Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue306/792/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)..... మహాశ్వేతాదేవిని ఓదారుస్తూ శోభాదేవి, ఆమె భర్త, మహాశ్వేత భర్త హరిశ్చంద్రప్రసాద్, మనోరమ, ముసలి వేషంలో ఉన్న ఎస్సై అక్బర్ ఖాన్ హాల్లో కూర్చున్నారు. యూనిఫాం లో ఉన్న ఎస్సై కూడా వారితోనే ఉన్న.
మహాశ్వేతాదేవికి రక్షణగా వచ్చిన పోలీసులు ఆ భవనం చుట్టూ కాపలాగా నిలబడ్డారు.

" ఎస్సై గారూ మీరిక వెళ్ళొచ్చు. " ముసలి వేషంలో ఉన్న అక్బర్ ఖాన్ కల్పించుకొని అన్నాడు.

" లేద్సార్, కమీషనర్ గారు ఆర్డర్ రావాలి. ఇక్కడ జరిగినదంతా రిపోర్టు రాసి ఇవ్వాలి కదా" నవ్వుతూ అన్నాడు లోకల్ ఎస్సై.

" అవును కదా" అభినందన పూర్వకంగా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఎస్సై అక్బర్ ఖాన్.

" పోలీసులు మదన్ ని అరెస్టు చేసి తీసుకుపోయారు. అతని దగ్గర నాకొడుకు శ్యాం చిక్కుకున్నాడు. నా కొడుకుని ఎలా రక్షించుకోవాలి" ఉన్నట్టుండి రోదిస్తూ ఎస్సై అక్బర్ ఖాన్ ని అడిగింది మహాశ్వేత.

" మీ కొడుకు శ్యాం కి ఏమీ కాదు మేడం. మాదీ బాధ్యత. మీరు ఆందోళన్ పడకండి." అన్నాడు ముసలి వేషంలో ఉన్న అక్బర్ ఖాన్.

" అబ్బా....మీ వేషం చూడలేకపోతున్నాం. ఆ విగ్గు తీసి అవతల పడేయండి సార్." అంది మనోరమ. ఆ మాటకి మనసులోనే నవ్వుకుంటూ తలమీదున్న ముసలి విగ్గు, పెట్టుడు మీసాలు, గెడ్డానికి అంటించుకున్న పండు వెంట్రుకలు అన్నీ పీకి పడేసాడు అక్బర్ ఖాన్. కళ్ళకున్న సోడాబుడ్డి కళ్ళద్దాలు కూడా తీసేసి చిన్నగా నవ్వుతూ మనోరమకేసి చూసాడు ...

అప్పుడు చూసింది మహాశ్వేత అతన్ని.

" మీరు....మీరు... సిమ్హాచలం కొండమీద ముసలమ్మని హత్య చేసిన ప్రదేశంలో మిమ్మల్ని చూసాను...." అంది మహాశ్వేత.

" అవును మేడం....మీకు అభ్యంతరం లేకపోతే నాదో చిన్న ప్రశ్న..." ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న ఎస్సై అక్బర్ ఖాన్ అన్నాడు . అడగండన్నట్టుగా మౌనంగా అక్బర్ ఖాన్ కేసి చూసింది మహాశ్వేత. మదిలో ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు ...చాలాసేపట్నుండి అడగాలని అవకాశంకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అంతుచిక్కని హత్యలమిస్టరీ వీడిపోయింది. హంతకుడు దొరికాడు. కానీ ఇంకా ఏదో తెలుస్కోవాల్సిన విషయాలున్నాయనిపించింది అక్బర్ ఖాన్ కి.

" మీరు ప్రేమించిన మదన్ మీ సంస్థలోనే ...మీ దగ్గరే పనిచేస్తున్న విషయం మీకు తెలియదా అడిగాడు ఎస్సై అక్బర్ ఖాన్.

" ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను ఎస్సైగారూ" అంటూ టక్కున కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు మహాశ్వేత భర్త హరిశ్చంద్రప్రసాద్. తను చెప్పాల్సిన సమాధానం నేను చెప్తానంటూ ముందుకొచ్చిన భర్తకేసి అభిమానంగా చూసింది మహాశ్వేత.

" చెప్పండి సార్ " అన్నాడు అక్బర్ ఖాన్.

" పి.ఏ. మదన్ కుమార్ అలియాస్ మదన్ ని అపాయింట్  చేసింది మా మామయ్యగారే. అంటే మహాశ్వేతాదేవి తండ్రిగారే. ఆ సమయంలో మహాశ్వేతాదేవి విదేశాల్లో ఉన్నారు. కంపెనీ పనిమీద లండన్ వెళ్ళారు. మదన్ విదేశాల్లో చదువుకున్న విద్యార్థి అని ఆయన సర్టిఫికేట్లు చూసి మా చైర్మెన్ గారే ఎకాఎకీ మదన్ ని తన పి.ఏ. గా అపాయింట్ చేసుకున్నారు.

