Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Vibhajana

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీ వనం - వర ప్రసాద్

sahithee vanam

వాని చక్కఁదనము వైరాగ్యమునఁజేసి
కాంక్షసేయు జార కామినులకు
భోగబాహ్య మయ్యెఁ బూచిన సంపెంగ
పొలుపు మధుకరాంగనలకుఁ  బోలె

ప్రవరుడు ఎంతటి అందగాడో అంతటి విరాగి కావడంవలన విటులను కోరుకునే కామినులకు అనుభవించడానికి పనికిరాకుండా పోయాడు, సంపెగ పువ్వు ఆడతుమ్మెదలకు పనికిరాకుండా పోయినట్లు.  సంపెంగ పూలకు ఏ తుమ్మెదలూ ముసరవు, ఆడతుమ్మెద అయినా మగ తుమ్మెద అయినా సరే,  ఇక్కడ కామినీ ‘స్త్రీలకు’ ప్రవరుడు పనికిరానివాడు అనిచెప్పడం కోసం ఆడ తుమ్మెదలకు సంపెంగ పనికిరానట్టు అన్నాడు పెద్దన, చమత్కారంగా.

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడునై కమనీయకౌతుక
శ్రీవిధిఁ గూఁకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప సుఖులై తలిదండ్రులు  గూడి దేవియున్
దేవరవోలె నుండి యిలు దీర్పఁగఁ గాపుర మొప్పు వానికిన్

ప్రవరుడు యవ్వనంలోనే యజ్ఞ యాగాదులను చేసినవాడు, సంపన్నుడు. ‘కూకటుల్ గొలిచి’ చేసిన కూరిమి సోమిదమ్మ తనకు కమనీయంగా, ఉత్సుకతతో, విసుగన్నది లేకుండా, మహాలక్ష్మిలా, సౌఖ్యాన్ని కలిగిస్తూ సేవిస్తూ ఉన్నవాడు. కూకటుల్ కొలిచి చేయడం అనేది విచిత్రమైన ప్రయోగం. ‘కూకటి’ అనే పదానికి జుట్టు, ముంగురులు, మూలాలు(కూకటివేరు) అనే నానార్ధాలు, అంటే నఖ శిఖ పర్యంతమూ పరిశీలించి, ఈడూ జోడూ కుదిరిందని, అటు పూర్వీకుల, యిటు పూర్వీకుల మూలాలు, వంశ చరిత్ర సంప్రదాయము చూసి, అన్నివిధాలా అనువైన వధూవరులను ఏర్చి కూర్చిన జంట ‘కూకటుల్ కొలిచి చేసిన జంట’. అటువంటి సోమిదమ్మ భార్యయై సేవిస్తుండగా, ‘తల్లిదండ్రులను తన దగ్గరే ఉంచుకుని సేవిస్తూ’ వారు సుఖంగా ఆనందంగా ఉండగా దేవిలా, దేవుడిలా తన ఇంట్లో తన భార్యతో కాపురం ఉన్నాడు ప్రవరుడు. ఇక్కడ ఆతని తల్లి దండ్రులు కూడా దేవి, దేవుడు అని అన్వయించుకోవచ్చు, అలా భక్తిగా తల్లిదండ్రులను కొలుచుకుంటూన్నాడు అని. కానీ పెద్దన ప్రవరుడి దంపతులకే ఈ విశేషణం వేసి, ఒక దివ్యమైన చమత్కారం చేశాడు. దేవి దేవర అని వదిలేశాడు. అంటే సరస్వతీ బ్రహ్మలు కావచ్చు, పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లక్ష్మీ నారాయణులు కావచ్చు, అసలు ఈ మూడుజంటల సంకేతమైన పాండిత్యము, జ్ఞానము- ఒకటే శరీరంగా అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మమకారం- భార్యను గుండెల్లో నిలుపుకునే భర్త, భర్త పాదసేవను మహాభాగ్యంగా నిరంతరమూ చేసే భార్య- ఈ మూడిటిలో ఏ లక్షణ మైనా కావొచ్చు, ముగ్గురిలో ఎవరైనా కావొచ్చు కావచ్చు అనికాదు, ఈ మూడు లక్షణాలూ కలిగిన ఉదాత్తమైన, శ్లాఘనీయమైన సంసారం ప్రవరుడిది అని చెప్పడం కోసం,  దేవి దేవరలలా కాపురం ఉన్నారు అని చెప్పడం.

