Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue299/778/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)...  ఆమె వంక ఒక మారు చూసి "చూడమ్మా.. పతివ్రత అన్న పదం నోటికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించింది. శరీరానికి సంబంధించిందైతే ద్రౌపది ఆ పదానికి ఎంత మాత్రం అర్హురాలు కాదు. మనసును పవిత్రంగా ఉంచుకున్నవాళ్లందరు పతివ్రతలే! మన పురాణాలు క్షుణ్నంగా చదివిన జ్ఞానంతో చెబుతున్నాను.

నీ విషయానికి వస్తే, అతను ముందు చెప్పక పోయినా, తర్వాత అతని ఉద్దేశం నీకు స్పష్టంగానే చెప్పాడు. చేసిన దానికి కృతజ్ఞతా పూర్వకంగా తగినది చేయడం న్యాయం. అతనెలాగూ తర్వాత నీకు కనిపించనన్నాడు. ఆడవాళ్లని మోసం చేసిన వాళ్లు సమాజంలో ఎలా చెలామని అవుతున్నారో మనకు తెలియంది కాదు. అపవిత్ర శరీరాలతో పవిత్రమైన పెళ్లి పీటలెక్కేవాళ్లూ మనకు తెలుసు. అతను నిన్ను, వేదించినా, మరో రకంగా బాధించినా మనం ఏం చేయలేని అసహాయులం. అంచేత అతనడిగింది తప్పయినా.. నీకు తప్పనిసరి. నీ పసుపు కుంకుమలు నిలిపిన అతను నీకు దేవుడే. అతని కోరిక తీర్చడంలో నాకేం తప్పు కనిపించడం లేదు. భగవంతుని సన్నిధానంలో నాకు తోచింది ఆయన వాక్కుగా భావించి చెబుతున్నాను. ఇందులో నా ప్రమేయం లేదు. నేను నిమిత్తమాత్రుణ్ననే భావన తోటే ఇది చెబుతున్నాను. ఇహ నీకు తోచింది నువ్వు చేయి తల్లి. ఇప్పుడు నాకు నువ్వు చెప్పిన విషయాలేవీ ఎవరితోనూ, ఎట్టి పరిస్థితిల్లోనూ పంచుకోనని భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను" అంటూ లేచాడు. ఆమె లేచి ఆయన పాదాలనంటి, ఆయన దీవించాక బయటకు వచ్చింది.

***

ఇంటికొచ్చిన కాత్యాయనికి, వీధి వాకిట్లో చెప్పులేసుకుని బయల్దేరుతూన్న కమలాకర్ ఆమెకి కనిపించాడు. అతను ఆమె వంక చూసి, ఆమె తల మీద నిలిచిన అక్షతల్ని చూసి "ఓహ్! గుడికి వెళ్ళావా? అమ్మకి చెప్పి వెళ్లకపోయావా? ఎక్కడికెళ్లావో అని నాకు ఎంత భయం కలిగిందో.. అందుకే నీకోసమని బయల్దేరుతున్నాను"అన్నాడు ఆందోళన నిండిన స్వరంతో.

ఆమె పేలవంగా నవ్వి సరాసరి వంటింట్లో కెళ్లి అన్నం వండడంలో మునిగిపోయింది.

***

ఆరోజు సాయంత్రమే కాత్యాయని మనోహర్ ను కలవాల్సింది. లేచిందగ్గర్నుంచి విసుగ్గాను, చిరాగానూ ఇంకా ఏమిటేమిటోగా ఉందామెకి. సాయంకాలం మూడు గంటల ప్రాంతంలో కమలాకర్ ‘స్నేహితుల్ని కలవడానికి వెళుతున్నానని, వచ్చేప్పటికీ రాత్రి చాలా ఆలస్యమవుతుందని’ చప్పి వెళ్లిపోయాడు.

సాయంత్రం ముఖం కడుక్కుని, మామూలు నేత చీర కట్టుకుని మనోహర్ ఇచ్చిన కార్డ్ తీసుకుని దాని వంకోసారి పేలవంగా చూసి బయటకు అడుగుపెట్టబోతూ, ఏదో గుర్తుకొచ్చినట్టు అసంకల్పితంగా అత్తగారి దగ్గరకు వెళ్లి తను ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నానని వచ్చేప్పటికీ ఆలస్యమవుతుందని, మరీ ఆలస్యమైతే అక్కడే పడుకుని మరుసటి రోజు ఉదయం వస్తానని, ఆవిడకి, కమలాకర్ కు కావలసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద అమర్చిపెట్టిందనీ చెప్పి బయటకు అడుగుపెట్టింది.

***

బ్రహ్మ దేవుడు అది చూసి పడీ పడీ నవ్వాడు. "చూశావా సరస్వతీ! అప్పుడు కదిలే శక్తిలేని పువ్వును సృష్టించి తుమ్మెద దౌష్ట్యానికి గురయ్యేలా చేశానని నన్ను నిందించావు, మరి కదిలి ఆలోచించే శక్తి ఉన్న కాత్యాయని  మనోహర్ దగ్గరకు తనకు తానుగా తరలి వెళ్లిపోతోందేమిటి?" అన్నాడు.

"ఇదీ మీ సృష్టిలోని లోపమే, ఈ విధి లిఖితమూ మీ ప్రతిభే కదా! ఆడదాన్ని అబలగా ఉంచాలన్న కోరిక సృష్టికర్తగా మీకూ ఉంటే ఇక మాకు స్వయం ప్రకాశమూ, సమానత్వం ఎలా సాధ్యమవుతాయి?" అంటూ కోపంగా విస విస వెళ్లిపోయింది.

‘ఔరా! స్త్రీలు బహు చమత్కారులు. ఎప్పుడూ వాళ్ల చేయి పైనే!’ అని తలలు పట్టుకున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్