Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

కవి హృదయం ఒక ఖజానా. - వాసుదేవమూర్తి శ్రీపతి

గోతెలుగు: మీ జన్మస్థలం, బాల్యం, చదువు, అమ్మానాన్నల గురించి....
వాసుదేవమూర్తి శ్రీపతి : నేను పుట్టింది కృష్ణా జిల్లాలోని గన్నవరం పక్కన పెద్ద ఆవటపల్లి. నాన్నగారి పేరు వేణుగోపాల కృష్ణమూర్తి, అమ్మ సీతారామలక్ష్మి ఇద్దరిదీ ఆదే ఊరు. ఉద్యోగరిత్యా నాన్నగారు ఆదిలాబాద్‌ జిల్లాలో మాదారం టౌన్‌షిప్‌లో స్థిరపడ్డాము. నా చదువంతా అక్కడే. నాన్నగారు వేణువు, హార్మోనియం విధ్వాంసులు. అమ్మకి కూడా సంగీతం వచ్చు. 
 
గోతెలుగు: మిమ్మల్ని కవితా ప్రపంచం వైపు నడిపించిన స్పూర్థి ప్రదాతలు....
వాసుదేవమూర్తి శ్రీపతి : ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో మా స్కూల్‌ లో ఉగాదికి విద్యార్థుల కవిసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సమ్మేళనం కోసం నేను నా మొదటి కవిత రాశాను. " ఈ జీవితమే నాటకరంగమైతే..." అంటూ మొదలయ్యే ఆ కవితని మా నాన్నగారికి వినిపించాను. ఆయనే నా మొదటి శ్రోత. అంతా విని "జీవితం నాటకరంగమని నువ్వు చెప్పేదేంట్రా షేక్‌స్పియర్‌ ఎప్పుడో చెప్పేశాడు." అన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలియదు గానీ నా ఆనందానికి మాత్రం అంతు లేదు. అంత గొప్ప కవికి వచ్చిన ఆలోచన నాకు ఇంత చిన్న వయసులో వచ్చిందంటే... నేను నేలమీద నడవడానికి నాలుగైదు రోజులు పట్టింది. నేను కవిగా పనికొస్తాననే నమ్మకం బలపడింది. ఆ తరువాత శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం చదివాను. కవిత్వం ఎలా రాయాలో అర్థం అయ్యింది. చాలా కవితలు రాశాను. స్ఫూర్తి దాతలు ఎవరనేదానికి సరైన సమాధానం చెప్పలేను కానీ నా కవిత్వం మీద శ్రీ శ్రీ గారి ప్రభావం చాలా ఉంటుంది. 
 
గోతెలుగు: మీ తొలి కవితను ప్రోత్సహించిన పత్రిక, సంపాదకులు.. ఆనాటి అనుభూతి...
వాసుదేవమూర్తి శ్రీపతి : ప్రచురించబడిన నా తొలి కవిత "హరిత విప్లవం". ఆంధ్రప్రభ (30/4/17) ఆదివారం అనుబంధంలో వచ్చింది. కవిత క్రింద ఉన్న నా నంబర్‌ చూసి ఎవరో ఒక పెద్దాయన ఫోన్‌ చేసి చాలా బావుంది అని చెప్పారు. నిజానికి ఆ కవిత ప్రచురించబడ్డ విషయం ఆయన చెప్పేవరకూ నాకు తెలియదు. సినిమాలలో పాటలు రాసినప్పటికన్నా ఆ రోజు చాలా సంబరపడ్డాను. ఆ తరువాత గోతెలుగు, తెలుగు వెలుగులతో సహా చాలా పత్రికలలో నా కవితలు వచ్చాయి. నాకు సినిమా పాటలు రాయడం కన్నా కవిత్వం రాయడమే ఎక్కువ ఇష్టం. కవిత్వం రాయడంలో భావ స్వాతంత్ర్యం, భాషా స్వాతంత్ర్యం ఉంటాయి. సినిమా పాటల్లో అలా కుదరదు. వాళ్ళకి ఏం కావాలో అదే రాసివ్వాలి. 
 
