Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Pandavulu Pandavulu Tummeda

ఈ సంచికలో >> సినిమా >>

తొలి చూపులోనే ప్రేమ పుడుతుందంటే న‌మ్మ‌ను! - కాజ‌ల్‌

Interview with Kajal Aggarwal

చంద‌మామ‌లా న‌వ్వుతుంది..
పంచ‌దార బొమ్మ‌లా ఊరిస్తుంది..
మ‌హారాణిలా మురిపిస్తుంది..
ఈ ఉపోద్ఘాతాల‌న్నీ కాజ‌ల్ గురించే. అందం, అభిన‌యాల మేలి క‌ల‌యిక - కాజల్. అందుకే అతి త‌క్కువ కాలంలోనే తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకొంది. ఎంత‌మంది క‌థానాయిక‌లు వ‌స్తున్నా, మ‌ధ్య‌లో ఆటుపోట్లు ఎదురైనా నిల‌దొక్కుకోగ‌లిగింది. త‌మిళంలోనూ త‌న‌ను తాను నిరూపించుకొంది. బాలీవుడ్‌లో విజ‌య‌బావుటా ఎగ‌రేసింది. 2014లో ఎవ‌డు సినిమాతో తొలి విజ‌యాన్ని అందుకొంది. అందులో చిన్న పాత్రే. కానీ ఉన్న‌ది కాపేపే అయినా క‌థ‌కు ప్రాణం పోసింది. అందుకే ఈ సినిమానీ గుర్తించుకొంటా... అంటోంది కాజ‌ల్‌. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌రోసారి జ‌త కట్ట‌నుంది. ఈ సంద‌ర్భంగా కాజ‌ల్‌తో జ‌రిపిన స్పెష‌ల్ చిట్ చాట్ ఇది.

* ఎవ‌డులో చేసింది చిన్న పాత్రే!  ఓ క‌థానాయిక‌గా ఉంటూ గెస్ట్‌రోల్ చేయమంటే ఎలా ఒప్పుకొన్నారు?
- గెస్ట్ రోల్ అని మీరంటున్నారు. కానీ ఆ పాత్ర తాలుకూ ఎమోష‌న్ చివ‌రి వ‌ర‌కూ అలా ప్ర‌యాణిస్తూనే ఉంటుంది. క‌థానాయ‌కుడి ల‌క్ష్యం... అత‌ని ప్ర‌యాణం అంతా ఆ పాత్ర కోస‌మే. అందుకే చిన్న పాత్ర అనుకోలేదు. దానికి తోడు... ఇది నా స్నేహితుల సినిమా. దిల్‌రాజు, వంశీపైడిప‌ల్లి - అన్నింటికంటే చ‌ర‌ణ్‌, బ‌న్నీ - వీళ్లంతా నాకు కావ‌ల్సిన‌వాళ్లు. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా.

* భ‌విష్య‌త్తులో ఇలాంటి అతిథి పాత్ర‌లు చేయ‌మ‌ని ఎవ‌రైనా అడిగితే..?
- త‌ప్ప‌కుండా చేస్తా. కానీ ఆ పాత్ర‌లోనూ ఇలాంటి డెప్తే ఉండాలి.

* మ‌రోసారి రామ్‌చ‌ర‌ణ్‌తో జ‌త క‌డుతున్నారు. ఆ సినిమా సంగ‌తులేంటి?
- ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడే క‌థ చెప్పేయ‌మంటే ఎలా? (న‌వ్వుతూ). కానీ ఒక్క‌టి మాత్రం చెబుతా. నా కెరీర్‌లో మ‌రో మంచి సినిమా అవుతుంది. కృష్ణ‌వంశీ చంద‌మామ నాకు మంచి ఆరంభం ఇచ్చింది. ఈసారి ఆయ‌న న‌న్ను మ‌రో మెట్టు ఎక్కించ‌బోతున్నారు.

* ఈమ‌ధ్య మీ కెరీర్ గ్రాఫ్ అంత స‌వ్యంగా లేదు. కార‌ణం ఏమిటి?
- నాకు గ్యాప్ వ‌చ్చింద‌ని నేను అనుకోవ‌డం లేదు. ల‌క్ష్మీ కళ్యాణం నుంచి ప్ర‌తి రోజూ ప‌నిచేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఉప‌శ‌మ‌నం దొరికింద‌ని నా భావన‌. 2013లోనూ నేను షూటింగుల‌తో బిజీగానే ఉన్నా. కానీ మునుప‌టిలా ఎక్కువ సినిమాలు చేయక‌పోవ‌డం వ‌ల్ల మీకు గ్యాప్ వ‌చ్చిన‌ట్టు అనిపించిందేమో..? చెల్లాయి పెళ్లి జ‌రిగింది క‌దా. ఆ ప‌నులు చూసుకొన్నా. నిజానికి విరామం తీసుకొన్న‌ట్టు కూడా లేదు.

* షూటింగుల‌కు సెల‌వు దొరికిన‌ప్పుడు ఏం చేస్తారు?
- (న‌వ్వుతూ) హాయిగా ప‌డుకొంటా. నిజమండీ. తెర‌పై అందంగా క‌నిపించాలంటే వీలైనంత నిద్ర‌పోవాలి. క‌నీసం 8 గంట‌లైనా ప‌డుకోని సంద‌ర్భాలు ఎన్నో. అందుకే ఈరోజు షూటింగ్ లేదంటే నిద్ర పోతూనే ఉంటా. కాస్త ఖాళీ దొరికినా కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డుపుతా. వాళ్ల‌తో క‌ల‌సి క‌బుర్లు చెప్పుకొంటూ భోజ‌నం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో..?