ఆ తర్వాత పదిహేను రోజుల్లోనే యలమంచిలి గ్రూప్ కంపెనీల చైర్మన్ మా మామయ్యగారు హఠాత్తుగా నిద్రలోనే చనిపోయారు.
కన్నతండ్రి చనిపోయిన వార్త వినగానే ఆఘమేఘాలమీద ఇండియా వచ్చేసారు. మహాశ్వేత. ఎయిర్ పోర్టు నుండి వచ్చి కారు దిగగానే తండ్రి శవం మీదపడి భోరున ఏడుస్తూ శవపేటిక ప్రక్కనే నిలబడ్డ మదన్ ని చూసి అప్పుడే నన్ను ప్రక్కకి పిలిచి అతనెవరు, ఇక్కడెందుకున్నాడని అడిగారు మహాశ్వేతాదేవి. చైర్మెన్ గారి పి.ఏ.గా ఈమధ్యే ఉద్యోగంలో చేరాడని నేనే చెప్పాను.

మామయ్యగారు చనిపోయిన దగ్గరినుండి మహాశ్వేతాదేవి కంపెనీ వ్యవహారాల్లో పాల్గొనడం మానేసారు. నాకే పూర్తిగా బాధ్యతలు అప్పగించి ఇంటిదగ్గరే తండ్రిని తలుచుకుంటూ గడిపేవారు. ఆఫీసుకు రావడానికి ఇస్ష్టపడేవారు కాదు. నేనూ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడనిపిస్తోంది ఆ మదంగాడి మొహం చూడలేక ఆఫీసుకు రాలేకపోయుంటారని అనిపిస్తోంది" తనకు తెలిసిందంతా చెప్పాడు హరిశ్చంద్రప్రసాద్.
" ఎస్..మీరన్నది నిజమే సార్. ఈరోజు ఉదయం చెన్నైలోనే నేను పి.ఏ. మదన్ కుమారే హంతకుడని మాకు రూఢీగా తెలిసింది. నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన వ్యక్తి బౌన్సర్ అతనే ఇప్పుడు అరెస్టయిన సెక్యూరిటీ సిబ్బంది నాయకుడు. నన్ను ఈ కేసు పరిశోధన నుండి తప్పుకోమని హెచ్చరించి వెళ్ళాడు. అదే వాళ్ళు చేసిన తప్పు. అదే క్లూ తో పరిశోధన ముమ్మరం చేసాం. చెన్నై పోలీసులు రాం తో కలిసి ఆ గూండాని అనుసరించారు. ఆ గూండా నేరుగా వెళ్ళి మీ ఆఫీసులో పి.ఏ. మదన్ తో రహస్యంగా సమావేశం కావడం కనిపెట్టారు.
అంతే. క్షణాల్లో ఇంటర్ పోల్ సహకారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో మదన్ పుట్టు పూర్వోత్తరాలు రాబట్టేసారు. దాని ప్రకారం నేను తెలుసుకున్నది ఒక్కటే. మదన్ కసి, కోపం కక్ష తనకు కాకుండా పోయిన మహాశ్వేతాదేవిని చంపడం. దానికి కారణం అయిన ఆమె తండ్రిని కూడా మట్టుబెట్టడం. ఇదే ధ్యేయంతో ఇండియా వచ్చాడు మీ పీ.ఏ. మదన్ " చెప్పడం ఆపి గొంతు పట్టేయడంతో చిన్నగా దగ్గుతూ కూర్చున్నాడు అక్బర్ ఖాన్.

అక్బర్ ఖాన్ దగ్గడం చూస్తూనే రామూ, సోమూలిద్దరూ పరుగున వెళ్ళి ఒకరు గ్లాసుతోనూ, మరొకరు లోటాతోనూ నీళ్ళు పట్టుకొచ్చి ఇవ్వబోయారు. ఇద్దరికేసి నవ్వుతూ చూసి రాము చేతిలో గ్లాస్ అందుకున్నాడు అక్బర్ ఖాన్.

మహాశ్వేతాదేవి విదేసాలనుండి చదువు ముగించుకుని ఇండియా వచ్చేసాక ఆమెకోసం ఎదురుచూసి ...చూసి మదన్ మద్యానికి మత్తుమందులకి అలవాటుపడి పిచ్చివాడైపోయాడట. ఈ పదేళ్ళు అతని తల్లిదండ్రులు మెంటల్ హాస్పిటల్ లో ఉంచి వైద్యం చేయించారట. ఆరోగ్యం కుదుటపడి వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్ని మర్చిపోయి హాయిగా తిరుగుతున్న సమయంలో ఈ మధ్యే ఫోర్డ్స్ మ్యాగజైన్ లో మీ తండ్రీకూతుళ్ళ ఇంటర్వ్యూలు చూసాడట. అంతే,,,,ఎవ్వరికీ చెప్పకుండా ఇండియా ఎగురుకుంటూ వచ్చేసాడని ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం.

ముగింపు వచ్చే సంచికలో......


(అన్నీ ఛేదించుకుని అన్నీ పరిష్కారమై, కథ కంచికి చేరినట్టేనా.....వచ్చే శుక్రవారం దాకా ఎదురు చూడాల్సిందే....)

 

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్