Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తడాఖా : చిత్ర సమీక్ష

thadakha movie review
చిత్రం: తడాఖా 
తారాగణం: నాగచైతన్య, సునీల్,  తమన్నా, ఆండ్రియా, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, వెన్నెల కిషోర్, నాగేంద్ర బాబు, రఘు బాబు, రమాప్రభ, జయప్రకాశ్ రెడ్డి  తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: బెల్లంకొండ గణేష్ 
దర్శకత్వం: కిశోర్  కుమార్ పర్దాసిని

తమిళంలో విజయం సాధించిన వేట్టై సినిమా తెలుగులో తడాఖా పేరుతో నేడు మన ముందుకొచ్చింది. నేరుగా కథా కమామిషుల్లోకి వెళ్ళిపోదాం.


క్లుప్తంగా చెప్పాలంటే:
శివ రామకృష్ణ (సునీల్) కార్తిక్ (నాగ చైతన్య) లు పోలీస్ ఆఫీసర్ వెంకట రావు (నాగ బాబు) కొడుకులు. తండ్రి మరణంతో  పెద్ద కొడుకు శివ రామ కృష్ణ కి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇస్తుంది డిపార్ట్మెంట్. స్వతహాగా శివ మహా భయస్థుడు. చిన్న చిన్న విషయాలకే బెదురుతూ ఉంటాడు. అలాంటి వాడు తమ్ముడు పోరు మీద యూనిఫాం వేసుకుని డ్యూటీ లో చేరతాడు. కరడు కట్టిన స్మగ్లర్స్, గూండాలు ఉండే ఒక కోస్తా ప్రాంతానికి చెందిన ఊరిలో అతనికి పోస్టింగ్. .

అదే ఊరిలో ఇద్దరు అందమైన అక్కాచెళ్ళెళ్ళు. నందు (యాండ్రియా) కి శివ కి పెళ్ళవుతుంది. కార్తిక్ ప్రేమలో పల్లవి (తమన్నా) పడుతుంది.

ఇంతకీ పిరికివాడైన శివ వెనుక అత్యంత ధైర్యవంతుడైన తన తమ్ముడు కార్తిక్ అండగా ఉంటూంటాడు. దాంతో శివ కి డిపార్ట్మెంట్ లో మంచి పేరు వస్తుంది. శివ వెనుక ఉన్న అసలు శక్తి తన తమ్ముడే అని తెలుసుకోవడంతో స్మగ్లర్ (అశుతోష్) తన గేం ప్లాన్ మారుస్తాడు. అక్కడి నుంచి కథ ఎలా మలుపులు తిరిగిందో తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
నాగ చైతన్యకి ఈ చిత్రం ఒక మలుపు అని చెప్పుకోవచ్చు. తనలో కేవలం లవర్ బాయ్ తప్ప, యాక్షన్ సన్నివేశాల్లో తేలిపోతాడు అనే వాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకునేలా నటించాడు. ఎక్కడా ఎనర్జీ లూస్ అవ్వకుండా నటించాడు.

సునీల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఈ పాత్రకు సునీలే సరి అనిపిస్తుంది.

ఈ చిత్రానికి ప్రధాన శక్తి కథ, కథనం. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినీ రచన చెయ్యాలంటే సన్నివేశాలపై చాలా కసరత్తు చేయాలి. అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తమిళ వేట్టై ని ఏ మాత్రం మార్చకుండా యథా తధంగా తెరకి ఎక్కించి మంచి పని చేసారు. ఎక్కడ ప్రయోగాలు చేసినా, తెలుగు వారి నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసినా ఫలితం ఇంకోలా ఉండేదేమో. ఈ విషయం లో దర్శకుడు డాలీ ని మెచ్చుకోవాలి.

కథ నడక ఆద్యంతం ఆసక్తిగా సాగడానికి తమన్ నేపధ్య సంగీతం బాగా తోడ్పడింది. కెమేరా పనితనం, ఎడిటింగ్ వంటి అంశాలను ఎక్కడా తప్పు పట్టలేం.

వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రమా ప్రభ, తదితరులంతా దర్శకుడికి బాగా తోడ్పడ్డారు. మొదటి సగం మాంచి పట్టుతో సాగితే రెండో సగంలో కొన్ని సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో పట్టు సడలిందనిపిస్తుంది.

ప్రస్తుతానికి ఈ సినిమా ఫస్ట్  క్లాస్ లో పాస్ అయ్యిందని చెప్పొచ్చు కానీ డిస్టింక్షన్ మార్కులు మాత్రం వేయించుకోలేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే: చూసేయొచ్చు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka!