Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahitee vanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

డయపర్లు అంత అవసరమంటారా? - భమిడిపాటి ఫణిబాబు

diaper

 మా చిన్నప్పుడు, చిన్నపిల్లల్ని కింద ఏమీ వేయకుండా ఉంచినా , పేద్దగా అనుకునేవారు కాదు.ఆ రోజుల్లో ఓ రబ్బరు షీట్ లాటిది వేసి, దానిమీద ఓ దుప్పటీ వేసేస్తే, పరుపులు తడవకుండా ఉండేవి. ఏదో ఆ దుప్పటీ కాస్తా ఎండలో వేసేస్తే హాయిగా ఎండిపోయేది. కానీ, ఇప్పుడో  తల్లి ఒడిలో ఉన్నప్పుడు తప్పిస్తే, పాకడం మొదలెట్టేటప్పటికి, వంటి మీద గుడ్డలేకుండా వదలరు. పైగా ఆ కిందేసీ చెడ్డీ లోపల డయపర్లోటి! వాళ్ళు చెడ్డీ చాలాసార్లు తడిపితే, అస్తమానూ మార్చలేక, ఓ లోపల ఓ  డయపరోటి వేసేసి ఉంచేస్తారు. చెప్పొచ్చేదేమిటంటే, ఈ ప్రక్రియ పెద్దవారి convenience కోసం మాత్రమే. కానీ దీనివలన జరుగుతున్నదేమిటయ్యా అంటే, ఆ పిల్లో, పిల్లాడో, పాపం నిజంగా పాస్ కి వెళ్దామనుకున్నా, ఈ డయపర్ల ధర్మమా అని, వాటిలోనే పోసేసే అలవాటు అయిపోతోంది. ఇంతకంటే మంచి టాపిక్కే దొరకలేదా అనుకోకండి. ప్రస్తుత burning topic అదే మరి. ఇంట్లో గ్యాసు అయిపోయినా ఫరవాలేదు కానీ  ఈ డయపర్లు అయిపోతేమాత్రం, మనకి నిద్ర పట్టదు !! ఈ ఆధునిక యుగంలో ఈ డయపర్లనేవి చిన్నపిల్లలకి సహజ కవచకుండలాల్లాగ తయారయ్యేయి. పైగా వీటిలో రకరకాలు..

  పైగా రాత్రి పక్కబట్టలు తడిసిపోతాయేమో అని, రాత్రిళ్ళు కూడా ఓ డయపరు వేసేసి పడుక్కోబెట్టడం! దీనితో ఏ స్నానం చేయించేటప్పుడో తప్ప, మిగిలిన ఇరవైమూడు గంటలూ ఆ డయపర్లతోనే ఉండిపోవలసివస్తోంది. మరి ఇంక ఓ టైముకి లేచి, పాస్ కి వెళ్ళడం అలవాటవమంటే ఎక్కడవుతుందీ? ఆ పిల్లనో పిల్లాడినో ఓ రాత్రివేళ లేపి, పోయించడానికి తల్లితండ్రులకి బధ్ధకం. బధ్ధకం అనడానికీ వీలులేదనుకోండి, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అర్ధరాత్రివరకూ ఆఫీసు కాల్స్ తోనే సరిపోతుందాయే. ఏదో టైముందీ అనుకుంటే టి.వీ. లో ఏ సినిమాయో చూసి పడుక్కునేటప్పటికి, అర్ధరాత్రి దాటిపోతుంది, ఇంక మధ్యలో పిల్లనో పిల్లాడినో లేపే ఓపికెక్కడ? ఈ గొడవంతా భరించలెక, ఓ డయపర్ చుట్టబెట్టేస్తే సరి! ఇంకో విషయం ఏమిటంటే, కొంతమంది తల్లులు ఈ డయపర్లు వాడడానికి ఇష్టపడరు. కానీ చిన్నపిల్లలు పక్క బట్టలు తడిపేసినప్పుడు, ఆ గుడ్డలు ఆరేయడానికి ఈ రోజుల్లో ఎపార్టుమెంట్లలో ఎండ ఎక్కడిదీ? దానితో, పాపం వాళ్ళుకూడా, నచ్చినా నచ్చకపోయినా ఈ డయపర్లలోకి దిగిపోతారు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, చంటిపాపను ఎత్తుకోవాల్సొచ్చినప్పుడు, ముందర బాబుకి డయపరు వేసేరా లేదా అని తప్పకుండా చూస్తారు,  పెంపుడు కుక్కకి గొలుసు ఉందా లేదా అని చూసినట్టు !!

  ఆమధ్య ఓ యాడ్ కూడా వచ్చింది, ఓ డాక్టరమ్మ గారు, పక్కావిడతో అంటూంటుంది 'అరే బాబు రాత్రంతా నిద్రపోలేదా అయ్యో ఫలానా డయపరు వేసేస్తే హాయిగా నిద్రపోయేవాడే...'

 ఈ డాక్టర్లు, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇలాటి సలహాలిస్తారేమో అని నాకో అనుమానం!  ఆ నిద్రలో ఉన్న పిల్లో పిల్లాడో కూడా ఓ పధ్ధతికి అలవాటు పడిపోతారు,అధవా మధ్యలో మెళుకువ వచ్చినా, పోన్లెద్దూ డయపరుందిగా, దాంట్లోనే పోసేస్తే ఓ గొడవొదిలిపోతుందీ అని! ఓ వయస్సు దాటిన తరువాత పాపం వారికి సరిపోయే డయపర్లు దొరకవాయె, అలాగని ఆ వచ్చేదేదో రాక మానుతుందా, తెల్లారేటప్పటికి పాపం పక్కబట్టలు తడిసిపోతాయి. మళ్ళీ డాక్టరు  దగ్గరకు పరిగెత్తడం. " డాక్టర్, మా పిల్ల/పిల్లాడు ఇంతవయస్సొచ్చినా ఇంకా bed wetting చేస్తున్నాడూ, (అదేనండి పక్క తడపడానికి కొంచం గ్లామరస్ టర్మ్), ఏం చేయమంటారూ" ఆయనదేం పోయిందీ, అంతకుముందే ఏ మెడికల్ రిప్రజెంటేటివో ఇచ్చిన ఫ్రీబీస్, కాంప్లిమెంటరీల ధర్మమా అని, ఇంకో మందు చెప్పేస్తారు! అక్కడికి వాళ్ళ వృత్తిధర్మం పాటించినట్లూ ఉంటుందీ, మార్కెట్ లోకి వచ్చిన ఆ కొత్త'మందు' కి బేరం వచ్చినట్లూ ఉంటుంది. ఉభయతారకం!  ఈ డాక్టర్లే కాకుండా, పేపర్లలో యాడ్లు కూడా చూస్తూంటాము--" మీ బిడ్డ ఇంకా పక్క తడుపుతున్నాడా? అయితే వెంటనే ఈ క్రింది నెంబర్లని సంప్రతించండి" అంటూ.

  ఇదివరకు రోజుల్లో అయితే, ఈ టి.వీ లూ, ఇంటర్నెట్టులూ లేకపోవడంతో, పిల్లలు ఓ పధ్ధతిలో పెరిగేవారు. ఓ టైముకి భోజనం, ఓ టైముకి నిద్రా.  నాకు బాగా గుర్తు- మా అబ్బాయి అటుసూర్యుడిటు ఉదయించినా సరే, రాత్రి ఎనిమిదిన్నరా అయేసరికి పక్కెక్కేసేవాడు. రాత్రి పదకొండూ అయే సరికి, ఆ నిద్రలోనే నడిచి, బాత్ రూం కి వెళ్ళి పనికానిచ్చేసేవాడు,  ఇదంతా వాళ్ళమ్మ చేసిన అలవాటు. దానితో మాకు పరుపులూ, పక్కబట్టలూ ప్రతీ రోజూ ఎండలో వేసే బాధ తప్పింది! Ofcourse, ఇప్పటివాళ్ళూ అంటారు, మేం మాత్రం ఎండలో వేస్తున్నామా అని, కానీ ఇప్పుడు డయపర్లువేసి, అంతే తేడా!

  ఇంకో చిత్రం ఏమిటంటే, ఇదివరకటి రోజుల్లో, చిన్న పిల్లో పిల్లాడినో బట్టలు లేకుండా చూడ్డం ఓ పేద్ద విషయం లా ఉండేది కాదు. కానీ ఇప్పుడో, modesty. ఇదంతా మన చేతుల్లో ఉన్నంతకాలమే, పెద్దయిన తరువాత  to hell with modesty.  చూడ్డం లేదూ? ఎంత తక్కువ బట్ట కడితే అంత గొప్ప! మన సౌకర్యం కోసం చిన్నపిల్లలకి ఈ డయపర్లేసి హింసించకుండా, ఓ డిసిప్లీన్ నేర్పిస్తే బావుంటుందేమో. మీకేమిటీ, ఓ చిన్నపిల్లనో పిల్లాడినో పెంచాలా ఏమిటీ, కబుర్లు మాత్రం చెప్తారూ అనకండి, మా ఇంటావిడ, మా మనవణ్ణి చూడాల్సినప్పుడు, డయపరు మాత్రం వేయదు. వాణ్ణి ఎదో ఫిక్సెడ్ టైముకి తీసికెళ్తే  వాడే oblige చేస్తూంటాడు. వాడితో ఎక్కడదాకా వచ్చిందంటే, అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ నాన్నమ్మని చెయ్యి పట్టుకుని తీసికెళ్ళేదాకా. వాళ్ళ అవసరం గమనించే ఓపికా, టైమూ మనకుండాలి. మీకేమండీ, ఓ పనా పాటా, కావలిసింత టైమూ అనొచ్చు. నిజమే, కానీ కన్నతరువాత పిల్లల బాగోగులు చూసుకోవాల్సింది తల్లితండ్రులే కదా! Buy one get one స్కీంలో నాలుగేసి డయపరు ప్యాకెట్లు కొనేసి పడేస్తే సరిపోదు.

 ఏదో బయటకు వెళ్ళినప్పుడు ఫరవాలేదు కానీ, రోజంతా మన సౌకర్యం కోసం, చిన్నపిల్లలకి డయపర్లు వేయడం అంత బాగుందంటారా?

మరిన్ని శీర్షికలు
kaakoolu