గోతెలుగు: కవి హృదయం, స్పందనలు ఎలా ఉండాలని మీ ఆకాంక్ష..
వాసుదేవమూర్తి శ్రీపతి : కవి హృదయానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒక పక్క పువ్వులా లలితంగా ఉంటుంది. మరో పక్క కత్తిలా పదునెక్కి ఉంటుంది. కీచురాళ్ళ అరుపు నుండి సముద్రపు ఘోష వరకూ అన్నింటినీ కవిత్వీకరించగలిగే శక్తి కలిగి ఉంటుంది. బిచ్చగాడి ఆకలి నుండి ప్రపంచీకరణ వరకూ అన్నింటికీ స్పందిస్తుంది. ఆ స్పందన ఒకసారి ఆర్ద్రంగా ఉంటుంది, మరోసారి అగ్నిలా ఉంటుంది. కవి హృదయం ఒక ఖజానా. ప్రకృతి, ప్రపంచం, సముద్రాలు, అగ్ని పర్వతాలు, హిమ శిఖరాలు ఆ ఖజానాలో నిక్షిప్త నిధులు. కవి హృదయంలో ఆకలి, ఆనందం సహజీవనం చేస్తుంటాయి. ప్రశ్నలు, సమాధానాలు స్నేహితుల్లా భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతుంటాయి. కవి విశ్వమనే విశ్వ విద్యాలయంలో విద్యార్థి, ప్రపంచం అనే పాఠశాలలో గురువు. కవి అరిషడ్వర్గాలకీ, ప్రలోభాలకీ లొంగకూడదు. కవి స్వాప్నికుడై ఉండాలి! కవి కల సమాజ శ్రేయస్సై ఉండాలి. కవి ప్రేమికుడై ఉండాలి! కవి ప్రేమ విశ్వజనీయమై ఉండాలి. 
 
 
గోతెలుగు: ఆధునిక కవితా ప్రపంచం ఎటువైపు వెళ్తోంది...
వాసుదేవమూర్తి శ్రీపతి : ఆధునిక కవితా ప్రపంచం అగమ్యగోచరం. ఒక సందంర్భంలో సుద్దాల ఆశోక్‌ తేజా గారు కవుల సంఖ్య పెరుగుతోంది అంటే సమాజంలో మంచివాళ్ళ సంఖ్య పెరుగుతోంది అన్నారు. నిజమే కవుల సంఖ్య పెరుగుతోంది కానీ కవిత్వం మాత్రం భ్రష్టుపడుతోంది. కనీసం ఓనమాలు కూడా రాకుండా కవులుగా, కవయిత్రులుగా చెలామణి అవుతున్న వారిని నేను చూశాను. కవిత్వం అంటే ఒక అనుభూతి, ఒక ఆస్వాదన. ప్రస్తుతం ఉన్న చాలా మంది కవులలో ఈ రెండు గుణాలూ లేవు. వాళ్ళ దృషిలో కవిత్వం అంటే మాటలు పేర్చడం అంతే. కవిత్వం స్పందన నుండి పుడుతుంది. మనస్సు స్పందించకుండా రాసే కవిత్వం పదాల చెత్త బుట్టతో సమానం. వాట్సాప్‌ గ్రూపులు పెరిగినాక సోకాల్డ్‌ కవులు కూడా పెరిగిపోయారు. సోకాల్డ్‌ పోటీలు, సోకాల్డ్‌ అవార్డ్‌లు, సోకాల్డ్‌ బిరుదులు, సోకాల్డ్‌ సన్మానాలు.... ఫలితంగా కవిత్వానికి ఉన్న విలువ పాతాళంలో పడిపోతోంది. ఒకప్పుడు విప్లవాలు సృష్టించి ప్రపంచ గతినే మార్చేసిన కవిత్వం ఇప్పుడు ఆదరణ కరువై అంపశయ్యపై ఉంది.  
 
