Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anyaayam

ఈ సంచికలో >> యువతరం >>

పరివర్తన

parivartana

"హాయ్...!! మహేష్ హౌ ఆర్ యూ రా..?, చాలా రోజులు అయ్యింది మనం కలిసి..!!" అంటూ ఆత్మీయంగా తన చిన్ననాటి స్నేహితుడిని పిలిచాడు రవి. "అరేయ్ రవి నువ్వా..!! ఎన్ని రోజులు అయ్యిందిరా, నిన్ను కలసి !! నేను బానే ఉన్నాను,  నువ్వు ఎలా ఉన్నావు..?" అని ఆశ్చర్యంగా అడిగాడు మహేష్. "నేను చాలా బావున్నాను, నువ్వేంట్రా ఇక్కడా!! ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు..?" అని అడుగుతూ ఏదో మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నాడు ఫోన్లో  రవి.

"ఇక్కడే జాబ్ ట్రయల్స్ వేస్తున్నాన్రా, రూంలో ఖాళీగా ఉండటం ఎందుకని అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుని వచ్చే పోయే అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉన్నాను ..!!, నువ్వెలాగో ఇక్కడ అమ్మాయిలను పట్టించుకోవు కనీసం,  మాలాంటి వాళ్ళు అయినా వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు రా బాబు..!!” అంటూ అటువైపుగా వస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తూ "అరేయ్ రవి..!! ఆ అమ్మాయిని చూడు, సూపర్ ఉంది.. జీవితంలో ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి రా అంటూ ..!! కత్తిలాగా ఉంది " అంటూ అది చాలక,  ఒక అసభ్యకర మాట ప్రయోగించి   ఆమె వంక వెకిలిగా పరీక్షగా చూస్తూ ఉన్నాడు..

ఆమె నడుస్తూ వచ్చి మహేష్ ముందు నిలబడి "మీరే కదా  మహేష్ !!  ఎలా ఉన్నారు..?" అంటూ మహేష్ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంది ఆమె. ఒక్కసారిగా మహేష్ బిక్కమొహం వేసి, ఏం చెప్పాలో అర్థం కాక రవి వంక చూస్తూ ఉన్నాడు.. అప్పుడు రవి,  "మహేష్..!! ఆమె నా భార్య,  పేరు ఆత్మజ, ఇందాక నీతో మాట్లాడుతూ నేను మెసేజ్ చేసింది తనకే, నేను నా ఫ్రెండ్ మహేష్ తో మాట్లాడుతూ ఉన్నాను.. నువ్వు కొంచెం ముందుకు నడిచి రమ్మని చెపితే తను ఇలా వచ్చింది.." అని మహేష్ కళ్ళ వంక చూస్తూ చెప్పాడు. మహేష్ తను ఇంతకు ముందు ఆమె గురించి అన్న మాటలకి, కొద్దిగా ఇబ్బంది పడి పోయి తల పైకి ఎత్తి, తిరిగి రవి మొహం చూడలేక అలానే మౌనంగా నిలబడి ఉన్నాడు.. రవి పక్కన పార్కింగ్ లో ఉన్న తన బైక్ తీసుకురావడానికి వెళ్ళాడు.. ఇంతలో "ఏమైంది మహేష్ అన్నా!!  అలా ఉన్నావు..?, ఆయన ఏమైనా క్లాస్ చెప్తున్నారా ఏంటి..?" అంటూ నవ్వుతూ 'అన్నా' అని వరుస కలిపింది ఆత్మజ..  ఆమె తనను అలా పిలవడంతో మహేష్ కి తాను చేసిన పని ఎంత పెద్ద తప్పో అర్థం అయ్యి కళ్ళలోకి నీళ్లు చేరాయి.. అంతలో రవి బండి తీసుకుని వచ్చాడు.. ఆత్మజ బండి ఎక్కి,  "అన్నా !!  మీరు ఈ రోజు సాయంత్రం, ఇంటికి భోజనానికి రండి !!  తప్పకుండా.!! ఈ సారి మీకు ఈయన క్లాస్ తీసుకోకుండా, ఈ ప్రిన్సిపాల్ సెలవు ప్రకటిస్తుంది" అని చిన్నగా నవ్వుతూ రవిని చూసి మహేష్ కి చెప్పింది.. కానీ,  మహేష్ కనీసం తల కూడా పైకి ఎత్తలేదు.. అనుమానం వచ్చిన ఆత్మజ, రవి వంక చూస్తూ,  'మీరు కూడా చెప్పండి' అన్నట్టు సైగ చేసింది..

 “అరేయ్ మహేష్..!! ఇటు చూడు నువ్వు సాయంత్రం ఇంటికి వస్తున్నావు.. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను., సరే ఉంటాను,  బై" అని చెప్పి లొకేషన్ షేర్ చేసి రవి బండి మీద వెళ్ళిపోయాడు.

 
వాళ్ళు వెళ్ళగానే మహేష్ తన తలపైకి ఎత్తాడు, ఇంక జీవితంలో రవిని గాని, ఆత్మజను గాని కలవకూడదు అని నిర్ణయం తీసుకుని అక్కడ నుండి బయలుదేరాడు.. 

