Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue303/785/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)..... ఆటో ఆగిన చప్పుడవంగానే గుమ్మం దగ్గరకు వెళ్లిన కాత్యాయనికి భర్త ముఖం, కళ్లూ ఎర్రబారి ఉండడంతో అతనికి ఒంట్లో బాగోలేదేమోనని మదనపడుతూ.."ఏవైందండీ" అడిగింది.

కాత్యాయనీ "నా ట్రీట్ మెంట్ కు మనోహర్ డబ్బు కర్చు పెట్టాడట కదా? కారణం ఏమిటి? నువ్వూ మీ నాన్నా దేబురించారా? లేక..?"అని వెటకారంగా అడిగాడు.

"మీరు ముందు లోపలికి రండి" అని లోపలికి తీసుకెళ్లింది.

అతను విసురుగా లోపలికెళ్లి కుర్చీలో కూర్చుని "ఇప్పుడు చెప్పు"అన్నాడు.

కాత్యాయని నెమ్మదిగా విషయమంతా చెప్పింది.

"విషయం మొత్తం బానే చెప్పావు గాని చివర్లో మాత్రం నీకు తగ్గట్టుగా ఎడిట్ చేసుకున్నావు" అన్నాడు.

"అంటే?" అంది విషపు కత్తివాటుకు గురైనట్టుగా..

"అదే అక్కడి దాకా వెళ్లాకా నిన్ను ముట్టుకోకుండా, జాగ్రత్తగా మళ్లీ వెనక్కి పంపడం..అదీ నీ మీద మోజుతో.. అంత డబ్బు కర్చుపెట్టి.. నేను నమ్ముతాననే.."అన్నాడు కోపం ఆవేశం వ్యంగ్యం అన్నీ మాటల్లో మేళవిస్తూ..

"మీరు నమ్మినా, నమ్మక పోయినా అది వాస్తవం" అంది బాధతో.

"మీరందరూ అలాంటి పాపిష్టి డబ్బుతో నాకు వైద్యం చేయించకుండా నన్ను చంపేసినా బాగుండేది. ఇప్పుడు అందరూ నన్ను
పరామర్శిస్తుంటే. . ప్రతిక్షణం చచ్చిపోతున్నాను. నన్నందరూ మోసం చేశారు. ముఖ్యంగా కోరి చేసుకున్న నువ్వు. నీ ముఖం నాకు చూపించకు..ఈ క్షణమే బయటకెళ్లిపో.."

"అదికాదండీ..నేను మిమ్మల్నెందుకు మోసం చేస్తాను?"

"మోసం కాక, కాసేపు నిన్నతను ఏం చేయలేదనే అనుకుందాం.. కాని నువ్వు ఆ ప్రపోజల్ కి ఒప్పుకునే కదా నాకు ఆపరేషన్ చేయించావు. అంటే అతనిపై నీకూ మోజుంది. ఒప్పుకో"

"ఏంటండి ఆ మాటలు"కన్నీరు మున్నీరై అతని పాదాలపై వాలిపోయింది. ముసలవిడ తన గదిలోంచి బయటకొచ్చి ముఖంలో భయాన్ని కనబరచింది. కొడుకు కోపానికి కారణమేమిటో ఆవిడకి అంతుపట్టలేదు.

"ఛ ఛ.. నన్ను ముట్టుకోకు. నువ్వు ఈ క్షణం బయటకు వెళ్లకపోతే నిన్నయినా చంపేస్తాను, లేదా నేనయినా చచ్చిపోతాను"కోపంగా ఊగిపోతూ లేచి నిలబడి అన్నాడు.

ఆమెకేం చేయాలో పాలుపోలేదు. ముందతని కోపం తగ్గాలంటే బయటకెళ్లాలి అని బయటకెళ్లింది.

ఆమె వెనకనే తలుపులు విసురుగా మూసుకుపోయాయి.

రాత్రి పది.

చాలాసేపు ఆ తలుపులు తెరుచుకుంటాయేమోనని చూసింది. ప్చ్..తెరుచుకోలేదు.

ఆమె బాధపడుతూ గుడికెళ్లింది. మరుసటి రోజు ప్రత్యేక పూజలుండడంతో అయ్యవారు ఇంకా అక్కడే ఉన్నారు.

ఆమె ఆయణ్ని కలిసి తన బాధను వ్యక్త పరచింది. విన్న చాలా సేపటికి ఆయన "అప్పటి ఆ త్రేతాయుగానికి, ఇప్పటి ఈ కలియుగానికి మగాడి మనస్తత్వంలో తేడా ఏం లేదమ్మా. నువ్వు పతివ్రతవు. మీ ఆయనకు కాస్త కోపం తగ్గి నిన్ను వెతుక్కునేదాకా నువ్వు మీ నాన్నగారింట్లో ఉండు"అన్నాడు.

"లేదు అయ్యగారూ..పెళ్లి చేసే దాకానే వాళ్ల బాధ్యత. తర్వాత నా కష్టాలకి కన్నీళ్లకీ నేనే బాధ్యురాల్ని. ఆ వయసులో వాళ్లకి మళ్లీ గుదిబండనవలేను"అంది.

"పోనీ ఓ పని చేస్తావా?"అన్నాడు.

‘ఏంటన్నట్టు’గా కన్నీటి సముద్రంలాంటి ముఖాన్నెత్తింది.

*****

తన భర్త  అర్ధం చేసుకోకుండా , తన మీద అనుమానాన్ని వ్యక్తపరుస్తున్న కాత్యాయని ఇంకా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటుందో వచ్చేశుక్రవారం ఒంటి గంటకు  విడుదలయ్యే సంచికలో చూడండి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్