Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కుటుంబ ప్రేక్షకులూ థియేట‌ర్లకు రావాలి!

interview with  venkatesh

వెంక‌టేష్ అంటేనే వైవిధ్యం. బ‌హుశా... వెంక‌టేష్ చేసిన ప్రయోగాలు తెలుగునాట మ‌రే ఇత‌ర హీరో చేసి ఉండ‌డు. క‌థ‌ని ఎలివేట్ చేయ‌డానికి త‌న క్యారెక్టర్‌నీ, త‌న‌లోని హీరోయిజాన్ని త‌గ్గించుకోవ‌డానికి కూడా మొహ‌మాట ప‌డ‌లేదాయ‌న‌. అందుకే చంటి, రాజా, శీనులాంటి సినిమాలొచ్చాయి. మ‌రీ క్లాస్ అయిపోతున్నానేమో అనుకొంటున్న స‌మ‌యంలో - త‌న‌దైన మాస్‌ని బ‌య‌ట‌కు తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తుంటారు. ప్రేమించుకొందాం రా, గ‌ణేష్, ధ‌ర్మ చ‌క్రం... అలాగ‌న్నమాట‌. మ‌ధ్య మ‌ధ్యలో కుటుంబ ప్రేక్షకుల‌నూ అల‌రించ‌డానికి సిద్ధమే. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు లాంటి క‌థ‌ల్లో ఇద్దరు భార్యల ముద్దుల భ‌ర్తగా ప్రేక్షకుల‌కు కావ‌ల్సినంత వినోదం పంచారు. మొత్తానికి వెంకీ ఓ అస‌లు సిస‌లైన ఆల్ రౌండ‌ర్‌. స్టార్ హీరో అయ్యుండి ఇద్దరు కూతుర్లకు తండ్రిగా న‌టించడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం చేశారు కాబ‌ట్టే.. దృశ్యం లాంటి సినిమా వ‌చ్చింది. ఈ సినిమా విడుద‌లైన సంద‌ర్భంగా వెంకీతో జ‌రిపిన చిట్ చాట్ ఇదీ..

* మీ నుంచి వ‌చ్చిన మ‌రో రీమేక్ సినిమా ఇది..

- (న‌వ్వుతూ) అవును... తెలియ‌కుండానే రీమేక్‌లు ఎక్కువైపోతున్నాయి. మా జ‌న‌రేష‌న్‌లో ఎక్కువ రీమేక్‌లు చేసింది నేనే అనుకొంటా. వాటిలో స‌క్సెస్‌లూ ఎక్కువే ఉన్నాయి. సో.. ఐ యామ్ వెరీ హ్యాపీ.

* రీమేక్ అంటే క‌థ కోసం వెదుక్కోవ‌ల‌సిన బాధ త‌ప్పుతుంది క‌దా..?
- నిజ‌మే కానీ.. దానిపైనా చాలా క‌స‌ర‌త్తు చేయాల్సిఉంటుంది. ఆ క‌థ మ‌న వాతావ‌ర‌ణానికి అనువుగా మార్చుకోవ‌డానికి సొంత తెలివి తేట‌లు కూడా ఉప‌యోగించాల్సి ఉంటుంది. మాతృక‌లో భారీ మార్పులు చేయ‌కూడ‌దు. చేసినా... అతికిన‌ట్టు ఉండాలి. సో.. కొత్త క‌థ రాసుకోవ‌డానికి ఎంత క‌ష్టప‌డాలో, రీమేక్ సినిమా తీయ‌డానికీ అంతే క‌ష్టప‌డాల్సివ‌స్తుంది.

* క‌థ‌ల కొర‌త వ‌ల్లే రీమేక్‌లు ఎక్కువ‌వుతున్నాయంటారా?
- అదీ ఓ కార‌ణ‌మే. ఇప్పుడొస్తున్న ద‌ర్శకులు యంగ్ హీరోల‌ను దృష్టిలో ఉంచుకొని క‌థ‌లు రాసుకొంటున్నారు. మాలాంటి సీనియ‌ర్లకు క‌థ‌లు దొర‌క‌డం లేదు. అలాంట‌ప్పుడు ఇలా రీమేక్‌ల‌పై ఆధార‌ప‌డ‌వ‌ల‌సి వ‌స్తుంది.

* మ‌ల‌యాళం దృశ్యంలో మార్పులేమైనా చేశారా?
- పెద్దగా ఏం లేవు. ఆ అవ‌స‌రం కూడా రాలేదు. ఎందుకంటే ప్రాంతం వేరైనా ఫ్యామిలీ డ్రామాలో ఎమోష‌న్స్ మాత్రం అలానే ఉంటాయి క‌దా?  అందుకే మార్పుల కంటే ఆ ఫీల్‌ని ఇక్కడా పున‌రావృతం చేయ‌డంపైనే దృష్టి పెట్టాం.