సాయంత్రం అయ్యింది.. రవి తన పిల్లాడిని స్కూల్ నుండి తీసుకువచ్చి,  భార్యని పిలుస్తూ,  "ఆత్మజా..!! సాయంత్రం భోజనానికి ఏం చేస్తున్నావు ?. మహేష్ కి ఇష్టం అని నేను బయట నుండి స్వీట్స్ తెచ్చాను.. సో నువ్వేమి స్వీట్స్ చేయకు" అంటూ వాష్ రూంకి వెళ్లి,  ఫ్రెష్ అయ్యి వచ్చి,  హాల్లో టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చున్నాడు..

"ఏమండీ..! నాకో అనుమానం,  అసలు మహేష్ అన్న వస్తాడంటారా ?? " అని మెల్లగా సందేహం వెళ్ళబుచ్చింది ఆత్మజ.. 

"ఏమో..!! వస్తాడని అనుకుంటున్నాను, ఆగు !!  ఒక్కసారి ఫోన్ చేసి చూస్తాను" అంటూ ఫోన్ చేసాడు రవి. 

"మహేష్ ఎక్కడ ఉన్నావు..? స్టార్ట్ అయ్యావా లేదా..?" అని అడిగాడు రవి.

"రవీ !!  నేను రావడం లేదు, వేరే పని ఉంది. మరెప్పుడయినా వస్తాను" అని చెప్పాడు మహేష్.

"అదేంట్రా..!! నువ్వు వస్తావు అని, తను నీకోసం అన్నీ సిద్ధం చేసింది. నువ్వు రాకపోతే నా కన్నా తను చాలా ఫీల్ అవుతుంది" అని దబాయింపు తో కూడిన చనువుతో అన్నాడు  రవి.

వీళ్ళ మధ్య సంభాషణ వింటున్న ఆత్మజ రవి చేతి నుండి ఫోన్ లాక్కుని,  "అన్నోయ్ !!  నువ్వు రాకపోతే, నేను వండిన వంటలు అన్నీ  మీ ఫ్రెండ్ తో తినిపిస్తాను.. అప్పుడు నువ్వు ఆయనను చూడటానికి హాస్పిటల్ కి రావాలి..!!  కాబట్టి,  నువ్వు ఇప్పడు ఇంటికి వస్తావో, అప్పుడు హాస్పిటల్ కి వస్తావో నీ ఇష్టం.. సరదాగా వచ్చి భోజనం చేసి, ఓ పది నిమిషాలు పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని వెళుదురు గాని త్వరగా రండి" అంటూ ఫోన్ కట్ చేసి రవి చేతిలో పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది..

మహేష్ కి ఏం చెయ్యాలో అర్థం కాక, కొన్ని నిమిషాలు ఆలోచించుకుని, 'రవి ఇంటికి వెళ్లి,  చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలి' అని మనసులో అనుకుని  బయలుదేరాడు.. మహేష్ చాలా సమయం గడిచినా రాకపోయే సరికి రవి, 'మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేద్దాము'  అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు,, అంతలోకి కాలింగ్ బెల్ మ్రోగింది.. ఎవరా.. అని తలుపు తీసి చూస్తే మహేష్!!  అతని మొహం ఇంకా అలాగే మొహమాటం గా ఉంది.

"అన్నా..!! వచ్చేశావా !!  రావేమో అని ఆయన కంగారు పడుతూ ఉన్నారు, మీరు రాలేదు అని కాదులే. నా వంట మొత్తం ఆయనొక్కడే తినాలనీ. సర్లే, సమయానికి వచ్చారు..  మీ ఇద్దరూ కూడా చేతులు కడుక్కుని వస్తే తినేద్దాము"  అని మహేష్ తో అంటూ వండిన వంటలు టేబుల్ మీద సర్దసాగింది. మహేష్ మోహమాటంగా భోజనం చేసాడని ఇద్దరికీ అర్థం అయ్యింది.

"మహేష్ !!  అలా మేడ మీదకు వెళ్లి మాట్లాడుకుందాం రా " అంటూ పైకి తీసుకువెళ్లాడు రవి.

పైకి వెళ్లిన తర్వాత,  "రవీ !!  నీకో విషయం మనస్ఫూర్తిగా చెప్పాలి రా..!!" అంటూ దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు.

"ఏముందీ !!  మహా అయితే నువ్వు కొన్ని గంటల క్రితం జరిగిన దానికి క్షమించమని అడుగుతావు, నీ భార్య అని తెలియక అన్నాను అంటావు. అంతే కదా..!!" అంటూ మహేష్ మనసులో అనుకున్న మాట రవి చెప్పాడు.

"అవును..! రవీ,  అంతకన్నా ఏం చెప్పగలను..?" అంటూ సిగ్గుతో తలవంచుకున్నాడు.

"చూడు..!! ఈ సృష్టిలో మనిషి మనుగడ సక్రమంగా ఉందని అనటానికి మనకు కనిపించే గుర్తు మనం ఒకరినొకరు గౌరవించుకోవడం. ఇదే మన నవీన మనుషుల మధ్య కొరవడితే మనకి అడవుల్లో ఉన్న వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పు..?" అని కొంచెం గట్టిగా అన్నాడు రవి.

