Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cini churaka by cartoonist bannu

ఈ సంచికలో >> సినిమా >>

కామెడీ 'హీరోల' కెరీర్ కొద్దికాలమే!

comedy heros

తెలుగు చిత్రసీమలో ఉన్నంతమంది హాస్యనటులు సంఖ్యాపరంగా ఎక్కువ సినిమాలు తీసే బాలీవుడ్ లో కూడా లేరు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండి ఇప్పటి 3D సినిమాల వరకు ఎంతోమంది హాస్యనటులు తమదైన శైలిలో హాస్యం పండిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొన్ని చిత్రాలలో విలన్ వేషాలు వేశారు. ఒక్కోసారి హీరోలుగా కూడా నటించారు. కానీ ఇలా హీరోలుగా చేసిన హాస్యనటుల కెరీర్ కొద్దికాలమే కావడం కాస్త ఆశ్చర్యపడవలసిన, గమనించాల్సిన విషయము. ఆ కెరీర్ ముగిసిన తర్వాత తిరిగి హాస్యనటులు గానే కొనసాగారు. అలాంటి కామెడీ 'హీరోల' గురించి కొన్ని విశేషాలు...

'వరవిక్రయం' ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమై, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హాస్యనటుడిగా చేస్తూ అక్కినేని 'బాలరాజు' సినిమాతో కామెడీ స్టార్ గా ఎదిగిన వాడు కస్తూరి శివరావు. హీరోగా జూనియర్ శ్రీ రంజనితో కలిసి నటించిన 'గుణసుందరి కథ' అప్పట్లో ప్రేక్షకాదరణ పొందడమే కాక మంచి వసూళ్లు కూడా రాబట్టింది. హీరోగా వేసిన తొలి హాస్యనటుడు కస్తూరి శివరావే. 'గుణసుందరి కథ' సినిమా తర్వాత హీరోగా రెండు మూడు సినిమాల్లో నటించిన శివరావు, అవేవి విజయం సాధించకపోవడంతో తిరిగి హాస్యనటునిగానే కొన్ని సినిమాల్లో నటించారు.

కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పెద్ద మనుషులు' సినిమాలో రేలంగిది దాదాపు హీరో తరహాపాత్రనే. అలాగే 'పక్కింటి అమ్మాయి' లో హీరోగా నటించాడు. అలా అని ఈ సినిమాల తర్వాత హీరోగా చేయలేదు. హాస్యనటుడిగానే అనేక సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు పొందాడు.

గూడవల్లి 'మాయలోకం' సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయమైన పద్మనాభం అనేక చిత్రాల్లో చిన్నా, పెద్దా హాస్య పాత్రలు వేస్తూ నిర్మాతగా, హీరోగా, దర్శకుడిగా ఎదిగారు. 'పొట్టి ఫ్లీడరు', 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న', 'జాతకరత్నం మిడతం బొట్లు' వంటి సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ మళ్ళీ హాస్యనటునిగానే కొనసాగాడు.

స్టార్ కమెడియన్ గా ముద్రపడిన రాజబాబు కూడా హీరోగా 'మనిషి రోడ్డున పడ్డాడు', 'ఎవరికి వారే యమునా తీరే' సినిమాల్లో హాస్యం బదులు శోకం పండించడంతో ఆ సినిమాలు ప్రేక్షకులు తిరస్కరించడంతో తిరిగి హాస్యనటునిగా కొనసాగాడు. దాసరి తొలిచిత్రం 'తాతా - మనవడు' చిత్రంలో రాజబాబు హీరోపాత్ర మటుకు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

చంద్రమోహన్ బి.ఎన్.రెడ్డి 'రంగుల రాట్నం' సినిమా ద్వారా పరిచయమై అనేక చిత్రాల్లో తనదైన శైలిలో నటిస్తూ 'రాధా కళ్యాణం', 'బంగారు పిచిక', 'సిరిసిరి మువ్వ', 'సీతామహాలక్ష్మి', 'శుభోదయం' తదితర అనేక సినిమాల్లో హీరోగా నటించాడు. తర్వాతి కాలంలో హాస్యనటునిగానే కొనసాగాడు.

'స్నేహం' చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమై చిన్న చిన్న పాత్రలతో ఎదిగిన రాజేంద్రప్రసాద్ సీనియర్ దర్శకుడు వంశీ తీసిన 'లేడీస్ టైలర్' సినిమా ఘనవిజయంతో అనేక సినిమాల్లో హీరోగా నటించి మంచి విజయాలే సంపాదించుకున్నాడు.

నరేష్ హాస్యనటునిగా కొనసాగుతూనే 'పోలీసు భార్య', 'చిత్రం భళారే విచిత్రం', 'జంబలకిడి పంబ' వంటి సినిమాలు విజయం సాధించినా ఆ తర్వాత హీరోగా నిలబడలేకపోయాడు.

బ్రహ్మానందం 'అహనాపెళ్ళంట' సినిమాలో చక్కటి హాస్యం పండించడంతో వరుసగా అవకాశాలు రావడం, 'చిత్రం భళారే విచిత్రం', 'అసెంబ్లీ రౌడీ', 'చంటి', 'సుందరకాండ' మొదలైన సినిమాల ఘనవిజయంతో హీరోగా 'లోఫర్ మామ సూపర్ అల్లుడు', 'పెళ్ళామా మజాకా', 'బాబాయ్ హోటల్' సినిమాలు అపజయం పాలవడంతో తిరిగి హాస్యనటుడిగానే కొనసాగుతూ ఇప్పుడు మంచి డిమాండ్ లో ఉన్నాడు.

