Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
o college drop out gadi prema katha

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐఏఎస్ పాస్

kittugadu inter fail ias pass

కాయన ఏ ప్రతిఫలం ఆశించకుండా పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ నేర్పించేవాడు.

ఇంకొకతను బీటెక్ పాసై ఉద్యోగాన్వేషణలో ఉండి, విద్యార్ధులకు "స్ట్రక్చరల్ ఇంజనీరింగ్" బోధించేవాడు.

మెస్ ఓనర్, టిఫిన్ సెంటర్ ఓనర్లు ఈ విద్యార్ధుల్ని ఎంతో ప్రేమగా చూసేవారు. 'మనియార్డర్లు రాలేదు, వచ్చేవారం కడతామంటే... దానిదేముంది, డబ్బులు వచ్చాక ఇవ్వండి' అనేవారు.

అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కేవలం కొందరు కంభం ఆకతాయిల వలన.

ఈ ఆకతాయిలను ఎదుర్కోవడం ఎలా?

ఇదే ప్రశ్న చాలామంది విద్యార్ధులకు పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది...

ఇదే ప్రశ్న ఒక గ్యాంగ్ ఏర్పాటుకావడానికి దోహదం చేసింది.

ఈ ఆకతాయిల బృందం ఒకరోజు కిట్టుని ఆపింది... ఏవూరు మీది...?

భీమవరం...

టక్కు లేకుండా కాలేజికి వెళ్లవా?... నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు...

చొక్కా చేతులు మడత పెట్టావేంటి? చొక్కా చేతులు బాగా పొడుగైపోయాయని మడతపెట్టుకున్నాను.

వాచీ ఏమిటి? ముంజేతి మీదకు పెట్టుకున్నావు?

వాచీ చెయిన్ పెద్దదైపోయి జారిపోతుంది. అందుకని కిందపడిపోకుండా పైకి పెట్టుకున్నాను.

నవ్వు చాలా నఖరాలు చేస్తున్నావు... ఎప్పుడో నీకు పడతాయి... వెళ్లు... బతుకుజీవుడా అనుకుంటూ బయటపడ్డాడు కిట్టు.

***

కిట్టు, వరదరావు ఇద్దరూ రూమ్ మేట్లు...

వరదరావు చాలా సౌమ్యుడు, సున్నిత మనస్కుడు, బక్కపలచగా ఉంటాడు, ఎవరితోనూ ఏ గొడవా పడే సమస్యేలేదు. ఆకతాయిల బృందం తన్నినా, వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అంటాడు.

ఇంతలో కిట్టుకి రాము మైండ్ లోకి వచ్చాడు.

రాము గట్టివాడు.

ఒంగోలు నుండి వచ్చినాగానీ, కంభంలో నాకు 'వాడు తెలుసు', 'వీడు తెలుసు' అంటూ దరిదాపుగా కంభం వాస్తవ్యుడిలా చలామణి అవుతున్నాడు. రాముని రూమ్మేటుగా చేసుకుంటే...?

వెంటనే వరదాకి చెప్పాడు... వాడా? మనల్నే తంతాడు వాడు... కోరి తలకాయ నొప్పి తెచ్చుకుంటానంటావేంటి కిట్టు... అన్నాడు వరద.

కిట్టు పట్టుబట్టాడు.

వరదాకి తప్పని సరియై ఒప్పుకున్నాడు. సరే నీ చావు నువ్వు చావు అన్నాడు.

రాముకి కూడా రూమ్ అవసరం ఉందని కిట్టుకి తెలుసు. రాముని రూమ్మేటుగా ఆహ్వానించాడు ...

రాము, వరద, కిట్టు రూమ్మేట్లయ్యారు.

రాముని రూమ్మేటుగా చేర్చుకున్న తర్వాత రాము విషయం అర్ధమయ్యింది కిట్టుకి.

రాము "నారికేళ పాకం" వంటివాడు.

ద్రాక్షపాకము, కదళీపాతము, నారికేళపాకము అనే మాటలున్నాయి.