వరణానదీ తరంగ ధ్వనులతో, పక్షుల కిలకిలా రావాలతో, కొత్తగా వికసిస్తున్న కమలముల సువాసనలను మోసుకొచ్చే తెల్లవారు ఝాము పిల్లగాలులతో పాటే లేస్తాడు, లేస్తూనే వామనమూర్తిని స్తుతిస్తాడు, శిష్యసమేతుడై నదికివెళ్లి స్నానంచేసి, సంధ్య వార్చి, గాయత్రిని ఉపాసించి, సూర్యనారాయణ మూర్తికి సన్నుతులు చేస్తాడు, పండ్లూ, సమిధలు, దర్భలు, పూలు, ఉతికిన మడి ధోవతీలు మోస్తూ బ్రహ్మచారులు, శిష్యులు వెన్నంటి వస్తూండగా పురప్రజలు గౌరవంగా, భక్తితో చూస్తుండగా ఇంటికి వస్తాడు.

శీలము, కులము, శమము, దమము, స్నేహగుణం, లేతవయసు అన్నీ సమంగా సమకూరినవాడు,‘మనము వినయంగా ఏదన్నా సమర్పించడానికి ఇతనే అర్హుడు’ అని ఏ ప్రభువు వచ్చి ఇవ్వాలని చూసినా ఏదీ తీసుకోడు, అతనిది ఇతరులది ఆశించే నైజము కాదు, అతనికి ఆ అవసరముకూడా లేదు, రకరకాల పంటలు సమృద్ధిగా పండే భూములు ఎన్నో ఉన్న సంపన్నుడు అతను, ఆతని ఇంట్లో ఎన్నడూ పాడికి, పంటకూ కొరతే లేదు.

వండ నలయదు వేవురు వచ్చిరేని
నన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి
యతిధు లేతేర నడికిరేయైనఁ బెట్టు
వలయు భోజ్యంబులింట నవ్వారి గాఁగ

అన్నపూర్ణకు ఉదాహారణముగా చెప్పాల్సినది ఆతని భార్య. అతిథులు నడి రాత్రి వచ్చినా భోజనము కావలసిన పదార్ధాలను విరివిగా, ప్రేమగా పెడుతుంది. భార్య ఇలా అయితే భర్త,

తీర్థ సంవాసులే తెంచినా రని విన్న/నెదురుగా నేఁగు దవ్వెంతయైన
నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ  దెచ్చుఁ /దెచ్చి సద్భక్తినాతిథ్య మిచ్చు
నిచ్చి యిష్టాన్న సంత్రుప్తులఁగాఁ  జేయుఁ /జేసి కూర్చున్నచోఁ  చేరవచ్చు
వచ్చి యిద్ధరఁ  గల్గు వనధి పర్వత సరి/త్తీర్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు

నడిగి యోజన పరిమాణ మరయు నరసి
పోవలఁ యు జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
ననుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి

తీర్థయాత్రలు ముగించి ఎవరైనా ఊళ్లోకి వచ్చారు అనే వార్త తెలిస్తే చాలు, ఎంతదూరమైనా ఎదురు వెళ్తాడు. వెళ్లి వారికి పాదాభివందనం చేసి ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి భక్తితో ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇచ్చి వారికి ఇష్టమైన భక్ష్య, భోజ్య, లేహ్య, చూష్యములతో విందుభోజనం, ఇష్టన్నం, మృష్టాన్నంతో సంతృప్తిపెడతాడు. సంతృప్తిపెట్టి ఇక దగ్గరికి జరిగి కూర్చుంటాడు. కూర్చొని భూమి మీద ఉన్న వనాలు, పర్వతాలు, తీర్థాలు, వాటి మాహాత్మ్యాలు, వివరాలు తెలుపమని అడుగుతాడు. అడిగి, “ ఆ స్థలం ఎన్నియోజనాల దూరం ఉంటుంది, ఈ స్థలం ఎన్ని యోజనాల దూరం ఉంటుంది? ’’ అని అడుగుతాడు. అడిగి దూరం తెలుసుకుని ‘ ఎలాగైనా సరే వెళ్లి చూడాలి ’ అని, ఎప్పుడు వెళ్తానో కదా అని, ప్రతిదినమూ తీర్థ సందర్శనాభిలాష మనసులో ఉప్పొంగి, నిట్టూర్పులు విడుస్తాడు ఆ ‘తరుణాగ్నిహోత్రి’.

కథ చెప్పడం ఎలాగో ప్రబంధ కవులను చదివితే తెలుస్తుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న శైలిలో, క్రమాలంకారంతో ప్రవరుడి తీర్ధయాత్రాభిలాష గురించి చెప్పి చివరలో ఒక మెరుపు మెరిపించాడు పెద్దన, ‘తరుణాగ్నిహోత్రి’ అనే పదంతో. తరుణుడు అంటే లేతవయసులో ఉన్నవాడు, చిన్నవయసులోనే అగ్నిహోత్రాన్ని ఉపాసించేవాడు అని ఒకఅర్ధం అయితే, సమయం తప్పకుండా ‘ చేయాల్సిన తరుణంలో, వేళదాటిపోకుండా ఎప్పటికప్పుడు, ఎల్లప్పుడూ సమయానికి అగ్నిహోత్రాన్ని ఉపాసించేవాడు’ అని ధ్వని, ఈ ధ్వని ‘ అగ్నికార్యానికి సమయం దాటి పోతున్నది, అయ్యో ఇంటికి ఎలా వెళ్తాను?  అని బాధపడే, కనిపించిన వాళ్ళను మా ఇంటికి దారి చెప్పి పున్నెం కట్టుకోండి’ అని బ్రతిమిలాడే భావి కథకు సూచన! ఇది మహాకవులకు సూచన!

ఇలా అతిథి అభ్యాగతుల సేవయే తన జీవన సర్వస్వంగా ఆ విప్రవరుడు సమయము గడుపుతుండగా ఒకనాడు మాంచి మిట్ట మధ్యాహ్నం వేళలో..

ముడిచిన యొంటి కెంజడ మూయ మువ్వన్నె/మెగముతోలు కిరీటము ధరించి
కకపాల కేదార కటక ముద్రిత పాణిఁ /గురుచ లాతాముతోఁ  గూర్చిపట్టి
యైణేయమైన యొడ్డాణంబు లవణిచే/నక్కళించిన పొట్ట మక్కళించి
యార కూటఛ్ఛాయ నవఘళింపఁగఁ జాలు/ బడుగు దేహంబున భస్మమలది

మిట్టయురమున నిడుయోగ పట్టె మెరయఁ 
జెవుల రుద్రాక్షపోఁగులు చవుకళింపఁ
గావికుబుసంబు జలకుండియును బూని
చేరెఁ దద్గేహ మౌషధ సిద్ధుఁడొకడు

తలముడికి పులితోలు కిరీటం పెట్టుకుని, జోలె సంచీ, పొన్ను చేతికర్ర పట్టుకుని, జింకతోలు వడ్డాణములా కట్టుకుని, ఇత్తడి పుత్తడి వర్ణంలో ఉన్న దేహమునిండా విబూది పూసుకుని ఎదుర్రొమ్ము మీద మెరుస్తున్న ‘యోగపట్టె’తో చెవులకు రుద్రాక్ష పోగులతో కావి పట్టిన బట్టలు కట్టుకుని ఒక ఔషధ సిద్ధుడు ప్రవరుని ఇంటికి వచ్చాడు. ఆ సిద్ధుని చూచి ఎదురేగి, అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, మృష్టాన్న భోజనం పెట్టి,

ఎందుండి ఎందుఁ బోవుచు
నిందుల కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేడుఁగదా! మ
న్మందిరము పవిత్రమయ్యె, మాన్యుడనైతిన్

ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తూ ఇక్కడికి వచ్చారు? జ్ఞానులచేత పూజింపబడే మహానుభావా! ఈరోజు నా ఇల్లు పావనమయ్యింది కదా! నేను మీ రాకచేత మాన్యుడనైనాను! అన్నాడు ప్రవరుడు.