గోతెలుగు: కవితా లోకంలో మీరెక్కడున్నారు..
వాసుదేవమూర్తి శ్రీపతి : హ్హ....హ్హ....హ్హ....! అది మీలాంటి పెద్దలు చెప్పాలి. అయిదు వందలకి పైగా వచన కవితలు రాశాను. దాదాపు యాభై గజళ్ళు రాశాను. ఆటవెలది పద్యాలతో రామాయణం రాసే ప్రయత్నంలో ఉన్నాను. కానీ ఇంతవరకూ పుస్తక రూపంలోకి మాత్రం నా కవిత్వాన్ని తీసుకురాలేదు. నిజం నిష్టూరంగా ఉంటుంది. అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెపుతున్నాను. కవిత్వాన్ని ఎవరు అచ్చు వేయించుకున్నా రెండు రకాల ఆశలతో వేయించుకుంటారు. తన కవిత్వం అమ్ముడు పోవాలనే ఆశ మొదటిదైతే రెండవది అవార్డులు, రివార్డులు. దురదృష్టం ఏంటంటే పుస్తకాలు అమ్ముడుపోవడం లేదు కానీ అవార్డులు అమ్ముడు పోతున్నాయి. ఎక్కడో ఒకటి రెండు మంచి సంస్థలు తప్ప మిగిలిన సంస్థలన్నీ తమ ధోరణితో మంచి కవిత్వాన్ని అవమాన పరుస్తున్నాయి.
గోతెలుగు: భావుకత, వాస్తవికత ఈ రెండింట్లో దేనిపై మీ మక్కువ?
వాసుదేవమూర్తి శ్రీపతి : రెండూ ఇష్టమే! భావుకత మనసుని ఆహ్లాద పరుస్తుంది. వాస్తవికత మనిషిని చైతన్య పరుస్తుంది. నా కవితల్లో రెండు రకాలూ ఉంటాయి.
 
    "చీకటి తైలం పోసుకుని నింగిన దీపాలెలిగాయి
     వెన్నెలనూపిరి చేసుకుని కొలనున కలువలు విరిశాయి
     నిశీధి తెచ్చిన నిశబ్దాన్ని కీచురాళ్ళు తరిమేశాయి..."
  ఇలా భావ కవిత్వమూ రాశా.
 
    "పుట్టేద పాపము పుట్టినంతనె మట్టుబెట్ట
     అని పల్కిన దేవుడు పుట్టడే అకటా....!
 
లాంటి వాస్తవికతా రాశాను. మరో కవితలో
"విపత్తుల రూపంలో ప్రకృతి ప్రాయోపవేశం చేసుకుంటోంది" అని రాశాను.
 
గోతెలుగు: వచన కవిత్వానికి ప్రాస ఎంతవరకు అవసరం?
వాసుదేవమూర్తి శ్రీపతి : ప్రాస ఉన్న కవితలు వినడానికి, వినిపించడానికి బావుంటాయి. వాటిలో ఒక గమ్మత్తు ఉంటుంది. కానీ సీరియస్‌ గా ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు ప్రాసల జోలికి పోకపోవడమే మంచిది. చెప్పదలుచుకున్నది యాధాతథంగా ప్రాసలో చెప్పగలిగితే మరీ మంచిది కానీ ప్రాస కోసం భావాన్ని మార్చేసుకోవడం మాత్రం తగదు. కవి మనసుకీ, కవిత్వానికీ ఎల్లలు ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. అప్పుడే కవిత్వంతో అద్భుతాలు సృష్టించచ్చు.
 