'ద్రాక్షపాకం' అంటే ద్రాక్షను నోటిలో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. కష్టపడి నమలాల్సిన అవసరం లేదు. 'కదలీపాకం' అంటే అరటిపండు... చాలా సునాయాసంగా తినవచ్చు. 'నారికేళపాక' మంటే కొబ్బరికాయ. కొబ్బరి గుంజు రుచి, కొబ్బరి నీళ్ళ తియ్యదనం వెంటనే తెలియవు. పై నుంచి చూస్తే అమ్మో చాలా కష్టం అనిపిస్తుంది. పీచు, గట్టి టెంకె తీసిన తర్వాత కొబ్బరి రుచి తెలుస్తుంది.

మనుషుల్ని కూడా వాళ్ల వాళ్ల స్వభావాలను బట్టి ఈ ద్రాక్షాపాకం, కదళీపాకం, నారికేళపాకాలతో పోల్చవచ్చు. రాము పైకి గట్టిగా కనబడతాడు కానీ, లోపల మంచితనం, మెతకతనం, అమాయకత్వం దాగి ఉన్నాయి.

రూమ్మేటుగా జాయినయిన కొద్దిరోజుల్లోనే రాము బాగా కలిసిపోయాడు.

వరద రాము మంచి స్నేహితులైపోయారు.

వరదాకి పేర్లు పెట్టడం వెన్నతో పెట్టిన విద్య. రాముకి "ఒంగోలు గిత్త" అనేపేరు పెట్టాడు.

రాము వరదాని ఎలా తిప్పికొట్టాలా అని ఆలోచించాడు. వరద బక్కపలచగా ఉంటాడు. ఒంటిమీద తోలు తప్ప కండలేదు అందుకని వరదాకి "తోలుగాడు" అని పేరు పెట్టాడు...

వరదాకి ఇంకోపేరు కూడా ఉంది 'బెండు అప్పారావు' అని. ఎందుకంటే వరదా హీరో 'కృష్ణ' కి వీరాభిమాని. వరద కనబడకుంటే, సినిమా థియేటర్ లో వందోసారి కృష్ణ సినిమా చూస్తున్నాడేమో అంటారు ఫ్రెండ్స్.

వరద, బురద, సరదా... అనేవాడు కిట్టు.

కిట్టు... ఒట్టుతీసి గట్టు మీద పెట్టు... అనేవాడు వరద.

బస్కీలు తీసి ఛాతీ కండరాన్ని పొంగించేవాడు కిట్టు.

వరద అనేవాడు...

'ఏందయ్యా కిట్టూ, ఆడదానిలాగా ఆ ఛాతీ? నీకు పెళ్ళయ్యాక రెండు బ్రాలు కొనాలి లెదర్ బ్రా నీకు, మామూలు బ్రా నీ పెళ్లానికి' అని.

ఏయ్... వరదా... ఏం తెలుసు నీకు... ఈ ఛాతీ కండరాన్ని ప్లేట్స్ అంటారు. బస్కీలు వందల్లో తీస్తేగానీ ఈ ప్లేట్స్ రావు. గెణుపుల మీద (ఇంగ్లీష్ లో నకుల్స్) డబ్బై బస్కీలు తియ్యగలవా నువ్వు? అంతెందుకు? మామూలుగా అరచేతులు నేలమీద పెట్టి, రెండు బస్కీలు తియ్యగలవా నువ్వు? అంటూ ఒంటి కాలి మీద, వరదా
మీద ఎగిరేవాడు కిట్టు.

రాము అప్పుడప్పుడు "వాయిదాలకి" ఒంగోలు వెళ్లేవాడు.

ఈ వాయిదాలకి వెళ్లిరావడమనేది రాము గౌరవాన్ని పెంచింది.

వాయిదాలంటే కోర్టు వాయిదాలు.

ఈ వాయిదాల వెనక ఉన్న కథ చెప్పమని  కోరారు వరద, కిట్టు.

ఏం లేదురా మామా...

