Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue298/776/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి) రెస్టారెంట్‌ రెండయినా ఇంకా రద్దీగానే ఉంది. ఓ మూల ఖాళీగా ఉన్న టేబుల్‌ కనిపించే సరికి గబాలున వెళ్లి అక్కడ కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఒకడు కూర్చుని ఏదో కూల్‌ డ్రింక్ తాగుతున్నాడు.

ఎస్సై అక్బర్‌ఖాన్‌ని చూస్తూనే పరిగెట్టుకు వచ్చాడు ఆర్డర్‌ తీసుకునే హోటల్‌ సూపర్‌వైజర్‌.

చికెన్‌ బిర్యానీ ఆర్డరిచ్చాడు. దానికి తోడు లివర్‌ కర్రీ పట్రమన్నాడు. డ్రింక్‌ బాటిల్‌, వాటర్‌ బాటిల్‌ చకచకా ఆర్డరిచ్చి చిన్నగా, టేబుల్‌ మీద దరువేస్తూ తన ఎదురే కూర్చున్న వ్యక్తికేసి తీరుబడిగా తలెత్తి చూసాడు అక్బర్‌ఖాన్‌.

అతన్ని చూస్తూనే ఒక్కసారే ఎగిరిపడ్డట్టు ఉలిక్కిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

బౌన్సర్‌! ఉదయం తమ వెంటపడ్డ ఆగంతకుడు. అతని దృష్టి నుండి తప్పించుకున్నామనుకున్నాడు. కానీ, నేరుగా తాను దిగిన లాడ్జీకే వచ్చేసాడు. క్రింద రెస్టారెంట్‌లో మాటు వేసుక్కూర్చున్నాడు.

కొంపదీసి తన ఆచూకీ  రామ్‌గాని చెప్పేసాడా? ఏమో! చెంపమీద నాలుగు వాయించి వస్తానని వెళ్లి వీడికి వంగి వంగి నమస్కారాలు చేసిన మనిషేనా? ఎలా నమ్మగలం? వీడిప్పుడు తనని ఏం చెయ్యాలనుకుంటున్నాడు? కొంపదీసి టక్కున కత్తి తీసి గబుక్కున పొడిచేస్తాడా?   తానేమో షోకిళ్ళారాయుడిలా తయారయి టింగురంగా అని అన్నీ వదిలేసి వచ్చాడు. కనీసం ఆత్మ రక్షణ కోసం గన్‌ అన్నా జేబులో పెట్టుకు రాలేదు!  క్రింద రెస్టారెంటే కదా! ఏం ప్రమాదం ముంచుకొస్తుందిలే అనుకున్నాడు. కానీ, ఇప్పుడు ఎదురుగా మృత్యువు మీద పడి ఆవు రావురుమని తినెయ్యాలన్న కసిగా కూర్చుంది. ఎలా?! ఇక్కడ్నుండి తప్పించుకోవడం ఎలా?! కుర్చీలో కూర్చున్నాడే గాని ఎస్సై అక్బర్‌ఖాన్‌ శరీరమంతా అతనికి తెలియకుండా చెమటలు పట్టేస్తుంది. వెళ్తూ వెళ్తూ ఆ రామ్‌ మరీ భయంకరంగా భయపెట్టి వెళ్ళాడు.

‘‘నమస్తే సార్‌! మీరు ఆంధ్రా పోలీస్‌ కదా!’’ చిన్నగా నవ్వుతూ డ్రింక్‌ నెమ్మదిగా సిప్‌ చేస్తూనే అన్నాడు ఎదురుగా కూర్చున్న ఆగంతకుడు.    అదిరిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రతిగా నమస్కారం కూడా చెయ్యాలనిపించలేదు. తనని మాటల్లో దించి ఏమరు పాటుగా ఉన్నప్పుడు ‘ఎటాక్‌’ చేస్తాడేమో! అందుకే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ముళ్ల మీద కూర్చున్నట్టే కూర్చున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌..