గోతెలుగు: ఊహల్లో తేలిపోతూ అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేదీ కవులే, వాస్తవాన్ని మరింత భయంకరంగా చూపిస్తూ పాఠకులను భయ భ్రాంతులకు గురిచేసేదీ కవులే....ఏది కవి బాధ్యత?
వాసుదేవమూర్తి శ్రీపతి : వాస్తవాలని రాసి మన బతుకులు ఎంత బాధా కరంగా ఉన్నాయో చెపుతాము. ఊహాత్మకంగా ఎంత ఆనందంగా బతకచ్చో చెపుతాము. బతుకు మీద ఆశని పెంచేది ఊహ. అలాగని పూర్తిగా ఊహలకి అంకితం అయిపోతే ముందుకెళ్ళలేము. అందుకే వాస్తవాలని కూడా చెప్పాలి.
 
గోతెలుగు: సమాజం పట్ల కవికున్న బాధ్యత ఎలాంటిది?
వాసుదేవమూర్తి శ్రీపతి : దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతైతే, సమాజం పట్ల బాధ్యత కలిగిన మొదటి పౌరుడు కవి అయ్యుండాలి. ప్రశ్నించడానికి, విమర్శించడానికి కవి భయపడకూడదు. అయితే  ప్రశ్నైనా, విమర్శైనా ప్రజా పక్షం వహించాలి. అర్ధాలకీ, అధికారాలకి లోబడకూడదు. అదే విధంగా ప్రజలలో తప్పుంటే వారిని కూడా దైర్యంగా విమర్శించాలి. దురదృష్టం ఏంటంటే అలా రాసే కవులు ఉన్నారు. కానీ అలాంటి కవిత్వాన్ని ప్రోత్సహించే పత్రికలు మాత్రం చాలా తక్కువ.
 
గోతెలుగు: కవితా ప్రపంచం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు, అందుకున్న పురస్కారాలు....
వాసుదేవమూర్తి శ్రీపతి : కవితా ప్రపంచం వేరుగా ఉందని నేను అనుకోను. ప్రపంచం చుట్టూ కవిత్వం ఉంది. కవిత్వం చుట్టూ ప్రపంచం ఉంది. ప్రత్యేకంగా నేను ఏమీ చెయ్యడం లేదు. నాకు అనిపించింది నేను రాస్తున్నాను. ఫేస్‌ బుక్‌, వాట్సప్‌ లలో పెడుతున్నాను. చదివిన వాళ్ళు బావుంది అంటారు. నాకన్నా బాగా తెలిసినవాళ్ళు తప్పు అనిపించిన వాటిని విమర్శిస్తారు. సవరింపులు చెపుతారు. వాళ్ళ సవరణ నాకు నచ్చితే సవరిస్తాను. లేదంటే వదిలేస్తాను. ప్రతిలిపి అనే వెబ్‌సైట్‌ నుండి "కవి ప్రవీణ", మేకా రవీంద్రగారి సంస్థ నుండి "సహస్ర కవి మిత్ర" అనే బిరుదులు తీసుకున్నాను కానీ, అవి నా సమర్ధతకిగాక నేను రాసిన సంఖ్యకి వచ్చినాయి అందుకే పెద్దగా తృప్తి కలగలేదు. ఆ తరువాత మరే పురస్కారాలకీ ప్రయత్నించలేదు. ఏవో రెండు మూడు సన్మానాలు జరిగినా అది గుంపులో గోవింద చందమే కానీ నా ప్రతిభకి కాదు.
 