* ఇద్దరు పిల్లల తండ్రిగా న‌టించ‌డం రిస్కే క‌దా?
- (న‌వ్వుతూ) ఇంకా పెళ్లికాని ప్రసాద్ పాత్రలు చేయాలంటే ఎలా..??  క‌థ‌ని బ‌ట్టి మ‌నం కూడా కొన్నింటికి అల‌వాటు ప‌డాలి.

* మోహ‌న్‌లాల్ పాత్ర ప్రభావం మీపై ఎంత వ‌ర‌కూ ప‌డింది?
- మ‌ల‌యాళ రీమేక్ చూశా. మోహ‌న్‌లాల్ అద్భుతంగా చేశారు. అది ఆయ‌న స్టైల్‌. అదే పాత్ర నేను చేయాల‌నుకొంటే నా మార్క్ చూపించాలి క‌దా?  అందుకే ఆ పాత్ర మోహ‌న్‌లాల్ చేశార‌న్న సంగ‌తి మర్చిపోయి న‌టించా.

* దృశ్యం తెలుగులో తీస్తే వెంక‌టేష్‌తోనే చేయ‌మ‌ని క‌మ‌ల్‌హాస‌న్ స‌ల‌హా ఇచ్చార‌ట‌..
- అవును. నేను కూడా విన్నా. మా ఇద్దరి ఆలోచ‌న‌లు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఇద్దరం ఎప్పుడు క‌లుసుకొన్నా.. ఇలాంటి వైవిధ్యభ‌రిత‌మైన క‌థ‌ల గురించే ఎక్కువ‌గా చ‌ర్చించుకొంటుంటాం. త‌మిళంలో ఈ సినిమా ఆయ‌న చేస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉంటుందా? అని నేను కూడా ఆస‌క్తిగా  ఎదురుచూస్తున్నా.

* వ‌స్తున్న క‌థ‌ల్ని గ‌మ‌నించారా?  ఫ్యామిలీ డ్రామాలు ఎక్కువ‌వుతున్నాయి మ‌ధ్య. మార్పు గ‌మ‌నించారా?
- అవును. కుటుంబ‌మంతా క‌ల‌సి చూసేలా సినిమాల్ని రూపొందించ‌డం మొద‌లైంది. నిజంగా ఇది ఓ హ్యాపీ మూమెంట్‌. కుటుంబ ప్రేక్షకులూ థియేట‌ర్లకు రావాలి. అప్పుడే.. సినిమాకి మంచి వ‌సూళ్లుంటాయి. వాళ్లంతా టీవీల‌కే ప‌రిమిత‌మైపోతున్నారు. మంచి సినిమా వ‌చ్చిందంటే త‌ప్పకుండా థియేట‌ర్లకు వ‌స్తారు. వాళ్లని థియేట‌ర్లవైపు న‌డిపించే సినిమా.. దృశ్యం. ఆ న‌మ్మకం నాకు చాలా ఉంది.

* యువ హీరోల‌తో క‌ల‌సి న‌టించ‌డానికి మీకేమైనా అభ్యంత‌రాలున్నాయా?
- ఏమాత్రం లేదు. రామ్‌తో క‌ల‌సి న‌టించాను క‌దా..? అలాంటి క‌థ‌లు దొర‌కాలి. ఇప్పుడిప్పుడే మ‌ల్టీస్టార‌ర్ సంప్రదాయం మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది. అదీ.. భారీ స్థాయిలో. నేను ప‌వ‌న్‌తో క‌ల‌సి న‌టిస్తున్నా. ప‌రిశ్రమ‌లో ఇలాంటి వాతావ‌ర‌ణం రావాల‌ని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా.

* అక్కినేని వంశం మ‌నంతో తెర‌పైకి వచ్చింది. అలాంటి ప్రయ‌త్నం మీ కుటుంబం నుంచి కూడా ఆశించొచ్చా?
- నేనూ రానా క‌ల‌సి న‌టించాల‌ని ఎప్పటి నుంచో అనుకొంటున్నాం. ఆ సినిమాలో నాన్న కూడా క‌నిపిస్తారు. అయితే స‌రైన క‌థ దొర‌కాలి. ఈ విష‌యంలో నాగ్ చాలా ల‌క్కీ. త‌న‌కు మంచి క‌థ దొరికింది. మ‌నం లాంటి మ్యాజిక్‌లు ఎల్లవేళ‌లా సాధ్యం కావు.

* గోపాల గోపాల సంగ‌తులేంటి?
- చాలా మంచి సినిమా అది. వ‌ప‌న్‌తో క‌ల‌సి న‌టించే సమ‌యం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఓ మైగాడ్‌కి ఏ మాత్రం త‌క్కువ కాకుండా ఉంటుంది. ఆ న‌మ్మకం నాకుంది.

వి.రాజా
మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Drushyam