Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue303/786/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)..... ఆ తర్వాత సడెన్ గా పెళ్ళన్నాడు మా తమ్ముడు. అట్టహాసంగా అంతా స్టార్ హోటల్ లోనే కానిచ్చేసాడు. పెళ్ళిచూపులు ఇల్లు చూపులు...తాంబూలాలు...భోజనాలు...ఏమీలేవు. అంతా యాంత్రికంగా జరిగిపోయింది.
పెళ్ళికొడుకు ఎవరని చూస్తే నాకు తలకొట్టేసినట్లయింది. మా తమ్ముడి దగ్గరే జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న కుర్రాడు. బుద్ధిమంతుడు
బాధ్యత ఎరిగిన వాడు అని మా తమ్ముడు ఇష్టపడి అతనికి పిల్లనిచ్చి పెళ్ళిచేసాడు.అసలు పెళ్ళే ఇష్టంలేని మహాశ్వేత ఆ కుర్రాడితో పదేళ్ళు కాపురం చేసినా కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి మాట్లాడలేదు.ఆ కుర్రాడు కూడా మౌనంగానే తలొంచుకుని తిరుగుతున్నాడు. అతనే యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాబోయే చైర్మన్ హరిశ్చంద్రప్రసాద్.

పెళ్ళయిన తర్వాత తండ్రివెనక ఆఫీసుకు వెళ్ళి వ్యాపార లావాదేవీల్లో తలదూర్చి బాహ్యప్రపంచాన్నే మర్చిపోయింది మహాశ్వేత.
బంధువులు, స్నేహితులు పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు లేరేంటండీ ఎవరైనా డాక్టర్ కి చూపించండి అంటే చిన్న నవ్వు నవ్వి కారెక్కి తుర్రుమనేది మహాశ్వేత.

ఓ రోజు మహాశ్వేత ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి అదే విషయం అడిగి " డాక్టర్ దగ్గరకు వెళ్ళి రామ్మా అంటే కాపురం చేస్తే కదత్తా పిల్లలు పుట్టేది. నాన్నకి అల్లుడు కావాలి కూతురికి భరత అనేవాడొకడుండాలని కదా పెళ్ళి చేసారు..." అంటూ ఏదో మాట్లాడి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయేది మహాశ్వేత.

పదేళ్ళు గడిచిపోయాయి.

ఈ పదేళ్ళలో యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గణనీయంగా సాధించిన ప్రగతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పత్రికలు, టీవీచానెళ్ళు, తండ్రీకూతుళ్ళని ఇంటర్వ్యూలు చేసి గొప్పగా ప్రచారం చేసాయి.

ఏ పత్రిక చూసినా, ఏ చానల్ చూసినా ఈ తండ్రీకూతుళ్ళే పెద్దపెద్ద వ్యాపార సంస్థలు కూడా తండ్రీకూతుళ్ళని చూసి ఈర్ష్యపడేవాళ్ళె. ఏ ముదనష్టపు కళ్ళుపడ్డాయో...ఎవరి దిష్టి తగిలిందోగానీ ఓ రోజు హఠాత్తుగా చనిపోయాడు మా తమ్ముడు.

అప్పుడు మహాశ్వేత ఇండియాలో లేదు. ఏదో కంపెనీ విషయమై ఇంగ్లండ్ వెళ్ళింది. అప్పటికే అది వెళ్ళి పదిహేనురోజులు దాటిపోయాయి. మహాశ్వేతతో మా తమ్ముడు కూడా వెళ్ళాల్సి ఉంది కానీ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ పని ఉందని కూతుర్ని ఒక్కదాన్నే పంపించాడు. అలా ఒక్కర్తే వెళ్ళి రావడం కూడా మహాశ్వేతకు అలవాటే. విదేశాల్లో చదువుకున్న పిల్లకదా వెళ్ళిరానీ అక్కా అనేవాడు మా తమ్ముడు.
ఈసారి పదిహేను రోజులు దాటిపోయిందని నేనే గోల పెడితే తమ్ముడే అన్నాడు." కొత్త కంపెనీ చర్చల్లో ఉంది. అది పూర్తయితే గానీ రాదది. నాకంటే మొండిఘటమక్కా నీ మేనకోడలు" అంటూ నవ్వేసాడు.