మీ మాటలే దివ్య మంత్రాలు. మీరు అడుగు పెట్టినచోటే పవిత్రమైన ప్రయాగ! మీ పాదములు కడిగిన నీటి ధారలే పవిత్రమైన ఆకాశగంగాప్రవాహాలు! ఎవడి ఇంటికి అరమరికలు లేకుండా మీలాంటి పావనులు విచ్చేసి స్నాన పానాదులు, భోజనము చేస్తారో, వాడిది భాగ్యమంటే, వాడిది పుణ్యం అంటే, వాడిది పుత్ర పౌత్రాదులతో కళకళలాడే ఇల్లు, వాడు స్వర్గాన్ని పొందుతాడు. సంసారం లంపటంలో చిక్కుకుని విలవిలలాడే మాలాంటివారికి మీ పాదధూళి తప్ప వేరేది ఏముంది ఉద్ధరింప బడడానికి? అన్నాడు.

ఆ సిద్ధుడు ప్రవరుని మాటలు విని ‘ వత్సా! గృహస్థుడు అంటే సిద్ధంగా ఉన్న తంగేటి జున్ను, ఒడిలో ఉన్న కాసుల భోషాణం, పెరటిలో కల్పవృక్షము, వరాలనిచ్చే కామధేనువు, అమృతపు బావి, మేరుపర్వతం, ఎడారిలో ఒయాసిస్సు, ఆకలిగొన్న వాడికి ధాన్యరాశి, కుంటి, గుడ్డి, యాచక, బ్రహ్మచారి, సన్యాసి, పరివ్రాజకులకు నాధుడు, దేవుడు, భర్త! కనుక నాయనా! గృహస్తాశ్రమమునకు సమానమైనది ఏమన్నా ఉన్నదా? లేదు! అన్నాడు.

ఆ మాటలకు ప్రవరుడు ‘స్వామీ మీరు సమస్త దేశాలనూ తిరుగుతూ ఉంటారు, సమస్త తీర్థాల పర్యాటన చేస్తూ ఉంటారు, కనుక కుతూహలంతో అడుగుతున్నాను, ఏయే దేశాలకు వెళ్ళారు? ఏయే పర్వతాలను చూశారు? ఏయే తీర్థములలో స్నానం చేశారు? ఏయే ద్వీపాలు, వనాలు, సముద్రాలు చూశారు? ఆయా స్థలములలోగల వింతలు నాకు వివరించి చెప్పరూ? అని ప్రాధేయపడి అడిగాడు.

ఆ సిద్ధుడు ‘ఓ బ్రాహ్మణా వంశ చంద్రమా! జనపదాలు, పుణ్య నదీ నదాలు, నాలుగుదిక్కుల మధ్యనున్న భూభాగమంతా తిరిగాను, అక్కడి వింతలన్నీ చూశాను. కేదారేశుడిని భజించాను, హింగుళాదేవి పాదాలకు శిరసు తాకించి మొక్కాను, ప్రయాగలో పద్మాక్షుడిని దర్శించాను, యాదవ కుటుంబీకుడైన బదరీ నారాయణుడిని చూశాను, ఈ దేశము, ఆ దేశము ఏమిటి? నింగి కిందనున్న వింతలన్నీ చూశాను, నేలమీద ఉన్న విశేషాలన్నీ చూశాను’ అన్నాడు. ‘అమ్మా! దొరికాను గదా అని కోతలు కోస్తున్నాడు మహానుభావుడు’ అనుకుని కొంటెగా నవ్వుతూ, అనుమానము దాచిపెడుతూ, ‘ జంకూ గొంకూ లేకుండా అడుగుతున్నాను, ఏమీ అనుకోకండి, స్వామీ! రెక్కలు గట్టుకుని ఎగిరి వెళ్ళినా ఏళ్ళతరబడి తిరిగి చూసినా ఇవన్నీ చూసేప్పటికి పండు ముసలి అయిపోతాడు ఎవడైనా, మీరు చూస్తే ఇంకా లేతదనం వీడని ముఖంతో ఉన్నారే! అయినా మీ మహిమలు ఎవరికీ తెలుస్తాయి గనుక!’ అన్నాడు సంశయంగా చూస్తూ.