గోతెలుగు: మీ ధ్యేయం, లక్ష్యం...ఏమిటి? ఎటువైపు మీ పయనం...
వాసుదేవమూర్తి శ్రీపతి : మంచి సినిమా రచయితని అవ్వాలని ఇరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్‌ వచ్చాను. దాదాపుగా ఒక పది సినిమాలకి పాటలు రాశాను. సముద్రేణి, రైతు, గెలుపు మొదలైన లఘు చిత్రాలకి కథ, మాటలు అందించాను. మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే సినిమా రచనలు సంపాదన కోసమేగానీ సంతృప్తి కోసం కాదు. నాకు కవిత్వం అంటేనే ఎక్కువ ఇష్టం. లక్ష్యమూ, ధ్యేయమూ ఒకటే గత తరం కవుల గురించి ఈ తరంలో గొప్పగా చెప్పుకున్నట్టే వచ్చే తరం నా గురించి చెప్పుకోవాలి. భవిష్యత్‌ పాఠ్య పుస్తకాలలో నా కవితలు ఉండాలి. పెద్ద కలే కానీ పెద్ద కలలు కంటేనే పెద్ద పనులు సాధించ గలుగుతాము.
 
గోతెలుగు: మీ గమ్యానికి మీరెంత చేరువలో ఉన్నారు?
వాసుదేవమూర్తి శ్రీపతి : చా...లా... దూరంలో ఉన్నాను. కానీ ప్రయత్నం మాత్రం మానను.
 
గోతెలుగు: కలమే శక్తివంతమైన ఆయుధం..మీ ఆలోచనలతో, అక్షరాలతో మీరేం సాధించారు? ఇంకా ఏమేం సాధించాలనుకొంటున్నారు? 
వాసుదేవమూర్తి శ్రీపతి : కలం శక్తివంతమైన ఆయుధమే కానీ ఆ ఆయుధాన్ని ధరించే చెయ్యి తాలూకు మనసు కూడా శక్తి వంతమై ఉండాలి. ప్రస్తుతం అలాంటి మనసులు చేతులు చాలా తక్కువనే చెప్పాలి. కవిత్వంతో మనమేమీ సాధించలేముగానీ సాధించే వాళ్ళకి స్ఫూర్తి, ప్రేరణ ఇవ్వగలుగుతాం. వాళ్ళలో ఉత్తేజాన్ని నింపగలుగుతాం. మార్గదర్శకత్వం చెయ్యగలుగుతాం. నా వంతు కర్తవ్యంగా కవిత్వం రాస్తున్నాను. ఎంత మంది స్ఫూర్తి పొందారో ఎంతవరకూ సఫలత పొందానో తెలియదు.
 
గోతెలుగు: కొత్త విషయాన్ని చెప్పడం, విషయాన్ని కొత్తగా చెప్పడం... ఏది కవిత పరమార్థం?
వాసుదేవమూర్తి శ్రీపతి : రెండూ ముఖ్యమే. ఈ విషయంలో ప్రస్తుతం చాలా మంది కవులు విఫలమవుతున్నారు. అవే వస్తువులు, అవే ప్రతీకలు, అవే ఉపమానాలు, ఉత్ప్రేక్షలు... అదే శైలి, అదే శిల్పం... అందుకే కవిత్వం జనానికి బోర్‌ కొడుతోంది. ఎప్పుడూ కొత్త విషయాలకోసం ప్రయత్నించాలి. ఒకవేళ పాత విషయం చెప్పదలుచుకుంటే కొత్తగా చెప్పాలి. తేట తెలుగు.... తీపి తెలుగు... కలువ కళ్ళు.... బ్రతుకు కడలి... కాళిదాసు కాలం నుండీ ఇవే రాస్తున్నారు...  గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం చదివి చూడండి కొత్త డిక్షన్‌ అంటే ఏంటో తెలుస్తుంది. బిక్కి కృష్ణ గారి "కవిత్వం డిక్షన్‌" అనే బుక్‌ చదివితే మంచి కవిత్వం ఎలా రాయాలో తెలుస్తుంది. మంచి కవి, మంచి రచయిత అనిపించుకోవాలంటే ముందు మంచి పాఠకుడై ఉండాలి. ఎంత సేపూ.. మనం రాసుకుపోవడమే కాదు, వేరే వాళ్ళవి చదవాలి. కొన్ని చదివితే ఎలా రాయచ్చో తెలుస్తుంది. ఇంకొన్ని చదివితే ఎలా రాయకూడదో తెలుస్తుంది. అలా చదివే ఓపిక ఎంత మందికి ఉంది?  
 