* మీ ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ‌గా ఉంటుంద‌నుకొంటా...
- అవును. మాది చాలా పెద్ద‌కుటుంబం. వ‌రుస‌గా షూటింగుల‌తో బిజీగా ఉండి ఇంటికి వెళ్ల‌క‌పోతే చాలా వెలితిగా ఉంటుంది. అఫ్‌కోర్స్‌... అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నాన్న కూడా నాతోనే ప్ర‌యాణం చేస్తారు. కానీ మేమంతా ఒకేచోట ఉంటే ఆ ఆనందమే వేరు క‌దా?

* చెల్లాయితో మీ అనుబంధం సంగ‌తేంటి?
- మేమిద్దరం చిన్న‌ప్పుడు ఎంత అల్ల‌రిచేసేవాళ్ల‌మో..? ఇద్ద‌రం ఉంటే ఇంట్లో ఓ యుద్ధం న‌డిచేది. మామ‌ధ్య ఎప్పుడూ గొడ‌వ‌లే. ఇప్పుడు పెద్ద‌వాళ్ల‌మైపోయాం క‌దా. అందుకే ప్రేమ‌గా ఉంటాం. ఇంట్లో సినిమా విష‌యాలు అస్స‌లు మాట్లాడుకోం. అది మాకు మేం పెట్టుకొన్న రూల్‌.

* సినిమాల్లో మీకు పోటీగా వచ్చేసింద‌నుకోలేదా?
- అదేం లేదు. మాలో మాకు పోటీ లేదు.

* బ‌య‌టివాళ్ల‌తో ఉందా?
- ఈ ప‌రిశ్ర‌మ‌ది చాలా విశాల‌హృద‌యం. ఎంత‌మంది వ‌చ్చినా... ఆద‌రిస్తుంది. టాలెంట్ కావాలంతే. పోటీ ఉన్నా... అది ఆరోగ్య‌క‌రంగానే ఉంటుంది.

* ఫ‌లానా క‌థానాయిక‌ నెంబ‌ర్ వ‌న్ అనే మాట వినిపిస్తుంటుంది... ఈ అంకెల్ని మీరు న‌మ్ముతారా?
- అస్సలు ప‌ట్టించుకోను. చెప్పా క‌దా... ఈ ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికీ స్థానం ఉంది. ఇలాంటి ప‌రిశ్ర‌మ‌లో నేను ఉండ‌డం ఆనందంగా భావిస్తా. అంతేత‌ప్ప నాది ఎన్నో స్థానం అని లెక్క‌వేసుకోను. ప్రేక్ష‌కులంతా నెంబ‌ర్ వ‌న్ క‌థానాయిక‌ల సినిమాలే చూస్తారా??  అంద‌రి సినిమాల్నీ ఆద‌రిస్తున్నారు క‌దా?

* ప్రేమ పై మీ అబిప్రాయం ఏమిటి?
- ప్రేమ‌ని ఒకే యాంగిల్‌లో చూస్తారెందుకో నాకు అర్థం కాదు. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య‌, అక్క చెల్లిళ్ల‌మధ్య, స్నేహితుల మ‌ధ్య ప్రేమ ఉంటుంది. అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య ఉన్న‌ది మాత్ర‌మే ప్రేమ అనుకొంటే ఎలా?  పైగా తొలి చూపు ప్రేమ అంటే నాకు అస్స‌లు న‌మ్మ‌కం లేదు. అది కేవ‌లం సినిమాల్లోనే చూపిస్తారు.

* అంటే భ‌విష్య‌త్తులో మీరు ప్రేమ‌లో ప‌డే అవ‌కాశ‌మే లేదా?
- ప్రేమించ‌డం, ఒక‌రి ప్రేమను ఆస్వాదించ‌డం అంటే చిటికెలో జ‌రిగే ప‌నికాదు. ఒక‌రి మ‌న‌సు మ‌రొక‌రు గెలుచుకోవాలంటే చాలా దూరం ప్ర‌యాణించాలి. ఆ ఓపిక నాకు లేదు.

* ఎలాంటి పాత్ర‌లు చేయాల‌ని వుంది?
- అనార్క‌లిగా క‌నిపించాలనివుంది. ఎప్ప‌టినుంచో నామ‌దిలో ఉన్న కోరిక ఇది. అది తీర‌డం లేదు.కానీ ఒక్క‌టి మాత్రం చెబుతా. ప్ర‌తీ సినిమాలోనూ నాలోని న‌టిని ఛాలెంజ్ చేసే స‌న్నివేశం ఒక్క‌టున్నా చాలు. త‌ప్ప‌కుండా ఒప్పుకొంటా. గ‌త సినిమాలో పోషించిన పాత్ర‌లా ఉంటే మాత్రం వ‌దులుకొంటా. ఇంత‌కు మించి ప్రాధాన్యాంశాలు ఏమీ లేవు.

* మ‌ళ్లీ బాలీవుడ్ వెళ్తున్నారా?
- త్వ‌ర‌లోనే ఓ సినిమా చేస్తున్నా. పూర్తి వివ‌రాలు ఇంకొన్ని రోజుల్లో తెలుస్తాయి.

* ఓకే. ఆల్ ది బెస్ట్‌...from  గో తెలుగు.కాం!
- థ్యాంక్యూ.

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka