Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
gongoorapappu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సజీవ నిఘంటువు శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి - వాసుదేవమూర్తి శ్రీపతి

vasireddy malleeswari

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ఒక సాహితీమూర్తైన స్త్రీమూర్తి గురించి చెప్పుకోవడం ఎంతైనా అవసరం.  ఆమె బహుముఖ ప్రఙ్ఞాశాలి! భావ కవిత్వము, పదకవిత్వము, పద్య కవిత్వము, లేఖా సాహిత్యము, వ్యాస రచన, గజళ్ళు, సమీక్షలు, ముందు మాటలు ఇలా ఎన్నో ప్రకియలలో తన ప్రతిభను చాటుకున్నారు. మంచి కవయిత్రిగా, రచయిత్రిగా తెలుగు భాషా ప్రేమికురాలిగా ఎనలేని గుర్తింపు పొందారు.  ఆమె ఒక బోధకురాలు! గృహిణిగా, తల్లిగా తన బాధ్యతలు ప్రశంసనీయంగా నిర్వర్తిస్తూనే ఒక ఉపాధ్యాయినిగా ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దారు.

ఆమె నిరంతర విద్యార్థిని! సముద్రమంత విద్వత్తు ఉన్నప్పటికినీ ఇంకా నేర్చుకోవాల్సింది ఆకాశమంత ఉంది అంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. తన కన్నా పిన్న వారి వద్ద తనకు తెలియని జ్ఞానం ఉంటే అడిగి తెలుసుకోడానికేమాత్రం సంశయించరు, చిన్నతనమనుకోరు.

ఆమె నిగర్వి! హిమాలయమంత కీర్తిని సాధించినప్పటికీ ఎప్పుడూ అహం ప్రదర్శించరు. తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యం, చూడగానే చేతులు జోడించాలి అనిపించే విగ్రహం. ఉన్నతమైన వ్యక్తిత్వం ఆమె సొంతం.

మాతృభాషపై ఆమెకి ఉన్న మక్కువ, పట్టు అపారం. ఆమె ఒక సజీవ నిఘంటువు.

తెలుగుభాష గురించి రాయమంటే ఎంతోమంది కవుల కరాలు కలాలపై బిగుసుకుంటాయి. కానీ భాషోద్దరణకు నడుంకట్టేవారు కొందరే! అటువంటి కొద్దిమందిలో మాతృ సమానులు శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరిగారు ముందు వరుసలో మొదటి వారుగా ఉన్నారు.   గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మైనేని వారి పాలెంలో ఒక ఆదర్శవంతమైన కుటుంబంలో సత్యవతీదేవి, పుండరీకాక్షరావు దంపతులకు 1952వ సంవత్సరం ఈ సాహితీ సరస్వతి జన్మించారు. 1983లో చారిత్రక నేపథ్యం కలిగిన రాజా వాసిరెడ్డి వారి వంశంలోకి కోడలిగా అడుగు పెట్టారు. పసితనం నుండే ఆమెకి కళలపై అమితమైన ఆసక్తి ఉండేది! క్రమంగా ఆ ఆసక్తి సాహిత్యం వైపు మరలి బలపడింది. అన్నప్రాసన రోజున ఏ వస్తువు ముట్టుకుంటే భవిష్యత్తులో పిల్లలు ఆ వస్తువుకి సంబంధించిన రంగంలో రాణిస్తారంటారు. ఆ నమ్మకం మల్లీశ్వరిగారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం అయ్యిందనుకుంటా! ఆ రోజు కలాన్ని చేతబూని ఉంటారు కనుకనే ఆవిడ సాహితీ ప్రస్థానం అరవై వసంతాలు దాటినా అప్రతిహతంగా సాగుతూనే ఉంది. పాఠశాల వయసులోనే అల్లిబిల్లి కవితలు అల్లడం ప్రారంభించిన మల్లీశ్వరిగారు కళాశాల మెట్లు ఎక్కేకాలానికే ఒక మంచి కవయిత్రి అనిపించుకున్నారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మగారు కూడగట్టిన కవిసేనలో మల్లిశ్వరిగారు కూడా ఒక భాగమైనారు.

ఆమె చీకటిపై కవిత్వం రాస్తే చీకటి పొంగిపోయి వెన్నెల కురిపిస్తుంది! ఆమె వెన్నెలపై కవిత్వం రాస్తే వెన్నెల సిగ్గుల మొగ్గై కెంపు వర్ణం సంతరించుకుంటుంది! ఒకసారి ఆమె కవితలు చిన్న పిల్లలై అల్లరి చేస్తాయి! మరొక్కప్పుడు పడుచు పిల్లలా ఆకర్షిస్తాయి! కొన్నిసార్లు పరిణితలా పలుకరిస్తాయి! ఇంకొన్నిసార్లు గురువులా బోధిస్తాయి! ప్రేమికలా ఆలపిస్తాయి, అలరిస్తాయి! విరహిణిలా విలపిస్తాయి, విషాదాన్ని ఒలికిస్తాయి! చదివేవారి మనసులని మంత్రముగ్ధులని చేస్తాయి.

తెలుగులో ఎక్కువ కవితా ప్రక్రియలని వెలువరించిన మహిళ మల్లీశ్వరిగారే. బాల సాహిత్యం మొదలుకొని భాషోద్దరణ వరకూ ఆమె రచించిన ప్రతి పుస్తకమూ సాహిత్య ప్రియులు ఖచ్చితంగా చదవాల్సినవే. తమ గ్రంథాలయంలో భద్రపరుచుకోవాల్సినవే. బాల సాహిత్యములో ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనది. పిల్లలకు వినోద, విఙ్ఞానాలతోపాటు పద సంపదను కూడా అందించడం ఆమె ప్రత్యేకత. "జానీ జానీ ఎస్‌ పప్పా", "ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌" వంటి ఇంగ్లీష్‌ రైమ్స్‌ని తలదన్నే ఎన్నో గేయాలనీ ఆమె తన బాల సాహిత్యంలో పొందుపరిచారు."తేనె వాకలు" పేరుతో పిల్లలకోసం గేయ కథలను రెండు భాగాలుగా అందించారు. అలాగే "తేనె చినుకులు", "రెల్ల పూలు", "బొమ్మల కొలువు", "అమ్మ పాట", పేర్లతో బాలగేయాలు, "ఇంద్ర ధనస్సు" పేరుతో బాలలకు విఙ్ఞానాన్ని అందించే గేయాలు, "నేనెవరిని" పేరుతో పొడుపు కథా గేయాలు రచించారు. "కైత" పేరుతో ఆమె రాసిన కవితా సంపుటిలో ప్రతి కవితా ఒక ఆణిముత్యమే. ఆమె తన కవితలలో భావానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో భాషకి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు. ఆమె ఎంచుకునే పదాలు కవితకున్న అందాన్ని ఇనుమడింపజేస్తాయి. పాఠకులకి కొత్త పదాలను నేర్పిస్తాయి.

"పదాలు పరిమళాలు" అనే పేరుతో భాషా ‌సాహిత్య జ్ఞానాన్ని పెంచే వ్యాస సంపుటిని రాశారు. "ఒక్క పదం అర్థాలెన్నో" అనే పుస్తకంలో కొన్ని పదాలని ఎంచుకుని వాటికున్ననానార్థాలని తెలియజేస్తూ వివరణాత్మక వ్యాసాలు రాశారు. ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు తెలుగువాచక నిర్మాణం కూడా చేశారు. ఐదు వందలకి పైగా కవితలు, వెయ్యికి పైగా భాషా సాహిత్య వ్యాసాలు, పదహారు వందలలకి పైగా పద్యాలు, భావగేయాలు, దాదాపు  నూట యాభై గజళ్లు, వాట్సన్ గ్రూపుల్లో కొత్త కవుల కోసం "పద సంపద నానార్థ పదం నిఘంటువు" ఇలా ఆమె కలం నుండి జాలువారిన సాహితీ ప్రవాహం అనంతం. ఇవన్నీ ఒకెత్తైతే ఈ మధ్య కాలంలో ఆమె సాహితీ లోకానికి పరిచయం చేసిన "నుడి గుడి" అనే పరిశోధనాత్మక గ్రంథం మరో ఎత్తు.