ఆ రోజు-

రాత్రి పార్టీ నుండి ఆలస్యంగా వచ్చాడు. తమ్ముడితోబాటు పి.ఏ కూడా వచ్చి ఇంట్లో దించేసి వెళ్ళాడు.

ఉదయం తొమ్మిదవుతున్నా తమ్ముడు లేవలేదని నేనే టీ పట్టుకుని గదిలోకి వెళ్ళాను. ఎంత లేపినా లేవకపోయేసరికి భయపడిపోయాను. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేసాను.

ఆయన వెంటనే హాస్పిటల్ కి తీసుకురమ్మంటే నేనూ, మావారూ అందరం తమ్ముడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేసాం. అప్పటికే తమ్ముడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అంతే కాదు, తమ్ముడిమీద విషప్రయోగం జరిగిందని డాక్టర్లు చెప్పేసరికి షాకయ్యాను. తమ్ముడ్ని విషప్రయోగం చేసి చంపేసారనే వార్తను ప్రజల్లోకి వెళ్తే ప్రమాదమని మావారే నానోరు మూసేసారు.

కంపెనీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటే షేరు విలువ పతనమైపోతుందని, దానివిలువ కంపెనీయేకాదు, షేరు హోల్డర్లు కూడా నష్టపోతారని తమ్ముడిమీద విషప్రయోగం జరిగిన విషయాన్ని బయటకు రాకుండా చూడాలని అన్నారు మావారు.

ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాము. మా తమ్ముడ్ని చంపేంత శత్రుత్వం ఎవరికుందో మాకు అర్థం కాలేదు.
తండ్రి చనిపోయిన వార్త చేరగానే ఆగమేఘాలమీద ఇండియా వచ్చేసింది మహాశ్వేత. వస్తూనే తండ్రి శవం మీద పడి భోరున ఏడుస్తూ కూలబడిపోయింది. అప్పట్నుండి మహాశ్వేత ఒంటరిగా ఓ మూల కూర్చొని ఏడుస్తూ గడిపేది. తండ్రి జ్ఞాపకాలతోనే రోజంతా మౌనంగా ఉండేది. తల్లి పోయాక తండ్రే లోకంగా ఎదిగిన పిల్ల ఊహ తెలిసిన దగ్గరనుండి తండ్రే తల్లయి పెంచాడు.  తండ్రి చావు మహాశ్వేతని మానసికంగా కృంగదీసింది.

కంపెనీ వ్యవహారాలన్నీ భర్తకే అప్పగించేసింది. అడపాదడపా అవసరమనుకుంటే కంపెనీ వ్యవహారాల్లో సలహాలు సూచనలు ఇచ్చేది మహాశ్వేత.మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న పనివాళ్ళనందర్నీ మార్చేసి కొత్తవాళ్ళని పెట్టాడు మహాశ్వేత భర్త హరిశ్చంద్రప్రసాద్. పాతవాళ్ళనెవరినీ నమ్మలేకపోతున్నామని మామయ్యమీద వీళ్ళల్లో ఎవరో ఒకరు విషప్రయోగం చేసారన్నది ఆయన నమ్మకం.

నెలకోరోజు కంపెనీకి వెళ్ళి సిబ్బంది జీతాల బిల్లుల మీద, చెక్కుల మీద సంతకాలు పెట్టడానికి కూడా వెళ్ళేదికాదు. ఇంతకుముందులా ఉత్సాహంగా ఎందులోనూ పాల్గొనలేకపోయేది మహాశ్వేత.. అనుక్షణం తండ్రినే గుర్తు చేసుకుంటూ ఒంటరిగా మిగిలిపోయేది.
ఆఫీసు వూసెత్తితే కోపంతో రెచ్చిపోయేది. మహాశ్వేత భరత హరిశ్చంద్రప్రసాదే ఫైల్ ఇంటికి తెచ్చి సంతకాలు చేయించేవాడు. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లలో ఉన్న కంపెనీ వ్యవహారాలు చూడ్డానికి వెళ్ళాల్సివస్తే తప్పదన్నట్టు వెళ్ళేది.

ఆరునెలలు గడచిపోయాయి. మహాశ్వేతలో మార్పు రావటంలేదు. ప్రతి ఏడాది తండ్రితోబాటు అరకు వ్యాలీ ఎంతో ఉత్సాహంగా వెళ్ళేది. అది గుర్తొచ్చి నేను, మావారు భార్యాభర్తలిద్దర్నె అరకువ్యాలీ వెళ్ళమని బలవంతపెట్టాము. అరకువ్యాలీ వెళ్ళమనేసరికి మహాశ్వేత కూడా ఆనందంగానే తలవూపి బయలుదేరింది.

అక్కడకు వెళ్ళిన నాలుగురోజులకే మహాశ్వేత ప్రయాణిస్తున్న కారు లోయలో పడి చనిపోయిందన్న వార్త చేరింది మాకు. కారు డ్రైవర్ తోబాటు మహాశ్వేత కూడా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మాడిపోయిందని. ఆకారం లేని ఆ శవాన్ని మద్రాసు తీసుకువచ్చి దహనసంస్కారాలు నిర్వహించాము.." జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది శోభాదేవి.

ఎస్సై అక్బర్ ఖాన్, మనోరమ అంతా శ్రద్ధగా విన్నారు.

" అరకువ్యాలీ షికారుకి వెళ్ళింది ఇద్దరు భార్యాభర్తలు కదా, మరి శ్వేతాదేవి ఒక్కరే కారులో ఎక్కడికి వెళ్తున్నట్టో తెలిసిందా...?" అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

" విశాఖపట్నం మధురవాడలో ఉన్న యలమంచిలి గ్రూప్ కి చెందిన హాస్పిటల్ ఇన్ స్పెక్షన్ కి వెళ్ళొస్తానని మహాశ్వేత ఒక్కరే టాక్సీలో బయలుదేరిందని మహాశ్వేత భరత హరిశ్చంద్రప్రసాద్ చెప్పారు" అని చెప్పింది శోభాదేవి.

" మీకు మహాశ్వేతాదేవి బతికే ఉన్నారని ఎప్పుడు తెలిసింది" అడిగాడు అక్బర్ ఖాన్.

" ప్రమాదం జరిగిన రెండురోజుల తర్వాత అర్ధరాత్రి సమయంలో మహాశ్వేతే ఫోన్ చేసింది. ఎవరో అనుకుని ఫోన్ ఎత్తాను. నేనత్తా... మహాశ్వేతని అంది. నమ్మలేకపోయాను. జరిగినదంతా చెప్పింది. ఆశ్చర్యపోయాను. ఇంటికి రమ్మన్నాను. రానంది. తనకో నిజం తెలిసిందని, అది నిరూపణ అయితే అప్పుడు అందరి ముందుకూ వస్తానని అంతవరకూ తాను బ్రతికే ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దని అంది. నాకూ అదే మంచిదనిపించింది..." అని ఏడుస్తూ చెప్పింది శోభాదేవి.

" మహాశ్వేత ఏం చెప్పిందమ్మా?" ఆతృతగా అడిగాడు అక్బర్ ఖాన్.

" ఏడవకండమ్మా...మన మహాశ్వేతాదేవి బ్రతికే ఉన్నారు కదా! సంతోషమే కదా" శోభాదేవిని ఓదారుస్తూ అంది మనోరమ...