"కాలేజిలో సెక్రటరీ పోస్టుకి అపోజిట్ వాడు నామినేషన్ వెయ్యకుండా, మేము వాణ్ణి కిడ్నాప్ చేసి, బంధించి, గుద్భాల్ గొట్టాం, తర్వాత రోజు వాడ్ని వదిలేసాము. ఆ తర్వాత వాడు మా మీద కేసు పెట్టాడు, పోలీసులు మమ్మల్ని దెంకపోయి, గుద్భాల్ గొట్టారు. ఆ కేసు కోర్టుకి పొయ్యింది. ఇది రెండో సంవత్సరం, అందుకనే ఈ వాయిదాలకి వెళ్లడం, రావడం." అంటూ ముగించాడు రాము.

అబ్బా! డక్కా మొక్కీలు తిన్నవాడురా వీడు, ఇలాంటి వాడే మనకు ఉండాలి అనుకున్నాడు కిట్టు.

రాము ప్రెస్టీజ్ ఇంకొంచెం పెరిగింది.

*****

కిట్టు ఏ  ఉద్దేశంతో రాముని రూమ్మేటుగా చేర్చుకున్నాడో ఆ ఉద్దేశం నెరవేరింది.

ఒకరోజు.....

పరీక్షకోసం ముందు రోజు రాత్రి ఎక్కువ సేపు మెలకువగా ఉండి, తరువాతి రోజు పరీక్ష రాసి, లంచ్ చేసి పడుకున్నారు కిట్టు, వరదలు.

మధ్యాహ్నం మూడు గంటలకు...

కంభం ఆకతాయిలు కిట్టు రూమ్ చేరుకున్నారు. అనుకోకుండా రాము మెలకువగా ఉన్నాడు. తర్వాత రోజు పరీక్ష కోసం చదువుతున్నాడు. ఈ ఆకతాయిల్ని చూసి... ఏమన్నా ఏంది సంగతి? అన్నాడు.

'కిట్టుగాడి పని పట్టాలి... ఒక అమ్మాయి మీద కామెంట్ చేశాడంట వాడు' అన్నారు వాళ్లు.

అలాగే అన్నా.... 'ఆ అమ్మాయిని తీసుకువచ్చి, ఆమెతో చెప్పించండి, నేను కూడా మీతో పాటే వాడి సంగతి చూస్తాను' అన్నాడు రాము. 'ఆ అమ్మాయి రాదు' అన్నారు వాళ్లు. 'అట్లైతే ఎలా?', 'ఎవర్నన్నాడో, ఏమన్నాడో తెలియకుండా ఎలా?' అన్నాడు రాము.

'నీకు తెలీదు, నువ్వు తప్పుకో' అన్నారు వాళ్లు.

'సరే మీ ఇష్టం' తిప్ప వాళ్లు నాకు మంచి దోస్తులు...' 'ఆ విషయం మీకూ తెలుసు... తర్వాత ఏమౌతుందో అదే అవుతుంది' అన్నాడు రాము.

రాము పర్సనాలిటీ, గొంతులోని నిర్భయం వాళ్లని ఆలోచింపజేశాయి.

"తిప్పవాళ్ళు" అంటే...

కంభం పట్టణానికి బాగా లోపలికి వెళితే అక్కడ నివాసముండేవాళ్లు. వాళ్లనే "తిప్పవాళ్ళు" అంటారు.

తిప్పవాళ్ళు మంచితనానికి మంచితనం ఉన్నవాళ్లు, మొరటుదనానికి మొరటుదనం కలవాళ్లు, వాళ్లముందు ఈ కంభం ఆకతాయిలు నిలబడలేరు. వీళ్ల ప్రతాపం వాళ్లముందు దమ్మిడీకి పనికిరాదు.

ఆకతాయిలు ఒక నిర్ణయానికి వచ్చారు.

సరే...

ఇంకోసారి ఇలాంటి కామెంట్లు చెయ్యొద్దని మీ రూమ్మేట్ కి చెప్పు... అంటూ వెళ్లిపోయారు...

ఆ తర్వాత నిద్రలేచిన కిట్టు, వరదాలకి పూసగుచ్చినట్లు విషయమంతా వివరించాడు రాము.