బాబూమోహన్ కూడా 'మామగారు' సినిమా ఘనవిజయం కావడంతో వరుసగా అలాంటి పాత్రలే వచ్చినా తనదైన శైలిలో హాస్యం పండిస్తూ హీరోగా 'సుందరవదనా - సుబ్బలక్ష్మి మొగుడా' సినిమా ఫ్లాప్ కావడంతో తిరిగి కామెడీనే నమ్ముకున్నాడు.

'ప్రెసిడెంట్ పేరమ్మ' సినిమా ద్వారా బాలనటుడిగా పరిచయమైన ఆలీ ఆ తర్వాత అనేక సినిమాల్లో హాస్యపాత్రలు వేస్తూ s.v.కృష్ణారెడ్డి 'యమలీల' సినిమాలో హీరోగా మారడం, ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో దాదాపు ముఫ్ఫై సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఒక్క 'పిట్టలదొర', 'హంగామా' సినిమాలు మాత్రమే విజయం సాధించడంతో మళ్ళీ హాస్యనటుడిగానే కొనసాగుతున్నాడు.

'చిరునవ్వుతో', 'నువ్వేకావాలి' అంటూ పరిచయమైన సునీల్ హాస్యనటుడిగా వేసిన పాత్రలు అనేక సినిమాల ఘనవిజయంలో తన వంతు పాత్ర పోషించడంతో హీరోగా మారి 'అందాల రాముడు', 'మర్యాద రామన్న', 'పూల రంగడు', 'తడాఖా' సినిమాల విజయంతో హాస్యపాత్రలు దాదాపుగా తగ్గించుకోవడంతో హీరోగా స్థిరపడతాడా లేక మళ్ళీ హాస్యనటుడిగానే ఉంటాడా అనేది కాలమే నిర్ణయించాలి.

'సంప్రదాయం' సినిమా ద్వారా పరిచయమైన వేణుమాధవ్ అనేక సినిమాల్లో హాస్యనటునిగా కొనసాగి హీరోగా మారి 'ప్రేమాభిషేకం', 'భూకైలాష్' లాంటి ప్లాప్ లతో మళ్ళీ కామెడీనే నమ్ముకున్నాడు.

సీనియర్ దర్శకుడు వంశీ తీసిన 'మహర్షి', 'ఏప్రిల్ 1 విడుదల', 'చెట్టు క్రింద ఫ్లీడర్' తదితర సినిమాల్లో నటుడిగా కొనసాగినా సరైన బ్రేక్ రాని కృష్ణభగవాన్ వంశీ 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో మంచి బ్రేక్ వచ్చి ఆ తర్వాత అనేక చిత్రాల్లో హాస్యం పండించాడు. హీరోగా మారి తీసిన 'జాన్ అప్పారావ్ 40 ప్లస్', 'మిస్టర్ గిరీశం' సినిమాల ఫ్లాప్ లతో మళ్ళీ కామెడీ నటుడిగానే కొనసాగుతున్నాడు.

'అల్లరి' సినిమా ద్వారా పరిచయమైన నరేష్ ఆ సినిమాలో హాస్యం బాగా పండించడంతో ఆ తర్వాత వరుసగా అనేక సినిమాల్లో కామెడీ హీరోగా వేస్తూ అనేక హిట్లు పొంది తన హవా కొనసాగిస్తున్నాడు.

సుమన్ శెట్టి, ఏవిఎస్, రఘుబాబు, శివారెడ్డి, గౌతంరాజు, ఉత్తేజ్, దువ్వాసి మోహన్, వెన్నెల కిషోర్, చిత్రం శీను, ఇలా ఎందరో హాస్యనటులు హీరోలుగా చేసిన సినిమాలు ఏమాత్రం విజయం కాకపోవడంతో తిరిగి వారికి కామెడీనే దిక్కయింది. ఇప్పుడు తాగుబోతు రమేష్, ధనరాజ్ లు కలిసి హీరోలుగా ఒక సినిమా చేస్తున్నారు. విడుదలయిన తర్వాతగానీ తెలియదు ఈ సినిమా హిట్టా ఫట్టాని!

కామెడీ నటులు హీరోగా కొనసాగాలి అని అనుకుంటే ఒకసారి హాస్యనటుడు సుధాకర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి. 'స్టేట్ రౌడీ', 'యముడికి మొగుడు', 'రాజా', 'సూర్యవంశం', 'ఖుషి', 'సుస్వాగతం' మొదలైన ఎన్నో సినిమాల్లో తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధాకర్ తమిళంలో హీరోగా రాధికతో నటించిన దాదాపు పదికి పైగా సినిమాలు విజయం పొందినప్పటికినీ తెలుగులో హీరోగా కాక హాస్యనటునిగానే కొనసాగాడు. ఈ సంగతిని కామెడీనటులందరూ గుర్తించుకోవాలని ఆశిద్దాం! రాజేంద్రప్రసాద్, ఇప్పుడు 'అల్లరి' నరేష్, అంతో ఇంతో చంద్రమోహన్ లు మాత్రమే కామెడీ హీరోలుగా నిలబడ్డారు.

-- కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
NTR dailoge for raviteja