గోతెలుగు: గోతెలుగుతో మీ అనుబంధం....మీ అభిప్రాయం
వాసుదేవమూర్తి శ్రీపతి : మంచి పత్రిక. రెండేళ్ళ క్రితం ప్రతాప వెంకట సుబ్బారాయుడిగారి ద్వారా గోతెలుగుతో పరిచయం ఏర్పడింది. అప్పటినుండి ప్రతి వారం చదువుతున్నాను. ప్రతాప భావాలు, కార్టూన్లు నాకు బాగా నచ్చుతాయి. కథలు కూడా బావుంటాయి. గత కొన్ని వారాలుగా కవితలు కూడా వేస్తున్నారు. చాలా సంతోషం! ఆన్‌లైన్‌ పత్రికలలో గోతెలుగు మొదటి వరసలో ఉంది అని మనస్ఫూరిగా చెపుతున్నాను.
 
గోతెలుగు: కొత్తగా కవిత్వం రాస్తున్నవారికి మీరేదైనా చెప్పదలుచుకున్నారా?
వాసుదేవమూర్తి శ్రీపతి : తప్పకుండా చెపుతాను! అసలు ఎప్పటినుండో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికి అవకాశం వచ్చింది.
    "నేను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తా...", "మా చెల్లికి మళ్ళీ మళ్ళీ జరగాలి పెళ్ళి..." వంటి పిచ్చి మాటలతో సినిమావాళ్ళు, విచిత్రమైన కార్టూలతో కార్టూనిస్టులు కవిత్వాన్ని చాలా వరుకు దిగజార్చేశారు. మనం రాసే కవితలతో మరింత దిగజార్చేయ్యడం భావ్యం కాదు. మన బిరుదులు ఎవరికీ గుర్తుండవు, మన పేరు కూడా గుర్తుండకపోవచ్చు కానీ మన కవిత్వంలో సత్తా ఉంటే కవిత్వం గుర్తుండిపోతుంది. గతతరం కవుల కవిత్వం మనకి ఇంకా గుర్తుండడానికి కారణం ఆ సత్తానే.
 
 వేదాలని, ఉపనిషత్తులని, పురాణాలని, ఇతిహాసాలని, భగవద్గీతని, భక్తిని, వైరాగ్యాన్ని, సంస్కృతిని, మరెన్నో మహాకావ్యాలని పరంపరగా మనకి అందిస్తున్నది కవిత్వమే. ప్రపంచంలో ఇంతవరకూ గొంతెత్తిన అన్ని విప్లవాల వెనుక కవిత్వం ఉంది, అన్ని యుద్ధాల వెనుక కవిత్వం ఉంది, సామాజిక చైతన్యం వెనుక, సామాజిక మార్పు వెనుక, మనుషుల కష్టసుఖాల వెనుక కూడా కవిత్వం ఉంది. కవిత్వం అంటే ఊరికే మాటకి మాటకి కలపడం కాదు, మహోన్నతం. మన విఙ్ఞానాన్ని, మన విధానాలని ముందుతరాలవారికి అందించే ఒక ప్రక్రియ. సంఖ్య పెంచెయ్యాలి, బిరుదులు తీసుకోవాలి అనే తాపత్రయంతో అర్థం పర్థం లేని రాతలు రాసెయ్యకండి. కవిత్వానికి ఉన్న విలువని పోగొట్టకండి. కవిత్వం రాయడం మనందరికీ ఇష్టమైన పని. దయచేసి ఇష్టమైన పనిలో కూడా ఆత్మవంచన చేసుకోకండి.
 
 
మరిన్ని శీర్షికలు
mahilalu - maharaanulu