కిట్టు అవాక్కయ్యాడు.

గుండె దడదడలాడింది.

చాలా 'థాంక్స్ రా' మామా అన్నాడు రాముతో.

'అరే మామ మనలో మనకి థాంక్స్ ఏంట్రా' అన్నాడు రాము.

'ఇవ్వాళ రాంబాబుగాడు (రాము) లేకపోతే కిట్టుగాడి పని అవుట్ గోవిందా...' అన్నాడు వరద.

'పనిలో పని నీకూ ఒక రౌండ్ పడి ఉండేది వరదా' అన్నాడు రాము.

నన్నేం జేస్తారయ్యా బాబూ... 'నేనెప్పుడు ఎవర్నీ ఏమీ అనలేదు, అనను కూడా' అన్నాడు వరద.

అదేం లేదు వరదా, వాళ్లకి ఏదో వంక, నెపం కావాలి అంతే... నువ్వు కూడా పక్కనే ఉన్నావని, నువ్వు కూడా కామెంట్ చేశావనీ... వంక పెట్టి, నిన్ను కూడా చావగొట్టి ఉండేవాళ్లు అన్నాడు' రాము.

'ఈ కిట్టు గాడికి నోటి దురద... ఏమయ్యా కిట్టూ... నువ్వు మంచివాడవనుకున్నాను... మీ అమ్మా... నాన్నలు... చదువుకోమని పంపిస్తే... నువ్వు అమ్మాయిల మీద కామెంట్ చేసి తన్నులు తింటావా... అన్నాడు వరద.

'అదేంటి వరదా... రోజూ మనం కలిసే వెళ్తున్నాం, వస్తున్నాం... మీకిద్దరికీ తెలియకుండా నేనెప్పుడు, ఎవరిమీద కామెంట్ చేసాను?" అన్నాడు కిట్టు.

'ఈ కిట్టుగాడికి మతి పోయింది, జోకులు కూడా అర్ధమై చావడంలేదు' అన్నాడు వరద.

'వరదా... ఇది జోకులేసుకునే సమయమా? నిన్ను చావగొట్టి ఉంటే అప్పుడేం చేసేవాడివి' అన్నాడు కిట్టు.

'చేసేదేముంది? వాడి పాపాన వాడే పోతాడు' అన్నాడు వరద.

'ఇది ఒకరోజులో ముగిసిపోయే విషయం కాదు వరదా?...

మళ్లీ మళ్లీ వచ్చి చావ కొడతారు' అన్నాడు కిట్టు.

"ఎన్ని రౌండ్లు వేసుకుంటే వేసుకోనీ...

వాళ్ల పాపాన వాళ్లే పోతారు..." అన్నాడు వరద.

"నీకు చెప్పడం నా వల్లకాదు" అంటూ తల పట్టుకున్నాడు కిట్టు.

*****

సినిమా హీరో బక్కగా, పీలగా ఉంటాడు ఇంకొందరు హీరోలు బండగా ఉండవచ్చు.  ఒక్క హీరో వందమందిని ఒంటి చేత్తో చిత్తు చేయగలడు. ఇప్పటి సినిమాల్లో అయితే... మనుషుల్ని భూ చక్రాల్లాగా తిప్పి తిప్పి... విసిరేయగలడు. హనుమంతుడిలాగా ఎగరగలడు... కంటి చూపుతో మనిషిని చంపేయగలడు... రజనీకాంత్ నోటితో గాలి 'ఉఫ్' అని ఊదితే... మనిషి ఎగిరిపడతాడు.

హీరో కొట్టిన దెబ్బకి ఎముకలు ఎలా అయిపోతాయో... ఎక్స్ రే కూడా కనబడుతుంది....

నిజ జీవితంలో అలా జరగదు...

కిట్టు కొంత శారీర ధారుడ్యాన్ని పొందినా గానీ, ఊరుగానీ, ఊరులో ఒంటరిగా ఎంతమందిని ఎదురించగలడు? అవతలి గ్రూప్ వాళ్లు తనని గమనిస్తున్నారనీ, అవకాశంకోసం చూస్తున్నారనీ, ఛాన్స్ దొరగ్గానే దాడి చేస్తారనీ, గాయపరుస్తారనీ కిట్టుకి తెలుసు.