‘‘నాకు తెలుసు సార్‌! మీరీ రోజు ఉదయమేగా ఫ్లైట్‌ దిగారు...తప్పు చేస్తున్నారు సార్‌! చాలా పెద్ద తప్పు చేస్తున్నారు.’’ ముందుకు వంగి అక్బర్‌ఖాన్‌కి మాత్రమే వినపడేలా నెమ్మదిగా అన్నా తీవ్రంగా హెచ్చిరిస్తూ అన్నాడా ఆగంతకుడు.

అతని మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. ఇక వాడి ముందు కూర్చోకుండా లేచిపోతేనో.... నో!....తను ఓ పోలీసు అధికారి. వాడెవడో గూండాగాడికి బెదిరిపోవడమా?! నెవ్వర్‌! ఏం చేస్తాడో చూద్దాం. ఎదిరించడానికి మానసికంగా సిద్ధమవుతూ సర్దుకు కూర్చున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఇంతకీ మీరెవరు?’’ గంభీరంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌. అంతా తెలిసినా ఏమీ ఎరగనట్టు వాడ్ని ఇప్పుడే చూసానన్నట్టు అన్నాడు.

‘‘అక్బర్‌ఖాన్‌ గారు! మీరే తెలివైనవారని విర్రవీగకండి. మహామహులే మట్టి కరిచిపోయారు. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఇంతటితో మీ పరిశోధన ఆపెయ్యండి. లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. అయిందేదో అయింది. ఇక వదిలెయ్యండి! బ్రతిమాలి చెప్తున్నానని భయపడుతున్నామనుకోకండి.  మీరూ తెలుగు వారే. నేనూ తెలుగువాడ్నే. పట్టపగలు అడ్డంగా నరికేసి నడిరోడ్డు మీద బోర విరుచుకుని నడుచుకుంటూ వెళ్ళే గాంధీనగర్‌ గూండాలని. దమ్మున్నోడ్ని. ఆంధ్రుడి వన్న ఒకే ఒక్క అభిమానంతో హెచ్చరిస్తున్నాను. ఇక్కడితో నీ ప్రయాణం ఆపేసి వెనక్కి వెళ్ళిపో!’’ ఈసారి కొంచెం కటువుగానే అన్నాడు ఆ ఆగంతకుడు.

‘అక్బర్‌ఖాన్‌గారూ!’ అని అతను సంభోదించి మరీ బెదిరించేసరికి ఎస్సై అక్బర్‌ఖాన్‌కి మతిపోయింది. తన పేరే కాదు. తన పుట్టుపూర్వోత్తరాలు కూడా ఆరా తీసేసినట్టున్నారు దుండగులు. ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది సాదాసీదా ‘హత్య’ వ్యవహారం కాదు. ఇందులో ఏదో నిగూఢ రహస్యం దాగుంది. చూద్దాం! ఇంకేం చెప్తాడో?!’ మనసులోనే అనుకున్నాడు ఎస్సై.మౌనంగా అతనికేసి చూసాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.. ఏం మాట్లాడ్డానికి విషయం ఇంకా పూర్తిగా తలకెక్కితేనా?! అతనింకా ఏం చెప్తాడో పూర్తిగా వింటే అప్పుడు విషయం పూర్తిగా అర్థమవుతుంది.

‘‘మీరేం మాట్లాడక్కరలేదు. మౌనంగా వెనక్కి తిరిగి వెళ్లిపోండి! మీకో నిజం తెలుసా?’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆ ఆగంతకుడు.    ఆశ్చర్యంగా చూసాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మీరు రాజమండ్రి నుండి వస్తున్నప్పుడు మీమీద హత్యాప్రయత్నం జరిగింది. తెలివిగా మీరే ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నారని కదూ అనుకున్నారు. కాదు. మా రంగాగాడే మీ మీద కత్తితో దాడి చేసి కావాలనే గురి తప్పించి సీటు మీద వేటు వేసాడు. బస్సులో నుండి గెంతేసి తప్పించుకోబోతూ  బస్సు క్రిందపడి చనిపోయాడు. హుషారుగా చెప్తూ చివరలో బాధగా అన్నాడు ఆ ఆగంతకుడు.

అక్భర్ ఖాన్ ఇంకా ఆసక్తికర మైన విషయాలను ఆగంతకుడి ద్వారా తెలుసుకుంటాడా..  అవేమిటో తెలుసుకోవాలంటే వచ్చేశుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి..    

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani