Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pancharatnalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

సాధారణంగా  “ మంచి “ కంటే  “ చెడు “ కే పెద్ద ప్రచారం జరుగుతూంటుంది. ఆ “ చెడు “ ని సాకుగా చూపించి, చేయాల్సిన పనులు చేయకపోవడం సాధారణంగా చూస్తూంటాము… ఏ విషయానికైనా బొమ్మా బొరుసూ ఉంటాయే కదా.. మన కి ఏది కన్వీనియెంటైతే , దాన్ని ఉదాహరించి చేసిన పనిని సమర్ధించుకోవడం. పైగా ఎంత బాగా చెప్తారంటే, వినేవాడు అనుకుంటాడూ “ అంతలా ఉదాహరణలతో చెప్పేడంటే బహుశా అదే కరెక్టేమో.. “ , అనుకుని తనుకూడా మరో నలుగురికి చెప్తాడు. చివరకి ఓ ముద్ర పడిపోతుంది..” ఫలానా దానివలన ఫలానా ఫలానా నష్టాలుంటాయీ.. “ అని.

ఉదాహరణకి , మనదేశంలో ఒకానొకప్పుడు, వైద్యులమీద ఎంతో నమ్మకం ఉండేది, కానీ కాలక్రమేణా, వైద్యులూ, కార్పొరేట్ ఆసుపత్రుల మీద, చాలామందికి  సదభిప్రాయం ఉండడం లేదు. అలాగని ప్రతీ వైద్యుడూ, ప్రతీ ఆసుపత్రీ చెడ్డవని అనలేముకదా… ఏదైనా అనారోగ్యం కలిగితే, ఆ వైద్యులే కదా మనకి దిక్కూ? ఓ పది శాతం డాక్టర్లు చేస్తూన్న వ్యాపారం ధర్మమా అని, మొత్తం అందరు డాక్టర్లకీ చెడ్డ పేరొస్తోంది.  ఏదైనా రోగం తగ్గాలంటే ముఖ్యంగా, ఆ వైద్యుడిమీద ఓ నమ్మకం ఉండాలి. ఆయన ముందుగా మనకి పరిచయమైనవాడైనా కావాలి, లేదా మనకి తెలిసిన స్నేహితుడిద్వారా అయినా తెలుసుకోవాలి… మన శ్రేయస్సుకోరుకునేవాడైతే ఉన్నవిషయమేదో వివరంగా చెప్పి, నిర్ణయం మనకే వదిలేస్తారు…  అసలు చెడ్డపేరెందుకువస్తోందో పరిశీలిద్దాం—ఈరోజుల్లో వైద్యం పేరుచెప్పి, జనాల్ని కంగారుపెట్టేయడం ఓ ఫాషనైపోయిందనడంలో సందేహం లేదు. కళ్ళ డాక్టరు దగ్గరకెళ్తే, నీకు క్యాటరాక్ట్ ముదిరిపోయిందీ, ఆపరేషన్ చేయకపోతే  చూపు పూర్తిగా క్షీణించిపోతుందీ అంటాడు. ఓ డెభై ఎనభై వేలకి  కాళ్ళొచ్చేస్తాయి. పిల్లపురిటికి ఆసుపత్రికి వెళ్తే, “ బిడ్డ అడ్డం తిరిగిందీ.. సిజేరియన చేయాల్సిందే..” అంటారు. ఏ మోకాలి నొప్పితోనో వెళ్తే, రకరకాల  X ray  లు తీసి, Knee replacement  ఒకటే దిక్కంటారు… అలాగే ఆడవారు వెళ్తే, గర్భసంచీ తీసేయడం తప్ప మరో మార్గం లేదంటారు.. అలాగే, ఏ ఛాతినొప్పితోనో వెళ్ళేరా, ముందర అవేవో స్టెంటు లతో మొదలెట్టి, గుండె ఆపరేషన్లోకి దింపుతారు.వీటన్నిటికీ లక్షల్లోనే పని… అలాగని దేశంలో అన్ని ఆసుపత్రులూ, అందరు డాక్టర్లూ అలా ఉన్నారని కాదు. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే వాతావరణం. అలాగని దేశంలో  knee replacements fail  అవుతున్నాయంటే ఎలా? ఆపరేషన్ విజయవంతం అవడానికి , ముందుగా శరీరతత్వం ముఖ్యం.. అది సరీగ్గా లేనప్పుడే బహుశా ఈ ఆపరేషన్లు  fail  అవుతున్నాయేమో అనికూడా ఆలోచించొచ్చుగా..

ద్విచక్రవాహకులు నెత్తిమీద ఓ హెల్మెట్ పెట్టుకోవాలని ఓ చట్టం ఉంది.. అది ఎవరికోసమో కాదు, మనకోసమే.. కానీ ఎంతమంది వాడతారూ? అది పెట్టుకుంటే చిరాగ్గా ఉంటుందని, జనాలూ వాడరూ, పోలీసులూ వాడరు..  ఆ విషయం ఒప్పుకోకుండా, వీళ్ళు , దేశంలో హెల్మెట్ పెట్టుకున్నా, తలపగిలి మరణించిన కేసుల వివరాలు సేకరించి, వాళ్ళు చేసే దరిద్రప్పనిని సమర్ధించుకుంటారు. సైనిక దళాల వారైతే కంపల్సరీ గా వాడాలే.. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో హెల్మెట్ల వాడకం చాలా బాగా జరుగుతోంది.

ఎక్కడో ఒకటీ అరా తప్పించి, జీవితంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలంటే, ధ్యేయం, శ్రమ లతోపాటు చదువుకూదా ముఖ్యం అన్నది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఎవర్ని చూసినా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ నీ ఉదాహరణగా తీసుకుని,  మొదటివారు 10 వ తరగతి ఫెయిల్, రెండోవారు కాలేజీ లో ఫెయిల్ అయ్యారూ, వాళ్ళు అంత ఘనత సాధించగాలేనిది, మనం ఎందుకు సాధించలేమూ అనుకుని, చదువు మానేస్తామంటే కుదురుతుందా? వారు సాధించిన ఘనత కంటే, వారి చదువు విషయానికే ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు. అయినా సరే ఈమధ్య జరిగిన విద్యార్ధుల ఆత్మహత్యల సందర్భంలో, వేలం వెర్రిగా ఆ ఉదాహరణలే వినిపిస్తున్నాయి.

ఏది ఎలా ఉన్నా,  Destiny  అనేది ఒకటుందని మర్చిపోతున్నారు జనాలు. హేతువాదులు దీన్ని కొట్టిపారేస్తారనుకోండి.. మన భవిష్యత్తెలా ఉంటుందనేది, మనం ఈ భూమ్మీదికి రావడంతోనే నిర్ణయించబడుతుంది.. తలరాత అనుకుందాము. అలాటిదే లేకపోతే, కొందరు 90 ఏళ్ళు దాటినా ఆరోగ్యంగా ఉండడం, కొందరు బలవన్మరణాలు పొందడం ఎలా జరుగుతోందంటారు?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu