Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు.. - భమిడిపాటిఫణిబాబు

ఈ వారం ( 8/3 – 14/3 ) మహానుభావులు.

జయంతులు

మార్చ్ 8

శ్రీ దామెర్ల రామారావు :  వీరు మార్చ్ 8, 1897  న  రాజమహేంద్రవరంలో జన్మించారు. మనదేశం గర్వించదగ్గ ప్రముఖ  చిత్రకారుడు.  ఆరేళ్ళ వయసునుండి గోడమీద బొగ్గుతో బొమ్మలు, ఆపైన తెల్ల కాగితాల మీద వేయటం ప్రారంభించారు. మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ళవయసుకి చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీయటం, అవి అందరి అభినందనలు అందుకోవటం మొదలయింది. కొబ్బరితోటల్లో కూర్చుని, గోదావరిగట్టు మీద కూర్చుని, లాంచీలో తిరుగుతూ ఒకటేమిటి? అనేక ప్రకృతి దృశ్యాలను చిత్రించారు..ఆయన చిత్రాలు దేశవిదేశాల్లో ప్రసిధ్ధి పొందాయి. 1923 లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణను ఈయన ఇచ్చారు.

శ్రీ నార్ల తాతా రావు :  వీరు మార్చ్ 8, 1917 న కౌతవరం లో జన్మించారు. ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి 1983లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

మార్చ్ 10

శ్రీమతి స్వర్ణలత :  వీరు మార్చ్ 10, 1928 న  చాగలమర్రి లో జన్మించారు. అలనాటి ప్రఖ్యాత నేపథ్య గాయని. వీరు పాడిన సినిమా పాటలు , ఇప్పటికీ అభిమానుల నోళ్ళలో నానుతున్నాయి. యాదృఛ్ఛికంగా వీరు అదే తారీకున 1997 లో స్వర్గస్థులయారు కూడా.

మార్చ్ 11
 శ్రీ మాధవపెద్ది సత్యం :  వీరు మార్చ్ 11, 1922 న బ్రాహ్మణ కోడూరు లో జన్మించారు. ప్రముఖ చలన చిత్ర నేపథ్య గాయకుడు, రంగస్థల నటుదు.  . ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందారు.

మార్చ్ 13
శ్రీ కోలాచలం శ్రీనివాసరావు :  వీరు మార్చ్ 13, 1854 న హంపీ దగ్గర , కామలాపురం లో జన్మించారు. సుప్రసిధ్ధ నాటక రచయిత, న్యాయవాది. చిన్న వయసులోనే, తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యత సాధించారు. ఈయన వ్యావహారిక భాషోద్యమానికి వ్యతిరేకుడు..

ఆయన భారతదేశంలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాల నాటకాల చరిత్రలను పరిశోధించి ప్రపంచ నాటక చరిత్ర (ది డ్రమాటిక్ హిస్టరీ ఆఫ్ ది వల్డ్) అనే గ్రంథాన్ని ఆంగ్ల భాషలో రాశారు.

శ్రీ బూర్గుల రామకృష్ణారావు  :  వీరు మార్చ్ 13,  1899 న  కల్వకుర్తి దగ్గర  పడకల్ గ్రామంలో జన్మించారు…  స్వాతంత్రసమరయోధుడు. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేసారు. బహుభాషావేత్త. వీరికి   తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో  ప్రావీణ్యం ఉంది..  పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల  లహరీపంచకమును,  శంకరాచార్యుల  సౌందర్యలహరి,  కనకధారారాస్తవమును  తెలుగులోకి అనువదించారు.

మార్చ్ 14

శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు : వీరు మార్చ్ 14, 1842 న వినుకొండలో జన్మించారు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు,. నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం, గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని ఈయనే ఏర్పరచారు.

వర్ధంతులు

మార్చ్ 9

శ్రీ  బెజవాడ గోపాల రెడ్డి :  వీరు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు. బహుభాషావేత్త. ఆంధ్రరాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి. పదకొండు భాషలలో ప్రవీణుడయిన శ్రీ గోపాలరెడ్డి అనేక రచనలు చేసారు.

వీరు మార్చ్ 9, 1997 న స్వర్గస్థులయారు.

మార్చ్ 11
శ్రీ నేదునూరి గంగాధరం :  జానపద సాహిత్యాన్ని ఒక ఉద్యమంగా నడిపించిన ఘనత వీరిది.   చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు,
జంటపదాలు,  జాతీయాలు, సామెతలు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి.

వీరు మార్చ్ 11, 1970  న స్వర్గస్థులయారు.

శ్రీ శ్రీపాద పినాకపాణి :  రోగాలను, రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక పాణి . వైద్య, సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు వీరి శిష్యులే.. గురువులకే గురువు డా. శ్రీ పాద.. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న దినాలవి. నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆరోజులలో, తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు. ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేశారు.

వీరు  మార్చ్ 11,  2013 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
chamatkaaram