" అరకు నుండి విశాఖపట్నం వెళ్ళడానికి మహాశ్వేత ట్యాక్సీలో బయలుదేరిందట. శ్వేత భరత హరిశ్చంద్రప్రసాద్ పడుకుని లేవలేదట. ట్యాక్సీలో బయలుదేరి ఫాం హౌస్ నుండి అరకు బస్టాండ్ దగ్గరకొచ్చేసరికి ఒక అమ్మాయి విశాఖపట్నం వరకు లిఫ్ట్ అడిగితే సరేనని కారులో ఎక్కించుకుని దారిలో టిఫిన్ చేసి విశాఖపట్నం బయలుదేరారట. అరకు ఘాట్ రోడ్లో ప్రక్కనే కారు ఆపి లోయ అందాలు ఫోటోలు తీసుకుంటోందట మహాశ్వేత.

ఇంతలో కెవ్వుమన్న కేక విని వేనక్కితిరిగి చూసిందట. ఎవరో ఇద్దరు దుండగులు కారు డ్రైవర్ ని, ఆ అమ్మాయిని తలల మీద కర్రలతో బాదడం చూసిందట. అంతే....భయంగా అరిచేలోపు తనతలమీద కూడా కర్రతో కొట్టేసరికి క్రిందపడిపోయిందట.

తెలివి వచ్చి చూస్తే కారులో ముందు స్స్ట్లో డ్రైవర్, మహాశ్వేత, వెనుక సీట్లో ఆ అమ్మాయి ఉన్నారట. కారు లోయలోకి దొర్లుకుంటూ వెళ్ళిపోతోందట. వెంటనే డోరు తెరుచుకుని ప్రక్కకి దూకేసిందట మహాశ్వేత. అక్కాడనుండి నెమ్మదిగా ఘాట్ రోడ్ ని చేరుకుని ఎవరినో లిఫ్ట్ అడిగి విశాఖపట్నం చేరుకుందట. ఇక హాస్పిటల్ కి వెళ్ళలేదట. ఆ తర్వాత నాకు ఫోన్ చేసింది. అక్కడినుండి బద్రాసు వచ్చింది. ఎవరూ లేనప్పుడు బురఖా వేసుకుని మహాశ్వేత స్నేహితురాలిలా ఇంటికొచ్చింది. ముస్లిం పిల్లలా తనింటికి తానే దొంగలా వచ్చి తనకి కావలసిన బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకుని అవసరానికి కొంత డబ్బు, నా ఏ.టీ.ఎం కార్డులు పట్టుకుని వెళ్ళిపోయింది. మహాశ్వేత వెళ్ళి నెలరోజులవుతోంది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడమే గానీ, కలుసుకున్నది లేదు..."ఏడుస్తూనే చెప్పింది శోభాదేవి.

మైగాడ్....మహాశ్వేతని చంపాల్సిన అవసరం ఎవరికుంది?" ఆశ్చర్యంగా అన్నాడు అక్బర్ ఖాన్.

" అందుకే బాబూ...అది ఇంటికి రానన్నా నేను కాదనలేదు." అంది శోభాదేవి.

" మహాశ్వేతాదేవి బ్రతికి ఉండి ఇంటికి రాకుండా ఏదో అన్వేషిస్తూ తిరుగుతున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది శోభాదేవిగారూ" ఉత్సుకతతో అన్నాడు అక్బర్ ఖాన్.

" ఉంది బాబూ...దానికి కారణం ఉంది" అంటూ తనవెంట తెచ్చిన బ్యాగులో నుండి ఒక డైరీ తీసి ఎస్సై అక్బర్ ఖాన్ చేతికిచ్చింది శోభాదేవి.
" డైరీలా ఉందే? ఇదెవరిది మేడం?" అడిగాడు అక్బర్ ఖాన్...

ఎవరిదా డైరీ? ఏమున్నాయందులో గుట్టువిప్పే నిజాలు?? మహాశ్వేతని చంపే అవసరం ఎవరికుందో ఆ డైరీ తేల్చేస్తుందా???? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచిచూడాల్సిందే......

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
katyayani