Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

దేవుడు రాసిన రాత ఇది - బ్ర‌హ్మానందం

బ్ర‌హ్మానందం వినోదం ఓ బ్రాండ్ ఇప్పుడు!  బ్ర‌హ్మీ పాత్ర క్లిక్ అయితే సినిమా సూప‌ర్ హిట్టే. ఈ విష‌యాన్ని చాలా సినిమాలు రుజువు చేశాయి... చేస్తున్నాయి కూడా.  క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల ప్ర‌కారం ఓ హిట్టు సినిమాకి ఇప్పుడు ఇద్ద‌రు హీరోలైపోయారు. ఒక హీరో మాస్‌, యాక్ష‌న్‌, డాన్సులు అంటూ హ‌డావుడి చేస్తాడు. రెండో హీరో వినోదం పంచితే - మ‌రో హీరో న‌వ్వులు చిందించే బాధ్య‌త తీసుకొంటున్నాడు. అలా ప్ర‌తీ మాస్ సినిమాకీ రెండో హీరోలా ఎదుగుదున్నాడు బ్ర‌హ్మీ. బోర్ కొట్టని న‌వ్వులు, విసుగ‌నిపించ‌ని హాస్యం... బ్ర‌హ్మీ స్పెష‌ల్‌. అందుకే అత‌ని బండి జోరుగా సాగిపోతోంది. అల్లుడు శీనులో కూడా సినిమా అంత‌టినీ భుజాల‌పై వేసుకొనే పాత్ర‌లో క‌నిపించాడు. డింపుల్‌గా న‌వ్వులు చిందిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా న‌వ్వుల బ్ర‌హ్మా... బ్ర‌హ్మానందంతో జ‌రిపిన‌ స్పెష‌ల్ చిట్ చాట్ ఇది.

* డింపుల్ గురించి సింపుల్‌గా ఓ ముక్క చెప్పండి..
- (న‌వ్వుతూ) నేను క‌న్‌ఫ్యూజ్ అయి, మిగ‌తావాళ్ల‌ను క‌న్‌ఫ్యూజ్‌లోకి నెట్టే క్యారెక్ట‌ర్ ఇది. ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌కి అసెస్టెంట్‌గా ప‌నిచేస్తుంటా. గ‌మ్మ‌త్తేమిటంటే.... ఇందులో ఇద్ద‌రు ప్ర‌కాష్‌రాజ్‌లు. ఒక‌డు మంచోడు, రెండోవాడు చెడ్డోడు. ఆ విష‌యం తెలియ‌కుండా మంచోడ్ని తిట్టేస్తుంటా, చెడ్డోడిని పొగిడేస్తుంటా. ఆ క‌న్‌ఫ్యూజ‌న్ నుంచి పుట్టిన కామెడీ ఇది. వినాయ‌క్ భ‌లే తీశాడు.

* అదుర్స్‌లో భ‌ట్టు, కృష్ణ‌లో బాబిలా డింపుల్ కూడా ఫ్యామ‌స్ అయిపోతాడ‌న్న‌మాట‌...
- అన్న‌మాట కాదు, ఉన్న‌మాటే. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాల‌కు మించిన వినోదం నా పాత్ర పంచుతుంది. ఇలాక్కూడా కామెడీ చేయొచ్చా..??  అనిపిస్తుంది. ఇది వ‌ర‌కు బ్ర‌హ్మానందం పాత్ర‌లు వేరు, ఈ డింపుల్ క్యారెక్ట‌ర్ వేరు... అలా ఉండాలి అనుకొని, చాలా శ్ర‌ర్థ‌గా ఈ పాత్ర‌ని డిజైన్ చేశారు వినాయ‌క్‌. ఆయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

* ఇంత‌కీ అల్లుడు శీను టైటిల్ వెనుక క‌థేంటి?
- నేను కూడా ఈ టైటిల్ విన‌గానే.... `ఏంటి సార్ ఇలాంటి టైటిల్ పెట్టారు?` అని అడిగా. `అమ్మ రాజ‌శేఖ‌ర్, త‌మ్ముడు స‌త్యం పేర్లు ఉన్న‌ప్పుడు అల్లుడు శీను అని ఉండ‌కూడ‌దా...` అన్నారు. ఆ మాటే ఈ సినిమాలో డైలాగ్ అయ్యింది. నిజంగా ఓ థ్రిల్లింగ్ క‌థ ఇది. వినాయ‌క్ క‌మ‌ర్షియ‌ల్ హీరోల‌తో సినిమాలు చేస్తుంటాడు. ఓ కొత్త హీరోతో సినిమా ఒప్పుకోవ‌డం నిజంగా గ్రేట్‌. నిర్మాత బెల్లంకొండ సురేష్‌కీ, వినాయ‌క్‌కీ ఉన్న అనుబంధానికి ప్ర‌తీక ఈ సినిమా అని చెప్పొచ్చు. చాలా చాలా గ్రాండియ‌ర్‌గా ఈ సినిమా తీర్చిదిద్దారు. ఎక్క‌డా ఓ కొత్త హీరో సినిమా అని ఉండ‌దు.. అంత రిచ్ నెస్ క‌నిపిస్తుంది.

* బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ని చూశారు క‌దా..? ఏమ‌నిపించింది..?
- తొలి సినిమా అని చెబితే ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. చాలా పాజిటీవ్ మైండ్‌తో సెట్‌కి వ‌చ్చేవాడు. అనుభ‌వ‌జ్ఞుడిలా ట‌క ట‌క చేసుకుపోయాడు. నిజంగా... అత‌ని ప్ర‌తిభ అంద‌రినీ ఆక‌ట్టుకొంటుంది. ఫ్యాట్స్‌, డాన్స్, యాక్టింగ్ స్కిల్స్.. ఇలా ఒక్క‌టేమిటి??  అన్నింట్లోనూ రాణించాడు.

* స‌మంత గురించి చెప్ప‌నేలేదు...
- కొంద‌రికి పుట్టుకుతోనే న‌ట‌న వ‌చ్చేస్తుంది. ఇంకొంద‌రు నేర్చుకొంటారు. స‌మంత‌కి యాక్టింగ్ అనేది గాడ్స్ గిఫ్ట్ అనుకొంటా. చాలా అద్భుతంగా న‌టించింది. ఈ సినిమా అనే కాదు. ప్ర‌తీ సినిమాలోనూ... ఆక‌ట్టుకొంటోంది. త‌న‌కి ఇంకా ఇంకా మంచి ఫ్యూచ‌ర్ ఉంది.

* మొత్తానికి సినిమా అంతా మ‌రోసారి భుజ‌స్కంధాల‌పై వేసుకొని న‌డిపించేశార‌న్న‌మాట‌...
- సినిమా అంతా నేనే న‌డిపించేశా అనే మాట‌లో నిజం లేదు. అలా చెప్పినా న‌మ్మొద్దు. సినిమా అనేది 24 విభాగాల కృషి. అందులో ద‌ర్శ‌కుడి క‌ష్టం ఎక్కువ‌. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే మిగిలిన పాత్ర‌లు రూపుదిద్దుకొంటాయి. ఓ సినిమా బాగుందంటే, అందులో నా పాత్ర బాగా పండిందంటే.. క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడిదే. సినిమాలో అన్నీ బాగుండి కామెడీ కూడా బాగుంటే ప్ల‌స్ అవుతుంది. అలాంటి సినిమా నిల‌బ‌డిపోతుంది. అంతే త‌ప్ప‌... నేనొక్క‌డినే సినిమాని న‌డిపించేస్తా అనే మాట‌లో నిజంలేదు.

* ఓ హిట్టు సినిమాలో మీ క్రెడిట్ ఎంత‌??
- న‌టుడిగా నా బాధ్య‌త ద‌ర్శ‌కుడు చెప్పింది చేయ‌డ‌మే. ఫ‌లానా సినిమాలో బ్ర‌హ్మానందం పాత్ర బాగుందిరా, భ‌లే చేశాడంటే.. ఆ గొప్ప‌ద‌నం అంతా నాది కాదు. నా ద‌ర్శ‌కుడిదే. అందుకే నాకు సంబంధించిన ఏ ఘ‌న‌త అయినా నా ద‌ర్శ‌కుల‌కే.

* సినిమా సినిమాకో కొత్త మెరుపు మీలో క‌నిపిస్తోంది. ర‌హ‌స్యం ఏమిటి?
- నా అదృష్టం కొద్దీ నా ద‌గ్గ‌ర‌కు మంచి పాత్ర‌లొస్తున్నాయి. ఇదంతా దేవుడి రాత‌. నా అదృష్టం. అంతే. ఏ న‌టుడికైనా ప్ర‌తిభ కొంత‌కాలం న‌డిపిస్తుంది. ఆ త‌ర‌వాతిదంతా అదృష్ట‌మే. నా విష‌యంలో ఆ అదృష్టం కొంచెం ఎక్కువ ఉంది. నాకు ఫ‌లానా పాత్ర రాయ‌మ‌ని ఎవ్వ‌రినీ అడ‌గ‌ను. ఇలాంటి పాత్ర కావాలి అని అడిగినా ఎవ‌రూ రాయ‌రు. మంచి పాత్ర‌లు న‌న్ను వెదుక్కొంటూ రావ‌డం దైవ‌కృప‌. వాటికి న్యాయం చేయ‌డ‌మే నా ప‌ని.

వి.రాజా
మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Alludu Seenu