Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue298/774/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)... కాత్యాయని ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచింది. అప్పటికే కమలాకర్ లేవడం ఎక్కడికో వెళ్లడం జరిగిపోయింది. అత్తగారు స్నానం చేసి పడక్కుర్చీలో కూర్చుని ఉన్నారు.

గబ గబ బయట వాకిట్లో కళ్లాపి జల్లి, ముగ్గేసి, స్నానం చేసి దేవుడికి దణ్నం పెట్టుకుని, వంటింట్లో కెళ్లి ఉప్మా చేసి అత్తగారికి తనకి ప్లేట్లలో పెట్టుకుని తీసుకొచ్చి ఆవిడకొకటిచ్చి తనూ మరొకటి తీసుకుని కుర్చీలో కూర్చుని తినసాగింది. తింటోందన్న మాటే గాని ముద్ద ముద్దకు మనోహర్ ప్రపోజల్ ను ఏం చేయాలన్న ఆందోళన విస్తృత మవుతోంది. అప్పుడే ఆమెకి సరిగ్గా ఓ ఆలోచన వచ్చింది.

గబ గబ తినేసి కాళ్లకు చెప్పులేసుకుని గుడికి బయల్దేరింది.

ఆమె వెళ్లే సరికి పూజలు పూర్తయి గర్భగుడి తలుపులు మూయబోతున్న అయ్యవారు ఆమెని చూసి నవ్వుతూ తలుపులు ఎడంగా తీశారు.

ఆమె కుడివైపుగా నుంచుని స్వామిని ఒక్కసారి తేరిపార చూసింది. లోకంతో తనకేమీ సంబంధం లేనట్టు నిర్లిప్తంగా చిన్న చిరునవ్వుతో నుంచుని ఉన్నాడు. ఆమె మనసులో నిట్టూర్చి కళ్లు మూసుకుని అంతా సవ్యంగా జరిగేట్టు చూడమని కోరుకుంది. అయ్యవారు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆమెని దీవించాడు. 

ఆయన గుడి తలుపులు మూసి వచ్చే వరకు ఆమె అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోతూ ’ఏమ్మా, నాతో ఏవన్నా మాట్లాడాలా?"చెప్పమ్మా" అన్నాడు లాలనగా.

ఆమె చెమర్చిన కళ్లతో తలూపింది.

తడిసిన ఆమె కళ్ల వెనక ఉన్న బాధను అర్థం చేసుకుని ఆమెని అక్కడే కొద్దిగా పక్క నున్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ దేవుడి పూజలు, ప్రత్యేక కార్యక్రమాలకు  సంబంధించిన వస్తువులు భద్రపరుస్తారు. అక్కడ అయ్యవారికి మాత్రమే ప్రవేశం. మరెవరూ లోపలికి రాడానికి సాహసించరు.

అక్కడ ఉన్న టేబుల్ కు అటువైపు ఉన్న కుర్చీలో తను కూర్చుంటూ తన ఎదురుగా ఉన్న కుర్చీలో ఆమెని కూర్చోమని సంజ్ఞ చేసి గ్లాసుడు మంచి నీళ్లిచ్చి తాగమని, ఆమె నీళ్లు తాగి కాస్త కుదుటపడ్డాక "చెప్పమ్మా, నీ మనసులో ఉన్న బాధంతా నీ తండ్రిలాంటి వాణ్ని నాకు చెప్పు. నా ద్వారా స్వామి నీకు పరిష్కారం చూపుతాడని నా విశ్వాసం. అలాగే నువ్వు చెప్పేది నేను ఎవ్వరికీ చెప్పనని స్వామి మీద ప్రమాణం చేస్తున్నాను" అన్నాడు.

కాత్యాయని కొద్దిసేపు మౌనాన్నశ్రయించి జరిగినదంతా చెప్పడం మొదలెట్టింది. తన మొర స్వామే వింటున్నంత శ్రద్ధగానూ చెప్పింది. ఇన్నాళ్లు తన మనసులో గూడు కట్టుకున్న బాధ మరొకరికి చెప్పుకోవడంతో కాస్త మనసుకు సాంత్వన కలిగింది.

అంతా విన్నాక  ఆయన "కాత్యాయనీ, కొంతమందితో దేవుడు ఇలా ఎందుకు ఆడుకుంటాడోనమ్మా! ఈ సమస్య చిన్నదేం కాదు. మహాశివుడు క్షీరసాగర మథనంలో హాలాహలం మింగే ముందునాటి పరిస్థితి. అంత క్లిష్టమైనదీనూ. ఇహపోతే ఈనాటి లోకం డబ్బుకు పూర్తిగా దాసోహం. విలువలు పూర్తిగా అడుగంటి పోయాయి. మీకున్న ఆర్థిక పరిస్థితికి కమలాకర్ కు సరైన వైద్యం జరిగి బతుకుతాడనుకోవడం కల్ల. సమయానికి దేవుళ్లా వచ్చిన మనోహర్ తగిన ఆర్థిక సహాయం చేసి కమలాకర్ ను పునర్జీవింపజేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాతే కోరరాని కోరిక కోరి తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఇక్కడో విషయం గమనించాలి. అతనిలో రాక్షసత్వం కొంత పాలే ఉంది- దానికి ఉదాహరణగా అతను నీతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. అతని కోరిక నీ ముందు పెట్టాక, తనిక నీకు కన్పించనని మాటిచ్చాక, ఈనాటి వరకూ నీకు కన్పడలేదు కూడా. అతను అన్నమాటకి కట్టుబడతాడని అర్థ మవుతోంది. అతనిలోని ఫక్తు వ్యాపారస్తుడు నిన్ను కోరుకున్నాడు. దాన్లో తప్పూ లేదు.

వ్యభిచారం రెండు రకాలమ్మా. ఒకటి మానసిక వ్యభిచారం- అందాన్ని చూసినప్పుడల్లా అనుభవించాలని కోరిక కలగడం. ఇది నూటికి తొంభై మందిలో జరుగుతుంది. పెద్ద పెద్ద రుషులకే తప్పలేదు ఆ రిమ్మ తెగులు. ఇహ రెండోది శారీరకం. అవకాశం వస్తే ఉపయోగించుకోవాలనుకు నే  వాళ్లే ఎక్కువ. అలాంటప్పుడు శీలం అన్న దానికి విలువ ఉన్నదంటావామ్మా! పైగా నువ్వు చపలత్వంతో అడ్డదారి తొక్కడం కాదు. పరిస్థితిల ప్రాభల్యం అది.

అంచేత..అంచేత...:కాస్త ఆగాడు.

ఆమె గుండె ధన ధన కొట్టుకుంటోంది. నుదుటన చెమటలు కమ్ముకుంటున్నాయి.

*****   

తన బాధనంతా అయ్యవారికి చెప్పుకుని మనసుని సాంత్వన పరుచుకున్న  కాత్యాయనికి , అయ్యవారు ఎటువంటి సలహాని ఇస్తారో   తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్