"అది కాదు రవీ..!! నేను ఏదో సరదాగా అన్నాను. పైగా చెప్పాను కదా..!! నీ భార్య అని తెలిస్తే అనే వాడినే కాదు" అంటూ మహేష్ తన సమాధానం చెప్పాడు.

"ఏమన్నావు మహేష్..!!  నా భార్య అని తెలిసి ఉంటే అనే వాడివి కాదా..!!. ఒకవేళ అక్కడ నేను లేకుంటే, ఒకవేళ అక్కడికి నీ చెల్లెలు వస్తే, లేదంటే నీకు తెలిసిన మీ చుట్టాల అమ్మాయి అయితే అంటావా ??  నువ్వు అనవు..!!, ఎందుకంటే,  వాళ్ళు నీకు తెలుసు కాబట్టి" అంటూ ఇంకా ఏదో చెపుతూ ఉంటే మధ్యలో అడ్డువచ్చి  "మనకు తెలిసినవాళ్ళని మనం ఎందుకు కామెంట్ చేస్తాము రవి..!!" అని మహేష్ కొంచెం వాయిస్ పెంచి అన్నాడు.

"ఒక విషయం చెప్పనా మహేష్ !!  మన ఇంట్లో ఉన్న కుక్క దానికి తెలిసిన వాళ్ళని చూస్తే తోక ఆడిస్తూ దగ్గరకు వస్తుంది, అదే కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది. ఎందుకంటే దానికి అదే తెలుసు, దానికి ఆలోచించే శక్తి లేదు. కానీ మనకి ఉంది, మనకి మాత్రమే ఉంది" అని కోపం నిండిన గొంతుతో అన్నాడు రవి.

"అంటే !!  ఇప్పుడు నేను ఏం ఆలోచించకుండా మాట్లాడుతున్నా !!  అంటున్నావా..?" అని మహేష్ అన్నాడు.

" ఇప్పుడు కూడా , నువ్వేమంటున్నావు..!! తెలిసిన వాళ్ళను కామెంట్ చేయను అని, , అంటే తెలియని వాళ్ళను చేస్తాను అనే కదా..!!  మా ఇంట్లో ఉన్న కుక్క కూడా అంతే,  ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అది అరుస్తుంది" అని కొద్దిగా కఠినంగా చెప్పాడు రవి.

"అంటే ఇప్పుడు నాలాగా కొన్ని వందల మంది రోజూ దారిన పోయే వందమందిని కామెంట్ చేస్తూ ఉంటారు. నీ దృష్టిలో వాళ్ళు అందరూ నీ కుక్కలతో సమానమా..?" అని అడిగాడు మహేష్.

"అవును !!  నా దృష్టిలోనే కాదు, మంచి చెడుల విచక్షణ తెలిసిన ఎవరి దృష్టిలో అయినా అంతే..  ఎదుట వాళ్ళను గౌరవించడం, ఈ సమాజంలో బ్రతుకుతున్న మనందరి మొదట కర్తవ్యం. నువ్వు ఒకడిని గౌరవిస్తేనే మరొకరు నిన్ను ,  నీ కుటుంబాన్ని గౌరవిస్తారు ఇది మీకు ఎందుకు అర్థం కావడం లేదు" అని తనలో ఉన్న అసహనం బయటపెట్టాడు.

“అరేయ్  రవీ !!  ఇవన్నీ ఈ రోజుల్లో  చాలా మామూలు రా !!” అని తేలికగా అంటూ తన ఫోన్లో టైం చూస్తున్నాడు మహేష్.

“చూడు మహేష్ !!  కాలంతో పాటు మనిషి మాట తీరు మారింది.. అనకూడని పదాలు కూడా చాలా సులభంగా చెల్లి, తల్లి, భార్య అనే భేదం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇదే అభివృద్ధి చెందిన సమాజం అని అనుకుంటున్నారు.. కన్న తల్లి ముందు ఆ తల్లి నేర్పిన భాషలో తల్లి లాంటి మరో ఆడపిల్లను ఇలా కామెంట్ చెయ్యడం ఈ సమాజంలో కామన్ అంటే,  అటువంటి సమాజంలో వున్న నువ్వు నేను సిగ్గుపడాలి” అని చెప్పి మహేష్ సమాధానం కోసం చూస్తూ ఉన్నాడు రవి. 

"అది కాదు రవీ !!  కావాలని పనిగట్టుకుని కనిపించిన అందరిని ఎందుకు కామెంట్ చేస్తాను. నువ్వు ఒకసారి ఆలోచించు" అని రవిని శాంతపరిచేలా అన్నాడు మహేష్..

"అలా అంటావా..!!  నీలాగే అందరూ ఆలోచిస్తున్నారు మహేష్ !!  నేనేం అందరిని అనడం లేదు కదా..!! అని.. కానీ,  వాస్తవం ఏంటో తెలుసా..? నీలాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానాలకి భయపడి, ఈ మాటలు చేతలు గా మారి తమను ఏ రకంగా ఇబ్బంది పెడతాయో అని కొంతమంది గడపలు దాటి రావడం కూడా మానేశారు" అని కొంచెం బాధతో అన్నాడు రవి..

రవి అన్న మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ మహేష్,  "చూడు రవీ !!  మేమేమి కావాలని చేయం.. మా మాటలని కొంతమంది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తారు కూడా !! " అని తనను తాను సమర్ధించుకోసాగాడు.. 