ఆ సిద్ధుడు ప్రవరుడు అనుమానిస్తున్నాడని గ్రహించి, ‘సందేహము కలిగితే అడగడం తప్పుకాదయ్యా! మేము సిద్దులము కనుక ముసలితనము, రోగము, ఆయాసము మాకు భయపడి, మా జోలికి రాకుండాఉంటాయి. అదీ గాక..

పరమంబైన రహస్యమౌ, నయిన డాపన్, జెప్పెదన్, భూమిని
ర్జరవంశోత్తమ! పాదలేప మను పేరం గల్గు దివ్యౌషధం
పు రసం బీశ్వర సత్క్రుపం గలిగెఁ దద్భూరి ప్రభావంబునం
జరియింతుం  బవమాన మానస తిరస్కారిత్వరాహంకృతిన్

ఇది పరమ రహస్యమైనా దాచకుండా చెప్తాను, ఓ భూసురోత్తమా! పరమేశ్వరుడి దయచేత పాదలేపము అనే దివ్యమైన ఔషధ రసం మాకు దొరికింది! దాని ప్రభావముచేత గాలికంటే కూడా వేగంగా, సూర్యకిరణాలు ప్రవేశించే ప్రదేశాలకు అన్నిటికీ దూరాభారము అనే మాట లేకుండా మేము ఏ ఇబ్బందీ లేకుండా సత్వరమే  వెళ్ళగలము’ అని అంటుండగానే, ప్రవరుడు కుతూహలంతో, భక్తిగా నమస్కరించి, అయ్యా! మీ దివ్యప్రభావమును గ్రహించలేని నా కూతలు పట్టించుకోకుండా నన్ను, మీ శిష్యుని, తీర్ధయాత్ర చేసే ధన్యతను ప్రసాదించి కనికరించండి!’ అనగానే సిద్ధుడు ఒక దంతపు బరిణ బయటకు తీసి, అందులో ఉన్న పసరును దాని గురించి అదీ ఇదీ అని ఏమీ చెప్పకుండా( అంటే దాని పరిమితులను, తీసుకొనవలసిన జాగ్రత్తలను కూడా చెప్పకుండా) ప్రవరుని పాదాలకు పూసి వెళ్ళిపోయాడు, అంతే!..

ఆ మం దిడి యతఁ డరిగిన
భూమీసురుఁ డరిగెఁ దుహిన భూధర శృంగ
శ్యామల కోమల కానన
హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్

ఆ సిద్ధుడు అలా వెళ్ళగా, ప్రవరుడు హిమాలయ పర్వత ప్రాంతాల పచ్చదనాన్ని, ఝరులను, రమణీయ దృశ్యాలను చూడాలనే కాంక్షతో హిమాలయాలకు వెళ్ళాలి అని సంకల్పించుకుని కన్ను మూసి తెరిచేలోగా హిమాలయాలకు వెళ్ళాడు' అని జైమిని మహర్షికి గరుడ పక్షులు కథను కొనసాగించాయి, అని స్వారోచిష మనుసంభవం’ లో ప్రథమాశ్వాసాన్ని ముగించాడు అల్లసాని పెద్దన. కథను వేగంగా నడిపే సందర్భంలో ఒకదానివెంట ఒకటిగా వేగంగా జరిగే సంఘటనల తీరును వర్ణించడానికి, ఒక ప్రవాహంలా పదప్రయోగ ఝరిని పరుగులెత్తించాడు చూడండి.

మరిన్ని శీర్షికలు
Book Review - Sammaanyudu