మనమెన్నో రకాల విషయాల గురించి చదువుతున్నాం కాని మనదైన భాషా సాహిత్యాల గురించి మాత్రం అలక్ష్యం చేస్తున్నాం! మల్లీశ్వరిగారు భాష కోసం ఇది చేయాలి, అంది చేయాలనే ఉత్తమాటలు చెప్పకుండా మన భాషా సాహిత్యాలు పట్ల తనకుగల మక్కువని మమకారాన్ని తెలుపుతూ నూట ఎనిమిది పదాలను ఎంచుకుని అవి పదాంతంగా, పదాంశంగా, పదాంత ధ్వనిగా, ఉన్న పదాలకు సాహిత్యాన్ని జత చేసి సోదాహరణంగా పరిశోధనాత్మకంగా వివరించారు.  ఆ అత్యుత్తమ గ్రంథానికి "నుడి గుడి" అని పేరు పెట్టారు. ఇలాంటి గ్రంథం ఇప్పటి దాకా రాలేదని శ్రీ తుర్లపాటి కుటుంబరావుగారు, ఇది తెలుగువారందరి వద్దా ఉండాల్సిన గ్రంథమని శ్రీ నాళేశ్వరం శంకర్‌గారు, ఇది అందరికి పనికొచ్చే అత్యుత్తమ గ్రంథమని శ్రీ డా. యన్. గోపి గారు ప్రశంసించారు. శ్రీ రామోజి రావుగారు వంటి వారెందరో ఆ గ్రంథాన్ని అభినందించారు, అభినందిస్తున్నారు!

ఇప్పటికే ఈ గ్రంథానికి గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారి నుండి, ఆనం సాహితి అకాడమి వారి భాషా సాహిత్య పురస్కారం లభించాయి. 2018 వ సంవత్సరానికి గాను ఉత్తమ పరిశోధనా గ్రంథంగా"శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ" పురస్కారాన్ని కూడా అందుకుంది భాషా సాహిత్యాల పట్ల ఎంతో తపన, అభిరుచి ఉంటే తప్ప అంతటి పరిశోధనా గ్రంథం రాయటం సాధ్యం కాదు. "ఒక విశ్వవిద్యాలయం చెయ్యాల్సినంత పెద్ద పనిని మల్లీశ్వరిగారొక్కరే ఒంటి చేత్తో పూర్తిచేశారు." అని ఎ.కె. ప్రభాకర్ గారు బిక్కి కృష్ణగారు ఈ “నుడి గుడి” పుస్తకానికి రాసిన తమ ముందు మాటల్లో అన్నారు.

మల్లీశ్వరిగారి వివిధ సాహితీ ప్రక్రిలకు అందిన అనేకానేక సత్కారాలు, పురస్కాలు, బిరుదులలో 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సాహితీ పురస్కారం, తెలంగాణా సాంస్కృతిక సౌజన్యంతో భారత కల్చరల్ అకాడమి అందించి విశిష్ట సాహితీ సేవా పురస్కారం, బాల సాహితీ రత్న మొదలైనవి కూడా ఉన్నాయి. "మూడు రోజుల వ్యవధిలో ఇరు రాష్ట  ప్రభుత్వాలు నుండి అవార్డులను అందుకున్న ఏకైక వ్యక్తి మీరు." అని సినీ గేయ రచయిత శ్రీ. డా. వెనిగళ్ళ రాంబాబు మల్లీశ్వరి గారిని ప్రశంసించారు.వయసు అరవై దశకాలు దాటినా, ఎన్నో కీర్తి కిరీటాలను సాధించినా ఇక చాలు అనుకోకుండా తన సమయాన్ని, శ్రమనీ, మేథనీ, ధనాన్నీ సాహిత్య సేవకోసం వెచ్చిస్తున్న మల్లీశ్వరిగారు ఆయురారోగ్యాలతో మరో వందేళ్ళు జీవించాలని, ఆమె చేసే సాహితీ సేవ నిరంతరం కొనసాగాలనీ మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను.                                   

మరిన్ని శీర్షికలు
tower love cartoons