"నువ్వు ఈ రోజు ఎందుకు ఇక్కడకు వచ్చావు మహేష్ !!" అని ప్రశ్నించాడు రవి.

"నువ్వు భోజనానికి పిలిచావని కదా నేను వచ్చాను" అంటూ సమాధానం చెప్పాడు మహేష్..

"ఇది ఒక కారణం మాత్రమే.. కానీ,  అసలు కారణం వేరు .. నేను చెప్పనా అదేంటో !!  నువ్వు ఉదయం చేసిన పనికి క్షమాపణ చెప్పడం కోసం.. అంటే నువ్వు చేసిన పని నీకు తప్పు అనిపించింది.. ఆ సమయంలో కనీసం నువ్వు నీ తల పైకి ఎత్తి కామెంట్ చేసిన ఆత్మజ మొహం లోకి  చూడలేకపోయావు.. కామెంట్ చేసిన నీకే అంత అవమానంగా వుంటే , ఆ మాటలు విన్న ఆత్మజ ఎంత బాధ పడేదో నువ్వు ఒక్కసారి ఆలోచించు" అంటూ,,  అతని ఆలోచనా విధానం సరైనది కాదు అని మహేష్ కి  రవి చెప్పాడు.

రవి చెప్తున్న మాటలకి మహేష్ కి తన తప్పు మెల్లగా తెలిసి వచ్చింది..  అతని కళ్ళలోకి చూడలేక దిక్కులు చూస్తూ స్నేహితుడు చెప్తున్న మాటలు వినసాగాడు..

"మీరు చేసే కామెంట్స్ కి ప్రపంచంలో ఏ స్త్రీ కూడా ఎంజాయ్ చేయదు, చేస్తుంది అనుకోవడం మీలాంటి వాళ్ళ మూర్ఖత్వం అంతే.. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే డబ్బులోనో లేక బహుమతులోనో ఉండదు, కేవలం ఇచ్చి పుచ్చుకునే మాటల్లోనే ఉంటుంది. ఒక మాట చాలు అది ఎన్నో అనర్దాలుకి దారి తీస్తుంది" అని రవి అన్నాడు.

"అనర్దాలా...!" అంటూ ఆశ్చర్యంగా చూసాడు మహేష్.

"అవును మహేష్ !!  నీలాగా కామెంట్స్ చేసేవాళ్ళ వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో అఘాయిత్యాలు చేసుకున్నారు, చేసుకుంటున్నారు.. మీరందరూ వరుసగా వెళ్లి ఆ అమ్మాయిలకు క్షమాపణలు చెప్పితే సరిపోతుందా..? ఒక్కసారి ఆలోచించు మహేష్ !!  ఆ ఆడపిల్లలను కన్న తల్లిదండ్రుల, తోడబుట్టిన వాళ్ల బాధకి అవి అడ్డువేయగలవా..? వెయ్యలేవు.. ” అంటూ ఆ వ్యాఖ్యానాల వెనుక ఏం జరుగుతుందో  అతను వివరించాడు..

ఆలోచనలో మునిగిన మిత్రుని చూస్తూ, 
"చూడు మహేష్..!!  దీనినే నేను ఇంకో కోణంలో చెప్పనా..? నువ్వు కామెంట్ చేసిన అమ్మాయి, కొంచెం ధైర్యవంతురాలు అయితే నీ మీద ఈవ్ టీజింగ్ కేస్ పెడుతుంది.. అప్పుడు నువ్వు ఏం చేస్తావు ??  నీ కుటుంబం రోడ్డున పడుతుంది.. మీ పరువు మంట కలుస్తుంది.. నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటి.. ఇదంతా చూసిన మీ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి..? ఆలోచించు ఒక్కసారి" అంటూ  సమయం ఇస్తూ కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉన్నాడు రవి.

మహేష్ నిశ్శబ్దంగా, మేడమీద నుంచి కిందకి చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు.. ఏ సమాధానం ఇవ్వలేదు..

"అసలు మన మనసులో ఎప్పుడు అయితే, ముక్కు మొహం తెలియాని ఎదుటి వాళ్ళను మాటలతో ఇబ్బంది పెట్టాలి అని చేస్తామో అప్పుడే మనం మనుషులం కాదు ఇంగితం లేని పశువులు అని అర్థం. నేను నువ్వు అన్నమాటకి ఇంతలా నీకు వివరణ ఎందుకు ఇచ్చానో తెలుసా.. మహేష్ !!"  అడిగాడు రవి .. చివరి మాటకు అతని గొంతు వణకటం గమనించాడు మహేష్..

రవి కళ్ళలో  సన్నటి నీటి పొరను గమనించిన  మహేష్, "తప్పు చేసింది నేను, , బాధ పడాల్సింది నేను,, నువ్వు కాదు.. నువ్వు ఎందుకురా బాధ పడుతున్నావు"  రవి దగ్గరకు వస్తూ అన్నాడు మహేష్.

