Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala-3 by bhaskarabhatla

ఈ సంచికలో >> సినిమా >>

రెండు పాటలైనా హిట్టవ్వాలి... రెండు సీన్లయినా బాగుండాలి

Interview with anoop rubens

అనూప్ రూబెన్స్... ఇప్పుడు యువ సంగీత ప్రియులకు చిరపరిచతమైన పేరు. లవ్ లీ, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అడ్డా, వంటి సినిమాల మీదుగా సంగీత ప్రయాణం. పరుగెట్టి ప్రిజ్ నీళ్లు తాగి ఆరోగ్య పాడుచేసుకునే రకం కాదు, నిలబడి, నిండుకుండలో నీళ్లు తాగే టైపు. అందుకే రాసిలో కన్నా వాసిలో మిన్నయిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అదేంటని అడిగితే... చిన్నగా నవ్వేసి, అదంతే అంటాడు. పరిచయం అయ్యేదాకా ఎవరో తెలియదు... పరిచయం అయ్యాక చిరునవ్వుతో వెంటాడతాడు. అలాంటి యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో ఈ వారం ఇంటర్వూ.

కెరియర్ ఎలా వుంది?
- ఏ నిమషంలో సినిమా రంగంలో కాలు పెట్టానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశ్రాంతి అన్నదే లేదు. సహాయకుడిగా అనండి, కీబోర్డు ప్లేయర్ గా కానివ్వండి, బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ గా అనుకోండి... అలా చేస్తూనే వస్తున్నా... చేస్తూనే వున్నా.

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే... ఇలా చాలా హిట్లు... అయినా, అన్ని మ్యూజికల్ హిట్ లు కొట్జాక కూడా మీ సినిమాల జాబితా పెరిగినట్లు లేదు.
- నిజం చెప్పనా... మీరు నమ్మినా నమ్మకున్నా, నాను సినిమా కథ నచ్చాలి. అప్పుడే హృదయస్ఫూర్తిగా సినిమా చేయగలం. అలా చేస్తేనే, మంచి పాటలు ఇవ్వగలం. ఇంకా మంచి నేపథ్య సంగీతం అందించగలం. అందుకే నేను కొంచెం సెలెక్టివ్ గానే వుంటాను.

ఇలాగే అందరూ చెబుతుంటారమే?
- కావచ్చు. నా మటుకు నేను ఈ మాటలు నిజాయితీతో చెబుతున్నానా లేదా అన్నది నాకు మాత్రమే తెలుసు. నేను చేసిన, చేస్తున్న సినిమాలు ఈ మాటలు నిజమా కాదా అన్నది చెబుతాయి.

సరే, పెద్ద సినిమాలు లేదా పెద్ద హీరోల ఆఫర్లు వస్తున్నాయా? పెద్ద స్టార్ లతో సినిమా లేదని ఫీలింగ్ ఏమ్నన్నా వుందా?
- అదేం లేదు. మంచి సినిమా అయితే చాలు. అది పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేదు. పోనీ మీరన్న మాటకే వస్తే ఇప్పుడు చేస్తున్న నితిన్ హార్ట్ అటాక్, నాగార్జున మనం... నాగచైతన్య ఆటోనగర్ సూర్య ఇవన్నీ పెద్ద సినిమాలే కదా?

తొలిసారి పూరి జగన్నాధ్ తో ఎలా వుంది?
- నిజానికి తొలిసారి అనుకోవడానికి లేదు. ఆయనతో బుడ్డా హోగయా మేరా బాప్ కు రీరికార్డింగ్ చేసాను. ఆయనతో వ్యవహారం డిఫరెంట్ గా వుంటుంది. సీన్ చాలా చక్కగా వివరించి, చాయిస్ మనకు వదిలేస్తారు. ఇకపై బాధ్యత మనపై వుంటుంది. అందుకే ఆయన సినిమాలో పాటలు హిట్ అవుతాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే.

పూరి జగన్నాధ్ సినిమా అంటే మాంచి ఐటమ్ సాంగ్ వుంటుంది. ఈ సినిమాలో కూడా?
- ఇప్పుడే చెప్పాడానికి ఏమీ లేదు.

సినిమా రంగంలో  పోటీ ఎలా వుంది? దేవీ శ్రీ ప్రసాద్, థమన్, వీళ్లతో గట్టి పోటీయేమో?
- అది అనుకోవడం వరకే. ఇక్కడ ఎవరు ఎవరికి పోటీ కాదు. ఎవరి సినిమాలు వారికి వుంటాయి. ఎవరికి సరిపడా పని వారి వుంటూనే వుంటుంది.

ఏ ఇనుస్ట్రుమెంట్ అంటే మీకు ఇష్టం.
- కీ బొర్డు అంటే ఇష్టం నేను బేసిక్ గా కీబోర్డు ప్లేయర్ ని. దానిపైనే కంపోజ్ చేస్తాను. పైగా నేను చాలా ఏళ్లు, చాలా మంది పెద్ద మ్యూజిక్ డైరక్టర్ల దగ్గర కీబోర్డు ప్లేయర్ గా పనిచేసాను.

ఇన్నేళ్ల అనుభవంతో మంచి పాటకు ఏముండాలని అని డిసైడ్ అయ్యారు?
- మెలోడీ. నన్నే కాదు, ఏ సంగీత దర్శకుడిని అడిగినా ఇదే చెబుతారు. చెప్పాలి కూడా. నిజానికి యూత్ కు బీట్ వుండాలి అనుకుంటాం. ఆ బీట్ కు కూడా మెలోడియస్ రిథమ్ తోడవ్వాలి. ఏ హిట్ సాంగ్ అయినా చూసుకోండి, అది ఫాస్ట్ బీట్ అయినా వెనుక కాస్తయినా మెలోడి టచ్ వుంటుంది. అప్పుడే పాట థియేటర్ బయట కూడా వెన్నాడుతుంది.

సినిమా చేసాక మీకు తృప్తికలిగించే విషయం?
- కనీసం రెండు పాటలయినా కొన్నాళ్లు వినపడాలి. కనీసం సినిమాలో రెండు సీన్లయినా ఆర్ ఆర్ కారణంగా నిలబడాలి. అప్పుడే నాకు ఆనందం. తృప్తి.

ఎక్కవ సినిమాలు చేయాలని లేదా? ఇలా కథలు ఎంచుకుంటూ వుండిపోతారా?
- చేయనని నేనేం గిరి గీసుకు కూర్చోలేదు. కానీ మనకు అంటూ ప్రత్యేకమైన బాణీ వుంది అన్నది ఎస్టాబ్లిష్ కావాలి. అనూప్ సంగీతం అందిస్తున్నాడు అంటే డిఫరెంట్ గా వుంటుంది. డెఫినిట్ గా బాగుంటుంది అన్న పేరు కావాలి.

అందుకు మీరు నిర్మాత దర్శకుల నుంచి మరింత ఫ్రీడమ్ ఆశిస్తున్నారా?
- అదేం లేదు. నాకు బాగానే ఫ్రీడమ్ వుంది. కొందరు నాకు వదిలేస్తారు. మరి కొంతరు వారి స్టయిల్ లో కావాలంటారు. దేనికైనా నేను రెడీ.

మీకు 2013 సూపర్ గా నడించింది. 2014 కూడా బాగుండాలని ఆశిస్తున్నాం.
- థాంక్స్... మీ నమ్మకాన్ని, సినిమా సంగీత శ్రోతల నమ్మకాన్ని వమ్ముకానీయను.

- కాత్యాయిని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Second Hand