అప్పటికి అరడజను పైగా స్టూడెంట్స్ దెబ్బలు తిన్నారు. పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు.

నిజంగానే పొరపాటు చేసి దెబ్బలు తింటే ఓకే... ఏమీ లేని దానికి, ఉత్త పుణ్యానికి అవతలి వాడి చేతుల దురద తీర్చడానికి మనమెందుకు తన్నులు తినాలి?

సరే...

మొన్నటికి మొన్న రాముగాడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది... ఒకవేళ రాము లేకపోతే?

పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు కిట్టు. అకస్మాత్తుగా ఒక ఆలోచన తట్టింది కిట్టుకి...

కరణంగారు!!

కరణం గారింట్లోని ఒక రూము అప్పటికే అద్దెకిచ్చారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు.

ఇంకో రూము ఖాళీగా ఉంది. అది తీసుకుంటే? ఎక్కడో ఒక చోట, ఏదో రూములో ఉంటే వేరేవాళ్లు దాడి చేసే అవకాశం ఉంది.

అదే కరణం గారింట్లో ఉంటే?

కరణం గారింట్లో ఉంటున్న వాళ్ల మీద దాడి చేస్తే... అది కరణంగారి మీద దాడి చేసినట్టే... అందుచేత దాడి జరిగే అవకాశం ఉండదు... బాగుంది... సరే... ఇంటిమీద దాడి తప్పించుకోవచ్చుగానీ... బయట ఎక్కడైనా దాడి జరగవచ్చు కదా... అలా జరగకుండా కాపాడుకోవాలంటే... కావలసింది సంఘటిత శక్తి... గ్యాంగ్ తయారవ్వాలి...

ఆలోచన వచ్చిన వెంటనే కరణం గారింట్లో అద్దెకుంటున్న స్టూడెంట్స్ తో కలిసి మాట్లాడాడు కిట్టు.

వాళ్లు కూడా జరిగేదంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్లకి కూడా తమమీద దాడి జరగవచ్చనే భయం ఉంది. కిట్టు ఆలోచన విన్న తర్వాత... వెంటనే ఒప్పుకున్నారు...

***

కరణం గారిని ఒప్పించి ఏదో విధంగా మీకు రూమ్ ఇప్పిస్తాము. అందరం కలసి కట్టుగా ఉందాం అన్నారు. అందరూ కలిసి ఉంటే, ఒక పెద్ద గ్రూప్ లాగా ఉంటే, ఈ గ్రూప్ నుండి ఒక్కణ్ణి బయటకులాగి బెదిరించలేదు. ఎందుకంటే మిగిలిన వాళ్లు ఊరుకోరు కదా... "నేషనల్ జాగ్రఫీ, డిస్కవరీ" వంటి ఛానెళ్ళలో అప్పుడప్పుడూ చూస్తుంటాం...

జంతువులు గుంపుగా తిరుగుతాయి...

ఒక దున్నపోతుల గుంపుపై సింహాలు దాడి చేసి, ఒక చిన్న దున్నని పీక పట్టుకుంటాయి...

ఈడ్చుకుంటూ తీసుకెళుతుంటాయి... రక్తం కారుతూ ఉంటుంది...

చూస్తున్న వాళ్లకి... అయ్యో పాపం... ఆ చిన్నదున్న పని అయిపోయింది... అన్పిస్తుంది...

ఇంతలోనే...

ఆశ్చర్యకరమైన పరిణామం...

దున్నపోతుల గుంపు ఒక్కసారిగా ఎదురు తిరిగి... సంఘటితంగా, సమైఖ్యంగా, దృఢ చిత్తంతో... ఆ భయంకర సింహాలను, తమ వాడి కొమ్ములతో గుచ్చి గుచ్చి తన్ని తరిమేస్తాయి...

అంతేకాదు...

 

(... ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్