రవి, " ఒకప్పుడు నేను చేసిన తప్పు వల్ల ఒక కుటుంబం అంతా కలిసి మూకుమ్మడి ఆత్మహత్య చేసుకున్నారు.. నా నోటి నుండి వచ్చిన మాటలు, ముగ్గురి నిండు ప్రాణాలను తీసింది" అంటూ తన కళ్ళు తుడుచుకుంటూ రవి మహేష్ వంక చూశాడు..

"ఏంటి రవీ..!!  ఏమంటున్నావు..? నాకేం అర్థం కావడం లేదు, ఏం జరిగింది ?? " అంటూ తన జేబులో ఉన్న రుమాలు రవికి ఇస్తూ అన్నాడు  మహేష్ ..

"జీవితంలో అనుభవాలు పాఠాలు నేర్పుతాయి అని అందరూ అంటూ ఉంటే నేను ఏమోలే అనుకున్నాను.. కానీ నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదని, ఇతరులకు చెప్తున్నప్పుడు నా అనుభవమే నాకు ఒక పాఠం అయ్యింది. కాలంతో పాటు మారిన భాష, మన చుట్టూ ఉన్న వారిని మనకు కాకుండా చేసింది, చేస్తుంది కూడా .. దీనికంతటికీ కారణం మన నోటి నుండి వచ్చే ఎన్నో తేలికపాటి మాటలు.. అనాలోచితంగా మాట్లాడే మాటలే మరో మనిషి మనసులో తూటాలుగా మారి మన మీద ఒక చెడు అభిప్రాయం తీసుకొస్తున్నాయి.  తెలిసీ తెలియక నేను కూడా చాలా రోజులు ఇలాగే ప్రవర్తించాను.. నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావ్ అని ఒక భయం నాలో ఏర్పడింది..  అప్పుడు నన్ను సరిదిద్దే వారు లేక నేను తప్పు చేసి, దాని శిక్ష మరొకరు అనుభవించేలా చేశాను.. కానీ,  నీ విషయంలో అలా జరగకూడదని ఇంతలా చెప్తున్నా మహేష్ .." అంటూ రవి తన మనసులోని బాధను బయటపెట్టాడు...

 స్నేహితుడి కన్నీటిని చూసిన మహేష్,   ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక రవి మాటలను వింటూ ఉన్నాడు..

"చూడు మహేష్ !!  నువ్వు అందంగా ఉంది కత్తి లాగా ఉంది అన్న నా ఆత్మజ, ఈ సృష్టిలో లో సంఘటనలను కళ్ళతో చూడడం తప్ప వాటిని విని ఆనందించ లేని ఒక అమాయకపు జీవి, జీవితంలో అందరి లాగా నేను కూడా డబ్బు కోసం వెంపర్లాడుతూ ఈ విశాలమైన నగరానికి వచ్చాను. ఉద్యోగం సంపాదించాను, స్వాతంత్ర్యపు గాలి పీలుస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను.. అప్పుడే నేను ఒక అమ్మాయిని చూసాను..  ఆమెను అలా ఒక నెల ఫాలో అవుతూ ఏదో ఒకటి సరదగా అన్న ఆలోచనతో పైశాచికంగా  కామెంట్ చేసేవాడిని, ఆమె మాత్రం తలొంచుకుని వెళ్లిపోయేది.. ఆమె మౌనం నన్ను మరింతగా మాటలు విసిరేందుకు అవకాశం ఇచ్చింది.. నేను లెక్కలేకుండా నా నోటి దురుసును కొనసాగించాను." అని రవి చెప్తూ ఉంటే  ఆత్మజ మేడ పైకి వచ్చింది.. రవి మొహంలో దుఃఖం చూసి నిశ్శబ్దంగా మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది.అది మహేష్ గమనించాడు కానీ,  ఏం మాట్లాడలేదు..

" ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత,  ఆమె ఒకరోజు ధైర్యంగా ఆగి, నా ముందు ఒకపేపర్ కింద పడేసి వెళ్ళింది. అదేంటి అని చూస్తే " దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండీ!! నా వెనక పడకండీ !!"  అని రాసి ఉంది.. కానీ నేను వినలేదు సరికదా..  ఆమె నుండి స్పందన వచ్చింది కదా.. అనుకుంటూ పక్కనున్న స్నేహితుల ప్రోద్బలంతో  మరింత విజృంభించి ఆమె ను వెంటాడసాగాను.. హఠాత్తుగా ఆమె నాకు కనిపించలేదు. ఒక వారం రోజుల తర్వాత ఆమె ఆత్మ హత్య చేసుకుంది అని పేపర్లో చూసాను" అంటూ రవి మరింత భావోద్వేగం అయ్యాడు.

" పేపర్ లో రాసిన వార్త ను, ఆమె ఫోటో ను చూసిన నేను అయోమయంలో పడిపోయి ఆ వార్తను గబగబా చదవసాగాను.. ఆ వార్తలో  'ఆమె ఒక పుట్టు మూగ అమ్మాయి పేరు భువిక,. ఇక్కడే ఒక వికాలుంగుల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఆమె హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది'  అని ఉంది"  రవి చెప్తూ,  వస్తున్న కన్నీళ్లు చెంపల మీద నుండి తుడుచుకుంటూ ఉన్నాడు..

పశ్చాత్తాపం మొదలైన నేను ఆ వసతి గృహానికి వెళ్లి,  అక్కడ ఏమైనా విషయం తెలుస్తుందా ? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ?  అని తెలుసుకోవడానికి వెళ్ళాను..  వాచ్ మెన్ తో మాట్లాడుతూ ఉన్న నన్ను చూసిన వార్డెన్ లోపలికి రమ్మని కబురు పంపింది.. లోపలికి వెళ్ళిన నన్ను పిలిచి విషయం ఏమిటని అడిగింది.. నేను ఆమెను వివాహం చేసుకోవాలి అని ఆమె వెంట పడ్డాను అని అబద్దమాడాను..

అది నమ్మిన వార్డెన్ కాసేపు నన్ను చెడామడా తిట్టి, "పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాడివి ఇలానా ప్రవర్తించే తీరు, తను ఎంతగా బెదిరిపోయింది బాబూ..!! నీ వల్ల ఎంత పని జరిగిందో తెలుసా..!! ఒక నిండు ప్రాణం గాలిలో కలిసింది" అంటూ ఆవేదన పడింది వార్డెన్.

"మేడం నేనేం చేసాను" అని ఆశ్చర్యంతో కూడిన భయంతో అడిగాను.. "నువ్వు ఎందుకు వెంట పడుతున్నావో తెలియని భువిక చాలా భయస్థురాలు పైగా, మూగది అవడం వల్ల నీకు ఎటువంటి సమాధానం చెప్పేది కాదు.. అది నువ్వు అదునుగా తీసుకుని ఏమేమి అనేవాడివో  రోజు నీ మాటలకు ఎంత బాధపడేదో,  భయపడేదో తన మూగ సైగల బాష ద్వారా నాకు చెప్పేది.. త్వరలో నిన్ను పిలిచి మాట్లాడాలి అనుకున్నాను.."

"నువ్వు ఆమె వెనుకాల వస్తూ  హాస్టల్ దగ్గరకు వచ్చేవాడివట, అది మా సుపీరియర్ చూశాడు.. చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నావని ఆమెను నిలదీశారు.. హాస్టల్లో ఉన్న పిల్లలకి పరీక్షల సమయం అవడం వల్ల నేను కూడా ఆమెకు వెంటనే సహాయం చెయ్యలేకపోయాను” అని వార్డెన్ ఇంకా చెప్తూ వుంటే మధ్యలో, 

“మేడం...!! నేను ఏం చేసాను ??  సరదాగా చేసిన కామెంట్స్ అవి. వాటికి భయపడి బాధపడి ఆత్మ హత్య చేసుకుంది అంటే నేను ఒప్పుకోను” అని కొంచెం జంకుతున్న గొంతుతో  అన్నాను..

“ చెప్పాను కదా !! నువ్వు ఆమె వెంట బడటం మా సుపీరియర్ రెండు మూడు సార్లు చూసి,  నీ వలన హాస్టల్ కి చెడ్డ పేరు వచ్చేలా వుంది..!! నీ ప్రవర్తన వలన ఈ తప్పులో నువ్వు భాగం అయినావు,  నీ ఒక్కదాని పరువే కాదు, ఈ హాస్టల్ మొత్తం పరువు పోతుంది.. నీ వెనుక అతను మరొక్కసారి హాస్టల్ దగ్గరకు వస్తే, నేను నీ ప్రవర్తన బాగోలేదు అని దృవీకరించి హాస్టల్ నుండి బయటకు పంపి వేస్తాను అని మీటింగ్ లో హెచ్చరించారు.. ఆ రోజే నీకు ఆమె  చీటీ మీద రాసి చెప్పిందట.. కానీ,  నువ్వు ఆ రోజు నుండీ మరీ ఉదృతంగా ఆమె వెంట పడ్డావట, చెప్పి భయపడింది.. అనారోగ్యం కారణంగా నేను వెంటనే చర్యలు తీసుకోలేక పోయాను.. కొంత కాలం చూద్దాం అని చెప్పి బుజ్జగించాను..  నువ్వు చేసే కామెంట్స్ , సుపీరియర్ హెచ్చరిక  ఆమెను చాల మనో వ్యధకు గురి చేసాయి.. కనీసం చివరిగా నాతో కూడా చెప్పలేక పోయింది ” అంటూ తన కళ్ళ నుండి వస్తున్న కన్నీరు తుడుచుకుంది...


ఇదంతా విన్న నా చేతులు మెల్లగా వణకడం మొదలు అయ్యాయి,.  ప్రమేయం లేకుండా కంటి నీరు ధారాపాతంగా బయటకు ఉబికి వస్తూంది.. ఏం చెయ్యాలో  అర్ధం కావడం లేదు.. నా చెవుల్లో ఆమెను అన్న మాటలు అన్నీ ఒక్కసారిగా  మారుమోగుతున్నాయి.. తల అంతా భారం అయ్యింది.


అంతలోకి వార్డెన్ “ఆమె చనిపోతూ ఒక సుసైడ్ నోట్ రాసి చనిపోయింది” అని చెప్పింది.


ఒక్కసారిగా నా కాళ్ళు చేతులు వణకడం రెట్టింపు అయ్యాయి. వణుకుతున్న గొంతుతో “ ఆ నోట్ లో ఏముంది మేడం..?” అని అడిగాను..


“ నువ్వు ఏం కంగారు పడకు,.  ఆమె చాలా భయస్తురాలే కాని గొప్ప జాలి గుండె.. ఆమె ఆ నోట్ లో 'నా చావుకు ఎవరూ కారణం కాదు'  అని రాసి పెట్టుకుని చనిపోయింది. నీ గురించి కానీ,  ఆ సుపిరియర్ గురించి కానీ ఏమీ రాయలేదు” అని వార్డెన్ నోట్ లో వున్న విషయం చెప్పింది..


ఈ మాట విన్న తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది.. ఎంత అనాగరికంగా, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను అనుకుంటూ లోలోపల మధన పడుతూ  నిలబడి వున్న  చోటులోనే కిందకి కూలబడ్డాను.. కళ్ళనీళ్ళు ధారాపాతంగా కారిపోసాగాయి.. కింద కూలబడి  వెక్కి వెక్కి ఏడుస్తున్న నాతో వార్డెన్ , “చూడు రవీ..!! జరిగింది ఏదో జరిగిపోయింది.. నీకు మాత్రం తెలియదు కదా" అంది, అది విన్న నేను మరింతగా కృంగి పోయాను.. వార్డెన్ నేను చెప్పిన అబద్ధం నమ్మి నాతో ఈ విధంగా మాట్లాడుతుంది.. నేను భువిక ను పెళ్లి చేసుకోనున్నట్లు ఆమె నమ్మింది, ఇది నన్ను మరింతగా పశ్చాత్తాపానికి గురిచేసింది.. 

ఆమె తన ధోరణి లో తాను చెప్పసాగింది " ఈ విషయాలు మొత్తం ఎవరికీ తెలీదు., ఆమె నాతో తప్ప మరెవరికీ ఈ విషయాలు చెప్పుకోదు.. నాకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు నేను సాయం చేస్తాను అని చెప్పాను, కానీ, నాకు సరైన సమయం దొరకలేదు.. ఈలోపే జరగవలసిన నష్టం జరిగింది.. నువ్వు సరదాగా చేసిన పనులు,  అన్న మాటలు ఇంతటి అనర్ధానికి కారణం అయ్యాయి రవీ !! ” అంటూ ఆగింది..


నా మొహంలో కత్తి వాటుకు నెత్తురు చుక్క లేనట్లు మారి పోయింది.. గొంతు పిడచగట్టుకు పోయింది.. మనసు పశ్చాతాపంతో నిండి పోయింది. నోటి నుండి మాట రావడం లేదు..

 

సుపీరియర్ కు ఈ విషయం గురించి వివరంగా చెప్పాను..  అతను తను చేసిన పని వల్ల ఒక అమ్మాయి చనిపోయింది అని షాక్ కు గురయ్యారు.. తనలో తాను కుమిలిపోతూ తన బాధ్యత సరిగా నిర్వర్తించలేదని, భువిక లాంటి అమాయకురాలిని తెలిసీ తెలియకుండా వేధించానని ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు” అని చెప్పింది. 


వార్డెన్ మాటలు విన్న నేను నా వలన ఒక్కరు కాదు ఇద్దరు బలయిపోయారు అని భరించలేని వేదనతో మౌనంగా కూర్చుండి పోయాను.. ఏడుపుతో నాకు గొంతు పెగల్లేదు.. నా పరిస్థితి గమనించి, వార్డెన్ మంచినీరు ఇచ్చి నన్ను ఒక అరగంట పాటు స్థిమిత పరచింది.. నెమ్మదిగా తేరుకున్న నేను  “ మేడం !! నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు..  ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు..? ఏం చేస్తే నిష్కృతి లభిస్తుంది,, చెప్పండి,  అదే నేను చేస్తాను” అంటూ వార్డెన్ పాదాల మీద పడ్డాను..

కొద్దిసేపు నన్ను నా ఆవేదనను గమనించిన ఆమె, 
“చూడు రవీ !! నిజంగా నువ్వు చేసిన పనికి ప్రక్షాళన చేసుకోవాలని అనుకుంటున్నావా" అని అడిగింది.. నేను ఔను అన్నట్లు తలూపాను.. ఆమె, "సరే ! ఇప్పుడు నువ్వు చేస్తాను అంటే ఒక పని చెయ్యాలి, భువిక అక్క , ఒకతన్ని ప్రేమించి,  అమ్మ నాన్నలు లేకపోవడం వల్ల ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని అతన్నే పెళ్లి చేసుకుంది..  అతను కొన్నాళ్ళు సరిగానే ఉండి మోజు తీరాక, దారి తప్పి  వ్యసనాలకు బానిస అయ్యి ఆమెను చిత్ర హింసలు పెట్టేవాడు,.  అతని తల్లి తండ్రులు నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మా వాడికి ఈ స్థితి పట్టింది, అని రోజు సూటి పోటి మాటలతో వేధించే వాళ్ళు.. ఒక రోజు తాగి వస్తూ అతను రోడ్డు ప్రమాదం జరిగి అక్కడిక్కడే మృతి చెందాడు.. అదే రోజు ఆమె అత్తమామలు  నీ వల్లే ఇది జరిగింది,  నువ్వు ఒక నష్ట జాతకురాలివి అని ఇంటి నుండి బయటకు గెంటేసారు.. చిన్నతనంలో తెలియక చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తుంది.. విధిలేక ఆమె ఇప్పుడు ఇక్కడే  తన బిడ్డని చూసుకుంటూ  చిన్న చితక పని చేసుకుంటూ  జీవితం సాగిస్తుంది.. కాని ఒంటరి ఆడది అవడం వల్ల ఆమెలో ఉన్న తల్లితనం కాకుండా ఆడతనం కోసం వెంపర్లాడుతూ వున్నారు చుట్టూ వున్న జనం.. వీలుంటే  నువ్వు వెళ్లి ఆమెకు ఏదయినా సహాయం చెయ్యి” అని చెప్పి అడ్రెస్ ఇచ్చి పంపింది వార్డెన్.. 


