎక్కడా ఎస్సై అక్బర్‌ఖాన్‌ కనిపించలేదు. అక్కడక్కడ గుంపులు గుంపులుగా కొంత మంది దర్శనాలు చేసుకు వచ్చి ఆలయం ఆవరణలో కూర్చొని ప్రసాదాలు తింటున్నారు. ఒకరిద్దరు బేడా మండపం గట్టుల మీద కూర్చున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయి గాలి గోపురం దగ్గరకు వచ్చి నిలబడింది మనోరమ.

‘ఫోన్‌ చేసి మరీ మరీ చెప్పింది. అయిదున్నరకల్లా గుడి దగ్గర ఉంటానని చెప్పింది. సరిగ్గా విన్నారో లేదో?!’ ఆలోచిస్తూ నిబడింది మనోరమ.    ఇంతలో ఒక ముసలాయన నడవలేక నడవలేక నడుస్తూ మనోరమ దగ్గరకు వచ్చాడు.

‘‘అమ్మా! ఈ అడ్రస్‌ ఎక్కడో చెప్పగలవా!’’ అంటూ చిన్న చీటీ మనోరమకి చూపించాడు.

‘‘అబ్బ! ఉండవయ్యా! నా గోల నాది నీ గోల నీది’’ అని విసుక్కుంటూ ఆ ముసలాడు ఇచ్చిన చీటీ సరిగ్గా చూడకుండా అతనికే ఇచ్చేయ బోయింది  మనోరమ.సరిగ్గా చూసి చెప్పండమ్మా!’’ అంటూ చెయ్యి గిల్లి చీటీ మనోరమ చేతిలో పెట్టాడు ఆ ముసలాయన.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani