Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రసమీక్ష

Lakshmi’s NTR movie review

చిత్రం: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ 
తారాగణం: విజయ్‌ కుమార్‌, యజ్ఞా శెట్టి, శ్రీతేజ్‌ తదితరులు 
సంగీతం: కళ్యాణి మాలిక్‌ 
సినిమాటోగ్రఫీ: రామి 
నిర్మాతలు: దీప్తి బాలగిరి, రాకేష్‌ రెడ్డి 
దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు 
నిర్మాణం: ఎన్‌హెచ్‌ స్టూడియోస్‌, ఆర్జీవీ గన్‌ షాట్‌ ప్రొడక్షన్స్‌ 
విడుదల తేదీ: 29 మార్చి 2019 
కుప్లంగా చెప్పాలంటే.. 
ఇది విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోని ఓ భాగం. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్‌ జీవితంలోకి రావడం దగ్గర్నుంచి, ఎన్టీఆర్‌ మరణం వరకూ జరిగిన కథ. ఇది కథ కాదు, జీవితం. ముఖ్యమంత్రి పదవి పోవడం, రాజకీయంగా వెన్నుపోటుకు గురి కావడం, అందరూ వున్నా ఒంటరి అవడం వంటివన్నీ ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆ సన్నివేశాల్ని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎలా డీల్‌ చేశాడు? అన్నదే అసలు విషయం. 
మొత్తంగా చెప్పాలంటే.. 
రంగస్థల నటుడు విజయ్‌కుమార్‌, అచ్చం ఎన్టీఆర్‌లా కనిపించేందుకు బాగానే కష్టపడ్డాడు. ఈ క్రమంలో ఆయన కొంతమేర సఫలమయ్యాడు కూడా. హావభావాల విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ని దించేశాడు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి పాత్రలో మెరిసిన యజ్ఞాశెట్టికి కూడా మార్కులు పడతాయి. చాలా బరువైన పాత్ర ఆమెది. తనవరకూ పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించింది. 
బాబు పాత్రలో మెరిసిన శ్రీతేజ్‌ ఆది నుంచీ అంతం వరకూ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఆయన నటన ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని ఇంకా బాగా ఎలివేట్‌ చేసిందనడం అతిశయోక్తి కాదేమో. 'కన్నింగ్‌' ఎక్స్‌ప్రెషన్స్‌లో అద్భుతం అనిపించాడు శ్రీతేజ్‌. మిగతా పాత్రధారులు మమ అన్పించేశారు. 
ముందే చెప్పుకున్నాం కదా, కథ అందరికీ తెలిసిందే. కథనం విషయంలో నాటకీయత ఎక్కువైంది. డైలాగ్స్‌ కొన్ని బాగా ఆకట్టుకుంటే, మరికొన్ని పేలవంగా అన్పిస్తాయి. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే వుంది. పాటలు బాగానే వున్నా, ఇలాంటి సినిమాలకి ఇన్ని పాటలు అవసరమా? అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే, ఇంకాస్త ఎక్కువగా కత్తెరకి పదును పెట్టి వుంటే బావుండేది. నిర్మాణపు విలువలు జస్ట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. 
తెలుగుదేశం పార్టీపైకి 'అస్త్రం'గా ఈ సినిమాని వర్మ సంధించాడన్నదాంట్లో ఇంకో మాటకు తావు లేదు. తాను ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడ్ని కానని వర్మ చెబుతున్నప్పటికీ, నిర్మాత స్వయానా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి. సినిమా వేరు, రాజకీయం వేరని ఇక్కడ అనలేం. ఆ రాజకీయమే ఈ సినిమాపై ఇంత హైప్‌ క్రియేట్‌ అవడానికి కారణమని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, ఏం ఆశించి ప్రేక్షకులు సినిమాకి వస్తారో, దానికి భిన్నంగా ఎన్టీఆర్‌ - లక్ష్మీ పార్వతి మధ్య అనుబంధానికి తొలి భాగంలో వర్మ పెద్ద పీట వేయడం గమనార్హం. సెకెండాఫ్‌లో టార్గెట్‌ ఆడియన్స్‌ కోరుకున్నవన్నీ వున్నా, కొన్ని బోరింగ్‌ సన్నివేశాలతో అదీ కొంత డైల్యూట్‌ అయిపోయింది. ఓవరాల్‌గా ఓ మైండ్‌ సెట్‌తో వెళ్ళిన వారికి ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. కచ్చితంగా వర్మ కోరుకున్న సంచలనమైతే ఈ సినిమాతో వచ్చినట్లే. 
అంకెల్లో చెప్పాలంటే.. 
2.5/5 
ఒక్క మాటలో చెప్పాలంటే 
నిజమే, ఇది లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

మరిన్ని సినిమా కబుర్లు
churaka