 నేను ఆ అడ్రస్ తీసి  చూస్తే “ఆమె పేరు ఆత్మజ” అని వుంది" అంటూ రవి భారంగా ముగించాడు.. మహేష్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాడు.. నిజమా !! అన్నట్లు రవి వంక అలా చూస్తూ ఉండిపోయాడు.


 రవి గతం విని పెల్లుబిక్కిన బాధ తో అతనిని గట్టిగా హత్తుకుని “ రవీ !! ఇన్నాళ్లూ నేను చేసింది తప్పు కాదు అన్న భ్రమ లో ఉండే వాడిని.. ఇప్పుడు నేను చేసింది ఎంత పెద్ద తప్పో అర్ధం అయ్యింది” అంటూ ఇకపై నా వలన ఇలాంటి పొరపాటు జరగదు" అంటూ వాగ్దానం చేశాడు..   “నీ వల్ల అంత పెద్ద తప్పు జరగకుండా,  జరుగుతుందేమో అన్న భయంతో,  నిన్ను హెచ్చరించాలి అని ఇవన్నీ చెప్పాను” అంటూ ఆగాడు..


కొన్ని క్షణాల తర్వాత  "చూడు మహేష్ !!  ఈ సృష్టిలో మనిషి ఒక్కడే తన మాటలతో చైతన్య పరచగలడు, తన మాటలతో నిరాశ పరచి, కృంగదీయగలడు., తన మాటలతో ఆనందం పంచగలడు, తన మాటలతో ప్రపంచాన్నే శాసించగలడు.. ఇంతటి శక్తి గల మాటలను చాల తేలికగా వాడుతూ,  కొందరి జీవితాల్లో  విషాదం నింపవద్దు అంటున్నాను.. ఎందుకంటే  మాటల్లోనే, మనిషి భావోద్వేగం మిళితం అయ్యి ఉంటుంది.. మన లోని చెడు భావాలనైనా మంచి భావాలనైనా  మాటల ద్వారానే బయటకు వ్యక్తపరచగలం. ఒక  సంతృప్తికరమైన మాట, మనసుకి ఎంతో ప్రశాంతతని, ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తాయి.. అదే ఒక అనాలోచిత మాట లేదా ప్రసంగం  పెను విషాదానికి దారి తీస్తుంది” అని అన్నాడు .


“రవీ !!  నువ్వు ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు  నా తుది శ్వాస వరకు నా మనస్సు లో నిలిచి ఉండిపోతాయి.. మరొకసారి ఒక  అమ్మాయినే కాదు సమాజంలో ఎవర్ని కూడా మాటలతో వేధించను, అలా ఎవరు చేసినా తప్పు అని వారిస్తాను..” తనలో వచ్చిన మార్పును తెలియజేస్తూ అన్నాడు మహేష్ .


“మహేష్ నీలో నేను ఈ మార్పే కోరుకుంటున్నాను. అంతేగాని,  నాకు మరో ఉద్దేశ్యం లేదు.. నేను చేసిన తప్పుకి నాకు నేను పరిహారంగా ఆత్మజని పెళ్లి చేసుకుంటే, ఆ దేవుడు నాకు వేసిన శిక్ష అమ్మ నాన్నలకి దూరం చేసాడు. ఒక భర్తృహీన ను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల నన్ను ఇంటి లోకి కూడా రానివ్వలేదు.. కారణం చెప్పినా వినలేదు.. కానీ,  నేను అవన్నీ పట్టించుకోలేదు, కేవలం ఇది నేను నా చేతులారా చేసిన తప్పుకి పరిహారం అని భావిస్తూ, ఆత్మజ కి ఒక జీవితం ఇవ్వాలి అనుకున్నా,.. ఇస్తున్నా ..” అని ప్రశాంతంగా  అన్నాడు రవి..

మళ్ళీ పైకి వచ్చిన ఆత్మజ,  "అన్నా...!! మీ పాత జ్ఞాపకాల నుండి బయటకు వస్తే, వాస్తవంలో మీ ఫ్రెండ్ తెచ్చిన స్వీట్స్ తినొచ్చు.. కిందకి రండీ !!" అంటూ పిలిచి వెళ్ళిపోయింది.. ఈసారి ఆత్మజకి రవి మొహం ప్రశాంతంగా కనిపించింది.. రవి, మహేష్ ఇద్దరూ నిర్మలమైన మనసులతో కిందకి దిగి వెళ్లారు.

*శుభం*

మరిన్ని యువతరం